మలయాలో తెలుగు మారుతం

  • 200 Views
  • 5Likes
  • Like
  • Article Share

    సీతారాము

  • అనకాపల్లి, విశాఖపట్టణం జిల్లా.

జీవిక కోసం దశాబ్దాల కిందటే మలేసియా తరలివెళ్లినా, జన్మనిచ్చిన భూమితో ఉన్న పేగుబంధాన్ని మర్చిపోకుండా అమ్మభాష అభివృద్ధికి ఎనలేని కృషిచేసిన తెలుగు దీప్తి బుద్ద మారయ్య అప్పలనాయుడు. విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలేనికి చెందిన బుద్ద మారయ్య, మహలక్ష్మమ్మ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో సహా 1928లో మలేసియాకి వలస వెళ్లారు. వారి రెండో సంతానం అప్పలనాయుడు. మూడో తరగతి వరకూ అనకాపల్లి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. మలేసియా వెళ్లాక అక్కడే తెలుగు, తమిళం, ఆంగ్ల భాషల్లో స్నాతకోత్తర పట్టాలందుకున్నారు. తమిళనాడులోని కుంభకోణంలో హోమియోపతి డిప్లొమా చేశారు. మలేసియా కెడా రాష్ట్రంలోని పెలాం ఎస్టేటు తెలుగు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. అక్కడే ఉద్యోగ విరమణ చేశారు. 
ఆరు లక్షల మందికి బోధన
మలేసియా తెలుగు సంఘం ఏర్పాటులో అప్పలనాయుడు కీలక పాత్ర పోషించారు. అక్కడి పెలం, కెడా, సుంగాయ్‌ల్లో ఆంధ్ర సంఘాలను ఏర్పాటు చేశారు. 1955లో స్థాపించిన మలేసియా ‘కూలిం’ శాఖకు చాలా ఏళ్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు. గతేడాది కన్నుమూసిన మలేసియా తెలుగు సంఘం వ్యవస్థాపకులు మదిని సోమునాయుడుకు ఈయన అత్యంత సన్నిహితులు. 
      రెండు మూడు తరాల మలేసియా ప్రవాసాంధ్రులు అప్పలనాయుడు దగ్గరే విద్యాభ్యాసం చేశారు. దాదాపు ఆరు లక్షల మంది వరకూ ఈయన వద్ద తెలుగు నేర్చుకున్నారు. అమ్మభాషను తేలిగ్గా నేర్పేందుకు చిన్న చిన్న కథలు, నీతి పద్యాలు, కావ్యాలు తెలుగులో ముద్రించి ఉచితంగా పంపిణీ చేసేవారు. 
      అప్పలనాయుడు ఉపాధ్యాయుడిగా ఉన్న సమయంలో తన ఇంటి దగ్గర ప్రతి శని, ఆదివారాలు ఎంతో మందికి తెలుగు బోధించేచారు. పిల్లలకు పెద్ద బాలశిక్ష, దాశరథి, వేమన, సుమతి శతకాలు, భగవద్గీత నేర్పేవారు. తెలుగు వ్యాకరణం మీద గట్టి పట్టున్న ఆయన చాలా చమత్కారంగా మాట్లాడేవారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా మలేసియాలో తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేశారు. దానికి గుర్తింపుగా మలేసియా పౌర పురస్కారాల్లో ఒకటైన ‘పీజేకే’ గౌరవాన్ని 1978లో అందుకున్నారు. 
      మలయా ద్వీపానికి వలస వెళ్లిన తొలి తరం తెలుగువారు పడిన కష్టాల మీద 2006లో ‘మధుర స్మృతులు’ పేరిట అప్పలనాయుడు కొన్ని కథలు రాశారు. ఇందులో తొలి తరం వలస జీవుల వాడుక భాషను సహజంగా చిత్రించారు. మలేసియాలోని తొలి తరం తెలుగువారి వాడుక భాష మీద అప్పలనాయుడు వివిధ పుస్తకాలు కూడా రాశారు. మలేసియా తెలుగు సంఘం నిర్వహించే విద్యా కార్యక్రమాలకు ఈయన సహకారం ఎనలేనిది. సేవా కార్యక్రమాలకూ ముందుండేవారు. 
      జీవిత కాల పర్యంతం మలయా ద్వీపంలో తెలుగును వెలిగించిన అప్పలనాయుడు నూరేళ్ల వయసులో మే 5న తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఆరుగురు కుమార్తెలు. వారిలో ముగ్గురు విశాఖ జిల్లాలో ఉంటుండగా, రెండో కుమార్తె డా।। మార్గరెట్‌ లండన్‌లో వైద్యురాలు. మరో ఇద్దరు కుమార్తెలు మలేసియాలోనే నివసిస్తున్నారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం