వ్యథార్త జీవిత యథార్థ గాథలు

  • 1249 Views
  • 10Likes
  • Like
  • Article Share

తెలుగు సాహిత్యంలో ‘మంచిపుస్తకాలు’ అంటే కొన్ని కథల సంపుటాలు గుర్తుకు వస్తాయి. కొన్ని కవితా సంకలనాలూ కళ్ల ముందు మెదులుతాయి. ఇంకొన్ని నవలలూ తట్టవచ్చు. ఇక ప్రాచీన కావ్యాలు సరేసరి. ఇవి ఎంతగా మానవ జీవితాన్ని చిత్రికబట్టినా... వాటిలో ఎంతోకొంత కల్పన ఉండకపోదు. కానీ, ఆ ఊహకు దూరంగా, బడుగుజీవుల బతుకుపోరాటాలను ఉన్నది ఉన్నట్టు చెప్పిన ఓ పుస్తకం పేరు చెప్పండి? 
ఈ ప్రశ్నకు
ఏకైక సమాధానం ‘జీవన సమరం’. మొత్తం దేశ సాహిత్యంలోనే ఇలాంటి పొత్తం మరొకటి కనిపించదు. అట్టడుగు జీవితాల్లోని వేదనను అక్షరాల్లోకి అనువదించి, రావూరి భరద్వాజ రాసిన పత్రికా వ్యాసాల సంకలనమిది. పేరుకు ఇవి వ్యాసాలైనా, అంతా కథ చెబుతున్నట్టుగా ఉంటుంది. కానీ ఆ ‘కథ’లో అక్షరం కూడా కల్పన కనిపించదు.  జానెడుపొట్టకు నాలుగు మెతుకులు సంపాదించుకోవడానికి బీదలు పడే పాట్లు, భవిష్యత్తు మీద ఎలాంటి ఆశా లేకుండా ఏ పూటకు ఆ పూట సంపాదించుకుంటూ బతుకుతున్న వాళ్ల జీవిత చిత్రణ వీటిలో కనిపిస్తుంది. 
      ‘‘మన బతుకులిలా బుగ్గి పాలుకావడానికి, దేవుడే కారణమనుకుంటున్నది గాని, మనల్ని పరిపాలించే వారే కారణమని ఆమెకు తెలీదు. మనం తెలియజెప్పినా ఆమె వినదు. ఒకవేళ విన్నా నమ్మదు. నిజం చెప్పినా, నమ్మనంత మూఢత్వంలో మన పాలకులు, మన పాలనా వ్యవస్థ పోశమ్మను అట్టే పెట్టిన విషయం మనలో చాలా మందికి తెలియదు’’ అని స్వరాజ్యం సాధించుకున్నాక, తొలి ముప్ఫయ్యేళ్లలో సామ్యవాద రాజ్య స్థాపన నినాదం చెప్పి ఆచరణలో దానికి భిన్నంగా వ్యవహరించి ‘అంతేలే పేదల బతుకులు’ అన్న నిస్తేజం సమాజంలో వేళ్లూనుకునేలా చేసిన ప్రభుత్వాల్ని విమర్శిస్తారు భరద్వాజ ‘జీవన సమరం’లో. కాలుకదలకుండా ఉండాల్సిన వయసులో పట్నంలో పిడకలు అమ్ముకుంటున్న పోశమ్మ అనే మహిళ జీవితం ఆధారంగా రాసిన ‘నేనుసైతం ఇంటిపొయ్యికి’ వ్యాసంలోని మాటలివి,
      భరద్వాజ చెప్పింది నిజమే. ఎన్నో పోరాటాలు చేసి కలలు కని సంపాదించుకున్న స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం... అన్నీ మేడిపళ్లే అయ్యాయి. వివిధ కారణాలతో కోట్లమంది రోజురోజుకూ పేదరికంలో కూరుకుపోయారు. దాన్నుంచి వచ్చిన అసహనం వాళ్లను కొన్నిసార్లు నేరాలవైపు పురికొల్పింది కూడా. సమాజం ఇలా దారీతెన్నూ లేకుండా పోతున్న దశలో వ్యథార్త జీవిత యథార్థ గాథలను పత్రికలో అక్షరీకరించాలన్న ఆలోచన ‘ఈనాడు’ అధినేత రామోజీరావుకు వచ్చింది. ఆయన కోరిక మేరకు భరద్వాజ కళ్లకు కట్టిన దిగువ ప్రపంచపు సోదరుల ధారావాహిక కథనాలే ఈ జీవన సమరం.
      అష్టకష్టాలు పడుతూ చావలేక, బతకలేక జీవితాన్ని సాగించే వాళ్ల గురించి రాసిన వ్యాసాలను ‘జీవన సమరం’ శీర్షికన మే 19, 1978 నుంచి ఆగస్టు 23, 1979 వరకు 52 వారాలపాటు ‘ఈనాడు’ సంపాదకీయ పుటలో ప్రచురించారు. తర్వాత అవే పుస్తకం రూపంలోకి వచ్చాయి. వివిధ వృత్తుల్లోని బక్కప్రాణుల వెతలను కళ్లకు కడుతుంది కాబట్టే ‘‘పాకుడురాళ్లు’ నవలకంటే జీవన సమరానికి జ్ఞానపీఠ పురస్కారం వస్తే ఎక్కువ సంతోషించేవాణ్ని’ అన్నారు రావూరి భరద్వాజ.
      ఇందులోని వ్యాసాలన్నీ నాలుగు గోడల మధ్య కూర్చుని రాసినవి కావు. పొట్టకూటి కోసం వ్యవసాయ కూలీగా, పశువుల కాపరిగా, రంపంలాగే పనివాడిగా, తిత్తులూదే కూలీగా, పేపరుబాయ్‌గా పనిచేసి జీవితంలోని యాతనంతా అనుభవించిన భరద్వాజ... ఆయా వృత్తులవాళ్ల దగ్గరికి వెళ్లి ఎంతో శ్రమకోర్చి ఓర్పుతో, సహనంతో రాసిన పుస్తకం. అందుకే ఆ వృత్తుల పదజాలం పొల్లుపోకుండా రాయగలిగారు. జీవన సమరంలో ఉన్న ప్రతీ కథనం మన లోలోతుల్లో గూడు కట్టుకుపోయిన ఆర్ద్రతను వెలికితీస్తుంది. గడ్డ కట్టుకుపోయిన మనిషితనాన్ని తట్టి లేపుతుంది. ఒక్కొక్క వృత్తివాళ్లు పడుతున్న ఇబ్బందుల్ని మనముందు నిలిపి కళ్లు చెమ్మగిల్లేలా చేస్తుంది. ఇందులో పేర్కొన్నవన్నీ కులవృత్తులు కాదు. విధిలేని పరిస్థితుల్లో చేపట్టిన తాత్కాలిక వృత్తులే ఎక్కువ. అందుకే ఇందులోని వ్యక్తులు ఏయే పనుల్లో ఎన్నెన్ని పాట్లుపడిందీ వివరిస్తుంది. 
ఒక్కోటి ఒక్కో జీవితం
హైదరాబాదులో ఉద్యోగులకు మధ్యాహ్న భోజనం అందించే అంజమ్మ జీవిత చిత్రణతో ప్రారంభమయ్యే ‘జీవన సమరం’, కత్తెరలు సానబట్టే పండరి ఆశ నిరాశల జీవితంతో ముగుస్తుంది. మొదలుపెట్టిన దగ్గరినుంచి 52 కథనాలూ అయిపోయేవరకు ఆపాలన్నా ఆగని శైలిలో సాగుతుందీ పుస్తకం. ప్రతీ కథనాన్ని ఆయా వృత్తులకు సంబంధించిన విశేష అంశంతో ప్రారంభిస్తారు భరద్వాజ. తర్వాత వాళ్ల జీవితాన్ని కళ్లకు కడుతూ... మధ్యలో వాళ్ల గురించి వాళ్ల మాటల్లోనే ప్రకటిస్తూ సాగుతారు. కథనం చివర్లో మనిషిని మనిషిగా చూడని, నినాదాలతో పొద్దుపుచ్చుతూ పబ్బం గడుపుకుంటున్న ప్రభుత్వ వ్యవస్థని విమర్శిస్తూ ముగిస్తారు. ప్రతీ కథనం మన గుండె చెమ్మగిల్లేలా చేసేదే. అన్నమో రామచంద్రా!, భయం... భయం... బతుకు భయం!, ముందుగతి కానవే చిలకా!, కేసరి జీర్ణ తృణంబు మేయునే... అని సాగే శీర్షికలు పాఠకుల్లో విషయం పట్ల ఆసక్తి రేకెత్తిస్తాయి.
      విధిలేని పరిస్థితుల్లో ఏదో ఒక వృత్తి చేపట్టిన అంజమ్మ, పిడకలు చేసే పోశమ్మ, తేగలు అమ్మే మొయినుద్దీన్, బుట్టలు అల్లే తిరుపతయ్య, విధివంచితురాలై బజ్జీలు అమ్ముకునే సావిత్రి, సంస్థానాల్లో రాజుల దగ్గర సుఖంగా బతికి గొడుగులు తయారుచేసే శంకరయ్య... ఇలా ఏ కథనం చదివినా మనకు వాళ్లపట్ల జాలి కలుగుతుంది. వీళ్లంతా మన పక్కన, మనతో కలిసి జీవించేవాళ్లే. సుఖపడే వయసులో బతుకు పట్ల అసహనం పెంచుకునే వాళ్ల కథలు చదువుతున్నప్పుడు కళ్లలో నీళ్లు తిరుగుతాయి. తాము ఎంచుకున్న పని అంతగా జరుగుబాటు కాకున్నా... చెవుల్లో గుబిలి తీసేపని, సైకిళ్లు బాగుచేయడం, చాయ్‌ అమ్మడం, సీసాలు అమ్మడం, గారడీ చేయడం, సవరాలు కట్టడం, పీచుమిఠాయి అమ్మడం లాంటివి చేపట్టి బతుకుబండి లాగుతున్న సమస్త వృత్తుల జీవితాల్నీ చిత్రిస్తుంది ఈ జీవన సమరం. తమ వృత్తుల్లో జీవనం సాగక తమ పిల్లలు తమలా కావొద్దని, ‘వాళ్లని చదివిస్తున్నాం, ఈ వృత్తి నాతోనే ఆఖరు’ అని వాళ్లు అన్నప్పుడు, ‘ఉద్యోగాలు అంత సులభంగా దొరకవనీ, చదువుకున్న చాలామంది ఉద్యోగాల్లేక, ఈ పుణ్యభూమి లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అన్న రచయిత వ్యాఖ్య మన విద్యా వ్యవస్థ దౌర్బల్యాన్ని కళ్లకు కడుతుంది.
      ఇక పత్రికలో వ్యాసాలకు వచ్చిన స్పందన గురించి.. ‘ఈ ఫీచర్‌ మేము ఆశించిన దానికన్నా అధికాధికమైన ప్రజాదరణను పొందింది. వారానికోరోజు కాకుండా రోజువిడిచి రోజు, వీలైతే ప్రతిరోజూ ప్రచురించవలసిందే’నని విజ్ఞప్తులు వచ్చాయంటారు రామోజీరావు. అంతేకాదు, ఎంతోమంది ఆయా కథనాల్లోని వారికి తోచినమేరకు సాయం అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. పుస్తకంలో పేర్కొన్న వృత్తుల్లో ఉన్న కొంతమంది చదువుకున్న వాళ్లు ఈ వ్యాసాలను అపురూపంగా దాచుకున్నారు.
      ఈతరంలో... మన చుట్టూ ఉన్న సమాజం గురించి మన భాషలో మనకు వివరించి మనలో సామాజిక బాధ్యత పెరిగేలా చేసే ‘జీవన సమరం’ లాంటి పుస్తకాల గురించి ఎంతమందికి తెలుసు? ఆ మాటకొస్తే, మన ప్రభుత్వాలూ ఈ వ్యాసాల నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో  ఉన్నాయి. ఉద్యోగ కల్పనా ప్రణాళికల్లో మనం ఎంతమందికి న్యాయం చేస్తున్నాం.. అభివృద్ధిలో ఎవరిని భాగం చేయాలి, మారుతున్న పరిస్థితుల్లో నెగ్గుకు రాలేక పోతున్న వృత్తులవారికి ప్రత్యామ్నాయాలను ఎలా వెతకాలి లాంటి అంశాలు గమనింపు లోకి రావడానికి ‘జీవన సమరం’ లాంటి పుస్తకాలు మార్గదర్శకంగా నిలుస్తాయి. సాహిత్యంలో ఉండే సామాజిక కోణానికి గొప్ప ఉదాహరణలు ఇలాంటి పుస్తకాలే. 


వెనక్కి ...

మీ అభిప్రాయం