తెలుగునాట కృష్ణమ్మతో అనుబంధం పెంచుకున్నవారిలో పాశ్చాత్యులకూ కొదువలేదు. క్రీ.శ. ఏడో శతాబ్దికి చెందిన హ్యుయెన్‌త్సాంగ్ మొదలు ఎందరో విదేశీయులు కృష్ణాతీరాన్ని సందర్శించారు. వాళ్లలో చాలామంది తెలుగుభాషకు, ప్రజలకు విశేష సేవలందించారు.
దేశంలోనే నాలుగో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం కృష్ణదే. అతి ప్రాచీన కాలంనుంచి ఈ నదిలోయ నాగరికతలకు ప్రసిద్ధి. ఆర్య ద్రావిడ భాషా సంస్కృతుల మేళవింపునకు ప్రధాన కూడలి. భారతదేశంలోనే అతి ప్రాచీన ఆస్ట్రో ఆసియా జనజాతులైన చెంచులు, యానాదులు, నెహాలీలు సంచరించిన ప్రాంతం. కృష్ణాతీరం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, సుసంపన్నమైన సామ్రాజ్యాలకు నెలవు. శాతవాహన, ఇక్ష్వాకు, పల్లవ, చాళుక్య, కాకతీయ, విజయనగర రాజవంశాలు ఏలిన చోటు. వాశిష్ఠీ పుత్ర పులుమావి వేయించిన నాణేల మీద తెరచాపలు ఉన్న ఓడలు ఆనాటి వారి సముద్రాధిపత్యానికి గుర్తు. అమరావతి నిర్మాణ శైలి ఆగ్నేయాసియా అంతటా విస్తరించడానికి ఇదే ప్రధాన కారణం. ఆనాటి ఆంధ్రదేశంలో కృష్ణాతీరంలో పేరుపొందిన అమరావతి, విజయవాడ, కౌతరం, పాండురంగం (బందరు) ఊళ్ల పేర్లతోనే ఏర్పడిన నాలుగు పట్టణాలే ఆనాటి చంపా దేశంలోని (ప్రస్తుత వియత్నాం) తీరపట్టణాలైన అమరావతి (ఖువఙ్్గ నమ్), విజయ (బిన్ డిన్), కౌతర (న్హ త్రఙ్్గ), పండరంగ (ఫన్ రఙ్్గ). క్రీ.శ. 6- 7 శతాబ్దాల మధ్య చైనా నుంచి భారత యాత్రికుడిగా వచ్చిన బౌద్ధ గురువు హ్యుయెన్‌త్సాంగ్ తన పర్యటనలో ధాన్యకటకాన్ని ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. దీనికి కారణం బహుముఖ ప్రజ్ఞావంతుడైన ఆచార్య నాగార్జునుడి జన్మస్థలాన్ని సందర్శించాలన్న కోరికే.
వెనిస్ యాత్రికుడు నికోలో ది కోంటి 1420- 21లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. ఇక్కడ ప్రముఖంగా వినపడుతున్న తెలుగును అజంత భాషగా గుర్తించాడు. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అన్నాడు. పోర్చుగీసు యాత్రికులైన దువార్తే బార్బోస, దోమింగో పేయెస్, ఫెర్నావో న్యూనిజ్ తదితరులూ విజయనగర ప్రజల జీవన విధానాన్నీ, భాషా సంస్కృతులనూ వర్ణించారు. వీరి వర్ణనలు ఆనాటి కృష్ణాతీర నాగరికతకూ, చారిత్రక అధ్యయనానికీ అతి విలువైనవి.
వాళ్లతోనే మొదలు
మాతృభాషను పట్టించుకోని దశలో నేడు మనం ఉన్నాం. కానీ, ఎంతోమంది పాశ్చాత్యులు కృష్ణాతీరంలో నివసించి, తెలుగుభాషను నేర్చుకున్నారు. తెలుగు వ్యాకరణాలను రచించి, నిఘంటువులను కూర్చారు. అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. తెలుగులోకి వచ్చిన ఎలాంటి గ్రంథమైనా, మన భాషకు కొత్త మెరుగులనూ, జవసత్వాలనూ అందిస్తుంది. ముద్రణకు అనుకూలంగా తెలుగును మలచడం వీళ్లతోనే మొదలైంది. ఇంగ్లీషు- తెలుగు నిఘంటువులనూ వ్యాకరణాలనూ, మతగ్రంథాలైన కొత్త నిబంధననూ, పాత నిబంధననూ, మొత్తం బైబిలునూ అనువదించారు. ఓ ఫ్రెంచ్ మిషన్‌వారు పదిహేడో శతాబ్దారంభంలోనే తెలుగు నిఘంటువును కూర్చారు. డేనిష్ మిషన్కి చెందిన బెంజమిన్ షుల్జ్ 1727కే తెలుగులో కొత్త నిబంధన, 1732కి పాత నిబంధన అనువాదం పూర్తిచేశాడు. ‘ఏ గ్రామర్ ఆఫ్ ద తెలుగు లాంగ్వేజ్’ పేరిట తెలుగు వ్యాకరణాన్ని తయారుచేశారు. కానీ, ఇవేవీ ఈ మధ్యవరకూ ముద్రణకు నోచుకోలేదు. షుల్జ్ తర్వాత చాలామంది బైబిల్ అనువాదానికి కృషిచేశారు. అలా 1818లో కొత్త నిబంధన ప్రచురితమైంది. 1854లో పాత నిబంధనను ముద్రించారు. చివరికి అన్ని సవరణలతో పూర్తి బైబిలు 1860లో జారీ అయింది.
1869- 1888 మధ్య సామర్లకోట, ఒంగోలుల్లో నివసించిన జాన్ మెక్లారిన్ అనే కెనడా మిషనరీ దంపతులు బైబిలు అనువాదంతోపాటు, 16 తెలుగు వ్యాఖ్యానాలనూ రచించారు. తెలుగు పత్రికను నడిపారు. సామర్లకోటలో పుట్టిన వీళ్ల అబ్బాయి జాన్‌బేట్స్ మెక్లారిన్ కూడా మన భాషకు ఎంతో సేవచేశాడు. 1808-65 మధ్యన జీవించిన రాబర్ట్ థుర్లింగ్టన్ నోబుల్ 1841లో మచిలీపట్నం వచ్చాడు. చనిపోయే వరకూ ఇక్కడే నివసించాడు. బందరు నోబుల్ కళాశాల ఈయనే ప్రారంభించిందే. 1879 ప్రాంతంలో ఉక్రేనియాకు చెందిన హోమియో వైద్యురాలైన శెబెస్తా పౌలు కృష్ణాతీరానికి వచ్చారు. తెలుగు నేర్చుకుని, తన జీవితమంతా ఇక్కడే వైద్యసేవలు అందించారు. క్రిస్టియన్ ఫ్రెడరిక్ హెయర్ 1842లో గుంటూరులో అమెరికన్ లూథరన్ చర్చిని స్థాపించారు. దీనికి అనుబంధంగా నాలుగు దశాబ్దాల తర్వాత ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఏర్పాటైంది. దేశంలోని అతి పురాతనమైన ఆధునిక కళాశాలల్లో ఇదీ ఒకటి.
ప్రాతఃస్మరణీయులు
ఈస్టిండియా కంపెనీ అధికారులుగా ఇక్కడి వచ్చిన ఎంతోమంది తెలుగుకు చాలా సేవచేశారు. వారిలో ఒకరు సర్వేయర్ జనరల్‌గా పనిచేసిన కల్నల్ కాలిన్ మెకంజీ. ప్రపంచ చరిత్రలోనే ఒక దేశ సంపూర్ణ చరిత్రకు కావాల్సిన సాధన సామగ్రిని సమకూర్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి. 1783లో ముప్ఫై ఏళ్ల ప్రాయంలో భారతదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాడు. దక్షిణ భారతదేశంలో పలు ప్రాంతాల సర్వేలో భాగంగా మెకంజీ పెద్దసంఖ్యలో రాతప్రతులను సేకరించాడు. తద్వారా కృష్ణాతీర ప్రాంత చరిత్రకు ఆధారాలైన కైఫియత్తులు, శాసనాలు, పట్టాలు, గ్రంథాలను అనువదించి ముందు తరాలకు అందించారు. ఆయన 1798లో అమరావతిని సందర్శించాడు. 1816- 20 మధ్య అమరావతికి సంబంధించి విస్తృత సర్వే జరిపించాడు. సుమారు 85 చిత్రపటాలను గీయించి, 135 శిల్పఖండాలను సేకరించి భద్రపరిచాడు.
తెలుగుభాషకు ఆంగ్లంలో వ్యాకరణం రాసిన వ్యక్తుల్లో ఏడీ కాంబెల్ ముఖ్యుడు. 1816లో ఆయన ప్రకటించిన తెలుగు వ్యాకరణాన్ని ‘ఎ గ్రామర్ ఆఫ్ ద తెలుగూ లాంగ్వేజ్ కామన్లీ టెర్మడ్ ద జెంటూ’ అని పేర్కొన్నాడు. మచిలీపట్నంలో జిల్లా జడ్జీగా పనిచేసిన ఎలిస్ ఫ్రాన్సిస్ వైట్ అనే బ్రిటిష్ అధికారి తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, సంస్కృత భాషలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. కాంబెల్ ప్రకటించిన తెలుగు వ్యాకరణానికి రాసిన పరిచయ వాక్యంలో ద్రావిడ భాషా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. తెలుగు తదితర దక్షిణాది భాషలు సంస్కృత ప్రాకృత జన్యం కావని, ప్రత్యేకమైన భాషా కుటుంబానికి చెందినవని నిరూపించాడు. ఈ దక్షిణ భారత భాషా కుటుంబానికే రాబర్ట్ కాల్డ్వెల్ (ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం రచయిత) ‘ద్రావిడ’ భాషా కుటుంబం అని పేరు పెట్టాడు. ఇది భారత చరిత్రలో ఓ మైలురాయి. దక్షిణ భారత ప్రజలు తమకంటూ ఓ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక గుర్తింపునూ, చైతన్యాన్నీ పొందేందుకు ఈ ద్రావిడ పదమే అంది వచ్చింది.
బ్రౌన్... ఎనలేని సేవ!
ఇక ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ పేరు తెలుగువారి చరిత్రలో స్థిరంగా నిలిచిపోతుంది. ఆయన కడపకు డిప్యూటీ కలెక్టరుగా పనిచేశాడు. అయితే బందరుకు బదిలీ అయిన తర్వాతే తెలుగు మీద ప్రత్యేకాభిమానాన్ని పెంచుకున్నాడు. ఈ సమయంలోనే వేమన పద్యాల మీద ప్రత్యేకాభిమానంతో వాటి సేకరణా పరిష్కరణా ప్రచురణా చేపట్టాడు. 1832- 33 మధ్య వచ్చిన గుంటూరు కరవు కోరల్లో చిక్కిన ప్రజలకు విశేష సేవలందించాడు. ఇంగ్లీషు, తెలుగు, పార్శీ భాషల అనువాదకుడుగా, మద్రాసు పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా పలు ఉన్నత పదవులు నిర్వహించాడు. విద్యాసంఘ సభ్యునిగా విద్యారంగానికి ఎనలేని సేవలు అందించాడు. తెలుగు- ఇంగ్లీషు, ఇంగ్లీషు- తెలుగు నిఘంటువులను రూపొందించాడు. ఆంధ్ర మహాభారతం, భాగవతాలను పరిష్కరణలతో పునర్ముద్రించాడు. మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు భాషాచార్యుడిగా విధులను నిర్వహించాడు. ప్రాచీన కావ్యాలను అధ్యయనం చేసి, వాటిపై తన అభిప్రాయాలను విపులంగా వివరిస్తూ వ్యాఖ్యానాలను రాయించాడు. వీటన్నింటికీ సొంత సొమ్మునే వెచ్చించాడు. ఇక విజయనగర సామ్రాజ్య చరిత్రను వెలికితీసిన ఘనత రాబర్ట్ స్యూయల్ది.
ఇంగ్లండులో పుట్టి, మనదేశంలో మరణించిన విలియం కేరీ, ‘ఎ గ్రామర్ ఆఫ్ ద తెలింగా లాంగ్వేజ్’ పేరిట వ్యాకరణం ప్రచురించాడు. ‘తెలుగు శ్రేష్ఠమైనదీ, సాహిత్య సృజనకు అనుకూలమైనది’ అని చెప్పాడు. భాషా నిపుణుడైన మోరిస్ హెన్రీ 1860లో బ్రిటిష్‌వారి కోసం సరళీకరించిన తెలుగు వ్యాకరణాన్ని ప్రచురించాడు. ఎ.హెచ్. ఆర్డెన్ 1873లో ‘ఎ ప్రోగ్రెసివ్ గ్రామర్ ఆఫ్ ద తెలుగు లాంగ్వేజ్’ పేరిట ఇప్పటివరకూ విదేశీయులు ప్రకటించిన వ్యాకరణాల కంటే భిన్నమైన వ్యాకరణాన్ని కొంత విపులంగా రచించాడు. అదెన్నో ముద్రణలు పొందింది. లండన్‌లో జన్మించిన జాన్ పీటర్ లుసియస్ గ్విన్ 1940లో మద్రాస్ సివిల్ సర్వీసులో చేరి 1967 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగుభాష మీద ఉన్న అభిమానంతో గ్విన్ ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ అధికారిగా పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తితో కలిసి తెలుగుభాషకు ఓ సమగ్ర ఆధునిక వ్యాకరణాన్ని సమకూర్చారు. ఆచార్య జె.వెంకటేశ్వర శాస్త్రి సాయంతో తెలుగు- ఇంగ్లీషు నిఘంటువును రూపొందించారు. ఇలా ఎంతోమంది విదేశీయులు మనకు సేవలందించారు. తెలుగునూ, తెలుగువారి చరిత్రనూ ప్రపంచపటం మీద చూపించే వారి ప్రయత్నం ప్రశంసనీయం.