ఆరోగ్యం @ అంతర్జాలం

  • 750 Views
  • 3Likes
  • Like
  • Article Share

వృత్తిరీత్యా ఏమాత్రం తీరిక దొరకని వైద్యనిపుణులు ఈ నలుగురు. అయినాసరే, ఓ ఉన్నతాశయంతో ముందడుగేశారు. తమ వృత్తికి సంబంధించిన సమాచారాన్ని తెలుగులో అందించాలన్న తపనతో అంతర్జాలాన్ని వేదికగా చేసుకున్నారు. అలా కొన్నేళ్లనుంచి వైద్య ఆరోగ్య అంశాల మీద తెలుగువారిలో అవగాహన పెంచేందుకు శ్రమిస్తున్నారు. వైద్యుల దినోత్సవం (జులై 1) సందర్భంగా ఈ వైద్యనారాయణుల స్ఫూర్తిదాయక కృషి గురించి.... 
ఎక్కడో పుట్టి... 

ఆ బ్లాగును తెరిచి చూస్తే, స్వచ్ఛమైన తెలుగు మనకు స్వాగతం పలుకుతుంది. ‘స్పృహ తప్పితే ఏం చేయాలి’ అన్న వివరాల నుంచి వ్యాధినిరోధక టీకాల వరకూ, కళ్ల కింద నల్లమచ్చల నుంచి కట్టుడుపళ్ల వరకూ, క్షయ నుంచి గొంతు కాన్సర్‌ వరకూ ఇలా రకరకాల వ్యాధులు, ఆరోగ్యసమస్యలకు సంబంధించిన సమాచారమంతా మన అమ్మభాషలోనే ఉంటుంది. పైగా ఆ బ్లాగు పేరు కూడా ‘మనతెలుగుడాక్టర్‌’. (manatelugudoctor.blogsopt.in) కానీ, దీన్ని నిర్వహిస్తున్న వైద్యుడు మాత్రం కన్నడిగుడు. ఆశ్చర్యంగా ఉందా! అదే మరి డాక్టర్‌ టీఎం నగేష్‌ ప్రత్యేకత. 
తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రి నిర్వాహకులైన నగేష్‌ మాతృభాష కన్నడం. కానీ, తెలుగునాట స్థిరపడటంతో మనభాష మీద ప్రేమ పెంచుకున్నారు. మాట్లాడటమూ నేర్చుకున్నారు. అంతేకాదు, విలువైన వైద్య సమాచారాన్ని తెలుగులో అందించడానికి 2012లో ఈ బ్లాగు ప్రారంభించారు. తెలుగులో రాతకు ఓ స్నేహితుడి సహకారం తీసుకుంటూ ఈ బ్లాగును నిర్వహిస్తున్నారాయన. ప్రాథమిక వైద్య సమాచారం నుంచి క్లిష్టమైన వ్యాధులకు సంబంధించిన చికిత్సా విధానాల వివరాలనూ అందిస్తున్నారు. మనిషికి అవసరమైన అతిసూక్ష్మపోషకాలు, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఘాటైన వాసనలు- అనారోగ్యం, గర్భాశయంలో గడ్డలు, కీళ్లలో రాయి- గౌట్‌ నివారణ... ఇలా అనేక అంశాలకు సంబంధించిన వివరాలను ఈ బ్లాగులో చూడవచ్చు. ఇప్పటివరకూ రెండు లక్షల మందికి పైగా ఈ బ్లాగును వీక్షించారు.
ఆహారవిజ్ఞాన సర్వస్వం 
తెలుగు పాఠకలోకానికి పరిచయం అక్కర్లేని పేరు డాక్టర్‌ జీవీ పూర్ణచందు. శతాధిక గ్రంథ రచయిత, తెలుగువారి ఆహార చరిత్ర పరిశోధకుడు, తెలుగు భాషోద్యమకారుడు అయిన ఆయన విజయవాడలో సుశ్రుత ఆయుర్వేద ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ఆయుర్వేద వైద్య రహస్యాలను ఆధునిక వైద్యశాస్త్రంతో సమన్వయపరుస్తూ పాఠకుల్లో ఆరోగ్య స్పృహ పెంచడానికి తన బ్లాగుద్వారా (drgvpurnachand.blogspot.in) కృషి చేస్తున్నారాయన. నాలుగేళ్ల కిందట దీన్ని ప్రారంభించారు పూర్ణచందు. ఆహారమే అనేక వ్యాధులకు మూలకారణమనే చరకుడి సిద్ధాంతానికి అనుగుణంగా తెలుగువారి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం మీద వాటి ప్రభావం మీద ఇప్పటివరకూ ఈ బ్లాగులో 400 వ్యాసాలు రాశారు. అవన్నీ తొమ్మిది పుస్తకాలుగా వెలువడ్డాయి. మొత్తమ్మీద పదివేల పుటల వైద్య సమాచారాన్ని 40 పుస్తకాల రూపంలో తెలుగులో అందించిన ఘనత పూర్ణచందుది. 
‘సామాన్యుడికోసం ఆహారం, ఆరోగ్యం, వైద్య సమాచారం అందుబాటులో ఉంచడంతోపాటు తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్రలకు సంబంధించిన పరిశోధక వ్యాసాలను అంతర్జాతీయ తెలుగు సమాజానికి అందించడానికి ఈ బ్లాగును ప్రారంభించా’నని చెప్పే పూర్ణచందు, దీనికి అనుగుణంగానే బ్లాగును నిర్వహిస్తున్నారు. ‘బొజ్జను తగ్గించే సజ్జలు’, ‘స్థూలకాయానికి విరుగుడు ఉప్పుటుండలు’, ‘ప్రపంచీకరణం అంటే మధుమేహీకరణమే’... ఇలా ఆసక్తికర శీర్షికలతో, సాధ్యమైనంత సులువుగా విషయాన్ని విడమరుస్తారు. మనం మరిచిపోతున్న సంప్రదాయ వంటకాల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలతోపాటు వివిధ వ్యాధులకు సంబంధించిన ఆయుర్వేద చికిత్స పద్ధతుల గురించీ ఆయన రాస్తున్నారు. మన శరీరం మీద ఏ ఆహార పదార్థం ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న విషయం దగ్గరినుంచి చెడ్డకొవ్వును తగ్గించే ఆహారం వరకూ అన్ని విషయాల మీదా చక్కటి సమాచారం అందుబాటులో ఉంచుతున్నారు. వీటితోపాటు ప్రాచీన, ఆధునిక సాహిత్యాల కలబోతగా పూర్ణచందు రాసే సాహితీ వ్యాసాలు ఈ బ్లాగుకు మరో ఆకర్షణ. ‘భాషాగీర్వాణం’, ‘వాగ్గేయకారుడు అల్లూరి వేంకటాద్రిస్వామి జీవితవిశేషాలు’, ‘స్త్రీవాదంలో మరోకోణం’ తదితర పూర్తిస్థాయి భాషా సాహిత్య వ్యాసాలతోపాటు ప్రాచీన సాహిత్యం ఆధారంగా పూర్ణచందు రాసిన ‘తెలుగు ఇడ్లీలు’, ‘అన్నమయ్య వంటకాలు’ లాంటి వ్యాసాలు మన ఆహారచరిత్రను కళ్లముందు నిలుపుతాయి.
ఖండాంతరాల నుంచి...
ఆయన పేరు డాక్టర్‌ సుధాకర్‌ అనుమంచి. మానసిక వైద్యనిపుణులు. ఉండేది ఇంగ్లాండులో. ఇరవై ఏళ్లుగా ఆయన అక్కడే నివసిస్తున్నారు. కానీ, ఆయనో అచ్చమైన తెలుగు వెబ్‌సైట్‌... ‘బాగు.నెట్‌’ (www.baagu.net) నిర్వహిస్తున్నారు. వైద్య విషయాల మీద తెలుగువారికి శాస్త్రీయ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నాలుగేళ్ల కిందట ప్రారంభించిన దీనిలో ఇప్పటివరకూ 853 వ్యాసాలు రాశారాయన. పాఠకులకు విషయం సులువుగా అర్థమయ్యేలా చిత్రాలు, గ్రాఫిక్స్‌ తదితరాలనూ జోడించారు.
‘వైద్య సమాచారాన్ని మన మాతృభాషలో తెలుసుకుంటే... వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, చికిత్స పద్ధతుల గురించి బాగా అర్థమవుతుంది. ఆ వ్యాధులు మనకు రాకుండా జాగ్రత్తలూ తీసుకోవచ్చ’ని చెబుతారు సుధాకర్‌. ఈ స్ఫూర్తితోనే వివిధ వ్యాధులకు సంబంధించిన లక్షణాలు, దాంతో వచ్చే అనర్థాలు, నివారణా మార్గాలు, చికిత్స పద్ధతుల గురించి తన వెబ్‌సైట్‌లో శాస్త్రీయ ఆధారాలతో రాస్తున్నారు. ‘పొగాకు రుణం... ప్రాణం పణం’ శీర్షికతో పొగ తాగడం వల్ల చుట్టుముట్టే ఆరోగ్య సమస్యల గురించి రాశారు. అతిసాధారణంగా కనిపించే మానసిక వ్యాధి కుంగుబాటు గురించి ‘డిప్రెషన్‌ ఆత్మకథ’ పేరిట కథనాన్ని ప్రచురించారు. చక్కెర వ్యాధిని పెంచే కృత్రిమ తీపిరసాయనాలు, ఏ నూనెలను ఏ వంటలకు వాడాలి, మధుమేహంలో భాగంగా వచ్చే కళ్ల సమస్యలు, నిద్రలేమి, లైంగిక సమస్యలు, అధిక బరువుతో వచ్చే గుండెజబ్బులు తదితర విషయాలతో పాటు పారనోయియా (అనుమానాలకు సంబంధించిన ఫోబియా), రోడ్‌రేజ్‌ (దారిక్రోధం) లాంటి మనకు పెద్దగా అవగాహన లేని మానసిక రుగ్మతల సమగ్ర సమాచారాన్నీ అందించారు. సాంకేతిక పదాలనూ వీలైనంత వరకూ తెలుగులోనే రాస్తున్నారు. తెలుగులో చెప్పడం కుదరని పదాలను ఆంగ్లంలోనే పేర్కొంటూ, అమ్మభాషలో వాటికి అర్థ వివరణ ఇస్తున్నారు. 
‘బ్రిటన్‌లో ఉంటున్నా నాకు మాతృభాష మీద మమకారం ఎక్కువ’ అనే సుధాకర్‌కు తెలుగునాట మూడు ప్రాంతాలతోనూ అనుబంధం ఉంది. గుంటూరులో పుట్టిన ఆయన... కర్నూలు, అనంతపురం, హైదరాబాదుల్లో పెరిగారు. ఉస్మానియా, కీల్‌ (ఇంగ్లాండ్‌) విశ్వవిద్యాలయాల్లో వైద్యవిద్యను అభ్యసించారు. నిజామాబాదు జిల్లా గిరిజన ప్రాంతం గాంధారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేశారు. తర్వాత ఇంగ్లాండు వెళ్లారు. ‘ఇక్కడ పని ఒత్తిడి సహజంగానే ఉంటుంది. కానీ, తీరిక చేసుకుని వ్యాసాలు రాస్తుంటాను. రాయాలనుకున్న అంశానికి సంబంధించి పూర్తిస్థాయి పరిశోధన చేస్తాను’ అని చెప్పే సుధాకర్‌ భాషాభిమానం స్ఫూర్తిదాయకం. 
నేనుసైతం...
‘ఆరోగ్యమే మహాభాగ్యం. ఏమీ ఉన్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే మనిషి ఎందుకూ పనికిరాడు. ఆరోగ్యంగా ఉంటే అడవిలోనైనా బతికేయగలడు. అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలూ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బుపడితే వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. బతికినన్నాళ్లూ హాయిగా ఆరోగ్యంగా బతకాలన్నది నిజమైన జీవనవిధానం’... ఇదీ డాక్టర్‌ వండాన శేషగిరిరావు సిద్ధాంతం. శ్రీకాకుళానికి చెందిన ఆయన ‘వండాన నర్సింగ్‌హోం’ నిర్వాహకులు. అంతేకాదు, తెలుగువాళ్లకు వైద్యపరమైన అవగాహన పెంచడం కోసం ‘వైద్యరత్నాకరం’ బ్లాగును (vydyaratnakaram.blogspot.in) నిర్వహిస్తున్నారు. 2009లో ప్రారంభించిన ఈ బ్లాగులో 826 వ్యాసాలు ఉన్నాయి. 


శేషగిరిరావు మొదట్లో ఈ బ్లాగును ఆంగ్లంలో ప్రారంభించారు. అయితే, తెలుగులో రాయాలని పాఠకుల నుంచి వచ్చిన అభ్యర్థనలతో దీన్ని పూర్తిస్థాయి తెలుగు బ్లాగుగా మార్చారు. వివిధ వ్యాధులకు సంబంధించిన ప్రథమ చికిత్స పద్ధతులతో పాటు సంబంధిత సందర్భాల్లో వాడదగిన మందుల వివరాలనూ అందిస్తున్నారు. పెద్దపేగు కాన్సర్‌ నుంచి కంప్యూటర్ల వినియోగంతో చుట్టుముట్టే ఆరోగ్య సమస్యల వరకూ, పసిపిల్లల్లో వినికిడిలోపం నుంచి గుండెజబ్బుల బాధితులకు చేసే ఎలక్ట్రో ఫిజియోథెరపీ వరకూ అన్ని అంశాలకు సంబంధించిన సమాచారమూ ఇందులో ఉంది. తాను సొంతంగా వ్యాసాలు రాయడమే కాదు, పత్రికల్లో వచ్చే వైద్యారోగ్య సంబంధ వ్యాసాలనూ తెలుగు యూనికోడ్‌లోకి మార్చి ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు శేషగిరిరావు. ‘ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఉండటానికి ప్రయత్నించాలి. మంచి ఆరోగ్యకర పరిసరాలను కల్పించుకోవాలి. ఆరోగ్యంగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పరచుకోవడం తప్పనిసరి’ అని చెప్పే ఆయన మాటలకు ఆచరణాత్మక రూపమే ఈ ‘వైద్యరత్నాకరం’. 


వెనక్కి ...

మీ అభిప్రాయం