కర్పూరంతో కళ్లాపి... ముత్యాలతో ముగ్గులు!

  • 1283 Views
  • 0Likes
  • Like
  • Article Share

    -వై.తన్వి

  • గుంటూరు

గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో / మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియల్లో / మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియల్లో/ ఆ ముగ్గుల మీద మల్లెపూలు గొబ్బియల్లో/  నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియల్లో/ ఆ ముగ్గుల మీద మొగలిపూలు గొబ్బియల్లో/ ధాన్యపురాశుల ముగ్గులు వేసి గొబ్బియల్లో/ ఆ ముగ్గుల మీద సంపెంగలు గొబ్బియల్లో/రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బియల్లో/ ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియల్లో/ భూదేవంతా ముగ్గులు వేసి గొబ్బియల్లో/ ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియల్లో/ లక్ష్మీ రథముల ముగ్గులు వేసి గొబ్బియల్లో/ ఆ ముగ్గుల మీద తులసీదళములు గొబ్బియల్లో
చేతిలో కాస్త బియ్యప్పిండి ఉంటే చాలు తెలుగింటి ఆడపడుచులందరూ పికాసోతో పోటీపడతారు. నేలనే కాన్వాసుగా చేసుకుని వాళ్లు తీర్చే రంగవల్లుల ముందు హరివిల్లు అయినా చిన్నబోవాల్సిందే. ఇక ముగ్గుల పండగ సంక్రాంతి రోజుల్లోనైతే ఇంటింటి రథాలు ఏకమై వూరంతా ఒకే తేరులో ఆనందాల తీరానికి పయనమవుతుంది. మగువల ఈ ముగ్గు మురిపాలు మన కవుల మనసులనూ మైమరపించాయి కాబోలు... కావ్యాల నుంచి చలనచిత్రాల వరకూ అన్నిచోట్లా ‘అక్షర రంగవల్లులు’ కొలువుదీరాయి.
ముద్దుగుమ్మల మునివేళ్ల మాటునుంచి నేలతల్లి నుదుటికి అందాల సిందూరమై అలరారుతుంటుంది ముగ్గు. ఆనందం, ఆరోగ్యం, సంప్రదాయం, సౌభాగ్యాల సమ్మిశ్రితం ముగ్గు. ఉషోదయానికంటే ముందే ఇంటి ముంగిట కొలువుతీరే మహాలక్ష్మి రూపమే ముగ్గు. ఈ ముగ్గుల్లో స్థూలంగా చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, మెలికల ముగ్గులు, రంగోలీలు (రంగవల్లులు) కనిపిస్తాయి. వేదకాలం నుంచి ఆధునిక కాలం దాకా, పాతరాతి యుగం నుంచి యాంత్రిక యుగందాకా నిరంతరాయంగా ముగ్గు తన పరిధిని విస్తరించుకుంటూ వస్తోంది. రెండు ముగ్గు కర్రలు గుమ్మం ముందు గీయనిదే గడపదాటని వారు ఈ రోజుకూ కోకొల్లలు.
ఇంటిముందు కొలువుదీరే ముచ్చటైన ముగ్గు శుచీ శుభ్రతలకు ఓ సంకేతం. ముగ్గు కోసం వాడే సున్నం ఈనాటికీ పర్యావరణ పరిశుభ్రతకి ఓ ప్రతీక. బియ్యప్పిండితో ముగ్గులు వేయడంలో సర్వ భూతదయ దాగి ఉంది. భారతీయతలోని ఓ ప్రధానాంశమిది. చీమల లాంటి సూక్ష్మజీవులకు సైతం ఆహారాన్నందించే ఓ సదుద్దేశం ఇందులో ఉంది. ముంగిళ్లలో చక్కగా కళ్లాపి చల్లి ముగ్గేయటం, ఇంటికి అటూ ఇటూ ఉన్న అరుగులను అలికి ముగ్గులు దిద్దటం సర్వశుభ సూచకం. ఈ విషయాన్నే ‘ముత్యాలముగ్గు’ చిత్రం కోసం రాసిన ‘ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ’ పాటలో చెబుతారు ఆరుద్ర. ‘ఆరనైదోతనము ఏ చోటనుండు అరుగులలికే వారి అరచేతనుండు, తీరైన సంపదా ఎవరింట నుండు దినదినము ముగ్గున్న లోగిళ్లనుండు..’’ అని అంటారాయన. ‘ముద్దు మురిపాలొలుకు ముంగిళ్లలోన మూడు పువ్వులు ఆరుకాయలు కాస్తా’యట. ఆ ముంగిలి అంత ముచ్చటగా ఉండాలంటే ఆ ఇల్లాలు తన ఇంటిముందు ముగ్గు గీసి తీరాల్సిందే. అప్పుడే ఆ ఇల్లాలికి సౌభాగ్యం, ఇంటిల్లిపాదికి వైభోగం ప్రాప్తిస్తాయన్నది తరతరాల నమ్మకం.
భారతం నుంచి...
తెలుగు సాహిత్య ప్రస్థానంలో నన్నయ నుంచి నేటిదాకా ఎందరో కవులు, కవయిత్రులు ముగ్గుల చుట్టూ తమ కవితా లతలను తీర్చిదిద్దుతూనే ఉన్నారు. భారతం ఆదిపర్వంలో నన్నయ రంగవల్లులను ప్రస్తావించాడు. పాండవులు వారణావతంలో లక్క ఇంటికి వెళుతున్న సందర్భంలో ఓ పద్యం చెప్పాడు. పాండవులు వస్తున్నారని తెలిసి వారణావత ప్రజలంతా చేసిన సందడిని సీసపద్యంలో వర్ణించాడు నన్నయ. దాన్లోని తేటగీతి ‘అంగళుల నొప్పె గర్పూర రంగవల్లు..’ అంటూ సాగుతుంది. అందులో ఆదికవి ఏమంటారంటే- వారణావతాన్ని, అక్కడి మేడలను, సందడిని చూస్తూ వస్తున్న పాండవులను చూడటానికి స్త్రీలు మిద్దెల మీదికి ఎక్కారు. ఆ వీధులు కస్తూరి, మంచి గంధం కలిపిన నీటితో కళ్లాపి చల్లి ఉన్నాయి. ఆ కళ్లాపి మీద కర్పూరంతో రంగవల్లులు తీర్చిదిద్దారు! ఇదీ నన్నయ చేసిన రంగవల్లుల ప్రస్తావన.
నన్నెచోడుడి కుమార సంభవంలోనూ ముగ్గుల ముచ్చట్లు కనిపిస్తాయి. చిత్ర వర్ణాతిశయ నూత్న రత్న చిత్రి/ తాంగ రంగవల్లి సురం గాంగణముల/ గలిగి విశ్వంబునకు తన వెలుగు వెలుగు/ సేయు దేజోమయంబగు శివపురంబు అంటూ కొత్తకొత్తగా తీర్చిదిద్దిన రంగవల్లికతో అలరారుతున్న శివపురాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తాడు కవి. నేను తెలుగు వల్లభుణ్ని అని గర్వంగా చెప్పుకున్న శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యదలో ఉత్ప్రేక్ష అలంకారాన్ని జోడించి మరీ ముగ్గు వర్ణన ముచ్చటగా చేశాడు.
కోరకిత నారికేళ క్ష్మారు హముల రత్నకుట్టిమంబులఁ దోఁపన్‌
ద్వారము లయత్న కృత శృంగారముఁ గను నలికి మ్రుగ్గు ఘటియించిరనన్‌
ఇది విల్లిపుత్తూరు పట్టణాన్ని వర్ణిస్తున్న సందర్భంలో చెప్పిన పద్యం. ఎంతో అందమైన ఆ పట్టణంలో వారి ఇళ్ల వాకిళ్ల ముందు పూసిన గున్న కొబ్బరిచెట్లు ఉన్నాయి. ఆ ఇళ్ల వాకిళ్లకు తాపడం చేసిన మణుల మీద అవి ప్రతిబింబిస్తున్నాయి. ఆ ప్రతిబింబాలు ఎలా ఉన్నాయంటే... గున్న కొబ్బరిచెట్ల పువ్వులు తెల్లగా ఉండటం వల్ల ముగ్గులుగానూ, ఆకు మట్టల నీడలు ఆవుపేడతో అలికిన అలుకుడుగానూ కనిపిస్తున్నాయంటాడు రాయలు. ఇలా పుర వర్ణనలో ముగ్గు కచ్చితమైన వర్ణనాంశంగా ఉండిపోయింది. వైజయంతి విలాసం, యయాతి చరిత్ర తదితర కావ్యాలెన్నింటిలోనో ముగ్గుల అందాలు దర్శనమిస్తాయి.
ఇక శృంగార రసపుష్టితో కనిపించే శ్రీనాథ మహాకవి కవిత్వంలో కూడా రంగవల్లుల ప్రతిబింబాలు పలుచోట్ల ప్రతిఫలించాయి. ముగ్గుల సందడికి చిరునామా అయిన సంక్రాంతి పండగను ఎంతో కళాత్మకంగా వర్ణించాడు శ్రీనాథుడు. ‘పల్నాటి వీర చరిత్ర’లో ఆ మహాకవి నలగామరాజు కొలువును, నాటి ప్రజల జీవనశైలిని వర్ణించే సందర్భంలో ముగ్గులను ప్రస్తావించాడు. ‘‘కస్తూరి చేతను కలయంగనలికి/ ముత్యాల తోడుత ముగ్గులు బెట్టి/ కర్పూరముదకంబు కలిపిముందటన్‌’’ అంటూ కర్పూరం కలిపిన కళ్లాపి చల్లి కస్తూరితో అలికి, ముత్యాలతో ముగ్గులను దిద్దినట్టు వర్ణిస్తాడాయన. పోతన భాగవతంలోనూ రంగవల్లులు తళుక్కుమంటాయి. శుక సప్తతి, హంసవింశతి, బసవపురాణం లాంటి కావ్యాలలోనే కాదు తాళ్లపాక కవుల పదకవితలలోనూ ముగ్గుల వర్ణనలు ఉన్నాయి.
తెలుగు సాహిత్యంలోనే కాదు దానికి స్ఫూర్తినిచ్చిన సంస్కృత సాహిత్యంలోనూ, మన పూర్వకవుల కావ్యాలకు మూల కథలనందించిన అష్టాదశ పురాణాలలోనూ ముగ్గులను గురించిన మాటలున్నాయి. దేవాలయాల ముందు, వాటి ప్రాంగణాలలో శుభ్రంగా చిమ్మి, నీళ్లు చల్లి, రెండు ముగ్గు కర్రలు గీసిన పుణ్యానికే స్వర్గాన్ని అలంకరించిన భక్తులెందరో! దేవాలయాలలోనైనా, ఇళ్ల పరిసరాలలోనైనా అలికి ముగ్గులు పెట్టడం వెనక ఓ సామాజిక ఆంతర్యం ఉంది. దాన్నే ఈనాడు పర్యావరణ పరిశుభ్రత అంటున్నారు.
ఆధునిక కాలంలోనూ...
ప్రాచీన కవులే కాదు, ఆధునిక కవుల దృష్టిలో కూడా ముగ్గుకు ఉన్న గొప్పతనం నిరుపమానం. పల్లెవాసుల జనజీవన వికాసాన్ని, గ్రామ ప్రాంత సౌందర్యాన్ని, రైతు జనజీవనాన్ని తన కావ్యాలలో వర్ణించి అభినవ తిక్కనగా ప్రసిద్ధికెక్కారు తుమ్మల సీతారామమూర్తి. ఆయనతోపాటు తెలుగు సాహిత్యంలో యుగకర్తగా పేరొందిన రాయప్రోలు సుబ్బారావు లాంటి ఎందరో తమ కావ్యాలలో ముగ్గులను గొప్పగా వర్ణించారు. సంక్రాంతి సంబరాన్ని రాయప్రోలు వర్ణించేటప్పుడు ముగ్గులు ముచ్చటగా తొంగి చూశాయిలా...
బూజు దులిపిన పూరియిండ్లను
వెల్ల వేసిన వీధి గోడలు
అలికి మ్రుగ్గులనిడిన యరుగులు
అందగించెను పల్లెలన్‌
ప్రాచీన ఆధునిక కవిత్వాలతో పోటీ పడుతూ జానపదమూ కొంత ఎక్కువగానే ముగ్గు ముచ్చట్లను గానం చేసింది. సర్వ సాధారణంగా జానపదులు తాము వర్ణిస్తున్న కథానాయికా నాయకులు రాజులైనా, చక్రవర్తులైనా తమ జీవనశైలిని పోలిన జీవనశైలితో ఉన్నట్టే వర్ణిస్తుంటారు. జానపద గాథల్లో రాముడు, సీత, ద్రౌపది, పాండవులు ఇలా ఎవరైనా సరే జానపదులు గడిపిన సాధారణ జీవితాన్ని గడిపినట్టే కనిపిస్తారు. జనకుడు మహారాజు, ఆయన కుమార్తె సీత రాకుమారి అయినా సీత స్వయంగా అలికి ముగ్గులు పెట్టిన సందర్భాలను జానపద రామాయణంలో చూడవచ్చు.
సంతాన పరుడమ్మ జనక మహాముని తా
ముద్దు కూతురిని తాజేరబిలిచి
ఆవు పేడా దెచ్చి అయినిళ్లు అలికి
గోవుపేడా దెచ్చి గోపురాలలికి
ముత్యాలు చెడగొట్టి ముగ్గు వేయించి
పగడాలు చెడగొట్టి పట్టలేయించె
సీతమ్మ చేత జనక మహారాజు ముగ్గులేయించినట్టు వర్ణించటం జానపదుల సొంతశైలి. అలాగే గిరిజన సంప్రదాయంలో పాడుకునే కొన్ని పాటలు ఉన్నాయి. వాటిలోనూ ముగ్గులున్నాయి. ‘‘.... అలుకులు లేని ఇంటికాడ మేమొల్లమయ్య/ ముగ్గులు లేని ఇంటికాడ మేమొల్లమయ్య..’’ ఇలా అలికి ముగ్గులు పెట్టని ఇంటికి ఎలాంటి అతిథులైనా రావటానికి ఇష్టపడరన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం.
‘ముగ్గులోకి దించటం’, ‘తల ముగ్గుబుట్టలా ఉంది’, ‘ముగ్గు ఒలికినా అందమే- మగువ అలిగినా అందమే’... ఇలా ముగ్గుల వల్ల తెలుగు భాషకు సమకూరిన జాతీయాలు, సామెతలెన్నో! చమత్కార రంజకంగా చెప్పే పొడుపుకథల్లో ‘అరవై కొమ్మల వృక్షం పడితే లేవదు’ ఒకటి. ఈ పొడుపునకు విడుపు ముగ్గు.
ఎందుకంటే... ఇందుకే
సాహిత్య రంగంలో ఇంత విస్తృతంగా ముగ్గు చొరబడటానికి కారణమేంటి? ఆలోచిస్తే కచ్చితంగా ముగ్గు మీద ప్రజలకున్న మక్కువే అన్న సమాధానం స్ఫురిస్తుంది. కవులు, రచయితలూ సమాజంలో అంతర్భాగమే. అధిక శాతం ప్రజల జీవన శైలిని సాహితీవేత్తలు గమనిస్తూ సందర్భానికి తగ్గట్టుగా రచనలలో వాటిని వాడుకోవటం ఏ కాలంలోనైనా సహజం. వేదకాలం నుంచి తరతరాలుగా ఇంటి ముంగిట మొదలు వంటింటిదాకా అన్నిచోట్ల ఏదో ఒక రూపంలో ‘ముగ్గు మాలక్ష్మి’ దర్శనమిస్తూనే ఉంటుంది. మనిషి భూమ్మీద పడి కన్ను తెరచిన నాటినుంచి కన్నుమూసిన తర్వాత కూడా ముగ్గుతోటే అనుబంధం ఉన్న ఆచారాలు సంప్రదాయాలు భారతావనిలో ఎన్నెన్నో. అందుకే కవులు, రచయితలు ముగ్గును విస్మరించలేకపోయారు.
ఇంతులు ఇంటిముందు గీసే చుక్కలు, మెలికల ముగ్గులు, గీతల ముగ్గులు, రంగుల రంగవల్లులు ఏవైనా కావచ్చు అవన్నీ ఏదో ఒక శాస్త్రాన్ని ప్రతిబింబిస్తుంటాయి. స్థూలంగా చూస్తే ముగ్గులలో గణితం, రేఖాగణితం, క్రీడలు, వైద్యశాస్త్రానికి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. జ్యోతిష, వాస్తు, ఖగోళ సంబంధ విశేషాలతోపాటు జీవాత్మ, పరమాత్మల తారతమ్యాన్ని తెలిపే తత్త్వశాస్త్రాంశాలు కూడా అందాల ముగ్గుల్లో కనిపిస్తాయి. అలాగే తేలికగా గీసే కొన్ని ముగ్గుల్లో అణు నిర్మాణ శాస్త్రం కూడా ఇమిడి ఉన్నట్టు స్ఫురిస్తుంది.
ఏడువారాల ముగ్గులు
స్త్రీలకు సాంప్రదాయికంగా ఏడు వారాల నగలున్నట్టే, వాళ్లు వేసే ముగ్గుల్లో కూడా వారానికొక ముగ్గు చొప్పున ఉంది. సాధారణంగా వారానికొక దేవుణ్ని పూజిస్తుంటారంతా. దాదాపు అదే పద్ధతిలో రోజుకో ముగ్గు చొప్పున దేవతా మందిరాల లోపల లేదా వాటిముందు వేస్తుంటారు. అవి... సోమవారం- శివపీఠం, మంగళవారం- కాళీపీఠం, బుధవారం- స్వస్తిక్‌, గురువారం- నక్షత్రం, శుక్రవారం- కమలం, శనివారం- తార, ఆదివారం- రెండు త్రికోణాలు.
మరికొంతమంది వారి వారి సంప్రదాయాలను అనుసరించి, ఇష్ట దేవతలను అనుసరించి ముగ్గులేస్తుంటారు. దేవుణ్ని ఉంచే పీట ముందు విష్ణు పాదాలు, శంఖ చక్రాలు ఉంటాయి. శ్రీకృష్ణ జన్మాష్టమికి కృష్ణుడి పాదాలను చిత్రించి పూజించటం, నిత్యం శుభాల కోసం ఆవు పాదాలను వేయడమూ ఉంది. కృష్ణ ఆరాధనలో బాల కృష్ణుడి కోసం ఉయ్యాలను ముగ్గుగా గీస్తుంటారు.
భోగి, సంక్రాంతి, కనుమ పండగలప్పుడు ముగ్గుల్లో ప్రత్యేకత కనిపిస్తుంది. కనుమ నాడు రథం ముగ్గు వేస్తుంటారు. ఈ రథం ఒక చక్రం, రెండు చక్రాలతో కనిపిస్తుంది. ఏక చక్ర రథం సూర్యరథానికి ప్రతీక. అలాగే ధనుర్మాసం పొడవునా నాగబంధం, గుమ్మడి పండ్లు, చేపలు, పద్మాలు, కలువ పువ్వులు, చెరకు గడలు, తులసి కోటల రూపాల్లో ఉండే ముగ్గులను చిత్రిస్తుంటారు.
సూర్య, చంద్ర గమనాల్ని బట్టి ముగ్గులు వేసే సంప్రదాయం కొన్నిచోట్ల ఉంది. రంగం సిద్ధం చేసే తీరులోనూ తేడా ఉంది. ఉదయం పేడ నీళ్లతో కళ్లాపి చల్లి పెద్దముగ్గు వేస్తారు. సాయంత్రం కొద్ది నీళ్లు మాత్రం చల్లి చిన్న ముగ్గులేస్తారు. సూర్యాస్తమయానికి సూచనగా చిన్న ముగ్గులు వేసేవారు కొందరైతే కేవలం చిన్న వలయాకారం ముగ్గులను వేసేవారు మరికొందరు.
మారిన పరిస్థితుల్లో
ఇప్పుడు నగరీకరణ పెరిగింది. ఫలితంగా రాతి ముగ్గునో, బియ్యంపిండి ముగ్గునో వెయ్యలేని పరిస్థితి! దాంతో రసాయన రంగులను లేదా ముగ్గుల ప్లాస్టిక్‌ స్టిక్కర్లను అంటిస్తున్నారు. ఇవి అలంకరణకు బావుంటాయి కానీ, ముగ్గుల పరమార్థమైన ‘ఆరోగ్యం - పరిశుభ్రత’కు ఉపయోగపడవు.
అయితే, పాఠశాలలు, కళాశాలలు, కొన్ని సంస్థలు సంక్రాంతి సమయంలో ముగ్గులు, రంగవల్లుల పోటీలను పెడుతున్నాయి. ముగ్గు గీతలను ముందు తరాలకు అందించే ఏ చిన్న ప్రయత్నమైనా మనదైన సంప్రదాయానికి గొడుగుపట్టేదే. అంతకుమించి నవతరంలో పర్యావరణ స్పృహను పెంచేదే.

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం