మూడు తరాల ఉద్యమకారుడు

  • 97 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। ఉదారి నారాయణ

  • ఆదిలాబాదు
  • 9441413666
డా।। ఉదారి నారాయణ

ఓ కవిగా ఒక్కపాటతోనే ఆచంద్రతారార్కమైన కీర్తి ప్రతిష్ఠలు గడించినవారు చాలా అరుదు. ఆ గొప్పతనం ఆ పాటలో ఉంది కాబట్టి జనం గుండెల్ని రగిలించింది... నాలుకల మీద నర్తించింది. ఆ పాటే ‘ఊరు మనదిరా! ఈ వాడ మనదిరా’! ఇంత గొప్పపాటను రాసి, తెలుగు సాహిత్యానికి విలువైన కానుకగా ఇచ్చి ఈ మధ్యనే మననుంచి వెళ్లిపోయిన ప్రజా వాగ్గేయకారుడు గూడ అంజయ్య.
అంజన్నా!
అని అందరూ ప్రేమగా పిలుచుకునే గూడ అంజయ్య పుట్టి పెరిగింది ఆదిలాబాదు జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపురం. నిరుపేద దళిత కుటుంబం... నర్సమ్మ, నర్సయ్యలకు నవంబర్‌ 1, 1954న పుట్టాడు. చిన్నప్పటినుంచే ఆ ఊరి దొరలు పెట్టే చిత్రహింసలు కళ్లారా చూశాడు. పిల్లలకు బుక్కెడు బువ్వ వెతికే క్రమంలో తల్లిదండ్రులు పడ్డ కష్టాల్ని చూసి కన్నీరు మున్నీరయ్యాడు. అందుకే ఇతని పాటల్లో కష్టాలు, కన్నీళ్లు, ధిక్కారం, తిరుగుబాటు ధోరణులు స్పష్టంగా కనపడతాయి.
      అంజయ్య హైదరాబాదులో ఫార్మసీ కోర్సు చేశాడు. అప్పుడే విప్లవోద్యమాల విద్యార్థిసంఘాల్లో పనిచేస్తూ, చెరబండరాజు పాటలతో ఉత్తేజితుడై తన కలాన్ని, గళాన్ని సానబెట్టుకున్నాడు. ఒకరోజు వాళ్ల ఊరి రైతును ‘ఎటువోతున్నవే’ అని అడిగితే ‘ఊరిడిసి నేబోదునా ఉరివోసుకొని సత్తునా’ అన్నాడట. 1971లో అవే మాటల్ని పాటగా అల్లి రైతుల దీనస్థితిని వర్ణించాడు. కన్నతల్లి లాంటి ఊరును విడిచి రైతులు ఎందుకు వలసవెళ్తున్నారో ఆ పాటంతా మన కళ్ల ముందుంచుతుంది. అదే అంజయ్య మొదటి పాట. 1972లో నల్లగొండ జిల్లా పలివెలలో రైతుకూలి సభలో ‘ఊరు మనదిరా... ఈ వాడ మనదిరా’ అన్న పాటను రాసి పాడాడు. సభ చప్పట్లతో మారుమోగింది. అరుణోదయ సాంస్కృతిక వ్యవస్థాపకుల్లో ఇతను ఒకరు కావడంవల్ల ఆ పాట అనతి కాలంలోనే దేశమంతా పాకిపోయింది. దక్షిణాఫ్రికా, రష్యా తదితర దేశాలకూ వెళ్లిపోయింది. 16 భాషల్లోకి అనువాదమైంది. అంతవరకు ఊరు మనదిరా అంటే మనది గాకుంటే ఇంకెవరిది అనే జనానికి ఎట్లా మనది? ఎందుకు మనది? అని ఈ పాట వివరించి చెప్పింది. ‘సుత్తెమనది, కత్తిమనది, పలుగుమనది, పార మనది... సావుకాడ మనమే... సన్నాయికాడ మనమే’ అంటూ అప్పుడే దళిత ఈస్తటిక్‌ సెన్సును చూపించాడు అంజయ్య.
భద్రం కొడుకో...
ఉద్యమాలు వేడెక్కడం వల్ల ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వం అంజయ్యను దాదాపు రెండేళ్లు జైల్లో పెట్టింది. అక్కడే తన పాటల పాదాలకు నడక నేర్పాడు. పాదాలను తన పొత్తిళ్లలో లాలించి పాటలుగా మలుచు కున్నాడు. జైలునుంచి విడుదలైనా ఇతణ్ని నిర్బంధం వెంటాడుతూనే ఉంది. డిప్లొమా పూర్తిచేసి తిరిగి తన తల్లి ఒడి ఆదిలాబాదు చేరుకున్నాడు. ఫార్మసిస్టుగా ప్రభుత్వ ఉద్యోగం మొదలుపెట్టాడు. హేమానళినిని పెళ్లిచేసుకుని సామాన్య జీవితం గడుపుతూ, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాడు. ఇంద్రవెల్లి కాల్పులు అక్కడి సాహితీ వాతావరణాన్ని వేడెక్కించాయి. అప్పుడే వసంతరావు దేశ్‌పాండే ‘అడవి’, అల్లం రాజయ్య, సాహుల ‘కొమురం భీం’ నవలలు వెలువడ్డాయి. బి.నర్సింగ్‌రావు దర్శకత్వంలో ‘రంగులకల’ సినిమా వచ్చింది. దాన్లో అంజయ్య రాసిన ‘భద్రం కొడుకో... జర పదిలం కొడుకో’ అనే పాటను గద్దర్‌ పాడారు. పొట్టచేత పట్టుకొని పట్టణానికి వలసపోయే జనానికి పట్నంలో పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించాడు. అంజయ్యది వినసొంపైన గాత్రం. అయినా ఇతని పాటల్ని గద్దర్, ఇతర గాయకులు ఎక్కువగా పాడారు.
      అటవీ ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ గిరిజనుల స్థితిగతులను అధ్యయనం చేశాడు అంజయ్య. గిరిజనేతరులు, భూస్వాముల దోపిడీని పసిగట్టాడు. రేల పూతల్లోంచి పాటల పాదాలకు అలంకారాల్ని అద్దుకున్నాడు. గోరువంకలు, రామచిలుకల్లోంచి స్వరాలను, సెలయేళ్ల నుంచి లయల్ని సమకూర్చుకున్నాడు. అందుకే ఓ పాటలో ఎన్‌కౌంటర్‌లో మరణించిన తన బిడ్డకోసం ఆ తల్లి అడవిలో వెతుకుతున్నప్పుడు ‘పాలపిట్ట ల్లారా/ పైడికంటెల్లారా/ రామచిలుకల్లారా/ గోరువంకల్లారా/ మీరైన జెప్పుండ్రి/ నా నెలవంక ఏమైనడే/ నా పసికూన యాడున్నడే’ అని సహజంగా వర్ణించాడు.
దరిద్రులంతా దళితులేరా!
1984 కారంచేడు ఘటనతో అంజయ్య  దృష్టి కుల సమస్యవైపు మళ్లింది. సభలు సమావేశాల్లో అంబేద్కరిజం గురించి మాటలు, పాటలు వినిపించేవాడు. అయినా అతడు సమావేశాలలో ఎక్కువగా ‘ఊరు మనదిరా’, ‘అసలేటి వానల్లో ముసలెడ్లు కట్టుకుని’ పాటలనే పాడేవాడు. ‘అసలేటి వానల్లో’ పాటను నల్లగొండ రైతు పొలం దున్నుతున్నప్పుడు చూసి రాశాడు. 
      1990 ప్రాంతంలో ఉట్నూరులో స్థిరపడ్డ అంజయ్య ఇల్లు సాహితీ సమావేశాలకు, చర్చలకు వేదికైంది. అప్పట్లో చుండూరు సంఘటన దళితులను కుదిపేసింది. అంజయ్య తీవ్రంగా స్పందించాడు. 1992లో ‘రచయితలారా, కవులారా మీరెటువైపు’ అని సవాల్‌ విసిరాడు. బి.ఎస్‌.రాములు, పి.సి.రాములు, డి.ఎల్‌.రవీంద్ర, మడిపల్లి భద్రయ్య, ఉదారి, చందనగిరి దేవయ్య తదితరులతో ‘దళిత రచయితలు, కళాకా రులు, మేధావుల ఐక్యవేదిక’ స్థాపించాడు. ‘స్వేచ్ఛ’ అనే కవితా సంకలనాన్ని వెలువరించాడు. ‘దళితులనగా ఎవరురా/ ధరణిలో దరిద్రులంతా దళితులేరా సోదరా’ అంటూ దళిత సాహిత్యానికి నిర్వచనం చెప్పాడు. పరిష్కారాన్ని చూపించాడు. అప్పటినుంచే తెలుగు రాష్ట్రాల్లో దళిత సాహిత్య ఉద్యమం ఉప్పెనలా ఎగిసిపడ్డది. అంతలో అంజయ్య నలుగురు కూతుళ్లలో నవిత అనే పదేళ్ల పాప హఠాత్తుగా చనిపోయింది. బిడ్డ మరణాన్ని తట్టుకోలేక ‘నున్నంగా తలదువ్వి/ సన్ననేత చొక్క తొడిగి/ సందువెంట పోతువుంటేరో/ నా కొడుకో బంగారు తండ్రి/ నువ్వు    గవర్నరువు అనుకొంటిని’; ‘ఓ కొండల్లారా, కోనల్లారా/ ఓ కొమ్మల్లారా, రెమ్మల్లారా/ మీ సాక్షిగా చెప్పుండ్రి నా నెలవంక ఏమైనడే... నా పసికూన ఏమైనడే’ అన్న పాటలను రాసుకున్నాడు. వీటిని కొంచెం మార్చి సినిమావాళ్లు తీసుకున్నారంటారు.
ఎత్తర తెలంగాణ జెండ
అనుకోని సంఘటనలు ఎన్నో తన బతుకును కుదిపేసినా వెంటనే తేరుకొని తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరికంటా జీవించాడు. ఎంత నిర్బంధంలోనైనా ఒక కన్నును కాపలా ఉంచుతూ మరో కన్నుతో ప్రజాసాహిత్యం సృష్టించాడు. అతని మాటల్లోని అద్భుతశక్తిని, పాటల్లోని సూటిదనాన్ని చూసి సినిమా వాళ్లు అంజయ్య పాటల్ని తీసుకున్నారు. ఇదే క్రమంలో 1997లో అతను హైదరాబాదుకు మకాం మార్చాడు. దాదాపు 20 సినిమాలకు పాటలందించాడు.
అంజయ్య 1978లోనే ‘నా తెలంగాణ/ నా తెలంగాణ / అనాదిగా అరుణారుణ వీరులకిది ఖజానా’ అన్నాడు. ‘ఉత్తర తెలంగాణలో’ అనే రెండు పాటలు రాసి తన అభిప్రాయాన్ని ప్రకటించాడు. 1995లో తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటానికి సాహిత్యాన్ని అందించాడు. మలిదశ ఉద్యమంలో 2003లో ‘పాట కవుల వేదిక’  ఏర్పాటుచేశాడు. ధూంధాం స్థాపనలో  కీలకపాత్ర పోషించాడు. ‘పుడితే ఒకటి సత్తె రెండు రాజిగ ఓ రాజిగా/ ఎత్తర తెలంగాణ జెండ’, ‘అయ్యోనివా నువ్వు/ అవ్వోనివా/ తెలంగాణోనికి నువ్వు పాలోనివా’ అంటూ ఉత్తేజాన్ని ఇచ్చే పాటలు రాసి ఉద్యమానికి ఊపిరయ్యాడు.
అక్షరమే ఆరోప్రాణం
పాటల్లో ఇమడని వస్తువుల్ని కథలు, నవలలుగా మలిచాడు అంజయ్య. వాటి లోనూ పీడితుల, దళితుల బతుకుల్ని చిత్రీకరించాడు. పొలిమేర, పొద్దుపొడుపు, దళిత పాటలు, కథలు, మేలుకో మహిళా నాటిక లాంటివి ఇలా వెలువడ్డవే. విప్లవ భావాలతో వర్గపోరాట పాటలు రాసి, దళితోద్యమ భావాలతో దళిత గీతాలు రాసి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో అస్తిత్వ పోరాట పాటలు రాసి మూడు తరాల ఉద్యమాలకు వారధిగా నిలిచాడు. కానీ ఎన్నడూ సిద్ధాంతాలను స్వార్థం కోసం వాడుకోలేదు. రెండేళ్లుగా పక్షవాతంతో కాలు, చెయ్యి పడిపోయినా అతని సాహిత్య తపన తగ్గలేదు. ఇటీవల అంజన్నను కలిసినపుడు ‘నారాయణా... రాసే చెయ్యిపడిపోయింది. రాయకుండా ఉండలేకపోతున్నా... ఎడమచేతితో పలకమీద అక్షరాలు దిద్దుకుంటున్నా’ అని ఆవేదన చెందాడు.
      అంజన్న తాను మరణించేదాకా ఎన్నో ఆటుపోట్లను అవమానాలను భరించాడు, సహించాడు. చివరికి రాష్ట్ర సాధనలో అంజయ్య సాహితీ కృషిని గుర్తించి గౌరవంతో తెలంగాణ ప్రభుత్వం ఇతనికి ప్రజాకవిగా ప్రతిభా పురస్కారాన్నిచ్చింది. సుద్దాల అశోక్‌తేజ ‘సుద్దాల హన్మంతు జీవిత సాఫల్య పురస్కారం’ ఇచ్చి గౌరవించారు.   
      ప్రజా ఉద్యమాలకు జీవనాడి లాంటివాడు అంజయ్య. ఉద్యమం జయిస్తుందనే నమ్మకంతో బతికాడు. తెలంగాణ రాష్ట్ర సాధనను కళ్లారా చూశాడు. ‘నమ్మకం బతుకుపైన  ఆశను పెంచుతుంది. ఆశయం గమ్యాన్ని ఛేదిస్తుంది’. ఈ ప్రజాకవి కలం, గళం కోరుకున్నవి అవే


వెనక్కి ...

మీ అభిప్రాయం