అగ్రరాజ్యంలో ఆదిమ ఘోష

  • 152 Views
  • 0Likes
  • Like
  • Article Share

అమెరికాను కొలంబస్‌ కనుగొని ఉండవచ్చుగాక! గానీ ఆ అమెరికాను సొంతం చేసుకునేందుకు ఐరోపా వాసులు చేసిన ప్రయత్నంలో, స్థానిక జాతులన్నీ ఇంచుమించుగా తుడిచిపెట్టుకుపోయాయి. వేల సంవత్సరాల నాటి ఆదిమజాతుల సంస్కృతి నేటికీ నామమాత్రంగా మిగిలిపోయింది. ఐరోపా వాసులు చేసిన యుద్ధాలు, అందించిన అంటురోగాలు, దోచుకున్న వనరులు... అన్నీ కూడా స్థానిక జాతుల పట్ల మరణశాసనంగా మారాయి. వివిధ తెగల మధ్య జరిగే యుద్ధాలు సరేసరి! దేశంలో జరిగే ప్రతి యుద్ధమూ కూడా వారి జీవితాల మీద ప్రభావం చూపేది. ఆదిమజాతి వారిని దొంగలుగా, క్రూరులుగా చిత్రీకరిస్తూ వారి ఉనికినే కాదు, వ్యక్తిత్వాన్ని కూడా నిర్మూలించే ప్రయత్నాలు జరిగాయి. 
      20వ శతాబ్దం వచ్చేనాటికి అమెరికా, ఆదిమ జాతులది కాకుండాపోయింది. వేల సంవత్సరాలుగా తాము సంచరించిన గడ్డ మీదే వాళ్లు ప్రభుత్వాలు దానంగా ఇచ్చిన భూముల మీద నివసించే పరిస్థితి వచ్చింది. ఈ భూముల మీద వాళ్లు జూదశాలలు నిర్వహిస్తూ, పశువులని పోషించుకుంటూ జీవిస్తున్నారు. వారసత్వంగా వచ్చిన కుట్లు, అల్లికలు వంటి చేతివృత్తుల మీద మరికొందరు జీవిస్తున్నారు. అమెరికా ఆదిమజాతుల సంస్కృతి ఎప్పుడైతే ఆటుపోట్లకు గురైందో, దాని ప్రభావం వారి భాషల మీద కూడా పడింది. 1492లో కొలంబస్‌ అమెరికాను కనుగొనక పూర్వం అక్కడ దాదాపు 300 ఆదిమ భాషలు ఉండేవని అంచనా. కానీ ప్రస్తుతానికి అందులో సగం మాత్రమే మిగిలాయి. పైగా వాటిలో చాలా భాషలను వెయ్యిమంది కూడా మాట్లాడరు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి అమెరికాలో 20 ఆదిమ భాషలు మాత్రమే మిగులుతాయని జేమ్స్‌ క్రాఫోర్డ్‌ అనే విద్యావేత్త హెచ్చరించారు.
      జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, అమెరికా వైభవానికే ముప్పు వస్తుందని ప్రభుత్వం గ్రహించినట్లుంది. అందుకే 2006లో ‘బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ ఎడ్యుకేషన్‌’ అనే విభాగాన్ని ఏర్పరచింది. ఆదిమజాతి వారి భాష, సంస్కృతులను కాపాడుకునే వారికి ఆధునిక విజ్ఞానాన్ని అందించడమే దీని లక్ష్యం. ఇది అమెరికాలోని 23 రాష్ట్రాల్లో 183 పాఠశాలల్లో ఆదిమ భాషలను బోధించేందుకు వనరులను సమకూరుస్తోంది. ఆదిమజాతి వారి కోసం ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలకు కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఆదిమజాతి వారు ఉన్నత విద్యను అభ్యసించేందుకూ కొన్ని కళాశాలలకు నిధులను అందిస్తోంది. దీనికి తోడు కొన్ని తెగలూ తమకు తాముగా భాషా సంస్కృతులను కాచుకుంటున్నాయి.
      అమెరికాలో ఆదిమ భాషలను కాపాడటానికి జరుగుతున్న ప్రయత్నాలను అర్థంచేసుకోవడానికి ఒక్క పాఠశాలను పరిశీలిస్తే సరిపోతుంది. అది కన్సాస్‌ రాష్ట్రంలోని పౌహటన్‌లోని ‘కికపూ నేషన్‌ స్కూల్‌’. దీంతో కికపూ అనే ఆదిమజాతి తన సంస్కృతిని పరిరక్షించుకుంటోంది. ఈ పాఠశాల పిల్లలు ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు. వారి చదువుకి అయ్యే ఖర్చుని అటు బీఐఈ, ఇటు కికపూ సంఘం భరిస్తాయి.
      కికపూ పాఠశాలలో వారి భాష, సంస్కృతుల గురించి ప్రత్యేక తరగతులు ఉంటాయి. కికపూ సంస్కృతికి ప్రత్యేకమైన చేతివృత్తులను నేర్పించే శిక్షణా సాగుతోంది. పాఠశాల గ్రంథాలయంలో వారి చరిత్రకు సంబంధించిన పుస్తకాలు కనిపిస్తాయి. పాఠశాల నడవాలలో ఆదిమ జాతులకు ప్రత్యేకమైన నినాదాలు రాసి ఉంటాయి. మొత్తంగా బడిలో వాతావరణం అంతా వారి మూలాలను గుర్తు చేస్తూ ఉంటుంది. 12వ తరగతి వరకూ ఉండే ఈ బడికి అటు ప్రభుత్వమూ, ఇటు స్థానిక కికపూ తెగవారూ నిధులను అందిస్తున్నా... ఒక పూర్తిస్థాయి పాఠశాలను నడిపేందుకు అవి ఏ మూలకీ చాలడం లేదు. మరోపక్క ఈ పాఠశాలలో పనిచేసేందుకు తగిన అర్హతలు కలిగిన ఉపాధ్యాయులూ లభించడం లేదు. అయినా ఈ పాఠశాల ఏ ఏటికాయేడు ముందుకు సాగుతూనే వస్తోంది. ఎందుకంటే పాఠశాల చిన్నదా పెద్దదా అన్నది కాదు, దాని ద్వారా ఒక జాతి మనుగడకు సాయపడుతున్నామన్న తృప్తి అక్కడి ఉద్యోగులకు ఉంది. ఆ పాఠశాల తమది అన్న భావన అందులో చదివే పిల్లలకు ఉంది. అలాంటి సానుకూల దృక్పథం రాజ్యమేలుతున్నప్పుడు ఇక నిరుత్సాహానికి తావేముంది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం