ఆ మంత్రం వందేమాతరం

  • 299 Views
  • 6Likes
  • Like
  • Article Share

    డా।। రంకిరెడ్డి రామమోహనరావు

  • సహాయ ఆచార్యులు, తెలుగుశాఖ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం,
  • రాజమండ్రి.
  • 9908794689
డా।। రంకిరెడ్డి రామమోహనరావు

భారతదేశ చరిత్రలో మహోజ్వల స్ఫూర్తిదాయక ఘట్టం జాతీయోద్యమం. 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం విఫలమైన తర్వాత బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది. దీన్ని సహించని ఆంగ్లపాలకులు భారతీయుల మధ్య విషబీజాలు నాటేందుకు విభజించి పాలించేందుకు సిద్ధపడ్డారు. ఆ కుటిలత్వంలో భాగంగా 1905లో బెంగాల్‌ను విభజించారు. దాంతో దేశమంతా వందేమాతరం నినాదంతో మార్మోగిపోయింది. 
      ఈ వందేమాతర ఉద్యమం ప్రభావం తెలుగు సాహిత్యం మీద కూడా పడింది. ఆ క్రమంలో స్వదేశీ వస్తు వినియోగం, జాతీయ సమైక్యత, పరిశ్రమల స్థాపన, మాతృభాషలకు ఆదరణ లాంటి విషయాలు ప్రధానంగా, స్వరాజ్య సాధన లక్ష్యంగా ముట్నూరి వేంకటసుబ్బారాయుడు, మంగిపూడి వేంకటశర్మ కలిసి ‘వందేమాతరం’ కావ్యాన్ని రచించారు. అది 1907లో ప్రచురితమైంది. తెలుగులో వచ్చిన స్వాతంత్య్రోద్యమ రచనల్లో ఇదే మొదటిది. 
      మంగిపూడి రచనలు వందకుపైగా లభిస్తున్నాయి. ముట్నూరివి మూడు రచనలు... అదీ మంగిపూడితో కలిసి మాత్రమే లభిస్తున్నాయి. వందేమాతరం పుస్తకం ముఖచిత్రం మీద రచయితలుగా ఇద్దరి పేర్లు ఉన్నాయి. ముట్నూరి మీదున్న గౌరవంతో శర్మ ఆయన పేరును మొదటిస్థానంలో ఉంచారే తప్ప, కావ్య కర్తృత్వంలో సింహభాగం మంగిపూడిదే. 144 పద్యాలున్న ఈ కావ్యంలో ఏడు పద్యాలు మాత్రమే ముట్నూరివి.
స్వదేశీ గానం
మంగిపూడి జీవితచరిత్రను కోగంటి దుర్గామల్లికార్జునరావు రెండు సంపుటాలుగా రాశారు. 1949లో ప్రచురితమైన రెండో సంపుటంలో ‘వందేమాతరం’ శీర్షికతో కొన్ని పద్యాలు రాసి దినపత్రికల్లో ప్రచురించినట్లు పేర్కొన్నారు. ఇవి వందేమాతరం ఉద్యమం తొలినాళ్లలోనే ప్రచురితమయ్యాయని స్పష్టం చేశారు. వందేమాతరం పద్యాలు పుస్తకరూపంలో రావడానికి ముందే ఏలూరులో విద్యార్థులకు, చాటపర్రులో మాగంటి సీతయ్యవంటి ప్రముఖులకు వినిపించారు మంగిపూడి. ఏలూరు మంజువాణి ముద్రాక్షరశాల యజమాని నందిరాజు చలపతిరావు ఈ కావ్యాన్ని పూర్తిగా చదివి, సీతయ్య ఆదేశం మేరకు అచ్చొత్తించారు. ఆ సమయంలోనే నందిగామలో జరిగిన కృష్ణా, గోదావరి జిల్లాల మహాసభల్లో శర్మ ‘వందేమాతరం’ చదివి వినిపించారు. మొదటిరోజు సాయంకాలానికి 300 పుస్తకాలు అమ్ముడయ్యాయి. కావ్యమంతా దేశభక్తితో, స్వాతంత్య్ర కాంక్షతో, ఉద్యమస్ఫూర్తితో నిండిపోయింది. వందేమాతరం నినాదాన్ని...
దేశాభిమానంబు దీపింపఁజేయు 
     మంత్రంబు వందేమాతరంబు సుండు
సాహసౌదార్యముల్‌ సమకూరఁజేయు 
     యంత్రంబు వందేమాతరంబు సుండు
స్వాతంత్య్రభాగ్యంబుఁ జేతికందిచ్చు 
     తంత్రంబు వందేమాతరంబు సుండు
ఐకమత్యాధిక శ్రీకులఁబేయు
     తంత్రంబు వందేమాతరంబు సుండు
హిందుజనులార! వాచాఫణీంద్రులార! 
నీతిపరులార! స్వాతంత్య్ర నిరతులార!
మన మనోరథములుఁ దీర్చి మనుచునట్టి 
బ్రహ్మ మరయ వందేమాతరంబు సుండు!

      అని శ్లాఘిస్తూ కావ్యారంభం చేశారు. తర్వాత మూడు శ్లోకాల్లో భారతమాతను స్తుతించారు. ఈ శ్లోకాలు రాసింది మంగిపూడి. వందేమాతరం, భరతమాత స్తవం, దేశాభిమానం, స్వదేశవస్తు ప్రోత్సాహం లాంటి 15 శీర్షికల కింద ఈ కావ్య రచన సాగింది. 1907 నుంచి 1947లో స్వతంత్రం వచ్చేదాక చేయాల్సిన కార్యాచరణ ప్రణాళిక వీటిలో ఉంది. ఇంకా వందేమాతర ఉద్యమం నుంచి 1947 దాకా చరిత్ర పుటల్లో చోటుచేసుకున్న పరిణామాలన్నింటికి సంబంధించిన సూచనలు ఈ కావ్యంలో కనిపిస్తాయి. ఎంతైనా కవి క్రాంతదర్శి కదా!
      భారతదేశం ముడుచుకుపోయిన పద్మంలా కాంతివిహీనమైపోయిందంటారు ఓ పద్యంలో. ఇందులో ఆలంకారిక ఔచిత్యం కనిపిస్తుంది. ఇంకా భారతీయుల్లో చిత్తశుద్ధి లోపించింది, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవాళ్లు కనిపించడం అరుదైపోయింది, ఆంగ్లేయుల పుణ్యమా అని మన జీవితాలు తలకిందులయ్యాయి, భారతీయులు స్వదేశంలోనే పరాయి వాళ్లయ్యారు... ఇలా ఆనాటి భారతాన్ని దర్శింపజేస్తుంది ‘వందేమాతరం’. స్వదేశీ విషయంలో భారతీయులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారంటారు. వస్త్రాల్ని ఎక్కడో ఇంగ్లండులో ఉన్న మాంచెష్టరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారంటూ ‘ధరియించునట్టి వస్త్రములు మాన్చెష్టరు పట్టణంబున నుండి పంపవలసె...’ అని నాటి భారతీయుల దైన్యాన్ని వర్ణించారు. విదేశీ భాషల మీద మోజుతో మాతృభాషలపట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న కావ్యకర్తల ఆవేదన వెనక కనిపించేది దేశభాషల్ని కాపాడుకోవాలన్న ఆత్రుతే. ఇది ఇప్పటి సమాజానికి ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలని నినదించిన వాళ్లే, చాటుగా వాటిని ఆదరిస్తున్న క్రమాన్ని నిరసించారు. భారతీయుల మధ్య ఐక్యతను కోరుకుంటూ, నిరంతరం కలహాలకు దిగితే స్వాతంత్య్రం రావడం కష్టమని హెచ్చరించారు.
కాలానికంటే ముందు
ఏ ఉద్యమమైనా ఏకోన్ముఖంగా, లక్ష్యం దిశగా సాగేందుకు జనబలమే కాదు, మహోన్నత వ్యక్తిత్వం ఉన్న నాయకుడూ ఉండాల్సిందే. లేకపోతే ఉద్యమానికి దారీతెన్నూ ఉండదు. అందుకే 1907నాటికే బహుముఖాలుగా సాగుతున్న స్వరాజ్య సమరాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఓ మహానాయకుడు రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిందీ కావ్యం. అప్పటికైతే అతనెవరో తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ వస్తాడు, వచ్చితీరతాడు, స్వతంత్రం తెస్తాడన్నది వందేమాతరం కావ్యం ఆకాంక్ష. ఈ అంశాన్ని గమనిస్తే గాంధీజీ స్వాతంత్య్రోద్యమంలోకి వచ్చిన పరిస్థితుల్ని గుర్తుచేస్తుంది. 
      నాటి భారతజాతి ఏకైక లక్ష్యం స్వతంత్రం సాధించడం. దీనికోసం భారతీయులు చేయాల్సిన పనుల్ని కూడా ఈ కావ్యం సూచించింది. భారతీయులు దేశభాషల్లో వచ్చే వార్తాపత్రికల్ని చదివి చైతన్యవంతులు కావాలి. ఊరూరూ తిరిగి దేశాభిమానం గురించి ప్రచారం చేయాలి అనడం చూస్తే కావ్యకర్తల దూరదృష్టిని అంచనా వేయవచ్చు. ఇంకా భారతీయులు రకరకాల యంత్రాలు, సాధనాల గురించి తెలుసుకోవడానికి పరదేశాలకు వెళ్తున్నారు. ఎంతో డబ్బు ఖర్చుపెట్టి స్వదేశంలోనే పరిశ్రమల్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పడం ఈ కావ్యం ప్రత్యేకత. ఇది ఇప్పటి భారత్‌లో తయారీ నినాదాన్ని గుర్తుచేస్తుంది. 
      దిశలు మారుమోగేలా దేశమంతా ధ్వనిస్తున్న వందేమాతరాన్ని తొలికోడి కూతగా అభివర్ణించి, తర్వాత జరిగేది స్వాతంత్య్ర భానూదయమే అనడంలో కావ్యకర్తల ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. స్వరాజ్య సమరంలో విదేశీవస్తు బహిష్కరణ, స్వదేశీవస్తువుల వాడకం అన్న రెండు అంశాల్ని ఉద్యమనాయకులు విధిగా పాటించారు. ఆ మార్గాన్ని అందిపుచ్చు కోవాలంటూ... ‘ప్రపంచంలో ఏ దేశంలో చూసినా భారతీయ వస్తువులే ఉండాలి.  ఎక్కడ చూసినా భారతీయుల కీర్తిపతాకాలు ఎగురుతూ ఉండాలి’ అని లక్ష్యనిర్దేశం చేస్తుంది ‘వందేమాతరం’ కావ్యం.  
      ఇలా తెలుగువాళ్లలో జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించడమే కాకుండా, ఉద్యమ నిర్మాణం ఎలా జరగాలో చెప్పారు కావ్యకర్తలు. దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధిని కాంక్షిస్తూ సాగిన ఈ కావ్యాన్ని మంగళ మహాశ్రీవృత్తంతో ముగించారు. మొత్తానికి ఆంగ్లేయుల పాలననుంచి భారతదేశానికి తప్పకుండా స్వతంత్రం లభిస్తుందన్న ఆకాంక్ష ఇందులో కనిపిస్తుంది. మొత్తమ్మీద స్వాతంత్య్రం కోసం అక్షర శంఖారావం పూరించిన తొలి తెలుగు కావ్యం ఈ ‘వందేమాతరం’.


వెనక్కి ...

మీ అభిప్రాయం