ఆయమ్మ పుత్రిక... తెలుగు పత్రిక

  • 36 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। కప్పగంతు రామకృష్ణ

  • తెలుగు అధ్యాపకులు
  • విజయవాడ
  • 9032044115
డా।। కప్పగంతు రామకృష్ణ

పత్రికొక్కటున్న పదివేల సైన్యమ్ము,
పత్రికొక్కటున్న మిత్ర కోటి
ప్రజలకు రక్ష లేదు పత్రిక లేకున్న
వాస్తవమ్ము నార్లవారి మాట

      అవును... పత్రిక సమాజానికి ప్రతిబింబం. మెరుగైన సమాజానికి దారిచూపే కాగడా కూడా. తెలుగునాట అలాంటి పత్రికలకు ప్రాణంపోసిన ఘనత కృష్ణాతీరానిదే. సామాజిక చైతన్యాన్ని రగుల్చుతూ ఈ పత్రికలు అందించిన స్ఫూర్తి విభిన్న రంగాల్లో వెలుగుపూలను వికసింపజేసింది. తెలుగు పత్రికా రంగానికే పుట్టినిల్లయిన మన కృష్ణవేణీ పరివాహక ప్రాంతానికి అక్షర నీరాజనమిది.
తొలి తెలుగు
దినపత్రిక ‘దేశాభిమాని’ నుంచి ఆనాటి మేటి పత్రిక ‘కృష్ణాపత్రిక’ వరకూ ఎన్నో దినపత్రికలు కృష్ణమ్మ ఒడ్డునే పురుడు పోసుకున్నాయి. వాటితోపాటు వందలసంఖ్యలో వార, పక్ష, మాస పత్రికలు కూడా కృష్ణాతీరంలోనే ఆవిర్భవించాయి. సుసంపన్న వ్యవసాయ క్షేత్రం కావటం... ముద్రణ, రవాణాకు సంబంధించిన వనరులు ఎక్కువగా ఉండటం... అన్నింటికీ మించి స్థానికంగా విద్యాధికులు ఎక్కువగా ఉండటం, రాజకీయ చైతన్యానికి వేదిక కావడంతో కృష్ణాతీరం పత్రికారంగానికి పురుడుపోసింది. 
      తెలుగులో పత్రికా రచనకు బలమైన పునాదులు వేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఆయన 1874లో ప్రారంభించిన ‘వివేకవర్ధిని’ పత్రిక అప్పట్లో సమాజ చైతన్యానికి ఊపిరులూదింది. అయితే, కందుకూరి కన్నా ముందుగానే మద్రాసు, బళ్లారి, రాజమండ్రి, మచిలీపట్నం తదితర ప్రాంతాల నుంచి కొన్ని పత్రికలు వెలువడ్డాయి. ముఖ్యంగా మచిలీపట్నం నుంచి ఉమారంగనాయకులు 1872లో ‘పురుషార్థ ప్రదాయిని’, ‘దైవ సమాజం’ అనే పత్రికలు నడిపారు. అదే సమయంలో మచిలీపట్నం నుంచే ద్వైతం కోటేశ్వరశర్మ సంపాదకత్వంలో ‘స్వధర్మ ప్రకాశిని’ పత్రిక వెలువడింది.
      ‘వివేకవర్ధిని’కి ముందుతరం పత్రికలు పాతికకు మించి లేవు. తర్వాత కందుకూరి అందించిన స్ఫూర్తితో తెలుగులో వెలువడ్డ పత్రికల సంఖ్య వంద దాటింది. వీరేశలింగం కాలంలోనే కృష్ణాతీరం నుంచీ ఎన్నో పత్రికలు వెలువడ్డాయి. బెజవాడ నుంచి వేల్పుల జార్జి 1880 ప్రాంతంలో ‘తెలుగు బాప్టిస్టు’ మాసపత్రిక, అదే సమయంలో మచిలీపట్నం నుంచి దాసు శ్రీరాములు ‘అనల్పజల్పితా కల్పవల్లి’ మాసపత్రిక తెచ్చారు. ఇక ‘సుజన మనోరంజని’, ‘రాజహంస’ పత్రికలు 1884 నాటివి. వీటి ప్రచురణకర్త కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన గుడ్లవల్లేటి పేర్రాజు. దాదాపు ఇదే సమయంలో మహబూబ్‌నగర్‌ నుంచి ‘సేద్యచంద్రిక’ పత్రిక వచ్చేది. ఇది పూర్తి వ్యవసాయ పత్రిక. పత్రికా రంగం వేళ్లూనుకుంటున్న ఆ దశలోనే అన్నదాతలకోసం ప్రత్యేకంగా ఓ పత్రిక రావడం విశేషమే! అయితే... ఈ పత్రికలన్నీ వార, పక్ష, మాసపత్రికలే కానీ దినపత్రికలు కావు.
విజయవాడలో తొలి దినపత్రిక
తెలుగులో తొలి పత్రిక ఏదనే విషయంలో వాదోపవాదాలు ఉన్నాయి. కానీ, తొలి తెలుగు దినపత్రిక ‘దేశాభిమాని’ అనే విషయంలో మాత్రం సందేహం లేదు. దేవగుప్తం శేషాచలపతిరావు దీనికి వ్యవస్థాపకుడు. బెజవాడ నుంచి ‘కృష్ణావృత్తాంతిని, కృష్ణా న్యూస్‌’ పేర్లతో కొంతకాలం వెలువడిన ఈ పత్రిక అనంతర కాలంలో దినపత్రికగా మారింది. ‘తెలుగు పత్రికలు’ శీర్షికతో ‘కృష్ణాపత్రిక’ మార్చి, 1906 సంచికలో ఓ వ్యాసం రాశారు చెన్నాప్రగడ వేంకటకృష్ణరాయశర్మ. అందులో ఆయన ‘‘దేశాభిమాని యొక్కసారిగనే దినపత్రికగా మారినది’’ అని రాశారు. దీన్నిబట్టి చూస్తే, 1906కు పూర్వమే ‘దేశాభిమాని’ దినపత్రికగా వెలువడిందని రూఢి అవుతోంది. 
      అలాగే, 1910 నాటి ‘ఆంధ్ర పత్రిక’ ఉగాది సంచికలో అప్పటి పత్రికల వివరాలు ఇచ్చారు. ఇందులో ‘దేశాభిమాని’ని మాత్రమే దినపత్రికగా పేర్కొన్నారు. కాబట్టి, ‘దేశాభిమాని’ నిస్సందేహంగా తొలి తెలుగు దినపత్రికే. దీన్ని నిర్ధరించే మరో ఆధారమూ ఉంది. ‘తెలుగు జనానా’ పత్రిక 1901 సెప్టెంబరు సంచికలో ‘గౌతమి’ పత్రిక (నిర్వాహకులు శ్రీపాద గోపాలకృష్ణమూర్తిశాస్త్రి) మీద ఓ వ్యాసం రాశారు. ఇందులో ‘‘ఆంధ్రలోకమున గౌతమియే మొదటి దినపత్రిక కాదు. అట్టి భాగ్యము కృష్ణకే లభించినది. కానీ అది కృష్ణ వెల్లువల వలెనే మూడునాళ్ళ మురిపమేయై సింధు గతమైనది. ఇదివరకు బెజవాడలో నుండి, ఈ మధ్య కృష్ణ దాటి గుంటూరు జొచ్చిన దేశాభిమాని కొంతకాలం క్రిందట దినదినమును దలచూపుచు వచ్చెను’’ అని ఉంది. ఈ ‘దేశాభిమాని’ వెల మూడు పైసలు. దాదాపు 30 సంవత్సరాలు ఈ పత్రిక నడిచింది.
అపురూపం... కృష్ణా పత్రిక
ఈస్టిండియా కంపెనీ 1611లో మచిలీపట్నం ఓడరేవు దగ్గర ఓ కర్మాగారాన్ని స్థాపించింది. అలా ఆంగ్లేయులు తెలుగునాట కాలుమోపారు. వాళ్ల పాలనా కాలంలోనే మచిలీపట్నం ప్రధాన వ్యాపార కేంద్రంగా రూపుదిద్దుకుంది. నేటి కృష్ణ, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలను కలిపి ఆనాడు కృష్ణామండలంగా పిలిచేవారు. తర్వాత 1859లో కృష్ణాజిల్లా ఏర్పాటైంది. క్రమంగా 1902 నాటికి ఇక్కడి ఉత్సాహవంతులైన యువకులు, సంస్కరణశీలురు కలిసి ‘కృష్ణాజిల్లా సంఘం’గా ఏర్పడ్డారు. సంఘం ఆశయాల్లో భాగంగా ఓ పత్రికను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అలా ఫిబ్రవరి 1, 1902న కొండా వెంకటప్పయ్య, దాసు నారాయణరావుల సంపాదకత్వంలో ‘కృష్ణాపత్రిక’ తొలి సంచిక విడుదలైంది. తొలి మూడేళ్లు పక్షానికోమారు వచ్చిన ఈ పత్రిక, తర్వాత వారపత్రికగా మారింది. ఆ సమయంలో దాసు నారాయణరావు మరణించారు. కొన్నాళ్లకే కృష్ణాజిల్లాను రెండుగా విభజించి గుంటూరు జిల్లాను ఏర్పాటుచేసింది నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం. దాంతో కొండా వెంకటప్పయ్య తన స్వస్థలమైన గుంటూరుకు మకాం మార్చారు. ఫలితంగా కృష్ణాపత్రిక నిర్వహణ, సంపాదకత్వ బాధ్యతలు పూర్తిగా ముట్నూరి కృష్ణారావు వహించాల్సి వచ్చింది. అప్పటికి కొన్నేళ్ల ముందటే సహాయ సంపాదకునిగా కృష్ణాపత్రికలో చేరారు మూట్నూరి. తర్వాత ఆయన సంపాదకత్వంలో జాతి పునరుజ్జీవానికి, అభ్యుదయ కళాకవిత్వ వికాసానికి కృష్ణాపత్రిక వేదికగా మారింది. సాంఘిక రాజకీయ, ఆర్థిక, శిల్ప, సాహిత్య, కళారంగాల మీద ఎన్నో విలువైన వ్యాసాలు ఇందులో ప్రచురితమయ్యాయి. పత్రిక రాక కోసం గ్రామాల్లో ఎదురుచూసేవారు. పల్లెప్రజలు రచ్చబండల మీద సమావేశమై పత్రికను చదివించుకునేవారు.
      కృష్ణాపత్రికలో ప్రచురించిన ధారావాహికల్లో ‘అభినయాలు- రూపకాలు’, ‘కావ్యమీమాంస- శాస్త్ర విచారము’, ‘కల్పనాకథలు’, ‘రసమంజరి’ చాలా ప్రజాదరణ పొందాయి. విశ్వనాథ సత్యనారాయణ, పింగళి నాగేంద్రరావు లాంటి మహామహులు ఇందులో రచనలు చేసేవారు. ‘పరమానందయ్య శిష్యుడు’ పేరుతో మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన ‘చలువ మిరియాలు’, ‘దర్బారు శాయరు’ పేరుతో కాటూరి వేంకటేశ్వరరావు రాసిన ‘పన్నీటి జల్లులు’ పాఠకుల మన్ననలు అందుకున్నాయి. వీటితోపాటు ‘సూర్యం చెప్పిన కథలు’ శీర్షికతో అబ్బూరి రామకృష్ణారావు చేసిన రచన కూడా పత్రిక కీర్తికిరీటంలో చేరింది. కృష్ణాపత్రిక తర్వాత ప్రజాశక్తి (1965), విశాలాంధ్ర (1952), ఆంధ్రజ్యోతి (1960)లతోపాటు సుమారు యాభై దినపత్రికలు విజయవాడ నుంచి ప్రారంభమయ్యాయి. అయితే వాటిలో నాలుగైదు పత్రికలు మాత్రమే నేటికీ కొనసాగుతున్నాయి.
పత్రికల రాజధాని కృష్ణాజిల్లా
దినపత్రికలతో పాటు వార, పక్ష, మాస, ద్వైమాసిక పత్రికలు కూడా కృష్ణా జిల్లా నుంచి ఎక్కువసంఖ్యలోనే వెలువడ్డాయి. అందులో కొన్ని మరీ ప్రత్యేకమైనవి. విద్య, వైజ్ఞానిక రంగాల సమాచారాన్ని ప్రజలకు అందివ్వడానికి ఉద్దేశించిన పత్రికలవి. మచిలీపట్నానికి చెందిన కోట సూర్యనారాయణ 1892లో ‘ఉపాధ్యాయోపయోగిని’ అనే విద్యాసంబంధ మాసపత్రికను ప్రారంభించారు. గుడివాడ నుంచి 1894 ప్రాంతాల్లో నందగిరి వేంకట అప్పారావు ‘బుద్ధిప్రదాయిని’ వైజ్ఞానిక మాసపత్రికను తెచ్చారు. ఇరవయ్యో శతాబ్దం తొలిరోజుల్లో విజయవాడ నుంచి ‘శ్రీవేంకటేశ్వర పత్రిక’ వచ్చేది. హైందవ ఆధ్యాత్మిక విషయాలను ప్రచారం చేసిన ఈ పత్రిక సంపాదకులు శ్రీనివాసాచార్యులు. ఇక 1907లో ఇక్కడినుంచే గాడిచర్ల హరిసర్వోత్తమరావు నడిపిన వారపత్రిక ‘స్వరాజ్య’. ఇది ఆ కాలంలో పెద్ద సంచలనమే సృష్టించింది. దేశభక్తి ప్రేరితమైన విషయాలు ఇందులో ఎక్కువగా వచ్చేవి. వేమూరి రాంజీరావు (మచిలీపట్నం) నడిపిన ‘దీనబంధు’ వారపత్రిక... అణగారిన వర్గాలకు బాసటగా నిలిచింది. తెలుగులో తొలి బాలల పత్రికను అందించిన ఘనతా కృష్ణాజిల్లాకే దక్కుతుంది. ఆ పత్రిక ‘బాలకేసరి’. విజయవాడకు చెందిన మేడిచర్ల ఆంజనేయమూర్తి 1940లో దీన్ని ప్రారంభించారు. 
      ఆ తర్వాత కాలంలో విద్యా వైజ్ఞానిక, వైద్య, ఆధ్యాత్మిక, వ్యాపార వాణిజ్య, సాంస్కృతిక, వినోద, హాస్య, శృంగార, మహిళా, ఉద్యోగ రంగాలకు సంబంధించిన పత్రికలెన్నో జిల్లా నుంచి వెలువడ్డాయి. కుల ప్రధానమైన పత్రికలూ కొన్నేళ్లు నడిచాయి. తెలుగుతోపాటు ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లోనూ మాసపత్రికలు వచ్చాయి. ఆంధ్రభారతి, శారద, వీణ, నవభారతి, కమ్యూనిస్ట్, ప్రజాసాహితి.. ఇలా ఎన్నో ప్రముఖ పత్రికలకు ఈ ప్రాంతం నిలయమైంది. తెలుగు సాహిత్యంలో వచ్చిన ఉత్తమ రచనలెన్నో ఇక్కడి మాసపత్రికల్లో ముద్రితమయ్యాయి. ఇరవయ్యో శతాబ్దం తొలినాటి మేటి సాహితీవేత్తలందరూ ఇక్కడి పత్రికలతో అనుబంధం ఉన్నవారే. 
ఇక్కడా అదే వెలుగు
పూర్వం కృష్ణా మండలంలో భాగంగా ఉన్న సమయం నుంచి నేటి వరకు గుంటూరు జిల్లాలో పత్రికా చైతన్యం ఎక్కువగానే ఉంది. 1886లోనే ‘రసికోల్లాసిని’ పేరిట ఓ మాస పత్రికను తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ప్రచురించారు పాలడుగు పానకాలరావు. అవ్వారి హనుమయ్య సంపాదకత్వంలో 1933లో ‘భక్తిప్రబోధిని’ మాసపత్రిక వచ్చింది. శివశంకరశాస్త్రి 1926లో ‘సఖి’ పత్రికను నిర్వహించారు. తర్వాత పదేళ్లకు గిడుగు వేంకటరామ్మూర్తి నేతృత్వంలో ‘ప్రతిభ’ వెలువడింది. ఈ రెండూ త్రైమాసిక పత్రికలు. ఎప్పుడో 1921లోనే ‘మాతృభాష’ అనే ఓ పత్రిక ఈ జిల్లానుంచి వెలువడటం స్ఫూర్తిదాయకమైన విషయం. కాశీ కృష్ణమాచార్యులు దీని సంపాదకులు. ‘ప్రజాసంస్థ, విశ్వకళ, పదువురి బంటు, పరపతి పాఠశాల, విశిష్టాద్వైత, ప్రకాశిక, స్వతంత్ర, ఆంధ్ర గ్రంథాయలం’ తదితర పత్రికలు గుంటూరు జిల్లా నుంచి వెలువడ్డాయి. వింజమూరి రాఘవాచార్యులు, గాదె సింహాచలంపంతులు, కుందుర్తి నరసింహాచార్యులు, గిడుగు వేంకటనరసింహారావు, గోవిందరాజు వేంకటకృష్ణారావు, గుండు రాఘవదీక్షితులు, పి.రాజశేఖరం లాంటివాళ్లు ఈ ప్రాంతంలో పత్రికా చైతన్యాన్ని పెంచారు. 
      రాయలసీమలో కర్నూలు జిల్లాను తాకుతూ వెళ్తుంది కృష్ణమ్మ. ఈ జిల్లానుంచి వెలువడిన తొలిపత్రిక ‘అరుణోదయం’. పక్షపత్రికగా 1923లో ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇంతకుమించిన వివరాలు అందుబాటులో లేవు. వనం శంకరశర్మ సంపాదకుడిగా 1957లో ‘హితవాది’ పక్షపత్రిక వచ్చింది. ‘జనహిత, అజీజ్, యువజ్వాల’ పత్రికలు కర్నూలు జిల్లా తొలితరం పత్రికల్లో ప్రసిద్ధి పొందినవి. వీటి సంపాదకులు ఎం.రామచంద్రరావు, మౌలానా అబ్దుల్‌ అజీజ్‌ రహ్మాని, బి.కృష్ణమూర్తి. సి.పాపారాయుడు నేతృత్వంలో ప్రారంభమైన ‘వ్యాయామవాణి’... వ్యాయామ విద్యకే ప్రత్యేకించిన పత్రిక. శ్రీశైలం దేవస్థానం 1965 నుంచి ‘శ్రీశైలప్రభ’ పత్రికను ప్రచురిస్తోంది. మొత్తమ్మీద 200కు పైగా దిన, వార, పక్ష, మాస పత్రికలకు కర్నూలు జిల్లా నెలవైంది.
నిర్బంధాన్ని ఎదిరించి...
నిజాం పరిపాలనా కాలంలో తెలంగాణలో పత్రికల మీద తీవ్ర ఆంక్షలు ఉండేవి. అసలు పత్రికలు ప్రారంభించడమే కష్టతరమైన పని. ఒకవేళ ప్రారంభించినా, అందులో వచ్చే వార్తల మీద సర్కారీ డేగకన్ను ఉండేది. ఈ నేపథ్యంలో ప్రజల తరఫున కలాన్ని ఝళిపించిన షోయుబుల్లాఖాన్‌ను ఘోరంగా హత్యచేశారు. ఇంతటి నిర్బంధ పరిస్థితుల మధ్య తెలంగాణలో తొలిసారి పూర్తిస్థాయి పత్రిక ఎప్పుడు ఎలా ఆవిర్భవించిందన్న విషయం ఆసక్తికరం. విశిష్టమైన ఈ ఘనతను సంతరించుకున్న ఆ పత్రికకు కార్యస్థానమైందీ కృష్ణాతీరమే. మహబూబ్‌నగర్‌ నుంచి వచ్చిన ‘హితబోధిని’ తెలంగాణ నుంచి వచ్చిన తొలి తెలుగు పత్రిక. అంతకుపూర్వం వెలువడిన ‘సేద్యచంద్రిక’ను అనువాద పత్రికగా చెబుతారు.  
      ‘హితబోధిని’ మాసపత్రిక. దీని వ్యవస్థాపకులు బి.శ్రీనివాసశర్మ, బి.రామచంద్రరావు. ఆత్మకూరు జమీందారు శ్రీరామ భూపాల బహిరీ బలవంత్‌ బహద్దూర్‌ ఆర్థికసాయంతో వీరు ముద్రణాయంత్రాన్ని సమకూర్చుకున్నారు. అనేక అవరోధాలను అధిగమించి జూన్‌ 13, 1913న పత్రిక తొలి సంచికను విడుదల చేశారు. నేటి పత్రికలు అనుసరిస్తున్న ‘పుల్‌ అవుట్‌’ వంటి వాటికి ‘హితబోధిని’ అప్పట్లోనే ఊపిరిపోసింది. పుల్‌ అవుట్‌ తీరులో పూర్తిస్థాయిగా కాకపోయినా వ్యవసాయం, వైద్యం, పారిశ్రామికం, సంఘ సంస్కరణం అనే నాలుగు విభాగాలుగా పత్రిక వచ్చేది. ఏడాది పూర్తయ్యాక 12 సంచికల్లోని ఆయా విభాగాలను విడదీసి, పుస్తకాలుగా మార్చుకోవడానికి వీలుగా దీన్ని ప్రచురించేవారు. ఆ తర్వాత ఈ జిల్లా నుంచి 1921లో ‘సువార్తమణి’ పత్రిక వచ్చింది. స్వాతంత్య్రానంతరం పత్రికలు విరివిగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ ఇక్కడ చెప్పుకోదగిన సంఖ్యలో స్థానిక పత్రికలు ఉన్నాయి.
      తెలంగాణలో జరిగిన గ్రంథాలయోద్యమానికి బాసటగా నిలిచి, ఆ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంలో ప్రధానపాత్ర పోషించిన పత్రిక ‘నీలగిరి’. నల్లగొండ కేంద్రంగా వెలువడిన ఈ పత్రిక వ్యవస్థాపకులు షబ్నవీసు వేంకట రామనరసింహారావు. దీని సంపాదకులు కూడా ఆయనే. ఈ పత్రికల వెల అప్పట్లో రెండు అణాలు. ఆ తర్వాత జిల్లాకు చెందిన సుప్రసిద్ధ సాహితీవేత్త కూరెళ్ల విఠలాచార్య సంపాదకత్వంలో చాలా పత్రికలు వచ్చాయి. సూర్యాపేట తాలూకా కొత్తగూడెం వాసి, మహిళా ఉద్యమ కెరటం మల్లు స్వరాజ్యం సంపాదకవర్గ సభ్యురాలిగా నడచిన పత్రిక ‘మానవి’. స్త్రీజనాభ్యుదయాన్ని ఆశిస్తూ 2002లో ప్రారంభమైన ఈ పత్రిక ఇప్పటికీ అదే స్ఫూర్తితో ప్రచురితమవుతోంది. ఇక స్థానిక దినపత్రికలు, ఇతర మాసపత్రికలను కలుపుకుంటే నల్లగొండ నుంచి 250కి పైగా పత్రికలు వెలువడ్డాయి. ఇలా తెలుగునాట కృష్ణానది పరుగులెత్తే ప్రాంతాలన్నింటా పాత్రికేయ చైతన్యం ఉరకలెత్తుతూనే ఉంది. ప్రజాసమూహాన్ని ఎప్పటికప్పుడు నవపథం వైపు నడిపిస్తూనే ఉంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం