‘వేదం’.. వేకువ కిరణం

  • 177 Views
  • 3Likes
  • Like
  • Article Share

    డా॥ సంగ‌న‌భ‌ట్ల న‌ర‌స‌య్య‌

  • హైద‌రాబాదు
  • 9440073124
డా॥ సంగ‌న‌భ‌ట్ల న‌ర‌స‌య్య‌

ఆంధ్ర వాఙ్మయమున ఆదినుండి నేటివఱకును చూడగా కొందఱు భాషానుశాసకులైరి, కొందఱు కవులైరి, కొందఱు కేవలము అనువాదకులైరి, కొందఱు నాటక రచయితలైరి, కొందఱు నవలలు మాత్రమే వ్రాసిరి, కొందఱు విమర్శకులుగా వెలింగిరి. ఇన్ని గుణములును ఒకరియందే పరిపూర్ణతంగాంచుట శ్రీ వేదము వేంకటరాయశాస్త్రుల వారియందే గాంచితిమి. భాషారాధకులలో నిట్లు సర్వతోముఖ పాండిత్యముగలవారరుదు’’  - ‘వేదము వేంకటరాయశాస్త్రుల వారి జీవితచరిత్ర సంగ్రహము’ నుంచి...
తొలి వైజ్ఞానిక వీచికలు, ఆధునికత తెలుగు ఇంట ప్రకాశమానం కాబోతున్న ప్రభాత వేళ అది. పూండ్ల, కొక్కొండ, కందుకూరి, గురజాడ, గిడుగు లాంటి భాషాసాంస్కృతిక దిగ్గజాల నడుమ ప్రభవించిన చెన్నపురి పండిత సింహం వేదం వేంకట రాయశాస్త్రి. ఆ మహితాత్ముని అసమాన పాండిత్య ప్రభతో, సృజనాత్మక ధిషణతో తమిళాంధ్రభూమి తళతళలాడింది.
వేంకట రాయశాస్త్రి పూర్వికుల స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి తాలుకా మల్లయపాళెం. వేంకట రమణశాస్త్రి, లక్ష్మమ్మ దంపతులకు 1853 డిసెంబరు 21వ తేదీన వేంకట రాయశాస్త్రి మద్రాసు మహానగరంలో జన్మించారు. అక్కడి ఆంగ్లదొరల నిర్వహణలోని క్రైస్తవ కళాశాలలో పాతికేళ్లు పండిత పదవిని నిర్వహించారు. గ్రాంథిక వాదిగా నిలిచిన ఈయన తన నాటకాల్లో అధమ పాత్రలకు పాత్రోచిత భాషను ప్రవేశపెట్టి విజయం సాధించారు. అది సమకాలికంగా తీవ్ర విమర్శలకు దారి తీసినా వెరవలేదు. స్వతంత్ర, అనువాద నాటకాలు, మహాకావ్య వ్యాఖ్యానాలు వెలయించారు. స్వతంత్రంగా ప్రచురణ సంస్థను నిర్వహించి తెలుగు, సంస్కృత భాషలకు అపూర్వసేవ చేశారు. ఆంధ్రమహాసభ నుంచి 1920లో ‘మహామహోపాధ్యాయ’, ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నుంచి 1927లో ‘కళాప్రపూర్ణ’ బిరుదులు పొందారు. గొప్ప భాషా సేవకుడిగా చిరకీర్తిని ఆర్జించి, 1929 జూన్‌ 18న మరణించారు.
అందరి బంధువు
శ్రీనాథుని శృంగారనైషధానికి (సర్వంకష), కృష్ణరాయని ఆముక్తమాల్యద (సంజీవని), భవభూతి ఉత్తరరామ చరిత్రకు వేంకట రాయశాస్త్రి రాసిన వ్యాఖ్యలు ఆయన పాండిత్యానికి ప్రతీకలు. ఆంధ్రదేశంలో వాటిని మరెవ్వరూ రాయలేరన్నంత గొప్ప ప్రశస్తి లభించింది. ‘ఆంధ్ర ప్రసన్న రాఘవ విమర్శనం, గ్రామ్యభాషా ప్రయోగ నిబంధనం, విసంధి వివేకం, ద్రావిడులెవ్వరూ’ లాంటి ప్రామాణిక  గ్రంథాలను శాస్త్రి వెలువరించారు. కాళిదాసు మేఘసందేశానికి వ్యాఖ్య రాశారు. ‘ఆంధ్ర హితోపదేశ చంపువు, ఆంధ్రసాహిత్య దర్పణం, అమరుక కావ్య (ఆంధ్ర) అనువాదం, ఆంధ్ర దశకుమార చరిత్రం’ వీరి ఇతర రచనలు.  
      వేంకట రాయశాస్త్రికి సమకాలీన సమాజంలో అపారమైన గౌరవం ఉండేది. వేంకటగిరి సంస్థానాధిపతులు తమ రాజభవనానికి పిలిపించి, సకల మర్యాదలతో భూరిపారితోషికాలు అందించేవారు. నెల్లూరి ప్రాంతపు ఎరబ్రోలు రామచంద్రారెడ్డి తదితర జమిందార్లు ధనసాయం చేసేవారు. తానై స్వయంగా పదవీ విరమణ చేస్తానంటే, తిరిగి ఇంతటి ప్రతిభాశాలి, పండిత దిగ్గజం దొరకరని, క్రైస్తవ కళాశాల యాజమాన్యం శాస్త్రి పదవీ విరమణను ఆపించింది. అంతేగాక సంస్కృత పదవితోబాటు ప్రాచ్య భాషా ప్రవచనాధ్యక్ష పదవిని కూడా ఇచ్చి, పారితోషికం పెంచి గౌరవించింది.
అడుగుజాడ ఆయనదే
తెలుగు భాషాభిమాన నాటక సమాజం 1899లో స్థాపితమైంది. అందులో ప్రదర్శించడానికి వేదం వారు చాలా నాటకాలు రాశారు. దీనికి రెండేళ్ల ముందే ఆయన రాసిన ‘ప్రతాపరుద్రీయ’ నాటకం చాలా ప్రశస్తి పొందింది. ఇది కాకతీయ ప్రతాపరుద్ర దేవుని జీవితానికి సంబంధించిన చారిత్రక నాటకం. అయినా కాల్పానికతకే శాస్త్రి పెద్ద పీట వేశారు. అది సమకాలికుల విమర్శలకు గురైనా, ప్రదర్శనతో దానికి వచ్చిన కీర్తి అధికం. అందులో శాస్త్రి కల్పించిన పేరిగాని పాత్ర అటు హాస్యాన్ని, ఇటు పాత్రోచిత సంభాషణతో నాటకీయతను పండించింది. దీన్ని విమర్శిస్తూ నాటి మదరాసులోని దిగ్గజ పండితులు ఇది భాషా పతనమని, సాహితీ విలువలు దిగజారాయని వ్యాఖ్యానించారు. వేంకట రాయశాస్త్రి దీనికి జవాబుగా సంస్కృత నాటకాల్లో అధమపాత్రలకు ప్రాకృతం వాడుకలో ఉన్నదేనని, పేరిగాని పాత్రతో రాజు పాత్ర భాషను పలికించడంలో ఔచిత్యం లేదని తిప్పికొట్టారు. 1895లో హర్షుడి నాగానందం నాటకాన్ని అనువదిస్తూ అందులో కూడా పురుషేతర, రాజపురుషేతర పాత్రలకు వ్యావహారిక భాషను వాడారు. 
      వేంకటరాయశాస్త్రి తన నాటకాల్లో తొలిసారిగా పాత్రోచిత భాష ప్రవేశ పెట్టడంతో సాహిత్యవేత్తల్లో ఆలోచన మొదలైంది. సాహిత్య భాషగా, వ్యావహారిక భాషను వాడవచ్చా? పాత్రోచిత భాష, వ్యావహారిక భాష అనవచ్చా? దీంతో గ్రాంథికం శిథిలమవుతుందా? ఎవరికి తోచినట్లు వారు పాత్రోచిత భాష పెడితే భాష పరిస్థితి ఏమవుతుంది? వ్యవహార భాష లక్షణానికి (వ్యాకరణానికి) ఒదగదు గదా! ఇలా చర్చలు జరిగి, భాషకేదో ప్రమాదం జరగబోతోందన్న ఆందోళన మొదలైంది. అయితే, గురజాడ లాంటి సంస్కరణాభిలాషులు వేదం వారి ప్రయత్నాన్ని అభినందించారు. ‘‘సంస్కృత సంప్రదాయాన్ని అనుసరించి తెలుగు నాటకంలో వాడుక భాషను ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెట్టిన ఘనత నా మిత్రుడు వేదం వేంకట రాయశాస్త్రి గారిది. ఆయన ప్రతాపరుద్రీయం అందచందాలకు వాడుకభాషలోని సంభాషణలు చాలావరకు కారణం’’ అని ‘కన్యాశుల్కం’ రెండో కూర్పు పీఠకలో రాశారు గురజాడ. మరొకపక్క వేదం వారు పాత్రోచిత భాషను నాటకంలో ప్రవేశపెట్టడం వల్ల చలామణి, అనుమతి, ప్రశస్తి- మూడూ ఏకకాలంలో ప్రజలిచ్చినట్టయింది. 
అద్వితీయ ప్రతిభాశాలి
సృజనాత్మకమైన శాస్త్రి ‘ఉషాపరిణయ, బొబ్బిలియుద్ధ’ నాటకాలు బహుళ ఖ్యాతి పొందాయి. సృజనేతర (అనువాద) నాటకాల్లో ‘శాకుంతలం, విక్రమోర్వశీయం, ప్రియదర్శిక, మాళవికాగ్నిమిత్రం’ ప్రసిద్ధాలు. వేంకట రాయశాస్త్రివి పాతిక వరకు రచనలు లభిస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రతిభా సమాన్వేషం. శాస్త్రి వ్యాఖ్యానాల్లో ప్రకాండ పాండిత్యం కనపడుతుంది. ఒక గ్రంథం వ్యాఖ్య చదివితే పది గ్రంథాలు చదివినట్టు ఉంటుంది. సంస్కృత, నాటక, సాహిత్య, అలంకార, వ్యాకరణశాస్త్రాలు, చరిత్రల్లో శాస్త్రి సాధికారిక రచనలు చేశారు. జ్యోతిష్మతీ ముద్రాక్షరశాలను స్థాపించి, తన గ్రంథాలన్నీ అచ్చు వేసుకున్నారు. ఈయన జీవితచరిత్ర సంగ్రహాన్ని మనమడు వేదం వేంకట రాయశాస్త్రి (తాతగారి పేరే) అక్షరబద్ధం చేశారు. 
      నాటక కర్తగా, ప్రయోక్తగా, పండితునిగా, బహుసంస్కృత గ్రంథ వ్యాఖ్యాతగా దాదాపు అరవై సంవత్సరాల పాటు తెలుగు భాషకు అపార సేవచేశారు వేంకట రాయశాస్త్రి. సమకాలికంగానే అనేకులు అభిమానులుగా, శిష్యులుగా, ఆత్మీయులుగా కలిగిన ఆయన, ఆధునిక యుగపు ప్రారంభాన వెలసిన తెలుగు సంస్కృతీ వైతాళికుడు.


వెనక్కి ...

మీ అభిప్రాయం