ఘనాఘనుల భాష

  • 211 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఇద్దరు తెలుగువాళ్లు కలిస్తే ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారన్న వెటకారం సామెతగా మారి చాలాకాలమే అయ్యింది. ఇక్కడే కాదు, ఆఫ్రికాలోని ఘనా పరిస్థితీ ఇదే. 
      ఆ దేశమూ సుదీర్ఘకాలం ఇంగ్లండు పాలనలో మగ్గింది. 1957లో ఘనాకి స్వాతంత్య్రం లభించినా, ఆంగ్లం మాత్రం వారి జీవితాల మీద ఇంకా ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తన సమస్యలన్నింటి మీదా దృష్టి సారించిన ఘనా ప్రభుత్వం, భాష కోసం ఒక స్పష్టమైన విధానం ఉండాలన్న అవసరాన్ని మాత్రం గుర్తించలేదు. దాంతో  80కిపైగా భాషలు వినిపించే ఘనాలో అధికారభాషగా ఆంగ్లం రాజ్యమేలుతోంది.
      ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజలు కూడా తమ మాతృభాషలను తోసిరాజని, ఆంగ్లంలోనే మాట్లాడటం మొదలుపెట్టారు. పాఠశాలల్లో సైతం ఆంగ్లంలోనే బోధన సాగుతోంది. ఆ భాషని పిల్లవాడు ఎక్కడ మర్చిపోతాడో అని ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఆంగ్లంలో మాట్లాడటం మొదలు పెట్టారట. ఇలా ప్రతి ఒక్కరూ వచ్చీరాని ఆంగ్లంలోనే మాట్లాడేందుకు ప్రయత్నించడంతో, ఘోష తప్ప భాష మిగలడం లేదని భాషావేత్తలు మొత్తుకుంటున్నారు.
      ఘనా విశ్వవిద్యాలయానికి చెందిన గోర్డన్‌ అదికా ఈ విషయం మీద ఏకంగా ఒక సిద్ధాంత పత్రాన్నే సమర్పించారు. పిల్లవాడు తన మాతృభాష మీద పూర్తిగా పట్టు సాధించకుండానే, ఆంగ్లాన్ని అభ్యసించడం వల్ల... ఆఫ్రికన్‌ తరహా ఉచ్చారణ ఆంగ్ల భాషలో చోటు చేసుకుంటోంది అంటున్నారు గోర్డన్‌. ఉదాహరణకు పర్సన్‌ను ‘పెసిన్‌’ అనీ, మర్మర్‌ని మెమో అనీ అంటున్నారట.
      కేవలం ఉచ్చారణకే కాదు! మాతృభాషకు బదులుగా ఆంగ్లంలోనే సంభాషించాలని ప్రయత్నించడంతో, ఆంగ్లాన్ని కూడా స్థానికంగా ఉన్న సంస్కృతికి తగినట్లు మార్చేశారట ఘనావాసులు. ఉదా: హెర్బలిస్ట్‌ అనే పదాన్ని తీసుకోండి. మూలికలని పెంచడమో, సేకరించడమో చేసేవారిని ఆంగ్లంలో హెర్బలిస్ట్‌ అంటారు. కానీ ఘనాలో మూలికని సేకరించేవారినే కాదు... పసరు వైద్యులనీ, భూతవైద్యులనీ కూడా హెర్బలిస్ట్‌ అని పిలవసాగారు. ఇలా ఆంగ్లానికి తలవంచి, ఆ తర్వాత ఆంగ్లాన్నే ఎడాపెడా వంచిన ఘనీయుల ఆంగ్లభాషకు ‘ఘనాయియన్‌ ఇంగ్లిష్‌’ అన్న పేరు స్థిరపడింది.
పిల్లవాడు తన మాతృభాషకు అలవాటుపడి, అందులో భావాలను వ్యక్తీకరించి, ఆ ఉచ్చారణ మీద పట్టు సాధించక పూర్వమే... అతణ్ని ఆంగ్లంతో ముడివేసే ప్రయత్నం, ఘనా పౌరుల జీవితాలను కుదిపేస్తోంది. నిజానికి   తొలి మూడేళ్ల ప్రాథమిక విద్యాభ్యాసమూ స్థానిక భాషల్లోనే సాగాలని గతంలో ప్రభుత్వమే ఓ ఉత్తర్వు ఇచ్చింది. ఇది చాలా అద్భుతంగా అమలైంది కూడా. కానీ తర్వాత ఆ ఉత్తర్వుని ప్రభుత్వమే తుంగలో తొక్కింది. ఆంగ్లాన్ని బోధించేందుకు సరైన ఉపాధ్యాయులే లేకపోయినప్పటికీ, ప్రాథమిక విద్యను సైతం ఆంగ్లమయంగా మార్చేసింది. ఇలాంటి అనాలోచిత చర్యల వల్ల స్థానిక జాతుల మూలాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆంగ్లాన్ని తలకెక్కించుకోవడం వల్ల స్థానిక ప్రజలు ద్వితీయస్థాయి పౌరులుగా మారిపోతున్నారని సాక్షాత్తూ ఘనా పార్లమెంటే 1971లో పేర్కొన్నా ఉపయోగం లేకపోయింది.
      ఏళ్లు గడుస్తున్నకొద్దీ ఘనా ప్రభుత్వానికి తాను చేసిన తప్పు తెలిసిరావడం మొదలుపెట్టింది. మాతృభాషలో పరిపక్వతను సాధించిన తర్వాతే, మరే భాషనైనా స్వచ్ఛంగా నేర్చుకోగలరని నిపుణులు చెబుతున్న మాటలు చెవికి ఎక్కసాగాయి. జాతీయ అక్షరాస్యతా కార్యక్రమం కింద ప్రాథమిక విద్యాభ్యాసంలోని తొలి మూడు సంవత్సరాల్లో, స్థానిక భాషకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ఇప్పుడిప్పుడే చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత కూడా పాఠ్యాంశాల్లో స్థానిక భాష ఉండేట్లు ప్రణాళికను రూపొందిస్తున్నారు. దీంతో అక్కడి పాఠశాలల్లోని విద్యార్థులు ఇప్పుడు మళ్లీ తమ భాషను నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడి ఆఫ్రికా ఖండం! ఎక్కడి ఘనా! పేదరికానికీ, వెనకబాటుతనానికీ పెట్టింది పేరైన ఘనాలో కూడా ఇప్పుడు చైతన్యం వచ్చింది. మాతృభాషను బోధనాంశంగా మార్చేందుకు చర్యలు మొదలయ్యాయి. మరి మనమో!!


వెనక్కి ...

మీ అభిప్రాయం