మొలకల పున్నమి ముచ్చట్లు

  • 534 Views
  • 22Likes
  • Like
  • Article Share

    డి.చంద్రకళ

  • బసినికొండ, చిత్తూరు జిల్లా.
  • 9652802462

పులకల మొలకల పున్నమ తోడనె కూడె/ అలివేణి నీ పతితో నాడవే వసంతము’’ అని అడిగాడు అన్నమాచార్యుడు. రాయలసీమ రైతుల పండగ మొలకల పున్నమి(తొలి ముంగారు). ఏటా వైశాఖ పౌర్ణమి నాడు వ్యవసాయ కుటుంబాలు ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ వేడుక విశేషాలివి..!
చిన్నప్పుడు
మా ఊర్లో మొలకల పున్నమి పండగ నెలలో ఉందనగానే సందడి మొదలయ్యేది. పిల్లోళ్లు, పెద్దోళ్లు, ముసిలోళ్లు రాత్రి పన్నెండు గంటల దాకా రకరకాల ఆటలు ఆడి పాటలు పాడేవాళ్లు. ఆ ఆటలు భలే ఉండేవి. ఆ నెలలో వెన్నెల పగలుగా ఉంటుంది. దానికి తోడు చల్లటి వాతావరణం. ఏడు గంటలకు అంత అన్నం తినేసి నడివీధిలోకి వచ్చి ఎవరో ఒకరు ‘‘పిల్లోల్లారా పిచుకోల్లారా... గుగ్గిళ్లు ఉడుకుతున్నాయి రాండ్రోయ్‌’’ అని కేక వేస్తారు. 
      మగవాళ్లు ఈ కూత వినగానే అన్నం తినేసి ఊరిముందర బీడు చేనులోకి కబడ్డీ ఆడేందుకు పోతారు. ఆడోళ్లు ఒకరిని ఒకరు పిలుచుకుంటా నడివీధిలోకి వస్తారు. పిల్లోళ్లు వారి పక్కన ఆడుకుంటారు.  
ముక్కులు గిల్లే ఆట: సగం మంది పిల్లలు ఒక పక్క.. ఇంకో సగం మందిని మరోపక్క కూర్చోబెడతారు. ఒకరు వచ్చి ఒక్కొక్కరి చెవిలో ‘శ్రీదేవి, వాణిశ్రీ, జయశ్రీ, మల్లెమొగ్గ’ అని నచ్చిన పేర్లు పెడతారు. ఇంకొకరు వచ్చి ఒకపక్క కూర్చున్న వాళ్ల కళ్లు మూసి ‘శ్రీదేవి వచ్చి ముక్కు గిల్లిపో’, ‘మల్లిమొగ్గా వచ్చి ముక్కు గిల్లిపో’ అని పిలుస్తారు. ఎవరైతే ముక్కు గిల్లిన వాళ్ల అసలు పేర్లు కరెక్టుగా చెబుతారో వాళ్లు గెలిచినట్టు. 
దాంకలా బూసి: అందరూ కలిసి ఒకరి కళ్లకు గుడ్డ కడతారు బిర్రుగా. ఆ గుడ్డ కట్టుకున్న మనిషి ఎవరినైనా అంటేస్తే, ఆ అంటేసిన మనిషికి ఆ గుడ్డకట్టి మళ్లీ ఆడేది. ఇట్లా అందరికీ వంతు తిరగాల్సిందే. ఆ వెన్నెట్లో ఈ గుడ్డ కట్టుకున్న మనిషి వేరేవాళ్లను అంటడానికి తడుముకుంటూ తిరుగుతుంటే వాళ్ల వెనకాల పిలకాయలు జుట్టు పీకేది, పావడా లాగేది చేస్తారు. ఇదంతా చూస్తున్న ముసిలోళ్లు, చిన్న పిల్లలు పగలబడి నవ్వుతా ఉంటారు. 
ఈరుమాను ఆట: ఇది బలే నవ్వులాట. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆడతారు. పిల్లల్ని ముందర, పెద్దల్ని వెనక వరసగా నిలబెడతారు. ఒకామె ‘ఈరుమాన్లు అమ్మా ఈరుమాన్లు’ అని అరుస్తా వస్తుంది. (ఈరుమాను అంటే తల్లో పేలు తీయడానికి వాడే పెద్ద చెక్క దువ్వెన. ‘ఈర్పెన’ అనీ అంటారు) ‘ఈరుమాన్లమ్మా ఇంటికి రా, నీ ఈరుమాన్లు ఎట్లాంటివో ఈర్చి చూపించు’ అని పిలిచి ఒక తలని చూపిస్తారు వరసలో ఉండే వాళ్లు. ఆమె ఈరుమాను తల్లోబెట్టి ‘అబ్బా దీని తల్లో అన్నీ దున్నలే (నల్లని పెద్ద పేన్లు). ఎంత పెద్ద దున్నలమ్మ.. తల్లే! ఇది తిన్న సంగటి దీని తల్లో దున్నలకే సరిపోతుంది’ అని అంటుంది. ఇంకొకరి తల్లో ఈరుమాను బెట్టి ‘అయ్యయ్యో ఈయమ్మ తల్లో అన్నీ అంటకలే’ (చిన్నగా తెల్లగా ఉండే పేన్లు) అంటుంది. మరొకరి తలను చూసి ‘దీని తల్లో ఎంటిక్కి ఎయ్యి ఈపులుండాయమ్మో’ అని.. అందరి తలలు ఈరుస్తూ వారిని రకరకాల మాటలంటుంది. ఆ మాటలకు అందరూ పగలబడి నవ్వుతారు. వాళ్లల్లో ఇంకొంతమంది ఈరుమాన్లమ్మను తరుముకుంటారు ‘మా తల్లో అన్ని పేన్లుండాయా, మా పరువు తీస్తుండావు’ అని. 
      పైట్లు వేసుకునే అక్కలు ఒక పది మంది కలిసి అయిదు జంటలుగా ఎదురుబదురుగా చేతులు బట్టుకుని బాయిలో గుండు, బంగారు చెండు, నీ మొగుడు మెండు అంటూ గిరగిరా తిరుగుతుంటే వాళ్ల పొడుగు జడలు ఎగురుతూ, ఎర్రపైట్లు, తెల్లపైట్లు, పచ్చపైట్లు రంగు రంగులుగా తిరగతా ఉంటే ఇంకొంచేపు చూడాలనిపిస్తుంది. ఎంత రాత్రి అయ్యిందో కూడా తెలీదు. ఒకపక్క అయిదేండ్ల నుంచి పదేండ్లు లోపు పిల్లోళ్లు రెండు చేతులు ఎదురెదురుగా పట్టుకొని చెమ్మ చెక్క చేరడేసి మొగ్గ అని పాటలు పాడుతూ తప్పట్లు తడుతుంటారు. ఇంకా ‘అలసందురాళ్లాట, తీండ్రతీగలాట, మట్టిగూడ్లు కట్టే ఆట, ఎర్రగడ్డలు ఎన్నయ్‌ కుప్పలు ఆట’ ఆడతా ఉంటారు మిగతా పిల్లలు. 
      ఇంకొక పక్క మగవాళ్లందరూ ‘‘చింతాకు పులగూర.. తిందురారా బామ్మర్ది’’ అని గస పోస్తా కబడ్డీ ఆడతా ఉంటారు. పెండ్ల్లయిన ఆడవాళ్లు... అమ్మలు, అక్కలు, అత్తలు, వదినలు, అమ్మమ్మలు ‘జక్కికు’ ఆడతారు. ఇది చూడటానికి చాలా బాగుంటుంది. సన్నటోళ్లు, లావుటోళ్లు అందరూ కలిసి ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ పక్కవారి చేతులు తాకతా తప్పట్లు కొడుతుంటే ఓ పెద్దమ్మ తన పెద్ద గొంతుతో ‘‘పందిటి మీది నుంచి పావుకోళ్లు దూకినాయి, పోవద్దు మామా కోడిపందెము... నీవు ఆడద్దు మామా కోడి పందెము’’ అని ఎలుగెత్తి పాడితే చుట్టుపక్కల పల్లెలన్నింటికీ వినిపిస్తుంది. ఇంతలోనే తాత ఎవరో ఓ పాట అందుకుంటాడు. ‘‘నిన్నంతా పొద్దు కాడ నీళ్ల రేవుల కాడ నీ తోన ఏమంటినే సెలియా సెలియా నమ్మి నా తోన రమ్మంటినే’’ అంటూ జక్కీకు ఏస్తా పాడుతుంటే భలే సంబరం! 
      మొలకల పున్నమి తొమ్మిది రోజుల్లో ఉందనగా రాగులు, సజ్జలు, వడ్లు, అలసందులు, జొన్నలు, అనుములు, కందులు, పెసర్లు, ఉలవలు లాంటి తొమ్మిది రకాల ధాన్యాలను ఒక పగలంతా నానబెడతారు. రాత్రి వాటిని గుడ్డలో పోసి బిర్రుగా చుట్టి కట్టి ఓ డేక్సాలో పెట్టి మూసిపెడతారు. మరుసటి రోజు పిల్లోళ్లు గొడ్ల కాడ నుంచి వచ్చి, జల్లెడ ఎత్తుకుపొయ్యి ఎరువు జల్లిపెట్టుకొని వస్తా వస్తా తీండ్రాకులు పెరుక్కొని ఇంటికి వచ్చేసరికి బయట కూలి పనులకు పోయిన పెద్దోళ్లంతా ఇండ్లకు వచ్చేసి ఉంటారు. అందరూ రాత్రి సంగటి తినేసి అటవలోంచి కుంపట్లు దించుతారు. ఇంట్లో ఎంతమందుంటే అన్నుంటాయి అవి. కుంపట్లు తెచ్చుకోలేనివాళ్లు టెంకాయ అడుగు చిప్పలు వాడతారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్క కుంపటి తీసుకొని లోపల వరిగడ్డి పలచగా చుట్టి పెడతారు. జల్లించి తెచ్చిన ఎరువు ముక్కాలు భాగం పోస్తారు. చుట్టిపెట్టిన మొలకిత్తనాలను కుంపట్లో పలచగా పరిచి నీళ్లు జల్లి తెచ్చిన తీండ్రాకులతో కప్పి, నట్టింట నీళ్లు జల్లి గంపకింద ఈ కుంపట్లన్నిటినీ మూసి పెడతారు. దినామూ రాటాల మావిటేల నీళ్లు జల్లుతారు. తొమ్మిదో రోజు అంటే పండగ రోజుకి మలక బంగారంలా మెరుస్తూ ఉంటుంది. కుంపట్లు అన్నీ ఒక చోట పెట్టి పసుపు కుంకుమలతో పూజించి మొలక వంగిపోకుండా చుట్టూ దారంతో కడతారు.  
      అన్ని ఇళ్లల్లోంచి మొలక కుంపట్లు నడివీధిలో పెట్టి అమ్మలక్కలు కొత్తచీరలు కట్టి, ఇంటెనక కాసిన మల్లెపూలెెట్టుకొని ‘‘మల్లి వచ్చే పున్నానికే గౌరమ్మ- మల్లె పూలే తోరణాలు, తిరుగు వచ్చే పున్నానికే గౌరమ్మ తీర్ణపూలే తోరణాల’’ని గౌరమ్మను కొలుస్తారు. అలాగే.. గుడులు, సమాధుల దగ్గరికి మేళతాళాలతో పలకలతో పోయి మొలకలు పెట్టి వచ్చి తెల్లవారుజాము దాకా జక్కీకు ఆడి, మొలకల పున్నమి ఆటలకు ముగింపు చెబుతారు. 
      తొలి బంగారు వానలు మొలకల పున్నమికి వస్తాయంటారు. అందుకని ఈ పండగ జేసి గౌరమ్మని కొలుస్తారు. ఆ మొలకలు ఎంత బాగొస్తే ఆ సంవత్సరం పంటలు అంత బాగా పండుతాయంట. మొదట దేవునికి మొలక బెట్టి సేద్యం పనులు మొదలెట్టడం పల్లె ఆనవాయితీ.


వెనక్కి ...

మీ అభిప్రాయం