కో అంటే మేలుకో! లోకాన్ని తెలుసుకో!!

  • 561 Views
  • 15Likes
  • Like
  • Article Share

    సాహితీ స్రవంతి

తెలిసినవాటి నుంచి తెలియనివాటి కోసం చేసే అన్వేషణే పాటలోకి ప్రయాణించడమంటే! భావాలు చెదిరిపోకుండా స్వరాలు సడలిపోకుండా పాఠకుడి మదిలో చైతన్యదీప్తిని రగిలించగల పాటలన్నీ జీవితానుభవం నుంచే పురుడుపోసుకుంటాయి. ఆలోచించగల శక్తి, ప్రతిఘటించగల యుక్తి, సామాజిక స్ఫూర్తి ఉన్నవారెవరికైనా పాటల్లో జాతి మూలాలు, చారిత్రక యథార్థ తత్వాలు కనిపిస్తాయి. కో అంటే కోయిలమ్మ కోకో! కో అంటే కోడిపుంజు కొక్కొరొకో! అనే పాట ఈ కోవకే చెందుతుంది. 
నాలుగక్షరాలు
నేర్చిన తర్వాత నాలుగు పుస్తకాలు చదవాలనిపిస్తుంది. తీరా చదివిన తర్వాత ఈ సమాజం ఇంకా ఇలా ఎందుకుందీ! అనే చింతన మొదలవుతుంది. సామాజిక మార్పుకోసం, సమసమాజం కోసం ఆరాటపడటం కేవలం మేధావులు చేసే పని అనుకుంటే పొరపాటే. గురజాడనూ, వేమననూ బడిలో పాఠాలుగా చదువుకుని గ్రామంలో పొడసూపే అనైతికతను ప్రశ్నించడం నేర్చుకున్న రామకోటి అనే భావుకుడి సలక్షణ భావాలకు నిలువుటద్దం ఈ పాట. 1979లో వచ్చిన ‘తూర్పు వెళ్లే రైలు’ చిత్రంలోని ఈ పాటను జాలాది రాయగా ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం స్వరకల్పన చేసి ఆయనే ఆలపించారు. ఈ పాటంతా పంటను నేపథ్యంగా చేసుకుని సాగుతుంది.
      చీకటీ చీకటీ పారిపో.. ఊరంతా వెలుతురూ నిండిపో.. అంటూ మూఢత్వమూ, మూర్ఖత్వమూ లేని పల్లెని కలగన్న ఆ కుర్రాడికి తాను అల్లిన పదాలూ, పాటల వల్ల ఊరినుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. పూజారి, షావుకార్ల అనైతిక కార్యకలాపాలను ఎండగడుతూ పాడే ఆ పాటలను చూసి చివరికి తండ్రి కూడా ఈసడించుకుంటాడు. ‘‘నాకెలాగూ లేదని నిన్ను చదివిస్తే నువ్వేమో పదాలు పాడుకుంటూ తిరుగుతుంటే తినడానికి కూడెలా వస్తుందిరా! నాలుగు డబ్బులు తెస్తేనే గానీ మెతుకులు పెట్టేవాడు కాదు మా బాబు! పని నేర్చుకోరా! కాస్త చేతిసాయం చేయరా!’’ అని ఆ తండ్రి ప్రాధేయపడినా, కులవృత్తి తప్ప ఏదైనా చేస్తానంటూ ఎదురు తిరుగుతాడు ఆ కుర్రాడు. వాడికొక వ్యాపకం ఉంటే దారిలోపడతాడని ఎవరో చెబితే ఊరి మోతుబరితో మాట్లాడి జొన్నచేను కాపలాకి పంపిస్తాడా తండ్రి.
      పంటచేను కాపలా అంటే ఒక్కచోటనే పడుండటం కాదు. నిద్రమానుకుని పొలమంతా తిరుగుతూ ఉండాలి. కాపలా కాస్తున్నాడే కానీ పదునెక్కుతున్న భావాలు ఉబికుబికి వస్తుంటే అణచివేయడం వీలుపడలేదా కుర్రాడికి. చేతికర్ర తిప్పుకుంటూ జొన్నకంకులను సరిచూసుకుంటూ ఇలా గొంతు సవరిస్తాడు.
కో అంటే కోయిలమ్మ కో కో
కో అంటే కోడిపుంజు కొక్కొరొకో
కొండమీద కో అంటే చుక్కలన్ని కోసుకో
నేలమీద కో అంటే పండింది కోసుకో! 

      ఒకప్పుడు దున్నేవాడిదే భూమి. కాయకష్టమొక్కటే మనిషి సొంత ఆస్తి. అయితే, పండించుకు తినే స్థితి ఉన్నా సేద్యానికి ఎన్నో సవాళ్లు! నాగలెత్తుకున్నోడికి లెక్కలేనన్ని గడ్డు పరిస్థితులు నేడు. దేశంలో డెభై అయిదు శాతం మంది ఇంకా భూమిని నమ్ముకునే బతుకుతున్నారు. అయినా అన్నపు రాశులొకచోట, ఆకలి కేకలొకచోట. ఈ దుర్భర బతుకుచిత్రం కళ్ల ముందు నుంచి తొలగిపోయే కాలం కనిపించడంలేదు.
కోటేరు పట్టినోడికో పూటకూడు  దక్కదెందుకో
నారు నీరు పోసినోడికో సేరు గింజలుండవెందుకో
అన్నముండదొకడికీ తిన్నదరగదొకడికీ
ఆశ చావదొకడికీ ఆకలారదొకడికీ..!

      కష్టపడేవాడికి కూడెందుకు దొరకడంలేదనే ప్రశ్న ముందు నుంచీ సవాలు విసురుతూనే ఉంది. శ్రామిక కోణం నుంచి అర్థంచేసుకుంటే శ్రమదోపిడీయే దీనికి కారణం. భూమి ఒకడిదైతే, పండించేది మరొకడు. ఫలితం మాత్రం చెమటోడ్చినవాడి చేతిలో పడటం లేదు. పని చేయనివాడికి తినేహక్కులేదు అనే గాంధీసూక్తులు పదే పదే వల్లించే కర్మభూమిలో చీమకు పంచదార పాముకు పాలు పుష్కలంగా దొరుకుతాయి కానీ, జాషువా అన్నట్టు పేదవాడి శూన్యమైన పాత్రలోకి అన్నం మెతుకు పుట్టదు.
మేడిపండు మేలిమెందుకో పొట్టవిప్పి గుట్టు తెల్సుకో
చీమలల్లె కూడబెట్టుకో పాములొస్తే కర్రపట్టుకో!

      గింజ విలువ చీమకీ అటు తర్వాత రైతుకే ఎరుక! చల్లిన గింజలు ఒకటికి పదింతలై ధాన్యపు రాశి వృద్ధి చెందాలి. అలా కూడబెట్టుకున్నదాన్ని అక్కరకొచ్చేలా చూసుకోవడం చీమను చూసి నేర్చుకోవాల్సిన గొప్పలక్షణం. సంపాదించుకోవడమే కాదు కూడబెట్టుకున్నదాన్ని కాపాడుకోవడం కూడా అవసరమే. దళారులూ, దోపిడీవర్గాల చేతుల్లో పడిపోకుండా కాయకష్టాన్ని గుప్పెటపట్టి కాచుకోమనే హెచ్చరిక ఇది. 
కో అంటే మేలుకో! లోకాన్ని తెలుసుకో! 
వేమన్న వేదాలు చెబుతాను రాసుకో! 
కష్టజీవులకి మారుతున్న కాల పరిస్థితుల మీద అంత లోచూపు ఉండదు. ముందు నుంచీ జీవన తాత్వికతకు ఆలంబనగా నిలిచే వేమన, పోతులూరి లాంటి వారి నుంచి స్ఫూర్తి పొందుతుంటారు. లోకం పోకడకి తగ్గట్టు లౌక్యంగా బతకడం నేర్చుకుంటే దోపిడీ నుంచి కొంత ఉపశమనం పొందొచ్చని ఈ చరణం చెబుతుంది.
తూరుపింటి అంకాలమ్మ కో కో
పటమటింటి పోలేరమ్మ కొక్కొ కో
దక్షిణాన గంగాలమ్మ కో కో
ఉత్తరాన నూకాలమ్మ కొక్కొ కో
కో అంటే కోటిమంది అమ్మతల్లులున్నా
పంటచేను కాపలాకి నేను ఎందుకో!

      ఊరి పొలిమేరల దగ్గరా, పొలాల సరిహద్దుల దగ్గరా, చెరువు కట్టల దగ్గరా గ్రామదేవతలకి జాతరలు జరపడం పల్లెల్లో ఆనవాయితీ. ఊరి బాగోగులను పట్టించుకోవడం, పాడిపంటలను కాచుకుని ఉండటం కోసమే కదా ఇవన్నీ. ఇటువంటి కాపలాదేవతలు ఒకరా ఇద్దరా, ముప్పదిమూడు కోట్లదేవతల సువిశాల దేవతాగణం ఉంది. సింధూ ప్రజల ప్రధాన ఆరాధ్య దైవం అమ్మతల్లి. అమ్మతల్లి అంటే ప్రకృతి దేవత. చరిత్ర మూలాల్లోకి వెళితే ఆహార సేకరణ నుంచి ఆహారోత్పత్తికి మారిన క్రమంలో అమ్మతల్లిని ఆరాధించడం ఆహార సేకరణలో సహాయపడమని దేవతకు చేసే క్రతువు. అమ్మతల్లిని పూజిస్తే ప్రకృతి అనుకూలించడమే కాదు ఎటువంటి అడ్డంకులు లేకుండా పంట చేతికొస్తుందనే జానపదుల విశ్వాసం ఈనాటికీ బలీయంగా ఉండిపోయింది. ఈ ఆచారాన్ని స్మరణకు తెస్తూ... కో అంటే పలికే కోటిమంది అమ్మతల్లులున్నప్పుడు ఇక పంçచేను కాపలాకి నా అవసరం ఏముంటుందీ! అని ప్రశ్నించడంలో హేతువు మాత్రమే కాదు నైతిక ఆలోచనను కూడా ఎరుకలోకి తెచ్చుకోమని హెచ్చరిస్తుంది ఈ పాట.


వెనక్కి ...

మీ అభిప్రాయం