ఆంధ్ర వాల్మీకి

  • 187 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కొత్త‌పల్లి రామాంజనేయులు

  • క‌డ‌ప‌
  • 9951770751
కొత్త‌పల్లి రామాంజనేయులు

కవిగా కమనీయ కావ్యమంజూషలను వినిపించారు. అధ్యాపకునిగా సలక్షణ పాఠాలు బోధించారు. సేవకునిగా కోదండరాముని పాదసేవలో తరించారు. యోగిగా టెంకాయచిప్ప శతకం చెప్పి లోకం పోకడని విడమర్చిచెప్పారు.  భక్తునిగా ఆలయనిర్మాణంలో కీలకపాత్ర పోషించారు, బహుముఖ ప్రజ్ఞావంతులు, కవిశ్రేష్టులు, ‘వాసుదాసు’గా ప్రసిద్ధులైన వాలిలకొలను సుబ్బారావు జీవన ప్రస్థానమిది.
సుప్రసిద్ధ
కవి వావికొలను సుబ్బారావు 1863 జనవరి 1న కడప జిల్లా జమ్మలమడుగులో రామచంద్రరావు, కనకమ్మ దంపతులకు జన్మించారు. వీరు జన్మించిన నాటికి తండ్రి సర్కారీ కొలువులో పనిచేస్తుండేవారు. సుబ్బారావుకి చిన్నతనంలో మాటలు వచ్చేవి కావు. ఏడో ఏట మాట్లాడటం నేర్చుకున్నారు. అలా క్రమక్రమంగా తెలుగు, సంస్కృత భాషలను అధ్యయనం చేశారు. తర్వాత ఎఫ్‌ఏ చదివారు. కవితా సాధన చేశారు. ప్రొద్దుటూరులో దప్తరుబందు ఉద్యోగం చేసారు ఆ తరువాత రెవిన్యూ ఉద్యోగిగా నిష్కళంకమైన జీవితం గడిపారు. రంగనాయకమ్మతో వీరి వైవాహిక జీవితం మొదలైంది. కుమారుడు జన్మించి కొద్ది కాలంలోనే చనిపోయాడు. కుమారాభ్యుదయం ఈయన తొలి రచన. ఇదొక ప్రౌఢ ప్రబంధం. పాతికేళ్ల వయసులోనే ఆ జటిల కావ్య రచన చేసి పండితుల మన్ననలు పొందారు. ఆ సందర్భంలో ఒక్క పూటలో శ్రీ తల్పగిరి రంగనాయక శతకాన్ని ఆశువుగా చెప్పి సభాసధులను అలరించారు. తర్వాత  కౌసల్య పరిణయం రాశారు. బంధ కవిత్వంతో అలరారే మధుర కావ్యమిది. సుబ్బారావు కవిత్వ పటిమను గుర్తించిన ప్రభుత్వం మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఆంధ్రోపాధ్యాయులుగా నియమించింది.
సాహితీ ప్రస్థానంలో...
ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సృజనకారుడిగా ఆర్య నీతి, ఆర్య చరిత్ర రత్నావళి, హితచర్య మాలికలు రచించారు. విద్యార్థుల కోసం సులభ వ్యాకరణం రచించారు. ‘సుభద్ర విజయం’ నాటకం రాశారు. భగవద్గీతను ద్విపదగా అనువదించారు. 1900లో వాల్మీకి రామాయణాన్ని ఆంధ్ర వాల్మీకి రామాయణం పేరిట ఏడు కాండలను 24 వేల పద్యాల్లో రాశారు. 1908 అక్టోబర్‌ 9, 10,11 తేదీల్లో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో గ్రంథాంకిత సభలు జరిగాయి. ఆ సమయంలో అధ్యక్షులు ధర్మవరం రామకృష్ణమాచార్యులు సుబ్బారావుకి ఆంధ్ర వాల్మీకి బిరుదునిచ్చి  సత్కరించారు. 1910లో సుబ్బారావు భార్య కాలంచేశారు.  
ఒంటిమిట్టకి పయనం
సుబ్బారావు ఒక మధ్యాహ్నం వేళ ఎక్కడికో వెళ్లి తిరిగి ఇంటికి నడిచి వస్తున్నారు. బాగా వృద్దుడైన ఒక పెద్దమనిషి ‘‘అయ్యా నాకింత అన్నం పెట్టించగలవా!’’ అన్నాడట. అప్పటికి ఆయన ఒంటరి వాడు. ఇంట వండి పెట్టే దిక్కులేదు.  ఏదో కాస్త ఉడకేసుకుని కాలం గడుపుతున్నారు. ఇతనికి అన్నం ఎలా పెట్టించగలను అనుకుంటూ అనుకుంటూ వెనక్కి చూస్తే అక్కడ  మనిషి లేడు. ఏమిటిదీ అని సంశయించుకుంటూ ఇంటికి వచ్చారు. పోస్ట్‌ కవర్‌ ఒకటి గుమ్మంలో కనిపించింది. దాన్ని చించి చూశారు. సిద్ధవటం తహసీల్దారుగా చిర పరిచయం ఉన్న జయరామ నాయుడు రాశారా ఉత్తరం. అందులో ఏం రాసుందంటే... ఒంటిమిట్ట శ్రీకోదండ రామలయంలో నిత్య నైవేధ్య దీపారాధన జరగడం కష్టంగా ఉంటోంది. మీ వంటి ఉత్తములు అందుకోసం కొంత శ్రమిస్తే బాగుంటుందని.
      చిన్నప్పటి నుండి తన ఇష్ట దైవం కోదండ రాముడే. దారిలో తనకు దర్శనం ఇచ్చిన వ్యక్తి సాక్ష్యాతు పరాత్పరుడే అని సుబ్బారావు మనసులో పరమానందపడిపోయారు. అప్పటి నుంచి నెలకి పది రూపాయలు కైంకర్యం నిమిత్తం ఒంటిమిట్ట గుడికి పంపేవారు. యోగ సాధన చేయాలని సంకల్పించుకుని ఘటికాచలం వెళ్లారు. అక్కడున్నప్పుడు ఒక కల వచ్చింది ఆయనకు. తాను ముళ్ల బాటలో నడవలేక ఇబ్బంది పడుతుంటే ఇద్దరు బాటసారులు చేతికి అసరాగా వచ్చి మంచి దారిలో విడిచి వెళ్లిపోయారు. ఏంటీ దర్శనం అని లోలోపల తర్కించుకున్నారు. తాను చేస్తున్న యోగసాధన కష్టసాధ్యం అనుకొన్నారు. భక్తియోగమే మేలనుకున్నారు. అక్కడి దైవాన్ని మనసులో స్మరిస్తూ ‘‘ఘటికాచల వాస నృసింహ కేశవ’’ మకుటంతో శతకం రాయడానికి ఉద్యుక్తులయ్యారు. ఒక రాత్రి మరొక కలగన్నారు. ఇద్దరు బైరాగులు ఇక్కడేం చేస్తున్నావూ! ఒంటిమిట్టకు రాకూడదూ! అని పిలిచారు. మరునాటి ఉదయం వాలిలకొలను సబ్బురావు ఒంటిమిట్టకి పయనమయ్యారు. పెద్దమనిషి ఎదురుపడి అన్నం అడగటం, కలలో చెడు దారి నుంచి మంచి దారికి మళ్లించడం, మరొక కలలో బైరాగులు ఒంటిమిట్ట రమ్మని పిలవడం... వీటన్నింటిని రామాజ్ఞగానే భావించారు. 
టెంకాయచిప్పలో ఆత్మదర్శనం
అలా సుబ్బారావు, గోచి ధరించారు. పాలు, పండ్లే ఆహారంగా తీసుకోవడం ప్రారంభించారు. టెంకాయ చిప్ప పట్టుకున్నారు. కాలి నడకతో ఊరూరు తిరిగి బిచ్చమెత్తారు. ఉత్తర జీవితమంతా రాముని సేవకే అర్పించుకున్నారు. టెంకాయ చిప్ప శతకం రాశారు. అనేకమంది శిష్యులను సంపాందించుకున్నారు. గుంటూరు ప్రాంతంలో ఇప్పటికీ ఆ శిష్యపరంపర చెక్కుచెదరకుండా ఉంది. యాచించిన ప్రతి పైసా ఒంటిమిట్ట రాములోరి సేవకే ఖర్చుచేశారు. లక్షల రూపాయలు కూడబెట్టి, ఆ ధనంతో 1923 -27 మధ్యకాలంలో విమాన గోపురం, గర్యాలయం, అంతరాళం బాగుచేయించారు. మహాద్వారం తలుపులు, రాతి దాలుబంద్రం శిథిలమైతే గరండాలు పెట్టి బిగించారు. సంజీవరాయ దేవాలయాన్ని మరమ్మత్తు చేయించారు. శ్రీ రామ సేవ కుటీర సత్రం నిర్మించి, దాని పక్కనే పెద్ద మిద్దె నిర్మించారు. ఉత్తర ముఖంపెట్టించారు. రథశాల నిర్మించారు. గుడి దక్షిణ దిశలో ఒక ఇల్లు నిర్మించారు. శ్రీరామ కుటీరం దగ్గర నిర్మించిన పెద్ద భవనాన్ని స్థానిక మోతుబరి ఒకరు ఆక్రమించుకున్నారు. అప్పట్లో ఆ వ్యక్తికి ఎదురు చెప్పేవారు లేకపోయారు. సుబ్బారావు మాత్రం అతనితో వాదించారు. ‘అది రాములోరి సొత్తు, అనేక మంది భక్తుల దగ్గర యాచించి తెచ్చిన ధనంతో కట్టించిన భవనం. దాన్ని మీరు ఏ విధంగా స్వాధీనం చేసుకుంటార’ని నిలదీశారు. అయినా అతను వినకపోవడంతో సుబ్బారావు నిస్సహాయులయ్యారు. 
      టెంకాయ చిప్ప శతకంలో  ‘‘ఆంధ్ర వాల్మీకి హస్తంబునందు నిలిచి/ రుప్యములు వేనవేలుగా పోగుచేసి/ దమ్మిడైనను వానిలో దాచుకొక/ ధరణిజపతి కర్పించి దన్యుడైతి/ కలదే నీకంటే గొప్ప టెంకాయ చిప్ప’’ అంటారు వావిలికొలను. ఆలయ జీర్ణోద్ధరణతో పాటు వివిధ వస్తు పరికరాలు, ఆభరణాలు, వెయ్యి మందికి అన్నదానానికి సరిపోయే పాత్రలు, 108 బంగారు కాసుల మాల, 108 పేటల మంగళ సూత్రాల హారం,  ఉత్సవ మూర్తులకు కనకమయ కిరీటాలు, వెండి పూజాసామాగ్రి.. ఇలా అనేకం సమకూర్చారాయన. బిక్ష రూపంలో వచ్చిన ధనానికి తన రచనల మీద వచ్చిన డబ్బును కలిపి ఆ రోజుల్లోనే ఆయన రూ. రెండు లక్షలకు పైగా వెచ్చించారు. ఒక పక్క సాహిత్య సృజన చేస్తూనే మరో పక్క స్వామిసేవలో తరించారు వాసుదాసు. ఒకే జీవన ప్రస్థానంలో అనేక జీవితావస్థలు అనుభవించిన నిష్కల్మష యోగిగా.. కవిగా ఎంతో ఉన్నతిని పొందిన ఆయన జీవితం ఎప్పటికీ ఆదర్శనీయమే. 
 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం