సమాసాల నవహాసం

  • 1098 Views
  • 8Likes
  • Like
  • Article Share

    ఆచార్య పులికొండ సుబ్బాచారి

  • హైదరాబాదు
  • 9440493604
ఆచార్య పులికొండ సుబ్బాచారి

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వచ్చిన టీవీ, ఇతర విద్యుత్‌ ఉపకరణాలు, దాదాపు ప్రతి వ్యక్తి చేతికీ వచ్చిన మొబైల్‌ ఫోను, ఎన్నో ఇళ్లకు చేరుతున్న దినపత్రికలు, గ్రామానికి చేరువైన నగర సంస్కృతి.. ఇలా ఎన్నో కోణాలు జనవ్యవహారంలో భాషాపరిణామానికి కారణం అవుతున్నాయి. ఇది అనివార్యంగా, అపరిహార్యంగా సాగుతూ ఉంది. ఈ పరిణామాన్ని భాషావేత్తలు అధ్యయనం చేయాలి. ఇందులో భాగంగా తెలుగు- ఇంగ్లీషు మిశ్రసమాస కల్పనారీతులను పరిశీలించడం ఆసక్తికరం.
జన
వ్యవహారంలో భాష నిత్య పరిణామం చెందుతోంది. అలాగే అచ్చు, దృశ్యమాధ్యమాల్లో భాష ప్రతిరోజు ఓ కొత్త అవసరాన్ని ఎదుర్కొంటోంది. దినపత్రికల అవసరాలు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి. రోజూ కొత్త ఘటనో, ఆవిష్కరణో వస్తూ ఉంటుంది. అందుకోసం కొత్త పదాలను వెతుక్కుంటూ ఉంటుంది పత్రికా రంగం అనువాదం చేసుకుంటుంది. కొన్ని పదాలు, పదబంధాలు నిలబడి స్థిరపడతాయి. మరికొన్ని ఆ ఒకటి రెండు రోజులు అవసరం తీరిన తర్వాత మరుగున పడతాయి. ఇదే పద్ధతిలో పల్లెలకూ చేరిన కొత్త సాంకేతిక విజ్ఞానం, ఉపగ్రహ ఛానళ్లు, మాధ్యమాల భాష ప్రభావంతో జనవ్యవహారంలో తెలుగు చాలా వేగంగా మారుతోంది. నిత్యావసర పదాల్లో ఆంగ్ల మాటల వాడుక బాగా పెరిగింది. తత్ఫలితంగా ఇంగ్లీషు, తెలుగు పదాలను కలిపి వాడుకోవాల్సిన పరిస్థితి బాగా వచ్చింది. వీటి ఉనికి అనివార్యమైనదిగా భావించి భాషావేత్తలు అధ్యయనం చేయాల్సి ఉంది.  
      తెలుగువారి వ్యవహారంలోకి ఇంగ్లీషు పదాల ప్రవేశం శతాబ్దం కిందటే జరిగింది. క్రమంగా చాలా ఆంగ్ల మాటలు తెలుగులో కలిసి మన పదాలుగానే మారాయి. ఈ పరిణామక్రమాన్ని ‘దేశీకరణం’ అనుకోవచ్చు. అంటే తెలుగుదేశ్య పదాలతో కలిసిపోయి అవి తెలుగు పదాలేనేమో అనుకునేంతగా వ్యవహారంలో నిలబడ్డాయి. రైలు, బస్సు, కారు, లారీ, ఆటో, సైకిల్, వాచీ, పెన్ను, బ్యాంకు, షాపు, స్టేషను, పోలీసు.. ఇలా కొన్ని వందల మాటలు మన మాటల్లో కలిసిపోయాయి. ఇలా వచ్చి చేరిన పదాల్లోనూ తత్సమాలు తద్భవాలు ఉంటాయి. ఇవి కాక పత్రికాభాషలో, రేడియో, టీవీ భాషలో ఇంకా చాలా పదాలు రోజువారీ వాడకంలో లేని ఇంగ్లీషు పదాలు కూడా వచ్చి చేరాయి. వాటిలో ఆంగ్ల- తెలుగు మిశ్రసమాసాలు కోకొల్లలు. వాటిని ప్రత్యేకంగా అధ్యయనం చేస్తే కొన్ని విశేషాలు కనిపిస్తాయి.
పరిశోధన లేదు!
సంప్రదాయ వ్యాకరణాలు అన్యదేశ్య పదాలను గురించి చెప్పాయి. అప్పట్లో అన్యదేశ్యాలంటే హిందుస్తానీ పదాలే. తిక్కన కాలంలోనే త్రాసు అనే ఉర్దూ పదం ఉందని పరిశోధకులు చెప్పారు. శ్రీనాథుడి కాలంలో చాలా ఉర్దూ పదాలు పద్యరచనలో ఉండటమూ గుర్తించారు. ఆధునిక కాలంలో వ్యవహార భాషలో ఇంగ్లీషు పదాల వాడుక చిన్నయసూరి కాలం నాటికే ఉంది. కానీ, అవి కావ్యరచనలో చోటుచేసుకోనందున లేదా వాటి గురించి ఆలోచించక పోవడంతో ఇంగ్లీషు పదాలను అన్యదేశ్యాలుగా గుర్తించలేదు. సంప్రదాయ వ్యాకరణాల్లో తెలుగుకు బాల ప్రౌఢ వ్యాకరణాలే ప్రామాణికమైన చివరి వ్యాకరణాలు. తర్వాత వ్యావహారిక భాషా వ్యాకరణాలు వచ్చినా తెలుగులో ఇంగ్లీషు పదాలు చేరినప్పుడు ఏయేమార్పులకు గురవుతున్నాయి.. తెలుగు ప్రత్యయాలు ఇంగ్లీషు నామపదాలకు, క్రియాపదాలకు, విశేషణాది ఇతర పదాలకు ఎలా చేరుతున్నాయి.. ఆ క్రమంలో జరిగే మార్పులేంటనే చర్చ వ్యాకరణాల్లో జరగలేదు. తెలుగు ఇంగ్లీషు పదాలతో సమాస కల్పన ఎలా జరుగుతుంది.. ఆ ప్రక్రియలో ఉన్న వ్యాకరణం ఏంటనే చర్చ లేదు. భాషాశాస్త్ర పరిశీలనలు తప్ప తెలుగుకు ఆధునిక వ్యాకరణాలు లేదా ఆధునిక వ్యవహార భాషావ్యాకరణాల రచన జరగలేదు. కనీసం జరగాల్సినంత జరగలేదని గట్టిగా చెప్పవచ్చు. ‘తెలుగునకు వ్యాకరణ దీపం చిన్నది’ అనే ఆనాటి మాటను ఇప్పుడు ‘మరీ సన్నది’ అని చెప్పుకోవాలి. ఇక పత్రికాభాషకు నిఘంటువులు వచ్చి ఇరవై ఏళ్లు అయ్యింది. ఈ రెండు దశాబ్దాల్లో పత్రికాభాషలో చాలా పరిణామం జరిగింది. కొన్ని వందల వేల ఇంగ్లీషు పదాలు నేరుగా వినియోగంలోకి వచ్చాయి. అయినా పత్రిక, ప్రసార మాధ్యమాల భాషలో తెలుగు ఇంగ్లీషు పదాల సమాసకల్పన ఎలా జరుగుతోందన్న దానిపైనా భాషావేత్తలు, పరిశోధకులు దృష్టిసారించలేదు.
      భాషలో వచ్చే తొంభై తొమ్మిది శాతం సమాసాలు వ్యాకరణ నియమాల ప్రకారమే వేర్వేరు రీతుల్లో ఏర్పడతాయి. ఇంగ్లీషు తెలుగు మిశ్రసమాసాల్లో కూడా ఇలాంటివే వివిధ రకాల సమాసాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఇంకా ప్రత్యేకంగా కనిపించే సమాసాలు కూడా నేటి భాషలో ఉంటున్నాయి. వీటిని ఇప్పటివరకూ భాషలో లోపంగానే గ్రహించారు కాని అలాంటి సమాసాలు ఏర్పడటం సహజ భాషాపరిణామం అని, వాటిని కూడా విశ్లేషించి చెప్పాలనే ప్రయత్నాలు జరగలేదు. పత్రికల భాషలో, జనవ్యవహారంలోనే కాక, సాహిత్యంలో కూడా ఇంగ్లీషు పదాల వినియోగం విరివిగానే ఉంటోంది. దీన్ని పరిశీలించి వ్యాకరణించే పని జరగాల్సిన రీతిలో జరగలేదు. 
తొమ్మిది రకాలు
తెలుగులో ఇంగ్లీషు పదాల వినియోగం వ్యస్తపదంగానే కాక సమస్త పదంగా కూడా అంటే సమాసాల రూపంలో కూడా విరివిగా జరిగింది. రెండూ ఇంగ్లీషు పదాలతో ఏర్పడ్డ సమాసాలు నేరుగా వాడుకునే పద్ధతి ఉంది. ‘బాడీగార్డ్‌’.. దీన్ని యథాతథంగా వాడవచ్చు. ‘బస్‌జర్నీ’ని నేరుగా రాయవచ్చు లేదా బస్సు ప్రయాణం అని ఇంగ్లీషు తెలుగు పదంతో కలిపి సమాసంగా చేయవచ్చు. మొదటి పదానికి తెలుగు అనువాదం లేకపోవడంతో ఇలాంటి మిశ్రసమాసం అనివార్యం. ఇలాంటివే తెలుగులో నేడు విరివిగా వినియోగంలోకి వచ్చాయి. 
      ఇంగ్లీషు తెలుగు పదాలు కలిసి ఏర్పడిన సమాసాలు చాలా వరకు సంప్రదాయ వ్యాకరణాలు చెప్పిన రీతిలో ఉన్నాయి. కాని కొన్ని సమాసాలు కొత్త తరహాలో కనిపిస్తాయి. మొత్తమ్మీద అర్థం పరంగా ఆంగ్ల మిశ్ర సమాసాలను ఇలా విభజించుకోవచ్చు.. సంబంధార్థక సమాసం (రెండింటిమధ్య సంబంధాన్ని తెలిపేది, వీటిలో వ్యాకరణాలు చెప్పిన అన్ని రకాల తత్పురుష సమాసాలు ఉన్నాయి), గుణాత్మక సమాసం (పూర్వ/ ఉత్తరపదాల్లో ఓ గుణాన్ని చెప్పేది, వీటిలో అన్ని కర్మధారయ సమాసాలు వచ్చాయి.), క్రియాత్మక సమాసం (జరుగుతున్న జరిగిన పనిని చెప్పేది), అన్యార్థక సమాసం (సమాసంలో ఉన్న పదాలకన్నా భిన్నమైన అర్థాన్ని చెప్పేది), ఉత్తరపద ప్రాధాన్యం (ఉత్తర పదం అర్థమే ముఖ్యమైనది), అభిధాన సమాసం (వ్యక్తి లేదా సంస్థ పేరును చెప్పేది), స్థిత్యాత్మక సమాసం (గుణాన్ని కాక ఓ స్థితిని చెప్పేది), రూపక సమాసం (ఉపమాన ఉపమేయాలతో ఉండేది.. ఉపమేయం పైన ఉపమాన గుణాన్ని ఆరోపించేది), విధాన సమాసం (గుణం కంటే భిన్నంగా ఓ విధానాన్ని చెప్పేది). స్థూలంగా ఇలా చెప్పుకున్నా ముందు ముందు వచ్చే వాటిని దృష్టిలో ఉంచుకుంటే మరికొన్ని విభాగాలు కూడా రావచ్చు.
‘తత్పురుష’లోనే ఎక్కువ
విభక్తులు లోపించి రెండు పదాలు కలిసి ఏర్పడిన సమాసాలను ఓ విభాగంగా చెప్పారు వ్యాకరణకర్తలు. ద్వితీయాది విభక్తులకు తర్వాత వచ్చే సమాసాలు ఒక విధం అన్నారు. వాటినే తత్పురుష సమాసాలంటారు. ఇలాంటివి తెలుగు ఇంగ్లీషు పదాలతో ఏర్పడిన సమాసాల్లో చాలా కనిపిస్తాయి. ద్వితీయావిభక్తి దగ్గరనుంచి సప్తమీ విభక్తి వరకు కూడా చాలా సమాసాలు వచ్చాయి. కొన్నింటికి రెండు రకాల అన్వయాన్ని కూడా చెప్పొచ్చు. ఈ ఆరు విభక్తులతో వచ్చే సమాసాలన్నీ ఓ సంబంధాన్ని చెబుతాయి. కాబట్టి వీటన్నింటినీ సంబంధార్థక సమాసాలు అనవచ్చు. 
      కరెంటును అందించే తీగలనే అర్థంలో ‘కరెంటు తీగలు’ సమాసం ఉంది. ఇది ద్వితీయా విభక్తికి ఉదాహరణ. కాన్సర్‌ను కలిగించేవి కాన్సర్‌ కారకాలు. రిక్షాను లాగి జీవించే వారు రిక్షా కార్మికులు. తెల్లకార్డు కుటుంబాలు, యూట్యూబ్‌ వీక్షకులు ఇలాంటివన్నీ ద్వితీయా విభక్తితో కనిపించే సమాసాలు. ‘బాంబుదాడి (బాంబుచేత దాడి), డ్రోన్‌భద్రత, రియల్‌ ఆక్రమణలు, విజిలెన్స్‌ దాడి, డ్రోన్‌పహారా, విజిలెన్స్‌ విచారణ’ ఇలాంటివి తృతీయా తత్పురుష విభాగంలోకి వస్తాయి. ‘పొదుపు డిపాజిట్లు, పాలక్యాను, పునరావాస ప్యాకేజీ, మానవహక్కుల కమిషన్, విలీన కమిటీ, వంటగ్యాస్, అధ్యయన కమిటీ’.. ఇలా చతుర్థీతత్పురుషగా చాలా సమాసాలు వచ్చాయి. ‘కరెంట్‌ కష్టాలు, కాన్సర్‌ బాధలు, ప్రాజెక్టు నిర్వాసితులు, స్వైన్‌ఫ్లూ మరణాలు, బస్సు ప్రమాదం, రెబల్‌ సమస్యలు’.. ఇవి పంచమీ తత్పురుష విభాగానికి చెందినవి. ఇక షష్ఠీసమాసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ‘కంపెనీ చట్టం, అంబులెన్స్‌ సేవలు, అకౌంట్‌ బదిలీ, అసెంబ్లీ ఆమోదం, ఐఓటీ సేవలు, ఐటీ కార్యాలయం, కాబినెట్‌ ఆమోదం, గవర్నర్‌ ఆదేశాలు, ఓబీసీ మహాసభలు’.. ఇవన్నీ ఆ కోవలోకి వస్తాయి.  
      తత్పురుష విభాగంలో అన్ని విభక్తులతో ఏర్పడ్డ సమాసాలు చాలా కనిపిస్తాయి. కొన్ని సమాసాలకు వివరణ రాస్తే అవి ఒక విభక్తి కాక రెండు విభక్తుల్లో కనిపించవచ్చు. ఆంగ్లమిశ్ర సమాసాల్లో దాదాపు సగం అంతకన్నా ఎక్కువ ఈ సంబంధాత్మకాలే. క్రీడా అవార్డుల కమిటీ, గవర్నర్‌ ఆదేశం.. ఇలా పూర్వపదంగా ఇంగ్లీషు, తెలుగుల్లో ఏదైనా ఉండవచ్చు. ఏ పదం ఎక్కడ ఉంది అన్నది కాక ఒక సంబంధాన్ని సూచించే వివరణతోనే ఈ సమాసాలున్నాయి. కొన్నింట్లో సంబంధాన్ని ఎలా చెప్పాలో ఇదమిత్థంగా వివరణవాక్యం (విగ్రహవాక్యం) రాయడానికి వీల్లేనివీ కనిపిస్తాయి. ఓటింగ్‌ యంత్రం అంటే ఓటింగ్‌ కొరకు యంత్రం అనవచ్చు లేదా ఓటేయడానికి ఉన్న యంత్రం అనవచ్చు. ఓటేయడానికి ఉన్న యంత్రమని వివరణ చెబితే ఇది విశేషణ పూర్వపద సమాసం కావచ్చు. ఇలా విశేష్యాన్ని వివరించేవి లేదా విశేష్యం గుణాన్ని తెలిపేవి కొన్ని సమాసాలు కనిపిస్తాయి. కానీ, ఇవి అటు తత్పురుష సమాసాలుగానూ ఉంటాయి. ఇలా సంప్రదాయ వ్యాకరణాలు చెప్పే విభాగాల్లో ఇమడనివి ఈ ఆంగ్ల మిశ్రసమాసాల్లో కనిపిస్తాయి. 
అవన్నీ అన్యార్థకాలే
సంప్రదాయ వ్యాకరణాల ప్రకారం విశేషణం విశేష్యంచేత ఏర్పడే సమాసాలు విశేషణపూర్వపద కర్మధారయాలు. సాధారణంగా విశేషణం పూర్వపదంగానే ఎక్కువ సమాసాలు ఉంటాయి. అంత సాహిత్యంలో విశేషణోత్తరపద కర్మధారయానికి ‘తమ్ముగుఱ్ఱ, చిలుకమొకరి, జాడుకూన’.. ఇలా మూడు నాలుగు ఉదాహరణలనే వ్యాకరణాలు సూచించాయి. కానీ, ఆంగ్ల మిశ్రసమాసాల్లో విశేషణం ఉత్తరపదంగా కనిపించేవి ఎక్కువగానే ఉన్నాయి. ‘అన్వేషణ కమిటీ’- అన్వేషణ కోసం వేసిన కమిటీ అంటే ఇది సంబందార్థకంగా చతుర్థీ సమాసం అవుతుంది. కానీ ఇక్కడ కమిటీ అనే విశేష్యానికి అన్వేషణ ఒక విశేషణం కూడా కావచ్చు. అన్వేషణ అనేది క్రియ కదా అనుకున్నా, కమిటీ ఉత్తరపదంగా ఉన్న చాలా సమాసాలను పోల్చి చూస్తే అది విశేషణంగా ఉండి కమిటీ పదాన్ని వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇలా ఇది గుణసంబంధ సమాసం అవుతుంది. విశేషణ పూర్వపద కర్మధారయం కూడా అవుతుంది. ఇలా రెండు రకాలుగా ఉన్నవి ఈ మిశ్రసమాసాల్లో చాలా కనిపిస్తాయి.
      ‘ఆపరేషన్‌ కమల్, ఆపరేషన్‌ కశ్మీర్, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ’.. ఇలాంటి సమాసాలు కూడా సంప్రదాయికంగా చెప్పే సమాసాల వర్గీకరణలోకి లొంగవు. ఆపరేషన్‌ కమల్‌ అనేది ఒక పార్టీ వారు ఓ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి లేదా పార్టీని సరికొత్తగా బలోపేతం చేయడానికి చేసిన కార్యక్రమం. కానీ,  ఇక్కడ ఆపరేషన్, కమల్‌ అనే రెండు పదాల్లో ఈ అర్థం విడిగా గోచరించదు. అందుకే ఇది అన్యార్థక సమాసం. అయితే, దీన్ని సంప్రదాయికంగా చెప్పే బహువ్రీహి అనలేం. పైన ఉట్టంకించిన మిగతా మూడు సమాసాలు కూడా అలాంటివే. ‘పసుపుబోర్డు, పొగాకుబోర్డు, మైలేజీరాజా’.. ఇలాంటి సమాసాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ బోర్డు అన్నది పసుపు/ పొగాకుల కోసం కాదు. ఆయా పంటలు పండించే రైతుల సమస్యలు, ఇతర అన్ని విషయాలను నిర్వహించే బోర్డు అని అర్థం. ఇక్కడ రైతుల విషయం ప్రధానమైంది. మైలేజీరాజా అంటే మైలేజీ ఎక్కువగా ఇచ్చే ఒక మోటారు వాహనం అని అర్థం. ఇక్కడ రాజా అనేది ఉపమానంగా ఉపయోగపడింది. దీన్ని విశేషణమనీ అనవచ్చు. ఇలాంటి సమాసాలూ అన్యార్థకాలే. 
      ‘ఆర్టీఏ కొరడా, మెట్రో కిరీటం, పొట్ట లాకర్, ఫాక్షన్‌ పడగనీడ’.. ఇలాంటి రూపక సమాసాలూ వినియోగంలోకి వచ్చాయి. అక్రమంగా నడిపే బస్సులపైన ప్రభుత్వం ఆర్టీఏ అనే కొరడాను ఝళిపించింది. మెట్రోరైలు నగరానికి కిరీటంగా మారింది. పొట్టే లాకర్‌గా మారింది. ఫాక్షన్‌ని అనుసరించడమంటే పాముపడగలో ఉన్నట్లే. ఇలాంటి వివరణలను పత్రికా పాఠకులకు ఈ క్లుప్త సమాసాలు అందిస్తున్నాయి. వీటిద్వారా పత్రికలో స్థలం ఆదా అవుతుంది. వార్త ఆకర్షణీయంగానూ తయారవుతుంది. ‘కొలువు లోకల్, కేంద్రం ఓకే’.. ఇలాంటివీ సంప్రదాయ సమాసాలకు భిన్నమైనవే. లోకల్, ఓకే అనే పదాలు ఇక్కడ క్రియాజన్య విశేషణాలుగా పనిచేస్తున్నాయి. లోకల్‌ వారికి ఇచ్చిన కొలువు అని; ఓకే చెప్పిన కేంద్రం అని వీటికి వివరణలు. ఇలా చెప్పినప్పుడు ఉత్తరపదంగా ఉన్నవి క్రియాజన్య విశేషణాలే. 
పరిణామాన్ని గమనించాల్సిందే 
కొన్ని సమాసాలు అన్యార్థకంగా ఉండటం మాత్రమే కాక వాటికి అంతర్లీనంగా ధ్వని ఉంటుంది. వార్తా శీర్షికల్లో ఇలాంటి సమాసాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ‘డబుల్‌ అవినీతి, గ్రేటర్‌ నాయకులు, బేర్‌ విశ్వరూపం, రియల్‌దందా’ ఇలాంటి సమాసాలు కొన్ని ఉన్నాయి. డబుల్‌ అవినీతి అంటే అవినీతికి డబుల్‌ పదం విశేషం కాదు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లనిర్మాణంలో జరిగిన అవినీతి అని అర్థం. గ్రేటర్‌ నాయకులు అంటే గ్రేటర్‌ అనేది నాయకునికి విశేషణం కాదు. గ్రేటర్‌ హైదరాబాదుకు చెందిన నాయకులు అని ధ్వని. బేర్‌ విశ్వరూపం అంటే ఎలుగుబంటి విశ్వరూపం కాదు  బేర్‌ చిహ్నంగా కలిగిన స్టాక్‌మార్కెట్‌ విజృంభణ. కేవలం ధ్వనిగర్భితంగా ఈ సమాసాలు అన్యార్థప్రధానంగా ఉంటాయి. ఆంగ్ల మిశ్రసమాసాల్లో ఇలాంటి తరహావి మరికొన్ని కనపడతాయి. 
      ఏదిఏమైనా భాషలో అనివార్యంగా వస్తున్న పరిణామాన్ని గమనించడం భాషావేత్తల కర్తవ్యం. భాషని సంస్కరించడం లేదా భాష ‘సంకరం’ కాకుండా చూడటాన్ని కొంతమంది భాషోద్యమకారులు బాధ్యతగా భావిస్తున్నారు. భాష సహజమైన ప్రవృత్తిని, అందాన్ని కొనసాగించాలనుకోవడంలో తప్పు లేదు. కానీ, జనవ్యవహారంలో సహజంగా ఓ సామాజిక పరిణామ నేపథ్యంలో వస్తున్న మార్పులను, మాధ్యమాల్లోనూ అనివార్యంగా వస్తున్న పరిణామాలను ఎవరూ ఆపలేరు. వాటిని అధ్యయనం చేయడమే కర్తవ్యం.


వెనక్కి ...

మీ అభిప్రాయం