అచ్చతెలుగు అన్నాదమ్ముళ్లు

  • 592 Views
  • 17Likes
  • Like
  • Article Share

    వేములపల్లి వేంకట సుబ్బారావు

  • విజయవాడ.
  • 8008171678
వేములపల్లి వేంకట సుబ్బారావు

ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తెలుగులో చదువుకున్న వాళ్లు ఉన్నత స్థానాలకు చేరలేరని ఇప్పుడు తల్లిదండ్రులు భావిస్తున్నారు. కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలు పెంచి పోషించిన ఈ విష భావజాలానికి పాలక వర్గాలు సైతం మద్దతు పలుకుతున్నాయి. కానీ, అమ్మభాషలో చదువుకుంటేనే పిల్లల్లో అవగాహన శక్తి పెరుగుతుందని ఆ అమ్మానాన్నలు గట్టిగా నమ్మారు. తమ ఇద్దరు కుమారుల్ని పది వరకూ తెలుగు మాధ్యమంలోనే చదివించారు. పాఠశాల విద్యలో బలమైన విజ్ఞాన పునాదులు వేసుకున్న ఆ పిల్లలు ప్రస్తుతం వైద్య రంగంలో రాణిస్తున్నారు.
ఆంగ్ల
మాధ్యమం... పల్లెటూళ్ల నుంచి నగరాల వరకూ ప్రతి ఒక్క కుటుంబం మీదా కార్పొరేట్లు రుద్దిన తప్పనిసరి విధానం. దీంతో లెక్కకు మిక్కిలిగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు వెలుస్తున్నాయి. ప్రభుత్వ బళ్లలో కూడా అమ్మభాషలో చదువు అవసరం లేదనే స్థితికి ప్రభుత్వాలు చేరుకుంటున్నాయి. కానీ, ఆంగ్ల భాషా పరిజ్ఞానం వేరు, చదువు వేరు. చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని, అంది వస్తున్న విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి చదువు అవసరం. అది అమ్మభాషలోనే సమగ్రంగా ఉంటుంది. ఆ దంపతులు ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించారు. తమ పిల్లల్ని అమ్మభాషా మాధ్యమంలోనే ప్రోత్సహించారు.
ఎవరేమంటున్నా..   
కృష్ణాజిల్లా చల్లపల్లికి చెందిన సూర్యదేవర నాగేశ్వరరావు, ప్రమీలారాణి దంపతులు బోధనా వృత్తిలో ఉన్నారు. నాగేశ్వరరావు చల్లపల్లిలోని ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలో భౌతికశాస్త్ర అధ్యాపకులు. ప్రమీలారాణి ఘంటసాల మండలం గోగినేనిపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని. ఇద్దరూ జనవిజ్ఞాన వేదికలో చురుగ్గా పనిచేస్తారు. శాస్త్రీయ దృక్పథం, ఆచరణాత్మక విధానాలకి ఎప్పుడూ మద్దతు తెలుపుతారు. విద్యాభ్యాసం అమ్మభాషా మాధ్యమంలోనే సాగాలని, తెలిసిన భాషలో తెలియని విషయం తెలుసుకోవడం సులువని వారు విశ్వసించారు. దాన్నే ఆచరణలో పెట్టి తమ కుమారులు ప్రణీత్, వరుణ్‌లను పది వరకు తెలుగు మాధ్యమంలోనే చదివించారు. 
      అయితే, విద్యా మాధ్యమం పరంగా సమాజంలో వేళ్లూనుకున్న అపనమ్మకాల నేపథ్యంలో నాగేశ్వరరావు, ప్రమీలారాణి దంపతులు చాలానే ఆటంకాలు అధిగమించాల్సి వచ్చింది. పిల్లల్ని తెలుగు మాధ్యమంలో ఎందుకు చదవిస్తున్నారని బంధువులు, సహచరులు నిత్యం వీరిని ప్రశ్నించేవారు. కొందరైతే ఎగతాళిగా మాట్లాడేవారు. అయితే అమ్మభాషా మాధ్యమంలో విద్యాభ్యాసం ప్రాధాన్యం తెలిసిన ఈ దంపతులు వాటిని ఏ మాత్రం పట్టించుకోలేదు. మాధ్యమం మాయాజాలం వెనకున్న అసలు విషయాన్ని అందరికీ వివరించే ప్రయత్నం చేశారు. తమ పిల్లలు పాఠ్యాంశాలను త్వరగా చదవడం, బాగా అర్థం చేసుకోవడం గమనించారు. ఒక భాషగా ఆంగ్లంపై పట్టు సాధిస్తే పిల్లలకు ఉన్నత చదువుల్లో ఎలాంటి ఇబ్బందీ ఉండదని నిర్ధరణకు వచ్చారు. ఎవరెన్ని చెబుతున్నా, ఏమంటున్నా వెనక్కి తగ్గకుండా పది వరకు పిల్లల్ని తెలుగు మాధ్యమంలోనే కొనసాగించారు.
వరుస రాణింపుతో.. 
పెద్ద కుమారుడు ప్రణీత్‌ మూడో తరగతి వరకు చల్లపల్లి మండలం వక్కలగడ్డలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో చదివారు. తర్వాత చల్లపల్లిలోని శ్రీ విజయ అకాడమీలో తెలుగు మాధ్యమంలో పది వరకు విద్యనభ్యసించారు. పదిలో 562 మార్కులు సాధించారు. అనంతరం గుంటూరు వికాస్‌లో ఇంటర్‌ చదివి 960 మార్కులు తెచ్చుకున్నారు. ఎంసెట్‌లో 592వ ర్యాంకు సాధించి కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ పీజీ వైద్య విద్య ప్రవేశ పరీక్షలో 33వ ర్యాంకు సాధించి ఆంధ్రా వైద్య కళాశాలలో జనరల్‌ మెడిసిన్‌లో ఎండీ చేశారు. బెంగళూరులోని శ్రీ జయదేవ్‌ కార్డియోవాస్క్యులర్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ ప్రవేశ పరీక్షలో అయిదో ర్యాంకు సాధించి కార్డియాలజీలో డీఎం పూర్తిచేశారు. ఇరవై ఒక్క సీట్లు మాత్రమే ఉండే ఈ కోర్సుకు దేశవ్యాప్తంగా పోటీ ఉంటుంది. ప్రణీత్‌ ప్రస్తుతం బెంగళూరు అపోలోలో హృదయ వ్యాధి నిపుణులుగా పనిచేస్తున్నారు. 
      చిన్నకుమారుడు వరుణ్‌ పది వరకు చల్లపల్లిలోనే తెలుగు మాధ్యమంలో చదివారు. పదిలో 547 మార్కులు, ఇంటర్లో 952 మార్కులు తెచ్చుకున్నారు. ఎంసెట్‌లో 91వ ర్యాంకు సాధించి కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివారు. అనంతరం చండీగడ్‌ పీజీ వైద్య విద్య, పరిశోధన సంస్థ ప్రవేశ పరీక్షలో దేశ వ్యాప్తంగా అయిదో ర్యాంకు సాధించి జనరల్‌ మెడిసిన్‌లో ఎండీ చేశారు. ఈ పరీక్షకు దాదాపు ముప్పై వేల మంది పోటీ పడతారు. ముప్పై అయిదు సీట్లు మాత్రమే ఉంటాయి. అనంతరం పాండిచ్చేరి జిప్‌మర్‌ ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం అక్కడ ఎండోక్రైనాలజీలో డీఎం చేస్తున్నారు. రెండు సీట్లు మాత్రమే ఉండే ఈ కోర్సుకు దేశవ్యాప్తంగా పోటీ పడతారు. 
      అమ్మభాషా మాధ్యమం అందించే అద్భుత అవగాహనా శక్తే ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు మేలిమి మార్గమని నిరూపించారు ఈ అన్నాదమ్ములు. ముఖ్యంగా అర్థం లేని వాదనలని పట్టించుకోకుండా అమ్మభాష మీద నమ్మకంతో తమ పిల్లల్ని తెలుగులోనే చదివించారు వారి తల్లిదండ్రులు. ఇంగ్లీషులో చదువులు లేకుంటే భవిష్యత్తు లేదనే వారికి వీరి విజయగాథ ఓ కనువిప్పు.


వెనక్కి ...

మీ అభిప్రాయం