భోగిపళ్లు పోయరారె అమ్మలారా!

  • 1611 Views
  • 2Likes
  • Like
  • Article Share

సంక్రాంతికి ముందురోజు మనకు భోగభాగ్యాలను ప్రసాదించే భోగి. ఆ రోజున సూర్యోద‌యానికి పూర్వ‌మే లేచి పెరిగిన చ‌లి నుంచి విముక్తి పొందేందుకు వీధుల్లో మంట‌లు వేస్తారు. పాత వ‌స్తువుల‌న్నీ తెచ్చి ద‌హ‌నం చేస్తారు. అంద‌రూ ఆ మంట చుట్టూ చేరి చ‌లి కాచుకుంటారు. ఇదంతా ప్రాతఃసంధ్య‌లో క‌నిపించే దృశ్యం. అదేరోజు సాయంత్రానికి చిన్న‌పిల్ల‌లున్న ఇళ్లు మ‌రింత సంద‌డి సంత‌రించుకుంటాయి. ఆ సంద‌డి భోగిప‌ళ్ల‌ది.
తెలుగిళ్లలో భోగిపళ్ల కార్యక్రమం ఓ వేడుకగా అనాదిగా వస్తోంది. దీనికి ప్రధాన వస్తువుగా నిలిచేది రేగుపండు. రేగుపళ్లలో సౌరశక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఆ శక్తి పళ్ల ద్వారా పిల్లలకు అందించాలని పెద్దలు తలపెట్టిన వేడుకే ఈ భోగిపళ్లు పోయడం. దీనిని ఇరుగుపొరుగులతో కలిసి సంబరంగా జరుపుకుంటారు. తమకు భోగిపళ్లు పోస్తారన్న విషయం పిల్లలకు పెద్దల ద్వారా తెలిసి ఉంటుంది. దాంతో భోగినాడు పొద్దుట్నుంచే పిల్లలు ఈ హడావుడి ఎప్పుడా అని ఎదురుచూస్తుంటారు. దీనికోసం పిల్లలకు కొత్తబట్టలు కుట్టిస్తారు. వాళ్ల దృష్టంతా దుస్తుల మీదే. స్నానం చేయగానే వేసుకోవాలన్న ధ్యాసతో ఉంటారు. పెద్దలు ఇప్పుడు కాదు... సాయంత్రం అంటే చిన్నబుచ్చుకుంటారు. మొత్తానికి ఆ వేడుక తమకు ప్రత్యేకించింది కనుక తమమాటే చెల్లుబాటు కావాలనుకునే తత్వం వాళ్లది. ఇది పిల్లల మీద దృష్టి దోషాలు, గ్రహ బాధలు తొలగిపోవాలన్న తలంపుతో చేసే వేడుక మాత్రమే. ఎందుకంటే ఒకప్పుడు పిల్లలను బాలారిష్టాలు వెంటాడేవి. 
     
ఇవ‌న్నీ సరే... ప్రతీ వేడుకకు సంబంధించి జానపదులు తగిన గేయాలు అల్లుకున్నారు. భోగిపళ్లకు సంబంధించిన పాటలు కూడా తెలుగునాట ప్రచారంలో ఉన్నాయి. అన్నీ కూడా చుట్టుపక్కల అమ్మలక్కల్ని వేడుకకు రమ్మని ఆహ్వానించడం, పిల్లలకు భోగిపళ్లు పోసి దిష్టితీయడం, దానికి ఉపయోగించే సామగ్రి- రేగుపళ్లు, చెరకుముక్కలు, (రాగి)నాణేలు, పిప్పరమెంట్లు లాంటివి; దానివల్ల దేవతలు సంతోషించి ఆ చిన్నారులకు జీవితంలో శుభాలు కలిగిస్తారని చెప్పడం, హారతులివ్వడం ప్రధానంగా సాగేవే. వాటిలో ఒకటి ఈ పాట...
భోగిపళ్లు పోయరారె అమ్మలారా
కోమలాంగులందరు గూడి కొమ్మలారా...
భోగిపళ్లు!! భోగిపళ్లు పోయరారే!!
చిట్టి చిట్టి పాపలను చేరదీసి
కొత్త కొత్త బొమ్మలను కొలువు దీర్చి 
కన్నెలొలుకు వన్నెలకు చిన్నెలిచ్చి 
ముద్దు గొలుపు మురిపాలు మూటగట్టి
భోగిపళ్లు!! భోగిపళ్లు పోయరారే!! 
రేగుపళ్లు రాగి డబ్బులు 
చెరుకు గడలు సెనగ గింజలు 
బంతిపూల రేకులతో కొమ్మలారా...
 దిష్టిదీసి దిగదుడిచి అమ్మలారా... 
భోగిపళ్లు!! భోగిపళ్లు పోయరారే!! 
కాంతులీను హారతిచ్చి
కమలనాభు కరుణ కోరి 
అందమైన బొమ్మలకు కొమ్మలారా 
బొమ్మలంటి పిల్లలకు అమ్మలారా 
భోగిపళ్లు!! భోగిపళ్లు పోయరారే!! 

      మా ఇంట్లో పిల్లలకు భోగిపళ్లు పోస్తున్నాం. మీరందరూ రండి అని ఇరుగుపొరుగుల్ని బొట్టుపెట్టి ఆహ్వానిస్తూ సాగిన పాట ఇది. భోగిపళ్ల వేడుక సందర్భం పిల్లలకు దిష్టితీయడం. అందుకోసం రేగుపళ్లు, బంతిరేకులు, చెరకుముక్కలు, శనగలు, రాగి నాణేలను ఒక పాత్రలో పోస్తారు. ఇవే భోగిపళ్లు. వీటిని అయిదేళ్ల లోపు పిల్లల తలమీది నుంచి పోస్తారు. ఆ తర్వాత హారతి ఇచ్చి, పిల్లలకు కొత్తబట్టలు వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో భోగిపళ్లలో చిక్కుడు గింజలు, వేరుశనగలు, తేగలను కూడా చేరుస్తారు.
      తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఔషధ గుణాలు కలిగిన వీటిని తల మీదినుంచి పోయడంవల్ల బ్రహ్మరంధ్రం ప్రేరితమై పిల్లలు చైతన్యవంతులు, జ్ఞానవంతులవుతారట! ఇక భోగిరోజు సాయంత్రానికల్లా భోగిపళ్లు పోసే చిన్నారులకు పట్టుబట్టలు తొడిగి, చక్కగా అలంకరించి, పసుపు పూసిన పీట మీద పట్టువస్త్రం పరిచి కూర్చోబెడతారు. దీన్ని కళ్లకుకట్టేదే ఈ పాట...

శశిముఖులారా రారే మా  
పసిబాలలకు భోగిపళ్లు పోయుదామూ 
అద్దంపు చెక్కిళ్లు ముద్దులొల్కు చుండె 
దిద్దిన కస్తూరి తిలకమింపైయుండె 
మంగళాకారులు మదనసుందరులు 
రంగుగా పీటపై రాణింపుచున్నారు 
బంగరువంటి మేలు బదరి ఫలములుంచి 
రంగైన వరహాలు రవలు కెంపులు చేర్చి 
మూడేసి దోసిళ్లు మురియుచు శిరముపై 
వేడుకతో పోయుదము నేడు మన బాలలకు
వెంకట శివగురు కింకర వరదుడు
శంకలేక మా శిశువుల కాపాడు
 ఓ సుబ్బి గొబ్బెమ్మ ఓంకార రూపిణి 
నీకు వందన మంచు నే మ్రొక్కెద 
లోకపావని నీవు లోలాక్షి వినవమ్మా 
ముందుగా నీకు వందన మంటినమ్మా 

 
ఇంటింటికి నీవు యిలవేల్పువైతివి
ఇహ పరంబుల జూపి బోచితివి
గోమాతకున్‌ మ్రొక్కి గోమయం దెచ్చి, ఓ 
గొబ్బెమ్మయని నిన్ను పూజింతురమ్మా 
పడతులందరు గూడి పసుపుకుంకుమదెచ్చి 
పువ్వు ఫలములతో అర్చించిరి 
చేడెలందరు గూడి చేమంతులు దెచ్చి 
చేతులారా నిన్ను పూజింతురమ్మా 
పాడి పంటలనిచ్చి భాగ్యరాశులనిచ్చి
బాలలతో వర్ధిల్ల జేయుమమ్మా 
ఆశ్రయించి నట్లే అబలలన్‌ దీవించి 
ఆనంద మొందింప జేయుమా తల్లి
మగువ లందరుగూడి మంగళములు పాడి
ప్రార్థించి నిను వేడుచుందురమ్మా
కన్యలందరి ఎడ కడుప్రేమ జూపించి
కాపాడుమోయమ్మా గౌరీశురాణి!


      కార్యక్రమానికి వచ్చిన ముత్తయిదువులను ఉద్దేశించి... ముద్దులొలికే చిన్నారులు సిద్ధంగా ఉన్నారు. చూడచక్కగా ముస్తాబై, పట్టువస్త్రాలు తొడుక్కుని పీటల మీద కూర్చున్నారు. ఎర్రని రేగుపళ్లు, కెంపులు, ముత్యాలు వరసగా పేర్చాము. ఒక్కొక్కొరుగా వస్తే మూడేసి దోసిళ్లు భోగిపళ్లు సంతోషంగా తలమీద పోద్దాం. అందరం కలిసిమెలిసి సంతోషంగా చేసే ఈ కార్యక్రమానికి వేంకటేశ్వరుడు, శివుడు స్వయంగా వచ్చి మన పిల్లల్ని కాపాడతారనడంలో సందేహం లేదు అన్నది ఈ పాట ఆంతర్యం. ఇంకా భోగిరోజు గొబ్బెమ్మగా కొలువు తీర్చిన గౌరీదేవిని తలచుకుంటారు. ‘తల్లీ మేమంతా వందనం చేస్తున్నాం. ఆవుపేడనే గొబ్బెమ్మగా మలచి నిన్ను ప్రతిష్ఠించాం. నీకు పసుపు కుంకుమలు, పూలూ పళ్లూ అర్పించాం. చేమంతిపూలతో చేతులారా పూజించాం. మేమంతా పాడిపంటలు, పిల్లాపాపలతో వర్ధిల్లేట్లు దీవించమ్మా. నిన్ను ఆశ్రయించిన అబలలను కాపాడి ఆనందాన్ని ప్రసాదించు. నిన్ను కొలిచిన కన్నెలందరి మీద ప్రేమను కురిపించి వారినీ ఆశీర్వదించమ్మా’ అంటూ.... గౌరీదేవిని స్త్రీలు వేడుకుంటారు. ఇలాంటిదే మరో గేయం...
కలహంస గమనరో మన బాలునకు భోగి
పళ్లు పోయుదాము రారె చెలి
అంగానమణి వేగ బంగారు పీఠమున
మన ముద్దు బాలురనుంచెదము 
                                         !!కలహంస!!
అలికుల వేణికి ఆణి ముత్యములు
అందమైన మణులు కెంపులును
బంగారములనుపోలు బదరి ఫలమ్ములు
భామరో వేడుక తోడుతను 
సదయ హృదయములతో దీవించేము 
                                              !!కలహంస!!
ముద్దుగుమ్మ మనము మూడేసి దోసిళ్లు
మురియుచు బాలుర శిరముపైన
సరసిజాక్షి మనము సంతోషమున బోసి
సదయ హృదయములతో దీవించేము 
                                                !!కలహంస!!

అంటూ పసివాళ్లను దీవించి, భోగిపళ్లు పోశాక... మందగమన వేగ మంగళహారతి/ మన ముద్దు బాలులకిచ్చెదము/ పంకజాక్షి మనము పసుపు కుంకుమలిచ్చి/ ఫలము తాంబూలంబులిచ్చెదము... అని పాడుతూ చిన్నారులకు మంగళహారతి ఇస్తారు.
      భోగి పండగను పురస్కరించుకుని ఆరోగ్యకరమైన వాతావరణంలో భోగిపళ్లు పోయడం తెలుగు ఇళ్లలో మాత్రమే జరుపుకునే సంప్రదాయం. దీనివల్ల అయిదేళ్లలోపు పిల్లలకు ఇరుగుపొరుగు వాళ్ల పరిచయం కలుగుతుంది. పైగా ఇది పిల్లలు ఇంటినుంచి బడికి బయలుదేరి, తమ తొలిస్నేహాలను ఏర్పరచుకునే దశ! అందుకే తమ పిల్లలను బాహ్య ప్రపంచానికి తెలిపే క్రమంలో భాగంగానే ఈ భోగిపళ్లు పండగ వచ్చి ఉంటుంది. దానికి శీతకాలంలో ఇంటికి పంటగా వచ్చే రేగుపళ్లు, చెరకుముక్కలు సాధనాలుగా మారి ఉంటాయి.


గొబ్బిగౌరి వ్రతం
భోగి రోజు కన్నెపిల్లలు చేసుకునే గొబ్బిగౌరి వ్రతం కొన్ని ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉంది. ఇది కూడా భోగిరోజు చేసే వ్రతమే. ఇందుకు ఇంట్లో మండపాన్ని నిర్మిస్తారు. దాన్ని పళ్లు, కూరగాయలు, చెరుకుగడలు, పూలతో అలంకరిస్తారు. దాని మధ్యలో కొత్తబియ్యం పోసి బంకమట్టితో చేసిన గౌరీదేవి ప్రతిమను ఉంచుతారు. పాలతో చేసిన పొంగలి నైవేద్యంగా పెడతారు. కొందరు దాన్లో కూరగాయలు కలిపి వండుతారు. తర్వాత గౌరమ్మను నిష్ఠగా పూజిస్తారు. మంగళారతులు పాడి ఆ రాత్రికి శయనోత్సవం చేస్తారు. మర్నాడు, అంటే సంక్రాంతి రోజు ఉదయమే సుప్రభాతంతో గౌరీదేవిని తిరిగి మేల్కొలుపుతారు.
ఈ వ్రతం మూడు, నాలుగు, ఆరు రోజులు జరుపుకునేవాళ్లూ ఉన్నారు. ప్రతిరోజూ సాయంకాలం వేళ ముత్తయిదువులను పిలిచి తాంబూలం అందించి వాళ్ల ఆశీర్వచనాలు అందుకుంటారు. ముగింపురోజు సాయంత్రం పూజచేసి ఉద్యాపన చెబుతారు. అలంకరించిన కూరగాయలను కూరగా చేసి తింటారు. అదే గొబ్బికూర. తర్వాత గౌరీదేవి ప్రతిమను, పూజకు వాడిన పువ్వులను నదిలోకానీ, చెరువులోకానీ నిమజ్జనం చేస్తారు.


* * *


వెనక్కి ...

మీ అభిప్రాయం