కూన‌పులిరాయ‌ని క‌థ‌

  • 1035 Views
  • 41Likes
  • Like
  • Article Share

    కట్టా నరసింహులు

  • కైఫియ్యత్తు కతల రచయిత
  • తిరుపతి
  • 9441337542
కట్టా నరసింహులు

కడప జిల్లాలో సుప్రసిద్ధ దుర్గం గండికోట. పెన్నానది ఎర్రమల కొండల్ని చీల్చుకుని ముందుకు పోతుందిక్కడ. ఆ కారణంగా ఏర్పడ్డ గండి దగ్గర కోట నిర్మించారు. అది గండికోట అయ్యింది. కల్యాణీ చక్రవర్తుల కాలంలో ఈ జిల్లాలోని పెద్దముడియం కేంద్రంగా చిద్దనచోళ మహారాజు పాలించాడు. చక్రవర్తి ఆలోచనతో చిద్దనచోళ మహారాజు ఈ కోటను నిర్మించాడు. ఇతణ్ని కాకరాజు అని కూడా పిలుస్తారు. అచ్చం శానపురాళ్లతో నిర్మాణమైన గండికోట ప్రపంచఖ్యాతిని సంపాదించుకుంటూ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఈ కోట ఆధారంగా ఎన్నో కథలు చరిత్రకెక్కాయి. అందులో కూనపులిరాయని కథ ఒకటి.
      విజయనగర చక్రవర్తుల కింద గండికోటను రామళ్ల తిరుమలనాయడు పాలిస్తున్న కాలం. తిరుమలనాయనికి ఓ అవసరం ఏర్పడింది. ఆయనకు పులిజున్ను కావాల్సి వచ్చింది. దాన్ని సంపాదించడమంటే మాటలు కాదు. పులిపాలు కావాలి. ఆ పాలు కూడా పులి ఈని మూడు నాలుగు దినాలు మాత్రమే అయ్యుండాలి. అలాంటి పాలతోనే జున్ను తయారవుతుంది. అలాంటి పులి పిలిస్తే వస్తుందా! పులిని సమీపించాలంటేనే భయం. పైగా పులి ప్రసవించి ఉన్న సమయంలో ఏ ఇతర జంతువునూ తన పిల్లల సమీపంలోకి రానివ్వదు. అలాంటి పులిపాలు కావాలిప్పుడు. బహుశా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి అవసరమై ఉంటాయి. ఆ రోగి తిరుమలనాయని కుటుంబసభ్యుడేమో!
      తిరుమలనాయడు కొలువులో పులిజున్ను కావాలని ప్రకటించాడు. సాహసవంతులు ముందుకు రావాలని కోరాడు. కొలువులో కడితం కసినేయడు ఉన్నాడు. కసినేయడు ధైర్యసాహసాలున్న వీరుడు. తన ప్రభువు అవసరాన్ని గుర్తించి లేచి నిలబడ్డాడు. గండికోట చుట్టూ ఉన్న అడవుల్లో పులుల సంచారం గురించి ఆయనకు తెలుసు. ఎలాగైనా జున్నుపాలు సాధించి పెట్టాలనుకున్నాడు. అసాధ్యాన్ని సాధిస్తానని ముందుకు వచ్చిన కసినేయని రాజు అభినందించాడు. జున్నుపాలు సంపాదిస్తే కసినేయనికి ‘చదురు నిలువు దోపు’ ఇస్తానన్నాడు. కసినేయనికి బంగారు పళ్లెంలో తాంబూలం అందించాడు.
      నిలువుదోపు అంటే ఒంటి మీదున్న నగలు సమర్పించడం. ‘చదురు నిలువుదోపు’ అంటే నాయకుడు సభాప్రవేశం చేసేటప్పుడు ఉచితమైన ఏయే ఆభరణాలు, విలువైన ఆయుధాలు, వస్త్రాలు ధరించి ఉంటాడో వాటినన్నింటిని ఒలిచి ఇవ్వడం. జున్నుపాలు దొరికితే చాలు తిరుమలనాయడు ఎంత వెచ్చించడానికైనా వెనుదియ్యడు. రాజు దగ్గర తాంబూలం పుచ్చుకొన్నాడు. జున్నుపాలు తీసుకురావడానికి ఒప్పందం కుదిరిందనడానికిది సంకేతం. వివాహం నిశ్చయమైనప్పుడు తాంబూలాలు పుచ్చుకొంటారు కదా! అలాంటిదే ఇది. 
పులికి వాకట్టు!!
కసినేయని ఇంటిపేరు కడితం. ఈ పదానికి అర్థం.. గుడ్డకు నల్లరంగు వేసి, దాని మీద లెక్కలు రాయడం. కసినేయని పూర్వులు కోటలో కడితం రాసే ఉద్యోగం చేస్తూ ఉండి ఉంటారు. లేదా ఆయనే ప్రస్తుతం ఆ పదవిలో ఉండి ఉంటాడు.
      తాంబూలం పుచ్చుకొన్న కసినేయడు కొలువు ముగిశాక ఇంటికి వచ్చాడు. ఇచ్చివచ్చిన మాటను ఎలా నిర్వర్తించాలన్న ఆలోచనలో ఉన్నాడు.
      రాత్రి భోజనం అయింది నిద్రపట్టడం లేదు. కసినేయనికి ఓ భోగపత్ని ఉంది. ఆమెతో వివాహం ఉండదు కానీ, తనకు పుట్టిన సంతానానికి కన్నతండ్రి ఆస్తిలో భాగం ఉంటుంది. భోగపత్ని తన జీవితమంతా ఒకరితోనే కాపురం చేస్తుంది. ఇలాంటి వ్యవహారాలు ఆ కాలంలో ఉండేవి. ఆమె భోగపత్ని అనే కానీ విశేషపరిజ్ఞానం ఉన్న సబల. ఆమె ఇంటికి వెళ్లాడు. కొలువులో తాంబూలం పుచ్చుకొని వచ్చిన సమాచారం వివరించాడు. జున్నుపాలు ఎలా సాధించాలో విచారంగా ఉందన్నాడు. ‘‘ఈ మాత్రానికి విచారమెందుకు నేనున్నాగా చింతించకండి హాయిగా శయనించండి’’ అందామె.
      ఆమెకు వాకట్టు విద్య తెలుసు. గండికోట కొండలో సంచరించే పులులన్నింటికీ ఇక్కడి నుంచే వాకట్టు కట్టింది. వాయి+కట్టు వాకట్టు అవుతుంది. అంటే నోటిని బంధించడం. ఇక కొండలోని పులులు గాండ్రించవు. మీదికి రావు. పిలిస్తే పిల్లుల్లా వెంటవస్తాయి. మంత్రించిన ఇసుకను కసినేయని చేతికిచ్చింది. ఇక మీ పని సులువు అంది. మంత్రించిన ఇసుకతో ఉదయం కసినేయడు అగస్త్యమహాముని కోన ఎక్కాడు. గట్టిగా కేకవేసి పులుల్ని పిలిచాడు. అడవిలో ఉన్న పులులు, పులిపిల్లలు, మగవి, ఆడవి అన్నీ ఒక్కొక్కటి కసినేయడున్న చోటికి వచ్చి చేరాయి. కసినేయడు ముందు నడుస్తూ ఉండగా పులుల మంద అతని వెంట నడిచింది. కసినేయడు పులులతో నాగదరికోనకు వచ్చాడు. ఈ వర్తమానం తిరుమలనాయనికి చేరింది. తిరుమలనాయడు కుటుంబసభ్యులతో అక్కడికి చేరాడు. అందులో తండ్రి, అల్లుడు, కుమారులు ఉన్నారు.
      బాలెంతపులుల నుంచి పాలు పిండుకున్నారు. తిరుమలనాయని అవసరం తీరింది. కసినేయడు పులుల్ని అడవికి మళ్లించాడు. తమ తమ గుహలు చేరుకొనే దాకా పులులన్నీ పిల్లుల్లాగానే వెళ్లిపోయాయి.
      జున్నుపాలు తెస్తానన్న కసినేయడు మాట చెల్లించుకొన్నాడు. తిరుమలనాయడు ‘చదురు నిలువుదోపు’ సమర్పించాడు. గండికోట కవులు కసినేయణ్ని ‘కూనపులిరాయా’ అని కైవారం (స్తోత్రం) చేశారు.
      తిరుమలనాయడు ‘కూనపులికసినేయడు’ అని సంబోధించాడు. అప్పటి నుంచి కడితం కసినేయడు కూనపులి కసినేయడు అయ్యాడు. కడితం మరుగయ్యింది. ఇప్పటికీ ‘కూనపులి’ నిలిచింది. కూనపులివారు పట్ర కులస్థులు.
అవుకులో అద్భుతం
చదురు నిలువుదోపుతో తృప్తి చెందని తిరుమలనాయడు కసినేయనికి దేనేపల్లె గ్రామాన్ని మొఖాసాగా (జీవనానికి) ఇచ్చాడు. మరి కొంతకాలానికి దేనేపల్లె గండికోట నుంచి అవుకు సీమలోకి మారింది. కసినేయడు కూడా గండికోట కొలువు చాలించి అవుకుసీమకు వచ్చాడు. అవుకు సంస్థానం పాలిస్తున్న కుమార నారసింహరాజు కొలువులో చేరాడు. ఈ ప్రాంతం అడవిలోనూ పులుల బాధ విస్తారంగా ఉండేది. రాజు వేటకు వెళ్లేటప్పుడు కసినేయని వెంటబెట్టుకొని వెళ్లేవాడు. వేటలో ఒకనాడు పులి గాండ్రిస్తూ హఠాత్తుగా ఇద్దరి మీదకి దూకింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదురూ బెదురూ లేకుండా కసినేయడు తనచేతి పిడిబాకుతో పులిని ఎదుర్కొన్నాడు. బాకు పోట్లతోనే పులిని నేలకూల్చాడు. తనని రక్షించడమే కాక, ఆ పులిని మట్టుబెట్టిన కూనపులి వీరునికి చెరువులోపల్లె, చెన్నంపల్లె గ్రామాల కావలి ఏర్పాటు చేశాడు రాజు. ఇందుకు గానూ నూటికి అయిదు మాడలు కసినేయడికి అందుతాయి. అంతేకాక తనకు ప్రతి గ్రామంలోను ఏదుంచేను, తూమెడు మడి మాన్యంగా ఇచ్చాడు రాజు. అయిదు వందలమందికి సర్దారును చేశాడు.
మంత్రాలకు చింతకాయలు రాలవు! మరి పులులకు వాకట్టు కట్టడమేంటి? ఇది కథ.. కైఫీయత్తు కథ.. కడప జిల్లాకు సంబంధించిన మెకంజీ కైఫియత్తు ఏడో భాగంలోని కూనపులిరాయని కథ. 


బతికుంటే బలుసాకు తినొచ్చు
బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు... మొండిగా ప్రకృతి శక్తులకు ఎదురీదవద్దు అంటారు పెద్దలు. కష్టకాలమొచ్చినప్పుడు శరీరాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం. జరుగుబాటు కనాకష్టంగా ఉన్నప్పుడు కాయో కసరో తిని బతకాలి కానీ పరిస్థితులను నిందించకూడదు కదా! అసలు ఈ బలుసాకు ఎక్కడ పెరుగుతుంది! అసలు దీని ఉపయోగం ఏంటీ! అంటే పట్టణవాసులకు తెలియకపోవచ్చు కాని, పల్లెపట్టుల్లో మసలేవాళ్లకి దీని గురించి ఎరుకే. పెద్ద పెద్ద ముళ్లతో, చిన్నచిన్న ఆకులతో, నునుపైన పళ్లతో, పశుగ్రాసం కోసం వదలిపెట్టిన బీడు భూముల్లో పెరిగే పిచ్చిమొక్కగా భావించే బలుసు గొప్పదనం తక్కువేమీకాదు. బలస/ బల్స/ బొల్సు/ బోల్స అని దీనికి రూపాంతరాలు. వీటన్నింటికీ బలజ్‌ అనేది మూల రూపం. బంజరు భూముల్లో పొదగా పెరిగే ముళ్లకంచె మొక్క ఇది. పూలు పసుప్పచ్చగా ఉంటాయి. వగరుగా ఉండే ఈ బలుసు పళ్లను రేగుకాయల మాదిరిగానే తింటారు. వెనుకటి రోజుల్లో తద్దినాలకి పెట్టే వివిధ పచ్చళ్లలో ఇది ముఖ్యమైంది కూడా. ఏడాదికొకసారైనా బలుసాకు తినడం మంచిదని పెద్దల మాట. కరువు కాలాల్లో ఆకును కూరగా వండుకుని తినేవారట. కరోనా గురించి చెబుతూ ‘బతికుంటే బలుసాకు తినొచ్చు.. ఇళ్లలోంచి బయటికి రాకండి’ అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌ చేసిన అభ్యర్థనతో ఇప్పుడు ఈ సామెత.. ఆ బలుసాకు మీద అందరినీ ఆకర్షిస్తోంది.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం