ఎన్నబా ఎన్న సమాచారం?

  • 834 Views
  • 26Likes
  • Like
  • Article Share

    కొలకలూరి శ్రీధర్‌

  • హైదరాబాదు.
  • 9642767765
కొలకలూరి శ్రీధర్‌

ఏంబా మలైకు పోయినావా?... చెప్పండి! చిత్తూరు సోదరులు అడుగుతున్నారు ‘మీరు తిరుమలకు వెళ్లారా? లేదా?’ అని! ఆయన ఇప్పుడదా పూడ్సినాడు... ఇదీ ఆ జిల్లా మాటే. అర్థం... ‘ఆయన ఇప్పుడే వెళ్లాడు’! ‘గోల గోవిందరాజులుది ముడుపులు వెంకటేశులువి’... ఈ సామెత వెనక కథ కూడా ఆ జిల్లాకే సొంతం. చిత్తూరుకు పోతే ఇలాంటి భాషా చమక్కులు చాలా వినపడతాయి. తమిళ, కన్నడ ప్రాంతాలతో సరిహద్దును పంచుకుంటూనే తెలుగు వాడుకలో తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటున్న ఆ జిల్లా మాటల ముచ్చట్లు మీకోసం... 
కలియుగ దైవంగా
భాసిల్లుతున్న కొండలరాయుడు కొలువైన వెంకటాద్రి... మూగప్రాణుల అజరామర భక్తికి నిదర్శనమైన శ్రీకాళహస్తి... ప్రమాణాల వినాయకుని కాణిపాకం... శౌర్యానికి గిరి గీసిన చంద్రగిరి... బోయకొండ గంగమ్మ... వేల సంవత్సరాల కిందటే రాళ్లకాలువలో ఆదిమ మానవుడు తిరిగిన జాడలు... చెన్నపట్నం చేరుకునే నావికులకు దిక్సూచిగా నిలిచిన నగరి ముక్కు కొండలు... చెప్పుకుంటే పోతే చిత్తూరు జిల్లా ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. కడప జిల్లా, ఆర్కాట్‌ సంస్థానాల్లోని కొన్ని ప్రాంతాలకు పుంగనూరు, కంగుంది, శ్రీకాళహస్తి సంస్థానాలకు సంబంధించిన ప్రాంతాలను కలిపి 1911లో ఈ జిల్లాను ఏర్పాటుచేశారు. ఇక్కడి భాష మీద సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలతో పాటు పొరుగు జిల్లాలు నెల్లూరు, అనంతపురం, కడపల ప్రభావమూ ఎక్కువే. అయితే పల్లెపట్టులతో పాటు కొన్ని పట్టణ ప్రాంతాల్లో చిత్తూరు జిల్లాకే సొంతమైన యాస వినపడుతుంది. 
      జిల్లాలో తూర్పుప్రాంతంలో యాస ఒకరకంగా పడమర ప్రాంతాల్లో మరోలా ఉంటుంది. ‘ఆయన ఇప్పుడదా పూడ్సినాడు’’ అంటూంటారు. ‘వెళ్లినాడు’ అనే దానికి ప్రత్యామ్నాయంగా ‘పూడ్సినాడు’ అని అంటారు. పురోహితులతో పాటు ఉపాధ్యాయులనూ అయ్యోరు, ఉపాధ్యాయినులను అమ్మోరు అనడం విశేషం. ఎక్కువగా ఏకవచన ప్రయోగమే ఉంటుంది. తండ్రి అన్నను పెదనాయనగా, తమ్ముణ్ని చిన్నాయనగా పిలుస్తారు. తమిళ ప్రాబల్యమున్న ప్రాంతాల్లో బావమరిదిని మచ్చీ, మచ్చాగా వ్యవహరిస్తారు. ఏ వ్యాపారం చేసేవారిని ఆయా పేర్లతో పిలవడం ఇక్కడి ప్రత్యేకత. మస్తాన్‌ అనే వ్యక్తి ట్యాక్సీలు నడిపితే ‘ట్యాక్సీ మస్తాన్‌’ అని, బుజ్జి అనే వ్యక్తి కూరగాయల దుకాణం నిర్వహిస్తుంటే ‘కూరగాయల బుజ్జీ’ అనీ నామకరణం చేసేస్తారు. ఇక తిరుమలలో ఉండే వ్యక్తినేమో ‘కొండాయన’గా పిలుస్తారు. ఎలబారినారు (వెళ్లినారు), సమళిచ్చేవాళ్లు (సమాధానమిచ్చేవారు), సినిమా కొటాయ్‌ (థియేటర్‌), ఉర్లగడ్డ (ఆలుగడ్డ), ఎర్రగడ్డ (ఉల్లిపాయ), తెల్లగడ్డ (వెల్లుల్లి), కుశాల (బాగున్నావా), ఒక్కరవ్వ(కొద్దిగా)... ఇక్కడ బాగా వ్యవహారంలో ఉండే మాటలివి. తిరుపతిని ‘తిరప్తి’గా, తిరుమలను ‘కొండ’/ ‘మలై’గా వ్యవహరిస్తారు. ఇక సమయానికి సంబంధించి కాల్‌ (పావు భాగం), ముక్కాల్‌ (ముప్పావు) లాంటి పదాలు వినపడతాయి. ‘రెండు కాల్‌’ అంటే రెండుంబావు, ‘మూడు ముక్కాల్‌’ అంటే మూడూముప్పావు. 
మాకు తెల్సులే అబ్బీ
ఇళ్లకు వేసే తాళాన్ని బీగం అని పిలుస్తారు. ‘ఇంటికి బీగాలు బాగా వేసినవా’ అని పెద్దవాళ్లు చిన్నవాళ్లని అడుగుతుంటారు. గ్రామీణ ప్రాంతాలకు చెందినవాళ్లతో మాట్లాడేటప్పుడు, వాళ్లకు తెలిసిన విషయాన్ని మళ్లీ చెబితే ‘ఆఁ మాకు తెల్సులే అబ్బీ’ అని చెప్పినవారినే ఆటపట్టిస్తారు. ఇక ‘వారుకొన్నాడు’ అంటే బాగా సంపాదించాడని అర్థం. ‘వెంకటముని చిల్లరంగడి పెట్టి బాగా వారుకొన్నాడు’ అంటే ఆ వెంకటముని అనే ఆయన చిల్లరకొట్టు పెట్టుకుని బాగా ఆర్జించాడని చెబుతున్నారన్న మాట. జిల్లాలో వినపడే కొన్ని సామెతలు హాస్యస్ఫోరకంగా ఉంటూనే వాస్తవాలను ప్రతిబింబిస్తాయి. ‘ఎన్ని పుంగనూర్లయితే ఒక బెంగళూరు’ అనే సామెత ఒకటి ఇక్కడ వ్యవహారంలో ఉంది. పుంగనూరు అనేది జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఓ పట్టణం. బెంగళూరు మహానగరమని తెలిసిందే. అంతటి నగరాన్ని నిర్మించడానికి పుంగనూరు లాంటి పట్టణాలు ఎన్ని కావాలని అర్థం. విస్తృతార్థంలో చూస్తే, ఎన్ని గడ్డిపోచలు కలిస్తే ఓ తాడు అవుతుందని. ‘దిల్లీతో కొట్లాడొచ్చు’ అనే మరో జాతీయమూ ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉన్నవారి గురించి చెప్పేటప్పుడు దీన్ని వాడతారు. దేశ రాజకీయాలకు, పరిపాలనకు కేంద్రస్థానం దిల్లీ. దాంతో కొట్లాడగల స్థాయిలో అతని దగ్గర డబ్బు ఉందన్నది భావం. డబ్బుంటే ఏదైనా సాధ్యమవుతుందన్నది దీని అంతరార్థం. 
ఇంటి కాడ, బాయి కాడ, చేను కాడ 
‘మీ ఆయన ఎక్కడున్నాడు అమ్మీ’ అంటే ‘బాయి కాడున్నాడునా’ అని సమాధానమిస్తుంది ఓ పల్లెపడుచు. బావి దగ్గరున్నాడని అర్థం. దగ్గరికి బదులుగా ‘కాడ’ అంటారు. అలాగే, భర్తను ‘ఇంటాయన’గా వ్యవహరిస్తారు. ‘ఏమ్మేయ్‌ బుజ్జీ మీ ఇంటాయన వచ్చాడు’ అంటూ అల్లుడి గురించి కూతురుకు చెబుతుందో ఓ అత్త. ఎక్కడికైనా వెళ్లొస్తుంటే ‘యాడికి పోయినావు’ అని అడుగుతారు. ‘ఎక్కడ’కు మారుగా ‘యాడ’ వినియోగం ఎక్కువ ఇక్కడ. జిల్లాలో పలు గ్రామదేవతల జాతర్లతో పాటు ధర్మరాజు, ద్రౌపదమ్మల తిరునాళ్లూ జరుగుతుంటాయి. ఈ ఉత్సవాల్లో గ్రామీణ భాష గుబాళిస్తుంది. ఎవరినైనా సరే, ఎంతో ఆప్యాయంగా వరసలతో పిలిచే ఇక్కడి సంస్కృతి ఆకట్టుకుంటుంది. ఎవరైనా పెద్దవయసువారు కనపడితే పెద్దాయన/ పెద్దామె అనడం సాధారణం. కొత్తవాళ్లని ‘ఏంబా’/ ‘ఏమబ్బా’ అని పలకరిస్తారు. దంపతులు కూడా ‘ఏంబా’ అంటూ సంభాషించుకుంటారు. అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ‘ఏమప్పా’ పిలుస్తారు. మహిళలు పురుషులను ‘అన్నా’ అని సంబోధిస్తారు. ‘ఏవన్నా చానా దినాలైంది నిన్ను చూసి’ అనడంలో ఎంతో ఆప్యాయత ధ్వనిస్తుంది. 
తెరువు... వేళకారు
చిత్తూరు జిల్లాకు దక్షిణం వైపు తమిళనాడు ఉంటుంది. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు ఉపాధి కోసం ఈ జిల్లాకు వస్తుంటారు. తిరుపతి, నగరి, పుత్తూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో వీళ్లు నివసిస్తుంటారు. దాంతో చాలా తమిళ పదాలు ఇక్కడి తెలుగులో కలిసిపోయాయి. అలాగే ఆయా ప్రాంతాల స్థానికులకూ తమిళ భాష మీద పట్టు ఉంటుంది. వాళ్లూ తమిళ మాటలను విరివిగా వాడుతుంటారు. ముఖ్యంగా వరుమానం (జీతం), వేళకారు (ఉద్యోగి), కడవులే (దేవుడు), పెరుమాళ్‌ (వేంకటేశ్వరుడు), అన్నాచ్చి (అన్న), అని (వదిన), చిత్తప్ప (చిన్నాయన), అంబలా పసంగల్‌ (అబ్బాయిలు), పొంబలా పసంగల్‌ (అమ్మాయిలు), తెరువు (వీధి) లాంటివి. ‘ఎన్నబా ఎన్న సమాచారం’ అంటే ‘ఏంబా సంగతులేంటి’ అని అర్థం. ‘పండగను అమక్కళంగా చేస్తారు’ అంటుంటారు. అంటే ‘ఆర్భాటంగా చేస్తార’ని భావం. చేపల మార్కెట్‌ను ‘మీన్‌ మార్కెట్‌’ అని, ఎండుచేపలను ‘కరువాడ్‌’ అనీ పిలుస్తారు. 
      ఇక్కడ ఇంకో రకమైన భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. తమిళపదాలను తెలుగు మాటలతో కలిపి వాడుతుంటారు. ‘ఏంబా మలైకు పోయినావా’ అంటారు. అంటే తిరుమలకు వెళ్లావా అని అర్థం. ‘అన్నం తిన్నావా’కు మారుగా ‘ఎన్నాబా సోర్‌ సాపాటుయా’ అని అడుగుతారు. తిరుమల, తిరుపతుల్లో తమిళ ఆగమాలు ఇప్పటికీ వ్యాప్తిలో ఉన్నాయి. అందుకే ఆలయాల్లోనూ తమిళ సంబంధమైన పేర్లు అనేకం వినిపిస్తుంటాయి. వెంకన్నగుడిని పెరుమాళ్‌ కోయిల్‌ అంటారు. తిరుమల నుంచి ఎవరైనా గుండుతో వస్తే ‘ఎన్నాబా మొట్ట అడిచ్చిట్టియా’ అని సంబోధిస్తారు. తమిళ ప్రాబల్యమున్న గ్రామాల్లో ‘నాట్టామై’ వ్యవస్థ ఉంది. ‘నాట్టామై’ అంటే గ్రామపెద్ద. ఆయన మాటలకు ఇప్పటికీ ఆ గ్రామప్రజలు విలువ ఇస్తారు. వీధుల్లో చిన్నచిన్న తగవులు ఏర్పడినప్పుడు సవాళ్లు విసురుకోవడం ఎక్కడైనా ఉండేదే. అయితే ఇక్కడ మాత్రం ‘నడకరదే వేరుడా’ అని సవాల్‌ విసురుతారు. ‘పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించడమన్న మాట. దీనికి ప్రతిసవాల్‌గా ‘పాతుకిటే’ అంటారు-  అంటే చూసుకుంటామని!  అయితే ఈ మిశ్రమ భాష వ్యవహారంలో ఉండేది పట్టణ ప్రాంతాల్లోనే. గ్రామాల్లో స్వచ్ఛమైన తెలుగే వినపడుతుంది. తరతరాలుగా ఇక్కడే ఉంటున్న తమిళులు రెండు భాషలనూ మాట్లాడగలరు.  
      పలమనేరు, బైరెడ్డిపల్లి, కుప్పం, మదనపల్లి తదితర ప్రాంతాల మీద కన్నడ భాష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుప్పం, పలమనేరు ప్రజలకు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్రవేశముంటుంది. ఇక్కడికి వస్తే ‘చెన్నగిదిర’ అని పలకరిస్తారు. అంటే ‘ఎలా ఉన్నావు?’ అని అర్థం. బేడు (వద్దు), బేకు (కావాలి), కల్సామాడు (పనిచూడు), సాకు (చాలు) అనే పదాలు రోజువారీ సంభాషణల్లో వినవస్తుంటాయి. ‘భోజనం చేశావా’ అనేందుకు ‘వూటా అయిత్తా’ అంటారు. అయితే, ఇతర భాషల ప్రభావం ఎంత ఉన్నాసరే, తనదైన సొగుసును మాత్రం పొగొట్టుకోని అమ్మభాష ఇక్కడివాళ్ల సొంతం. మధురాంతకం రాజారాం, కేశవరెడ్డి, నామిని తదితరుల రచనల్లో చిత్తూరు తెలుగు గుబాళిస్తుంటుంది. మొత్తమ్మీద తెలుగు భాషాధ్యయన కోణంలో చూస్తే చిత్తూరు జిల్లా ఓ విలక్షణ ప్రాంతం. 
వెంకన్న వైభోగం అందరికీ తెలిసిందే. ఆయన సన్నిధానం నిత్యకల్యాణం పచ్చతోరణంగా కళకళలాడుతుంటుంది. అయితే, తిరుపతిలోని గోవిందరాజులస్వామి ఆలయమూ ప్రాచీనమైందే. కానీ, ఆదాయం ఎక్కువగా ఉండదు. మరోవైపు భక్తులు, పర్యాటకులు ఎవరొచ్చినా మొదట ఆ రద్దీని భరించేది కొండ కింది తిరుపతే. కానీ, వాళ్లు సమర్పించే దక్షిణలన్నీ కొండ మీది స్వామికే పోతాయి. ఈ రెండు విషయాలనూ కలిపి సరదాగా చెబుతూ ‘గోల గోవిందరాజులుది, ముడుపులు వెంకటేశులువి’ అంటారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం