రాగాలరాయి సిబ్బె... చిప్పకట్టె

  • 445 Views
  • 7Likes
  • Like
  • Article Share

    దాసరి కృష్ణారెడ్డి

  • పాత్రికేయులు
  • పుంగనూరు, చిత్తూరు
  • 9885326493
దాసరి కృష్ణారెడ్డి

గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్‌ అన్నాడు నన్నయ్య. మానవ చారిత్రక గమనంలో గతానికి ఉన్న ప్రాధాన్యం విస్మరించలేనిది. సంస్కృతి, సంప్రదాయాలు, పూర్వికుల జీవన విధానం గురించి తెలుసుకోవడానికి ఆ గతమే మూలం. అందులోకి ఒక్కసారి దృష్టిసారిస్తే వాళ్ల సృజనాత్మకతకు అద్దం పట్టే అపురూప వస్తుజాలం కనిపిస్తుంది. 
ఒకప్పుడు
పల్లెల్లో రాగులు, సజ్జలు, జొన్నలు లాంటి తృణధాన్యాలే ప్రధాన ఆహారం. వాటితో సంగటి, గటక లాంటివి చేసుకునే క్రమంలో పొడుంలా చెయ్యడానికి విసురురాయిని ఉపయోగించేవారు. ధాన్యం విసిరేటప్పుడు ఒక కొబ్బరి చిప్ప కొలతగా విసుర్రాయిలో పోస్తుండేవారు. ఈ చిప్పకొలతను ‘వాయి’ అని పిలిచేవారు. ఇద్దరు మహిళలు ఎదురెదురుగా కూర్చుని పిడి సాయంతో విసురుతూ అలసట తెలియకుండా విసుర్రాయి పాటలు పాడేవారు. అందుకే ‘రాగలరాయి, రాగాలరాయి’ అని దానికి పేరొచ్చింది. ఆధునిక తరంలో విసుర్రాయిని ఉపయోగించే వారు కాదు, అసలు దాని గురించి తెలిసిన వారే తక్కువ! ఇలా విసిరిన తృణధాన్యాలతో సంగటి చేసిన తర్వాత దాన్ని కలియబెట్టడానికి రెండు కర్రలను ఉపయోగించేవారు. కలియబెట్టేటప్పుడు సంగటి పాత్ర అటూ ఇటూ ఒరిగిపోకుండా, సంగటి చిందిపోకుండా ఆంగ్ల అక్షరం వై ఆకారంలో ఉండే తమర (పంగల) కట్టె కొసను పాదంతో తొక్కిపట్టి సంగటిని కెలికి గుండ్రంగా ఉన్న రాతిపలక (సంగటి బండ) మీద కుమ్మరించేవారు. ఆ తర్వాత మట్టి మూకటి సాయంతో కావల్సిన పరిమాణంలో ముద్దలు చేసుకుని మరో పాత్రలో వాటిని భద్రపరిచేవారు.
      అన్నంలోని గంజి వార్చేందుకు గతంలో వెదురుతో అల్లిన గుండ్రటి ‘సిబ్బె’ ఉపయోగించేవారు. కరెంటు అన్నం కుక్కర్లు వచ్చాక ఇప్పుడు పొయ్యిమీద వండటం తగ్గిపోయింది. ఒకవేళ వండుతున్నా సిబ్బెని మాత్రం ఎవరూ వాడట్లేదు. అలాగే ఈ తరానికి బొత్తిగా తెలియని మరో వంట సాధనం ‘చిప్పకట్టె’. పాలు, పెరుగు, చారు, సాంబారు లాంటి వాటిని దీనితో అవసరమైనంత తోడి అన్నం, సంగటిలో వడ్డించేవారు. దీన్ని ‘అబక’ అని కూడా పిలుస్తారు. టెంకాయ చిప్పకు ఒకవైపు కన్నులు లాంటి గుంతలు ఉంటాయి కదా. ఇనుపకమ్మీ(శలాక)ని ఎర్రగా కాల్చి ఏటవాలుగా టెంకాయ చిప్ప కన్నులో గుండా రంధ్రం చేసి అందులో సుమారు మూరెడు పొడవున్న వెదురు కర్రను అమర్చితే అదే చిప్పకట్టె. ప్రకృతి సిద్ధంగా దొరికే టెంకాయ చిప్పతో దీన్ని రూపొందించుకోవడంలో జానపదుల గొప్ప సృజనాత్మకత కనిపించడం లేదూ. అలాగే అప్పట్లో వంటలన్నీ మట్టి పాత్రల్లోనే చేసేవారు. మంచినీళ్లని కూడా మట్టి బానల్లోనే పోసుకునేవారు. అవి పక్కకి ఒరిగిపోకుండా నిటారుగా ఉంచేందుకు వరిగడ్డిని గుండ్రటి చుట్టలుగా చుట్టి వాటి మీద పాత్రలు ఉంచేవారు. అవి కనీసం రెండు మూడేళ్లు మన్నేవి. పాలు, పెరుగు, వెన్న పాత్రల్ని ఉట్లలో పెట్టేవారు. వీటి ఆధారంగానే ‘ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికెగిరింది’ లాంటి సామెతలు పుట్టుకొచ్చాయి.
మడి.. నుడి!
వ్యవసాయం విషయానికొస్తే తొలకరి వర్షాలకు ముందే శుద్దిళ్లు, చిన్నశుద్దిళ్లు, ఇనుపలిక్కులు, కక్కు కొడవళ్లు, మామూలు కొడవళ్లు లాంటి వాటికి పదును పెట్టించేందుకు విశ్వబ్రాహ్మణుల వద్దకు తీసుకెళ్లేవారు రైతులు. అందుకే ‘‘కొలిమి పాదులోన నిప్పురవ్వ రగిలింది/ కొలిమి తిత్తిలోన పొత్తంగు గాలి నిండింది/ పంటలను కోసేటి కక్కు కొడవళ్లకు కొట్టండిరా కక్కు దశదిశలు చాటంగ’’ అని పాడుకొనేవారు జనం. వ్యవసాయానికి సంబంధించి చాలా పదజాలం క్రమంగా అంతరించిపోతోంది. అలాగే కపిలబావి, ఏతాము, గూడవేయడం, కాడెడ్లలో ఎలపట, దాపట, గానుగ ద్వారా విత్తనాల నుంచి చమురు తీయడం, సున్నం, ఇసుక కలిపి కాంక్రీట్‌ మిశ్రమం తయారు చేయడం, కొబ్బరి పీచుతో తాళ్లు పేనడం, దంపుడు బియ్యం లాంటి ఎన్నో పూర్వకాల పదాలు, పద్ధతులు ఇప్పటి వారికి తెలియవు. కాలంతో పాటు మార్పు సహజమే కానీ, జాతి నడచి వచ్చిన దారుల గురించి తెలుసుకోవడం అవసరం. అంతేకాదు, ఆ పదాల్లో ఆధునిక వస్తువులు, పరికరాలకు సరిపోయేవాటిని తీసుకుని ఆంగ్ల పదాలకు మారుగా ఉపయోగించుకుంటే అమ్మభాష కూడా పదికాలాల పాటు నిలబడుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం