అదిగో నాగార్జునాద్రి... కృష్ణాస్రవంతి అదిగో...!

  • 380 Views
  • 4Likes
  • Like
  • Article Share

    ఎం.నారాయణ శర్మ

  • సంస్కృత అధ్యాపకులు
  • హైదరాబాదు
  • 9848348502
ఎం.నారాయణ శర్మ

నాగార్జునసాగరం’... ఓ చారిత్రక కథా గేయకావ్యం. కవి డా।। సి.నారాయణరెడ్డి. చారిత్రక పాత్రలతో కూడిన కల్పిత గాథలు, బౌద్ధం విశిష్టత, నాగార్జునసాగర్‌ ప్రాంతంలో కృష్ణానదీ సౌందర్యం... ఇలా విభిన్నాంశాలను స్పృశిస్తూ సినారె వెలయించిన ఈ కావ్యం... కృష్ణమ్మ జ్ఞాపకాల్లో విశిష్టమైనది. 
దాదాపు అయిదు పుష్కరాల
కిందటే ‘కృష్ణవేణీ తరంగిణీ పయః కింకిణుల’ మార్దవస్వరాన్ని కవితామయం చేశారు సినారె. ఆయన రాసిన మూడు ప్రసిద్ధ గేయకావ్యాల్లో ‘నాగార్జునసాగరం’ ఒకటి. రచనా కాలం 1955. పద్య సాహిత్యానికి వచన కవిత్వానికి మధ్య ఉన్న కవిత్వమంతా దేశీ, గేయ ఛందస్సులలో రచించిన సాహిత్యమే. నాగార్జునసాగరమూ అందుకు మినహాయింపుకాదు.
ఓ కల్పితగాథ
చారిత్రకత, బౌద్ధ సంబంధమైన విలువలు, ప్రేమైక జీవన ప్రతిపాదన లాంటి అంశాలతోపాటు గేయ ఛందస్సు, గొప్ప కళావిష్కారం కలిగిన సృజన ఇది. కొన్ని చారిత్రక పాత్రలతో సినారె ఓ కల్పితగాథను కావ్యంగా మలిచారు. చాంతిసిరిగా చరిత్రలో నమోదైన ‘శాంతిశ్రీ’ ఇందులో ప్రధానపాత్ర. కృష్ణానది పాయలనానుకొని ప్రవహించిన బౌద్ధకాలపు ఇతివృత్తం ఇందులో కనిపిస్తుంది. మోక్షం కోసం సౌందర్య విరక్తిని ప్రతిపాదించింది బౌద్ధం. కానీ శిల్పాచార్యుడు పద్మదేవుడు తయారుచేసిన శిల్పాల సౌందర్యాన్ని, అతని చిత్రరచనను, గానాన్ని ఆరాధిస్తుంది శాంతిశ్రీ. అతనితో జీవితాన్ని పంచుకోవాలని తాపత్రయపడుతుంది. కానీ మత విలువలకు తలొగ్గి చివరికి సన్యాసినిగా మారుతుంది. ఆమె దుఃఖమే నాగార్జునసాగరం అయ్యిందన్న సూత్రీకరణతో ముగుస్తుందీ కావ్యం.
      ఈ కావ్యంలోని శాంతిశ్రీ మాత్రమే చారిత్రకంగా, కొంత స్పష్టంగా కనిపించే పాత్ర. మతాచార్యుడు, శిల్పి పద్మదేవుడు కల్పిత పాత్రలు. కావ్య నాయిక శాంతిశ్రీ ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు వాసిష్ఠ పుత్ర శాంతమూలుడి (క్రీ.శ.200- 218) చెల్లెలు.  ఆమె నాగార్జునకొండలోని మహాచైత్యం దగ్గర బౌద్ధ భిక్షువుల కోసం మండపాలను, చైత్యాలను నిర్మించినట్లు ఆధారాలున్నాయి. శ్రమణులకు, బౌద్ధ భిక్షువులకు దాన ధర్మాలు చేసినట్లు రెండు శాసనాలు కనిపిస్తాయి. 
అలల శబ్దమే...
‘నాగార్జునసాగరం’ కావ్యంలో అయిదు భాగాలున్నాయి. వీటికి నదీ శబ్దాన్ని అనుసరించి ‘తరంగాలు’ అని పేరు పెట్టారు. రచన కృష్ణవేణి నది తరంగాలు, బౌద్ధం, ఇక్ష్వాకుల ప్రస్తావనతో ప్రారంభమవుతుంది. ఇదంతా బౌద్ధ స్వర్ణయుగాన్ని ప్రతిబింబిస్తుంది. ‘‘ఇక్ష్వాకు వంశక్షి/ తీంద్రచంద్రులకీర్తి/ కౌముదుల్‌ నల్గడల/ కలయ విరిసిననాడు/ కృష్ణవేణీ తరంగిణి పయఃకింకిణులు/ త్రిశరణక్వాణాల/ దెసల నింపిననాడు/ సిద్ధార్థుని విశుద్ధ సిద్ధాంత బీజములు/ శాఖోపశాఖలై/ సాగిపోయిననాడు’’ అంటూ ఇక్ష్వాకుల పరిపాలనను ప్రస్తావిస్తారు కవి. ‘అదిగొ నాగార్జునాద్రి/ అదిగొ కృష్ణాస్రవంతి/ అవిగొ చైత్యవిహారముల్‌/అవిగొ సంఘారామముల్‌’’ అంటూ నందికొండను పరిచయం చేస్తారు. ‘‘అదిగో కృష్ణమ్మ న/వ్యాప్సరాంగన భంగి/ నడయాడెనాంధ్ర భూ/నందనోద్యానమున/ అల్లదిగో కృష్ణవేణమ్మ భాసించె బౌ/ద్ధము రసాకృతిదాల్చి/తరలి వచ్చె ననంగ’’ అంటూ కృష్ణవేణీ అలల సవ్వడిలో త్రిశరణాలు (బుద్ధం, ధర్మం, సంఘం) ధ్వనించినప్పుడు బౌద్ధం నీటిరూపం దాల్చి ప్రవహించిందని చెబుతారు. 
      కావ్యం ప్రథమభాగంలో కృష్ణానదీ వర్ణన ఎక్కువ. కృష్ణానది అదిరిపడితే ఆ కదలికలు అప్సరోభామినుల మెయి విరుపుల్లా కనిపిస్తాయని, ఆమె వెన్నెల వస్త్రాలు సన్నని గాడ్పుకు చలించినట్టు అలలు కదులుతున్నాయని, ఆకాశంలో పింజలు పింజలుగా విడిపోయిన మేఘాల్లా ఉన్నాయని, శాక్యముని (బుద్ధుని) కళ్లనుంచి దూకే కరుణధారల్లా ఉన్నాయని కృష్ణానది అందాలను వర్ణిస్తారు సినారె. దీని ద్వారా నాగార్జునసాగర్‌ ప్రాంతంలోని బౌద్ధ ఉజ్జీవనాన్ని, కృష్ణానది సౌందర్యాన్ని రెంటినీ గొప్ప భావనలతో కవితామయం చేశారు. ఆ కాలంనాటి భావకవితా ఛాయల్లోని సౌందర్య దీప్తి ఇందులో కనిపిస్తుంది. అనేక విషయాలను చిత్రించినప్పటికీ కృష్ణానది, ఆ వాతావరణం ఈ కావ్యంలో జీవవాహికలా ఉంటుంది. కృష్ణానది అలల్లో స్నానమాడి పవనుడు పవిత్రుడయ్యాడని చమత్కరిస్తూ... ‘కృష్ణవేణీ తరంగిణి పయోలహరికా/ స్నాతుడై పవనుడు పు/ నీతుడై చలియించె’ అని కవితాగానం చేస్తారు. కావ్యమంతా నదికి సంబంధించిన ఊహలు, స్పృహ అనేక రూపాల్లో కనిపిస్తాయి. 
ఇసుక తిన్నెలే ప్రేమ వేదికలు
పద్మదేవుడు, శాంతిశ్రీ కలయికకు నెలవు కృష్ణానది ఇసుకతిన్నెలు. ఓ సందర్భంలో వేణునాదం వినిపించి శాంతిశ్రీ తీరానికి వస్తుంది. పద్మదేవుడి ఒడిలో సేదదీరుతుంది. పద్మదేవుడు ఆకాశం వైపు చూస్తుంటాడు. ఆ సందర్భంలో నది వాళ్లిద్దరినీ నిబద్ధమైన యోగదృష్టితో- ‘ఇరువురిని ఆ తరం/ గిణి చూచె నిసుమంత/ కదలికయే లేని యో/ గ నిబద్ధ దృష్టితో’- చూసిందంటారు నారాయణరెడ్డి.  
      శాంతిశ్రీకి పద్మదేవుని ఊహలు ఎక్కువవుతాయి. ఇద్దరూ సైకత శ్రేణులమీద విహరిస్తారు. శాంతిశ్రీ పద్మదేవుణ్ని అనుసరించింది. ఆ సందర్భంలో ‘వారిర్వురటులెంత/ దూరమేగెడువారొ కాని ఆగిరి కృష్ణ/ వేణి అడ్డము నిల్వ’ అని కవి అనడం... ఆయన నదిని దేనికి ప్రతీకగా గమనించారో అర్థమవుతుంది. కావ్యంలో ఆయన చాలాసార్లు ఇసుక తిన్నెలను ప్రేమ వేదికలుగా చెబుతారు. అలాగే ‘మునువైపు కృష్ణవే/ ణిని శాంతి దర్శించె/ వెనువైపు పద్మదే/ వుని శాంతి గమనించె’ అంటూ నదిని బౌద్ధాచార్యునిగా కూడా చూపిస్తారు. అయితే... శుద్ధమైన బౌద్ధమతావలంబి సుఖాపేక్షతో వెళ్లిపోవడాన్ని చూసి కృష్ణానది కన్నీరు కార్చిందేమో అంటారు మరోచోట. ఇందులో భాగంగానే అనేక మానసికాంశాలను స్పృశించారు సినారె.  ‘తనముందు కృష్ణాన/ దిని చూచె నద్దాని/ ప్రతి తరంగము విలా/ పము చేసినటు తోచె’ అంటూ తన ప్రవర్తన చూసి కృష్ణానది విలపించినట్టుగా తరంగాల ధ్వనిలో శాంతిశ్రీ భావించిందంటారు. ఇవన్నీ మానసిక అనువర్తనలే. 
అభ్యుదయాక్షర సేద్యం
నారాయణరెడ్డి రచనలో అభ్యుదయ భావనలున్నాయి. నది, వ్యవసాయ సంబంధంగా రాసిన చరణాలు ఈ దృష్టికి బలాన్నిస్తాయి. చివరిభాగంలో పద్మదేవుడు గురువుతో మాట్లాడిన సందర్భంలో ఇవి వస్తాయి. ‘కృష్ణవేణి ఒకవైపున/ కెరలి నిండుగ పారగ/ మరియొక వైపున ప్రజాళి/ కరువు బరువులను కృంగెను’ కవితలో కృష్ణానది పారుతున్నా... సమీపంలోని పంటపొలాలు పచ్చగాలేవన్న వాస్తవిక దృష్టిని కళ్లకు కడతారు. ఇదే భాగం చివర్లో కూడా ‘ఒకవైపు కృష్ణమ్మ/ ఉత్తుంగముగ లేచు/ పాలకెరటాలెత్తి/ పర్వుదీయుచునుండె’ అని, మరోచోట ‘మరియొక్కవైపామె/ నొరసికొని నిద్రించు/ పండునేలలు గొంతు/లెండి బీటలువారె’ అంటూ కర్షకుల ఆవేదనకు అక్షరరూపమిస్తారు. మానవాళికి నిరుపయోగమైనదేదీ ఆనందాన్నివ్వదనీ, కృష్ణవేణి పరుగులెత్తినా పొలాలు ఎండి, రైతులు వైరాగ్యాన్ని పొందుతున్నారంటారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్వం కృష్ణాపరివాహక ప్రాంత రైతుల స్థితిగతులు ఇలాగే ఉండేవి. వీటినే తన చారిత్రక కావ్యానికి ముడిపెట్టి చెప్పారు సినారె.   
      నాగార్జునసాగరంలోని కావ్యాత్మ భిన్నమైంది. అది అనేక కోణాల్లో అనేక విషయాలను స్పృశించింది. బౌద్ధం, అందులోని బోధనలు, ఇక్ష్వాకుల చరిత్ర, భావ కవిత్వాంశాలు, మానవీయత, అభ్యుదయ దృష్టి ఇవన్నీ రచనలో భాగస్వాములు. ప్రధానంగా కృష్ణానది కావ్య వాతావరణంలో మాత్రమే కాకుండా కవిత్వ పరికరంగా కూడా ఇందులో భాగస్వామి అయ్యింది. అరవయ్యేళ్లు నిండినా రచనలోని యవ్వనానికి బహుశా ఇవే ప్రధాన కారణాలు.


వెనక్కి ...

మీ అభిప్రాయం