నవలావనంలో తొలినాళ్ల వెన్నెల

  • 407 Views
  • 4Likes
  • Like
  • Article Share

    వై.హెచ్‌.కె.మోహన్‌రావు

  • పిడుగురాళ్ల, గుంటూరు జిల్లా.
  • 9440154114
వై.హెచ్‌.కె.మోహన్‌రావు

తెలుగులో తొలి నవల ఏది? ఈ ప్రశ్నకు చాలా వరకు వచ్చే సమాధానం కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్రము’. అయితే, దీనికి ఆరేళ్ల ముందే ‘శ్రీ రంగరాజ చరిత్ర’ నవల వెలువరించారు నరహరి గోపాలకృష్ణమసెట్టి. డిప్యూటీ కలెక్టరుగా పనిచేసిన ఈయన స్వతంత్ర ఇతివృత్తంతో, రాయలసీమ మాండలిక పదాలను విరివిగా ప్రయోగిస్తూ, సంఘ సంస్కరణాభిలాషతో ఈ రచన చేశారు.
సమకాలీన
సామాజిక పరిస్థితులను, అప్పటి జీవన విధానాన్ని సమగ్రంగా చిత్రించే సాహితీ ప్రక్రియ నవల. రచయిత విస్తృత జీవితానుభవాలు ఇందులో దర్శనమిస్తాయి. తెలుగులో తొలి నవలగా కందుకూరి ‘రాజశేఖర చరిత్రము’నే చాలా మంది గుర్తిస్తూ వచ్చారు. దీని గురించి పలు వాదాలూ జరిగాయి. అయితే, ప్రతి సందర్భంలోనూ తొలి తెలుగు నవల కందుకూరిది కాదని స్పష్టమవుతూ వచ్చింది.
      ‘‘గోపాలకృష్ణమ సెట్టి నేర్పుకొలదీ 1872లో ఒక గ్రంథం రాశారు. అదే తెలుగులో మొట్టమొదటి నవల’’ అని ఆరుద్ర తన ‘సమగ్రాంధ్ర సాహిత్యంలో’ అన్నారు. ఇందులోనే ‘‘కాలక్రమాన్ని బట్టి రాజశేఖర చరిత్రను రెండో నవలగా చెప్పాలి, కానీ దానికి వచ్చిన పొగడ్తలు, అనుకరణలు మొదలైన వాటిని బట్టి చూస్తే ఇదే తెలుగు సాహిత్యంలో వచ్చిన ప్రప్రథమ నవల అనే భ్రమ కలుగుతుంది’’ అనీ పేర్కొన్నారాయన. కొక్కొండ వెంకటరత్నం పంతులు ‘మహాశ్వేత’ కూడా తొలి తెలుగు నవల అనే వివాదం కొంతకాలం నడిచింది. అయితే ‘మహాశ్వేత’ను 1876లో వచ్చిన అసంపూర్ణ రచనగా విమర్శకులు తేల్చారు. ‘శ్రీరంగరాజ చరిత్ర’ వచ్చిన ఆరేళ్ల తర్వాత 1878లో కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్రము’ వెలువడింది. నరహరి నవల ప్రపంచంలోని ఏ ఇతర రచనలకు అనువాదంగానీ, అనుకరణగానీ కాదు. ఇది స్వీయసృజన. కందుకూరి నవల ఆంగ్ల రచయిత అలివర్‌ గోల్డ్‌స్మిత్‌ ‘వికార్‌ ఆఫ్‌ ది వేక్‌ఫీల్డ్‌’కు అనుకరణ. పైగా నరహరి రచన వచ్చే సమయానికి తెలుగులో ‘నవల’ అనే పదం వాడుకలో లేదు. అందువల్ల ‘శ్రీరంగరాజ చరిత్ర’ను ‘నవీన వచన ప్రబంధం’గా పేర్కొన్నారు. దీనికే ‘సోనాభాయి పరిణయం’ అనే పేరూ ఉంది.
సంస్కరణాభిలాష
పందొమ్మిదో శతాబ్ది ద్వితీయార్ధంలో ‘చింతామణి’ పత్రిక నవలల పోటీని నిర్వహించింది. నవలా రచన మనదేశానికి, మన భాషకీ కొత్త ప్రక్రియ కాబట్టి ఈ పోటీలో పాల్గొనేవారు ఇంగ్లీషు నవలల్ని, ఇంగ్లీషు భాషా పరిశ్రమ లేనివారైతే ‘శ్రీరంగరాజ చరిత్రము’ వచన ప్రబంధాన్ని మార్గదర్శకంగా చేసుకోవచ్చని ఈ సందర్భంగా సలహా ఇచ్చింది. 1893లో ‘చింతామణి’ పత్రిక నవలా పోటీలో ఖండవల్లి రామచంద్రుడి ‘ధర్మవతీ విలాసము’ ప్రథమ బహుమతి అందుకుంది. దీని రచనలో రామచంద్రుడు ‘శ్రీరంగరాజ చరిత్ర’ను అనుసరించినట్లు పరిశోధకులు, నాటి న్యాయనిర్ణేతలు గుర్తించారు. మచిలీపట్నం నుంచి వెలువడిన ‘పురుషార్థప్రదాయిని’ అనే సారస్వత పత్రిక 1872లోనే ‘శ్రీరంగరాజ చరిత్ర’ను మొదటి నవలగా పేర్కొంటూ ఈ రచన సులభమైన, శ్రావ్యమైన భాష కలిగిందిగా ప్రకటించింది. అంతేకాదు, తొలి తెలుగు నవలగా ‘శ్రీరంగరాజ చరిత్ర’ను గుర్తిస్తూ బ్రిటిష్‌ పాలకులు గెజిట్‌ కూడా ఇచ్చారు. ఫోర్ట్‌ ఎస్‌.టి.జార్జ్‌ సప్లిమెంటు 1872 జులై, ఆగష్టు, సెప్టెంబర్‌ మూడో త్రైమాసిక గెజిట్‌లో ‘తెలుగు నవలా ప్రయత్నంలో శ్రీరంగరాజ చరిత్ర ప్రప్రథమమ’ని వెల్లడించారు. 
      ‘శ్రీరంగరాజ చరిత్ర’లో నరహరి గోపాల కృష్ణమసెట్టి రాయలసీమ మాండలికాలను ఎక్కువగా ప్రయోగించారు. ముఖ్యంగా పందొమ్మిదో శతాబ్దానికి చెందిన నరహరి 21వ శతాబ్ది సామాజిక పరిస్థితులకనుగుణంగా నవలలో కథాంశాన్ని నడిపించడం విశేషం. సాంఘిక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకోవడంలో ఆయన ఆధునిక దృష్టి అవగతమవుతుంది. గిరిజనుల జీవనశైలిని ఆవిష్కరించిన తీరు అబ్బురపరుస్తుంది. కథలో భాగంగా మూరురాయ గండర్‌ రాజుకు వేశ్యతో వివాహం జరిపించడాన్ని బట్టి రచయిత సంస్కరణాభిలాషను అర్థం చేసుకోవచ్చు. వేశ్యా సంతానానికి కూడా రాజాస్థానంలో సమున్నత గౌరవం కల్పించడం ద్వారా వర్ణభేదాలకు స్వస్తి పలకాలనే సందేశం అందించారు నరహరి గోపాలకృష్ణమ సెట్టి. 1872లో లార్డ్‌ మేయో ప్రకటించిన నవలా పోటీల్లో ‘శ్రీరంగరాజ చరిత్ర’ బహుమతి గెలుచుకుంది. ఈ నవలను నంద్యాల సమీపంలోని గని గ్రామస్థులు, ప్రముఖ పండితులు శేషకవి పద్యకావ్యంగా మలచి నరహరికి అంకితమిచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగిగా..
సమకాలీన సాహితీవేత్తలకు మార్గదర్శిగా స్వతంత్ర ఇతివృత్తంతో నవలను రచించడమే కాకుండా జిల్లా సమాచారాన్ని కూడా గ్రంథస్థం చేశారు నరహరి. ‘కర్నూలు జిల్లా భూగోళం, ఎ మాన్యువల్‌ ఆఫ్‌ ది కర్నూల్‌ డిస్ట్రిక్ట్‌’ శీర్షికలతో రెండు రచనలు చేశారాయన. నరహరికి ప్రఖ్యాత పండితులు పరవస్తు చిన్నయసూరి అత్యంత సన్నిహితులు. పరవస్తుతో కలిసి ‘మాన్యువల్‌ ఆఫ్‌ హిందూ లా’ అనే ఆంగ్ల రచనను ‘హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము’ పేరుతో 1858లో ఆంధ్రీకరించారు. పరవస్తు చిన్నయసూరి బాలవ్యాకరణానికి ప్రభావితులైన నరహరి ‘ఆంధ్ర వ్యాకరణము’ అనే మరో రచన కూడా చేశారు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి 1888 ఏప్రిల్‌ 25న కీర్తిశేషులయ్యారు. 
      తెన్ను రంగయ్య, వెంకటలక్మి దంపతులకు జన్మించిన నరహరి గోపాల కృష్ణమ సెట్టి, మద్రాసు ప్రెసిడెన్సీలో కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టరుగా పనిచేశారు. ఆయన తల్లిదండ్రులూ కుంఫినీ ప్రభుత్వంలో ఉద్యోగులే. నరహరి కుమారుడు రాణామణిసెట్టి కవి, రచయిత. తండ్రి మరణానంతరం కర్నూలు వదలి విజయనగర పాలకుడు ఆనంద గజపతి ఆస్థానాన్ని చేరారు. 1895లో నరహరి జీవితం భూమికగా ‘గోపాలకృష్ణమూర్తి శతకం’ తదితర రచనలు చేశారు. నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగానికి ముందే స్వతంత్ర ఇతివృత్తంతో, సంఘ సంస్కరణాభిలాషతో నవలా రచన సాగించిన అభ్యుదయ కేతనం నరహరి గోపాలకృష్ణమ సెట్టి. అయితే, 1866లో తడకమళ్ల వేంకట కృష్ణారావు రాసిన ‘కంబుకంధర చరిత్ర’లో తొలి తెలుగు నవలా మూలాలున్నట్లు ఇటీవల పరిశోధకులు గుర్తించారు. అయినప్పటికీ తొలితరం నవలా రచయితగా, అనువాదకుడిగా, పరిశోధకుడిగా విభిన్న కోణాల్లో నరహరి సాగించిన అక్షర కృషి తెలుగు సాహితీ చరిత్రలో చెరిగిపోనిది.


వెనక్కి ...

మీ అభిప్రాయం