ఉత్తరాల మేలిపొద్దుల్లో...

  • 325 Views
  • 0Likes
  • Like
  • Article Share

    గంటి ఉషాబాల

  • విశాఖపట్నం
  • 8019261852
గంటి ఉషాబాల

ప్రియమైన లేఖా! 
ఎంత
అందమైన పేరు నీది. నిన్ను తలచుకుంటే చాలు అదో మధురానుభూతి. ఎదురుచూపులు, విరహ వేదనలు, ప్రేమసందేశాలు, ఆత్మీయుల పలకరింపులు, హితుల యోగాక్షేమాలు ..ఇలా ఎన్నెన్నో గుండెనిండా నింపుకుని నీ కోసం ఎదురుచూసేవారి ఆనందానికి కారణమవుతావు కదా! 
      ఏ ఆషాఢమో అడ్డొచ్చి పుట్టింటికొచ్చిన పెళ్లికూతురికి శ్రీవారు అందించే ఆరాధననీ, లాలననీ పదే పదే చదువుకునేటంతటి గాఢతని మిగుల్చుతావు. ఇద్దరు పిల్లల తల్లినైన తర్వాత కూడా ఆ భావనని అలాగే ఉంచుతావు. పొట్ట చేత పట్టుకుని పట్నానికి వెళ్లిన కొడుకు భోగట్టా కోసం గుమ్మం ముందు నిలబడి తపాలా బంట్రోతు కోసం ఎదురుచూసే కళ్లజోడు ముసలి తండ్రికి తెల్సు నీ విలువేంటో! పెళ్లి చూపులయ్యాక ఉత్తరం రాస్తామంటూ వెళ్లిపోయిన పెళ్లివారినుంచి.. కల్యాణ ఘడియను మోసుకొచ్చే శుభలేఖ ఎప్పుడా అని వాకిట వేచి చూసే కళ్లకు తెలుసు నువ్విచ్చే తీపి కబురు ఎంత మధురమో. 
      జాతకాలు నప్పలేదంటూ నువ్వు తెచ్చే కబురుకి ప్చ్‌! అని నిట్టూర్చి మళ్లీ నువ్వు ఏ తీపి కబురు తీసుకొస్తావో అని నిరీక్షించే వేళ ఏదో రోజున తీపిని అద్దుతావు ఆ మానినికి. కొలువు కోసం.. జీవితంలో స్థిరమైన నెలవు కోసం అర్రులుచాచే నిరుద్యోగులకు ‘‘ఉందిలే మంచికాలం ముందు ముందునా...’’  అంటూ ఊరించి మరీ ఒక శుభ సమయాన ‘‘ఉద్యోగ ప్రాప్తిరస్తు!’’ అంటూ వాలిపోతావు. ఉద్యోగ నిర్వహణలో అవకతవకలు చేసినప్పుడు పై అధికారుల నుంచి అందుకునే శ్రీముఖం గురించీ తెలియనిదేం కాదు. అంతవరకూ ఎందుకూ! పెళ్లిలో ‘సత్సంతాన ప్రాప్తిరస్తు!’ అని దీవెనలందుకున్న అల్లుడికీ తెలుసు! నువ్వు ఫలానా తేదీన ఫలాన నక్షత్రంలో పండంటి బిడ్డకి తండ్రివయ్యావు అనే తీపి కబురు తెచ్చిందీ నువ్వేనని. 
      ఇంటికో పువ్వు ఈశ్వరుని పూజకన్నట్టు దేశభద్రత కోసం అహరహం శ్రమించే జవాను బాగోగులనూ.. అతని ఆగమనాన్నీ తెలిపేదీ నువ్వే! యుద్ధంలో గాయపడ్డాడనో, అమరుడయ్యాడనో అంటూ జీవితంలో వెలుగునీడల అడుగుజాడలను వినిపించేదీ నువ్వే. 
      ఇలా ఎన్నో వార్తలను నిత్యం మోసుకొచ్చే నువ్వు మాకు ఆత్మబంధువువి. పట్టె మంచం కింద అదిమిపెట్టో. ఇనుప తీగకి వేలాడగట్టో మా మధురోహలన్నింటినీ నీ రూపంలో భద్రంగా దాచుకునేవాళ్లం. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడా వైభోగం ఏదీ! కనబడదేం! ఎలా కనబడుతుందీ! ప్రపంచాన్నంతా తన గుప్పిట బంధించి సమస్త మానవాళీ దాసోహం అనేలా చేస్తున్న ఆ చరవాణి మన చేతినుందిగా. నిన్ను రోజూ నోరారా తలచుకోవాలనే నా ముద్దుల కూతురికి లేఖ అని పేరు పెట్టాను. లేఖా! అని పిలిచినప్పుడైనా ఓ లేఖ రాయాలనిపిస్తుందనీ. 

ఇట్లు
 నీ అభిమాని

 


వెనక్కి ...

మీ అభిప్రాయం