దేశమంటే అప్పులోయ్‌

  • 493 Views
  • 8Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

దేశమంటే మట్టికాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌
అన్న గురజాడ అప్పారావు దేశభక్తి గీతంలో ‘దేశమంటే అప్పులోయ్‌’ అని ఉంటే అదిరిపోయేది. ‘అప్పుడప్పుడూ అవసరమైంది అప్పూ, డప్పూ’ అన్నాడొక కవి. ఏరకంగా చూసినా మనుషులు రుణగ్రహీతలే. మనిషి అంటే అప్పుల అప్పారావు. ‘అప్పిచ్చువాడు’ ఉండే ఊళ్లోనే ఉండమని కవి ఎంచక్కగా చెప్పాడు! అతడి రుణం తీర్చుకోలేం! ఆ జీవుడైనా, దేవుడైనా ‘అప్పుకు లోకం దాసోహమే’. అంతెందుకు? వేంకటేశ్వరస్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవడం, దాని పరిణామాలు ఎవరికి తెలియవు... వెంకన్న వడ్డీకాసులవాడు ఎలా అయ్యాడు? అందరికీ శ్రీహరే అంతరాత్మ అన్నారు. దాంతోపాటు ‘అందరికీ అప్పులే అంతరాత్మ’ అని కుబేరుడు, ఆయన అనుచరులు అన్నారు. ఇవన్నీ రుణ పురాణంలోని విశేషాలు. 
      అప్పులు.. వాటిని ఇచ్చిన మనుషులకు మంచి జ్ఞాపకశక్తిని ఇస్తాయి. ఇచ్చినవాడు చచ్చినా మరచిపోడు. చెవిలోని జోరీగలాగా ఉంటుంది అతని వ్యవహారం. అప్పులు తీసుకున్న వాడికీ తక్కువ సుఖమేమీ ఉండదు. అదే ఆస్తులు వెనకేసుకున్నవాడికి అడుగడుగునా గండమే. సచ్చినోడు ఆస్తులు విపరీతంగా పెంచాడు కానీ, తమకు ఇంకా ఇవ్వడేమిటని వారసులు ద్వేషం పెంచుకుంటారు. కొంత ఇచ్చి తమను ఆదుకోవచ్చు కదా అని బంధుమిత్రులు, సందు మిత్రులూ గోడకాడ నక్కల్లా పొంచి ఉంటారు. ఆస్తులున్నవాడికే దొంగ భయం ఉంటుంది. కానీ అప్పులున్నవాడిని ఏ భయమూ వెంటాడదు. పైగా ‘ఆత్మ’కు ఉన్నట్టి రక్షణ ఉంటుంది. ఆత్మను కత్తితో కోయలేం, అగ్నితో దహించలేమని శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో నమ్మకంగా చెప్పాడు కదా! కాబట్టి అప్పులు తీసుకున్నవాడు గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రమాత్ర వేసుకోకుండానే నిద్రపోవచ్చు. వాడికి జడ్‌ప్లస్‌ తాతలాంటి సెక్యూరిటీ కల్పించడానికి రుణదాతలు సదా సన్నద్ధంగానే ఉంటారు. అప్పులిచ్చిన పుణ్యానికి వారు డ్యూటీలు వేసుకొని మరీ అతణ్ని రక్షిస్తారు. మాయల మరాఠీల ప్రాణం చిలకల్లో ఉంటుందో లేదో గానీ అప్పులిచ్చిన వారి ప్రాణాలన్నీ అప్పు తీసుకున్నవాడిలో కొలువు దీరి ఉంటాయి. ఆస్తులు వెనకేసుకుంటే ఏంగొప్ప! అప్పులు కుప్పలుతెప్పలుగా ఉంటే అదీ అసలైన గొప్ప.
      ఆస్తులు, ఆభరణాలు ఉన్నవాళ్లకు, ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా కన్నీళ్లే. దొంగల బెడదతోపాటు ఇన్‌కంటాక్స్‌ వాళ్ల బెడద కూడా ఉంటుంది. కానీ కేవలం అప్పులున్నవాడిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అప్పు అడుగుతాడేమోనని భయపడి చస్తారు. అతడి కంటపడకుండా తప్పించుకుంటారు. అందువల్ల అప్పులున్నోళ్లే గొప్పోళ్లు! అప్పులవల్ల దేశానికిసైతం గొప్ప గుర్తింపు వస్తుంది. ఆస్తులిచ్చిన వాణ్ని విస్మరిస్తారు గానీ అప్పులు పుచ్చుకున్న వాణ్ని ఎవరైనా స్మరిస్తారు. అష్టోత్తర పారాయణంలాగా అప్పులు తీసుకున్న అన్ని దేశాల పేర్లనూ ప్రపంచబ్యాంకు స్మరిస్తూ ఉంటుంది.
      ‘అప్పులేని వాడే అధిక సంపన్నుడు’ అన్నది కవి మాట! అది నిజం కాదు. అప్పులున్నవాడే అధిక సంపన్నుడు. ఎందుకంటే ఇతరులు కష్టపడి సంపాదించిన డబ్బును వీళ్లు తమ సొంతం చేసుకుంటారు. ‘అప్పు తీసుకోవడం వరకే నీ చేతిలో ఉంటుంది. అది తీర్చడం నీ చేతిలో లేకపోవచ్చు. కొండొకచో నీ వారసుల చేతిలోనూ ఉండకపోవచ్చు’ అని కృష్ణపరమాత్ముడు చెప్పకపోయినా ఇది పచ్చినిజం! ఇంటిల్లిపాదికీ తెలిసిన నిజం! ‘ఓన్‌ హౌస్‌లన్నీ లోన్‌ హౌసులే’నని అక్షరాలా రాసి పళ్లికిలించాడు ఓ రచయిత.
      ఓ సినీకవి ‘అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా! గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా!’ అన్నాడు తప్ప ఆస్తులు సంపాదించి పప్పుకూడు తినమనలేదు. ఆస్తులు మనకు భయాన్ని ప్రసాదిస్తే, అప్పులు మొండి ధైర్యాన్ని ప్రసాదిస్తాయి. అప్పులున్నవాడు ‘అప్పులవాడు చస్తేనేం, పత్రాలు కాలితేనేం’ అని ధీమాగా ఉండవచ్చు. రుణం తీర్చకపోవడం దారుణం, అన్యాయం అని కొందరంటారు కానీ అదేమీ న్యాయసమ్మతం కాదు. ఇన్ని సంవత్సరాలలోపు రుణం తీర్చకపోతే, మధ్యలో చెల్లు వెయ్యకపోతే ప్రామిసరీనోటు కుంకుమపొట్లం కట్టుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రాదని అంటారు. అలాంటప్పుడు రుణాల గురించి దిగులు పడటం ఎందుకు?
      ఇవన్నీ ఆలోచించి అప్పులిచ్చేటప్పుడే జాగ్రత్తపడేవాళ్లు ఉన్నారు. దానికో చిన్న కథ ఉంది. ఒకాయన అప్పు అడిగాడు. ఇంకో ఆయన అప్పు ఇచ్చాడు. అంతవరకు తప్పు ఏమీలేదు. ఎటొచ్చీ ‘భాష’ వల్లనే ముప్పు వచ్చింది. ‘మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనండీ’ అన్నాడు అప్పు తీసుకున్న మహానుభావుడు. దాంతో రుణదాత రాగల ముప్పును గ్రహించాడు. ఈ జన్మలో రుణం తీర్చకపోతే ఎంత ప్రమాదం అనుకున్నాడు. వెంటనే ఇచ్చిన రుణాన్ని వెనక్కి తీసుకున్నాడు. ‘తెలివితేట’లంటే అవీ!
      అయినా.. ఏ ఒక్కరికీ రుణం ఉంచుకోకుండా తీర్చేయ్యాలని కోరుకోవడం ఎంత ఛాదస్తం! తల్లి రుణం తీర్చుకోగలమా? తండ్రి రుణం తీర్చుకోగలమా? గురువు రుణం తీర్చుకోగలమా? మనందరినీ కన్న దేశం రుణమైనా తీర్చుకోగలమా? ఈ రుణాలే తీర్చుకోలేనప్పుడు ఇతరుల అప్పు తీర్చుకోవాలనుకోవడం ఎంత తప్పు!
      అప్పు తీసుకోవడం జన్మహక్కు. తీర్చాలనుకుంటే ఎంత చిక్కు. వారసత్వానికి గండికొట్టినట్టు.. ఎవరో ఒకాయన ‘ఫలానా దేశం’ అని దాని పేరు చెప్పగానే ఎదుటి వ్యక్తి ‘ఆ దేశం ప్రపంచంలోనే లేద’ని ఢంకా బజాయించి చెప్పాడట. ‘అంత గట్టిగా ఎలా చెప్పగలవు? ఆధారం ఏంటి?’ అని మొదటాయన దబాయించాట్ట. ‘మన దేశం ఏయే దేశాల దగ్గర అప్పులు తీసుకుందీ ఆ లిస్టు నా దగ్గర ఉంది. ఆ దేశాల జాబితాలో నువ్వు చెప్పిన పేరు లేదు కాబట్టి ఆ దేశం లేనట్టే!’ అన్నాడట ఈయన. కాదనడానికి పాయింటు లేక ఆయన గమ్మున ఉన్నాట్ట!
      ‘ఆస్తులనమ్మితే ఏమి ఉందిరా.. అప్పుల నమ్మితే ఫలితముందిరా!’ అని మంచివాళ్లు పాడువాళ్లు ఎవరైనా పాడుకోవచ్చు. అప్పు తీసుకోవడం అనేది బహుళార్థక, బహుళార్థ‘బోధక’ ప్రాజెక్టు. ‘ఒక్కసారి అప్పు చెయ్యి గణనాథా నీకు ఏది అయినా గణనాథా’ అనీ అనుకోవచ్చు. అప్పు అంటే పరపతి. పరపతి అంటే పలుకుబడి. అందరి దగ్గరా అప్పులు తీసుకున్నవాడు ఏ పార్టీ తరఫున అయినా, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా గెలవడం గ్యారంటీ. అప్పులు ఇచ్చినవాళ్లంతా కలిసి నడుంబిగించి, ప్రాణాలకు తెగించి అయినా ప్రచారం చేస్తారు. గెలిపిస్తారు. గెలిస్తేనన్నా తమ అప్పులు తీరుస్తాడన్న ‘మూఢనమ్మకం’ వారిచేత ఆ పని చేయిస్తుంది. దీనిని దైవసేవగా కూడా భావిస్తారు. అప్పు తీసుకునేటప్పుడు ఇచ్చిన వాడిలో దేవుడు కనిపిస్తాడు. తీర్చేటప్పుడు తీర్చేవాడిలో కనిపిస్తాడు.
      అప్పు అనే రెండక్షరాల పదం ఏ ముప్పునైనా ఎదుర్కొనే శక్తి. అది దైవశక్తికి మూలం. ‘హరియను రెండక్షరములు/ హరియించును పాపమంత’ అన్నారు. మరి ఎవరూ పాపం చేయకపోతే ఆ హరికి పనేముంటుంది? అప్పు తీసుకుని ఎగ్గొట్టడం ఎన్నో పాపాలపెట్టు. దొంగల్లో కూడా ఈ మధ్య ఈ మేరకు చైతన్యం వచ్చేసింది. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా రిస్కు తీసుకుని బ్యాంకుల్లో చోరీలు చేయడమేంటి? పట్టుబడితే చచ్చేట్టు దెబ్బలు తినే ప్రమాదమూ ఉంది. అలాంటి సందర్భాల్లో ప్రాణాలు కూడా పోవచ్చు. పోనీ అంతపని జరగకపోయినా, పోలీసుల చేతిలో పట్టుబడి జైలుపాలూ కావచ్చు. అంచేత పట్టపగలు కోట్లు వేసుకొని దర్జాగా కొన్ని బ్యాంకుల్లో కొందరు ఉన్నతాధికారుల ముందు వాలితే, వారిని ‘ఏదో’ విధంగా ప్రసన్నం చేసుకుంటే కోట్లకొలది డబ్బు అప్పుల రూపంలో తీసుకోవచ్చు. ఇందుకు అవసరమైతే పోలీసు స్టేషన్లనో, కోర్టులనో, జైళ్లనో తాకట్టుపెట్టవచ్చు. బ్యాంకు ఉన్నతాధికారులు అతిథి సత్కారాలను సైతం అందించి, వీనులవిందుగా మాట్లాడి,  కారు డోరు సైతం తీసి వీడ్కోలు చెబుతారు. నక్కను తొక్కితే డబ్బురావడం కాదు, కోటు వేసుకొని బ్యాంకు మెట్లు ఎక్కినా కోటీశ్వరుడు కావచ్చు. 
      అప్పువల్ల ఇంకా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. విదేశీయోగం అందులో ఒకటి. తీసుకున్న అప్పు తీర్చాలని బ్యాంకులు గొంతు మీద కూర్చుంటే, చెల్లని చెక్కులు వాళ్ల మొహాన పడేసి, ఎంచక్కా విదేశాలకు చెక్కేయవచ్చు. ఒకవేళ దర్యాప్తు సంస్థలు ‘విచారించి, విచారించి’ కోర్టుల ద్వారా స్వదేశానికి రప్పించాలని చూస్తే ‘‘మీ జైళ్లు విల్లాల్లాంటి భవనాల్లా ఉండి... విలాసాలన్నీ ఉన్నాయా?’’ అని దబాయించవచ్చు. అంతటి వాడు ఖైదీగా రావడమే మహద్భాగ్యమనిపించవచ్చు. అసలు అక్కడిదాకా పోక ముందే ‘పాపం ఇప్పటికీ  కోటీశ్వరుడే కానీ, నిండా అప్పుల్లో మునిగిపోయాడు’ అని దయతలచి బ్యాంకులు- ప్రభుత్వాలే ఆ అప్పుల్ని రద్దుచేసి పారేయవచ్చు. అప్పుడు ఎంచక్కా ఆ పాత బ్యాంకుల్లోనే కొత్త అప్పులు తీసుకోవచ్చు. 
      ఇప్పుడు చెప్పండి.. అప్పు మంచిది! అవునంటారా? కాదంటారా? చెప్పండి మేడమ్‌... చెప్పండి సార్‌?


వెనక్కి ...

మీ అభిప్రాయం