తిరుమల ఉచిత పుస్తక ప్రసాదం!

  • 485 Views
  • 22Likes
  • Like
  • Article Share

    సండ్ర రుత్విక్ చౌద‌రి

  • తిరుప‌తి.
  • 8008017109
సండ్ర రుత్విక్ చౌద‌రి

అంతర్జాలంలో  తెలుగు ఈ-పుస్తకాలను ఉచితంగా చదవనిచ్చే సైట్లే తక్కువ. ఉన్న ఆ సైట్లలో కూడా పదో, ఇరవయ్యో పుస్తకాలను మాత్రమే చదువుకునే వీలుంటుంది. అలాంటిది 1166 తెలుగు పుస్తకాలను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. అన్నమయ్య, త్యాగరాజ కీర్తనల పొత్తాలతో మరెన్నో విశేష పుస్తకాలను ఈ సైట్‌ ద్వారా మన ముందుకు తెచ్చింది. 
భారతీయ
సంప్రదాయంలో సరస్వతీ పూజకు విశేష ప్రాధాన్యం ఉంది. దసరా సమయంలో చేసే సరస్వతీ పూజల్లో పుస్తకాలనూ ఉంచుతారు. ఇక వినాయకచవితి నాడు పొత్తాలకు పసుపు రాసి, ఉండ్రాలు పోయడం ఓ ఆచారం. రామాయణ, భారత, భాగవతాదులను సంపదగా భావించి, ఇళ్లలో భద్రపరచుకుంటాం. పొరపాటున పుస్తకం కాలికి తగిలినా వెంటనే దాన్ని కళ్లకు అద్దుకోవడం మన అలవాటు. ఇదంతా కూడా గ్రంథాలపట్ల మనకున్న గౌరవభావానికి అద్దంపట్టేదే. 
      భారతీయ సంస్కృతిని పెంపొందించడంలో గ్రంథాలు విశిష్టమైన స్థానాన్ని పోషించాయి. పారమాత్మిక విజ్ఞానసాధన ప్రబోధాలతో పాటు లౌకిక విజ్ఞానం కోసం కూడా పురాణాది గ్రంథాలు, శాస్త్రాలు రచించారు మన పూర్వీకులు. వాళ్ల కృషి ఫలితంగా మనకు లభించిన వివిధ పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ధార్మిక జీవనానికి, ఆధ్యాత్మిక చింతనకు మార్గదర్శకాలుగా నిలిచాయి. ఈ పొత్తాలన్నీ మానవ జీవన వికాసానికి, అభ్యుదయానికి ఉపకరించేవే. వాటిని తితిదే తరఫున ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ వస్తున్నారు. వాటితోపాటు ప్రాచీన తెలుగు కావ్యాలు, ప్రబంధాలనూ ఆయా సందర్భాల్లో ప్రచురించారు. ఇప్పుడు వాటన్నింటినీ ఈ- రూపంలోకి మార్చి తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది తిరుమల తిరుపతి దేవస్థానం.
ఇంతకీ సైటేంటంటే..!
ebooks.tirumala.org దీన్ని దేవస్థానం ప్రచురణల విభాగం నిర్వహిస్తోంది. రామాయణ, మహాభారత పొత్తాలతోపాటు బాల, వేద, పురాణ, ఇతిహాస సాహిత్యమంతటినీ ఇక్కడ పొందుపరిచారు. ఇప్పటివరకూ వాళ్లు ప్రచురించిన అన్ని పుస్తకాలనూ పి.డి.ఎఫ్‌. ప్రతులుగా మార్చారు. వాటన్నింటినీ ఈ సైట్‌లో చదువుకోవడమే కాకుండా ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, సంస్కృతం, కన్నడ భాషల్లో కూడా పుస్తకాలను ఉంచారు. అన్ని భాషల మీద కలిపి దాదాపు మూడువేలకు పైగా పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, కావ్యాలు, ప్రబంధాలు, శాస్త్ర గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సైట్‌లోకి వెళ్లాక, అక్కడ మనకు కావాల్సిన భాషను ఎంచుకోవాలి. అనంతరం శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు.. ఇలా మనకు కావాల్సిన పుస్తకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 
సాహిత్యలోకంలో...! 
ఇందులో వేదసాహిత్యంలోని బ్రహ్మసూత్ర వివృతి, గీతా కల్పవృక్షం, మంత్రపుష్ప సూక్తాలు వంటి పుస్తకాలెన్నో ఉన్నాయి. అలాగే పురాణ ఇతిహాస సాహిత్యంలో భాగంగా పోతన కవితామాధుర్యాన్ని తెలిపే మందారమకరందాల పుస్తకంతో పాటు, శ్రీమదాంధ్ర మహాభారతంలోని పర్వాల సమగ్ర సమాచారాన్ని అందించే పొత్తాలున్నాయి. కావ్య ప్రబంధాల్లోని అలివేలు మంగావిలాసం, ఆముక్తమాల్యదలో విశిష్టాద్వైత సిద్ధాంత ప్రకాశం, బాలసాహిత్యంలో అంతర్వేది లక్ష్మీ నృసింహ శతకం, శ్రీ హనుమచ్ఛతకం ఇలా అన్నింటినీ ఇక్కడ చూడొచ్చు. పంచకావ్యాల్లోని జనజీవన పరిశీలన, పాల్కురికి సోమనాథుని వీరశైవ సిద్ధాంతం, కాళిదాసుని కవితావైభవం, రాఘవేంద్ర చరితంలాంటి పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి.
ఇంకా మరిన్నో..!
ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు/ నప్పడగు తిరువేంకటాద్రీశుగంటి.... ; అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ/ నలి నిందిర నీతో నవ్వినది...
అంటూ మధురంగా సాగే అన్నమయ్య సంకీర్తన స్వర మాధురి పుస్తకాలు మనల్ని సాహితీసాగరంలో ఓలలాడిస్తాయి. శ్రేయము పుణ్యమూర్తులకు జేసిన జీవితకాల మాత్మలో / బాయని ప్రేమ జూపి కడు భాగ్యము వారలకిత్తు రెప్పుడున్‌..  మంచివాళ్లకు మనం ఏదైనా మేలు చేస్తే, వాళ్లు అది బతికినంతకాలం గుర్తుపెట్టుకుని తిరిగి మనకు మేలు చేస్తారు- ఇలాంటి నీతిని తెలిపే వేంకటేశ్వర శతక పద్యాల పుస్తకాలు కూడా ఇందులో చూడొచ్చు. ఇంకా బాలకృష్ణ నాటకం, త్యాగరాజ కీర్తనలు, శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి చరిత్ర మొదలైన పొత్తాలెన్నో ఇక్కడ దర్శనమిస్తాయి. కాశీ మాహాత్మ్యం, ఆంధ్రవచన వాఙ్మయం, తిమ్మమ్మ బుర్రకథ, విదుషీమణి వెంగమాంబ, జానకీపతి శతకం, కన్యాకుమారి యాత్ర, బంజారా చరిత్ర ఇలా అన్ని విషయాలకు సంబంధించిన పుస్తకాలూ ఓ క్లిక్‌ దూరంలో ఉన్నాయి ఇక్కడ. వీటితోపాటు తితిదే ప్రచురించే సప్తగిరి మాసపత్రికనూ అందుబాటులో ఉంచారు.
 


వెనక్కి ...

మీ అభిప్రాయం