మసిపూసి మారేడుకాయ చేసినట్టు

  • 292 Views
  • 7Likes
  • Like
  • Article Share

మసిపూసి మారేడుకాయ చేసినట్టు
‘మారేడుకాయ’కి ఎన్నో ఔషధ గుణాలున్నాయి. మారెడు ఆకుల్ని శివుని పూజలో ఉపయోగించడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం. ‘మసిపూసి’ అంటే బూడిదని పూయడం. మారేడు కాయ బూడిద రంగులో ఉంటుంది కాబట్టి వేరే ఏ కాయకో కాస్త మసిపూసేసి.. అదే మారేడుకాయ అని చెప్పే ఘనులూ ఉంటారు. అసలు విషయాన్ని దాచేసి.. దానికి ఇంకేదో రంగు అద్ది ఎదుటివాళ్లను బురిడీ కొట్టించే వాళ్ల గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు.


ఉంటే ఉట్ల పండుగ లేకుంటే లొట్ల పండుగ
గోకులాష్టమి నాడు జరిగే ఉత్సవాన్ని ఉట్టి తిరుణాల అంటారు. నునుపైన స్తంభానికి చివర రూకల సంచిని కడతారు. ఎక్కి తీసుకోగలిగినవాడిదే ఆ సొత్తు. అది అంత సులువైన వ్యవహారం కాదు. ప్రయత్నం చేసేవారినందరినీ వసంతపు నీళ్లు చల్లి నిరోధిస్తుంటారు. ఉట్టి కొడితే రూకలు చేతిలో పడ్డట్టే. అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డట్టు. అలా ఇది కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలిపే జాతీయంగా స్థిరపడింది. లొట్టి అంటే శూన్యం, ఏమీలేని తనం. జరుగుబాటు ఉన్నప్పుడు ఉట్ల పండగ అనీ, ఈసురోమని ఉన్నప్పుడు లొట్ల పండగ అని తెలంగాణలో వ్యవహరిస్తారు.


రేవు
దిగడానికి ఏర్పరచిన దారి. ఘట్టం అని కూడా పిలుస్తారు. విడిది, స్థానం, స్థిరం.. నిఘంటువు రూపాలు. ఇరవు అనేది రేవుకు పూర్వరూపం. తమిళంలో ఇరు అంటే ఉండుట. ఇరుప్పు అంటే స్థానం, నివాసం అనే అర్థాలుంటే కన్నడంలో అస్తిత్వం, ఆశ్రయం అనే అర్థచ్ఛాయలు కనిపిస్తున్నాయి. మలయాళంలో ఇరిప్పు అంటే నివాస స్థలం.


తడిసి మోపెడగు
మోపెడవ్వడం అంటే అధికం కావడం, సమస్యలు ఎక్కువ కావడం అని సామాన్యార్థాలున్నాయి. గడ్డిమోపుల్లాంటివి తడిచినప్పుడు బరువు ఎక్కువవు తాయి. ఉన్న సమస్యకు తోడు మరిన్ని సమస్యలు జతపడిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఇంటి అద్దె ఒక సమస్య అయితే విద్యుత్తు, నీళ్లబిల్లు, కిరాణా..  ఇలా ప్రతినెలా ఉండే ఈ ఖర్చులన్నిటికీ అదనంగా మరిన్ని ఖర్చులు ఒక్కసారే వచ్చిపడటాన్ని ఈసారి ఇంటి ఖర్చు తడిసి మోపెడయ్యింది అనడం పరిపాటి.


కొంప
‘కోంపట’ అనే కన్నడ పదం దీనికి మూలం. గుడిసె, పాక అని అర్థమున్న ఈ పదం నేడు అర్థ విస్తృతిని పొందింది. ‘‘దోసెడు కొంపలో పసుల త్రొక్కిడి’’ అనే శ్రీనాథుడి ప్రయోగంలో కొంప అంటే ఇల్లు అనే అర్థం. ‘కొంపకు ముప్పు, కొంపదీయు, కొంపపీకు, కొంపముంచు, కొంపల కొరివి, కొంపలంటుకొను, కొంపాగోడూ’ లాంటి జాతీయాలు, పదబంధాలు వాడుకలో ఉన్నాయి. ‘హంపీకి పోయేదాని కంటే కొంపలో ఉండేది మేలు’ అనే సామెత కూడా ఉంది.


పొలి
గింజల్ని దులిపి, ధాన్యం రాశులుగా పోసి, రాశిచుట్టూ గీత గీస్తారు. దీన్ని పొలి అంటారు. ధాన్య సమృద్ధిని పొలి అనీ, దాని కోసం పూజించే దేవుణ్ని పోలిగాడు అంటారు. అనంతపురం ప్రాంతంలో ధాన్యం కొలవడానికి ముందు పొలంలో ధాన్యం రాశులచుట్టూ జిల్లేడాకు చేతపట్టుకుని మూడు ప్రదక్షిణలు చేస్తారు. దీనికే పొలితిరగడమని పేరు.


ఊదరగొట్టు
ఊదర అంటే ఎలుకలు, పందికొక్కుల కలుగులోనికి ఒక ద్వారం గుండా గడ్డిపొగ ఊది ఊపిరాడకుండా చంపే పద్ధతి. గోదావరి ప్రాంతాల్లో దీనికి మరో అర్థబేధం కనిపిస్తుంది. అరటిగెలలను ఒక గదిలో పేర్చి వాటిమీద ఎండుగడ్డి కప్పి ఆపైన బందపూసి, ఉదయం సాయంకాలాల్లో ఓ గంట ఒట్టిగడ్డికి నిప్పంటించి, మంట రాకుండా పొగ వచ్చేటట్లు చేస్తారు. ఆ పొగకు రెండు రోజుల తర్వాత గెలలు మగ్గుతాయి. దీన్నే చిత్తూరు మాండలికంలో గాలికొట్టు అంటారు. నేటి వ్యవహారంలో ఊదరగొట్టడం అంటే చెప్పిందే చెప్పడం, వెళ్లగొట్టడం, తిట్టడం.. 
అనే అర్థచ్ఛాయలు కనిపిస్తాయి.


తెలుగు - తెనుగు
తెలుగు- తెనుగు రూపాంతరాలే కానీ, భిన్న ధాతుజాలు కావు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల భాషలో ‘న- ల’కు మారుగా ‘ల- న’లు వినిపిస్తాయి. మనగ- ములగ, చెనగు- చెలగు, మునుకోల- ములుకోల, జన్మం- జల్మం, లేదు - నేదు, లాగు- నాగు తదితరాలు దీనికి ఉదాహరణలు. తెలుగు త్రిలింగ శబ్దభవం కాదు. దేశ్యమైన తెనుగు రూపాంతరం. ఈ రెండు రూపాలూ ప్రాచీన కాలం నుంచీ ఉన్నాయని భాషాశాస్త్రం చెబుతోంది.


చెప్పుకోండి చూద్దాం!
కుండనిండా ఉండ్రాళ్లు
కుండకు తాళం
గుడినిండా ముత్యాలు
గుడికి తాళం 

ఈ రెండు పొడుపుకథలకి విడుపు వెలగపండు, 
దానిమ్మపండు. ఈ రెండు పళ్లూ దాదాపు గుండ్రంగానే ఉంటాయి. రెండింటిలోనూ విత్తనాలుంటాయి. వెలగ విత్తనాలు మోటుగా, గట్టిగా ఉండ్రాళ్ల పాయసంలోని వాటిలా ఉంటాయి. దానిమ్మగింజలు ముత్యాల్లా గోపురం ఆకారంలో ఇమిడి ఉంటాయి. ఈ పొడుపు కథ గురించి పి.యశోదారెడ్డి తన ‘గోడమీద బొమ్మ’ రచనలో వివరించారు.


మామూలు
‘మామూల్‌’ అనే ఉర్దూ పదం నుంచి పుట్టింది. ఏ ప్రత్యేకతా లేని, విశిష్టం కాని విషయం గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని ప్రయోగిస్తారు. నేడు ఉద్యోగులకు చిన్న మొత్తాలుగా ఇచ్చే లంచంగానూ వ్యవహరిస్తున్నారు. పండగలు, పర్వాలప్పుడు మామూలు పేరుతో ధనాన్ని పోగేసుకునే వారూ ఉన్నారు.


దింపుడుకళ్లమాశ
నిరాశస్థితిలో చేసే చివరి ప్రయత్నం. మృతదేహాన్ని కాటికి తీసుకెళ్లేటప్పుడు శ్మశానానికి ముందు కొంత దూరాన జీవి మళ్లీ బతుకుతాడేమో అనే ఆశతో దించి మళ్లీ ఎత్తుకుంటారు. ఇలాంటి చరమదశలో చేసే ప్రయత్నాన్నే దింపుడుకళ్లమాశ అనడం పరిపాటి.వెనక్కి ...

మీ అభిప్రాయం