జానపద వాఙ్మయ సిరి

  • 1952 Views
  • 45Likes
  • Like
  • Article Share

    వై.సూర్యకుమారి

  • రాజమహేంద్రవరం
  • 8008574147
వై.సూర్యకుమారి

పల్లెప్రజల బతుకు పరిమళానికి, ఆచార వ్యవహారాలకు ఆలవాలం జానపద వాఙ్మయం. దాన్ని తెలుసుకోవడమంటే మన మూలాలను మనం తడుముకుని మురిసిపోవడమే. మన పూర్వీకుల జీవితానుభవ సారాన్ని అవలోకించి ఉప్పొంగిపోవడమే. ఇంతటి విశిష్ట జానపద సాహిత్య అధ్యయనానికి, పరిశోధనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దిక్కుగా నిలుస్తోంది రాజమహేంద్రవరం లక్ష్మీవారపుపేటలోని నేదునూరి గంగాధరం జానపద స్మారక గ్రంథాలయం.
‘‘తాటాకు
పుటల్లో, తాతల అవ్వల నాల్కల పొరల్లో అణగారి వున్న పాటల నిధులను, సామెతల నిక్షేపాలను, పద్యాల రత్నాలను వెలికి తీసి వెలుగు చూపిన జానపద సాహితీ కర్మసాక్షి శ్రీ నేదునూరి గంగాధరం గారు. ఆయన అలనాడు ప్రారంభించిన జానపద సాహిత్య సమీకరణోద్యమం తరువాతి తరాల్లో పి.హెచ్‌.డిలకు ప్రేరక శక్తిగా మారింది’’ అంటూ ఈ గ్రంథాలయ స్థాపకులు నేదునూరి మీద ప్రశంసల జల్లు కురిపిస్తూ, ఈ పొత్తపుగుడి ప్రత్యేకతను తెలియజెప్పారు డా।। సి.నారాయణరెడ్డి. జానపద వాఙ్మయోద్ధరణకు జీవితాన్ని అంకితం చేసిన నేదునూరి గంగాధరం, తాను సేకరించిన జానపద సాహిత్యం, ఇతర రచనలు, తాళపత్ర గ్రంథాలతో 1935లో ఈ పొత్తపుగుడిని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో జానపద వాఙ్మయానికి అంకితమైన ఏకైక గ్రంథాలయమిదే. 
      గంగాధరం స్వస్థలం రాజమహేంద్రవరానికి సమీపంలోని కొంతమూరు. 1904 జులై 4న వెంకటేశ్వర్లు, మంగమాంబ దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు. పాఠశాల రోజుల్లో వ్యాసరచన, దస్తూరి పోటీల్లో విజేతగా నిలిచి కందుకూరి చేతుల మీదుగా ఆంధ్రకవుల చరిత్ర మూడు భాగాలను బహుమతిగా అందుకున్నారు. గ్రామీణ నేపథ్యం కావడంలో మొదటి నుంచి ఆయనకు జానపద వాఙ్మయం మీద ఆసక్తి ఉండేది. గురువు మానవల్లి రామకృష్ణ కవి ప్రోత్సాహంతో ఆ అనురక్తి మరింత పెరిగింది.
అరుదైన సాహితీ సంపద
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తీరిక సమయాల్లో చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి జానపద వాఙ్మయాన్ని సేకరించేవారు గంగాధరం. పొలం గట్లపై కూర్చుని ఊసులాడుకునే మహిళల ముచ్చట్లు, వారు పాడుకునే పాటలు, ఉపయోగించే సామెతలు రాసుకునేవారు. ఎదురుగా కనిపిస్తే మాట్లాడుకోరేమోనని దూరంగా ఉంటూ వారి మాటలు, పాటలు సేకరించేవారట. గ్రామాల్లో అమ్మవారి ఉత్సవాలు జరుపుకునే తీరు, వివాహ సమయంలో పాటించే విధానాలు, రోట్లో పిండి దంచుతూ పాడుకునే పాటలు, మంగళహారతి, భక్తి పాటలు.. ఇలా మొత్తం ఆరు వేలకు పైగా జానపద గీతాలను గంగాధరం అక్షరబద్ధం చేశారు. తాను సేకరించిన సాహిత్యం మీద వ్యాసాలు రాసి పత్రికలకు పంపించేవారు. వాటిని చూసి కవులు, రచయితలు ఆయన్ని కలుసుకుని.. వాటి మీద చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకునేవారు. మొత్తంమీద 1926 నుంచి 1954 వరకు ఒక తపస్సులా జానపద వాఙ్మయాన్ని సేకరించారు గంగాధరం. జానపద గేయాలు, కథా గేయాలు, వీరగాథలు, జమిలి పదాలు, నోముల కథలు, సామెతలు, పొడుపుకథలు, పలుకుబళ్లు, కిటుకు మాటలు, వైద్యం, కళలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలు, స్త్రీల ఆటల విశేషాలు లాంటివి ఆయన సేకరణల్లో కనిపిస్తాయి. సరైన ప్రయాణ సాధనాలు లేని ఆ రోజుల్లో కాలినడకనే మైళ్ల దూరం ప్రయాణించి అరుదైన జానపద సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చిన నేదునూరి 1970 మార్చి 11న స్వర్గస్థులయ్యారు. గంగాధరం ఏర్పాటు చేసిన గ్రంథాలయం బాధ్యతలను అప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు స్వీకరించారు. 
      గంగాధరం రాసిన, సేకరించిన, వెలువరించిన ‘జానపద కథలు-గాథలు, జానపద గేయ వాఙ్మయ వ్యాసావళి, స్త్రీల వ్రత కథలు, వ్యవసాయ సామెతలు, సెలయేరు, మిన్నేరు, మున్నీరు, పసిడి పలుకులు, మంగళ హారతులు, ఆటలు పాటలు, వేమన నీతి పద్యావళి, దివ్య తేజోనిధులు, బాల నీతి కథావళి, భగవద్గీత వచనం, గంగాధర వ్యాకరణం, స్తోత్ర రత్నాకరం, ఘటశోధిని (వేదాంత గ్రంథం), ఆంధ్రనామ సంగ్రహం, త్యాగరాజ కృతి రత్నాకరం లాంటి 73 ముద్రిత గ్రంథాలు, మరో 66 అముద్రిత రచనలు, 30 తాళపత్ర గ్రంథాలు, అలాగే 230 పత్రికలు ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయి. బ్రిటీషు పాలనా కాలం, ఎలిజబెత్‌ రాణి, పూర్వకాలపు రాజుల చిత్రాలు, నెహ్రూ జీవితానికి సంబంధించి వివిధ రూపాల్లోని సమాచారం, గంగాధరం ఉపయోగించిన వస్తువులనూ ఇక్కడ చూడొచ్చు. గంగాధరం కుమార్తె యిందాని సూర్యప్రభావతి ప్రస్తుతం ఈ గ్రంథాలయాన్ని కంటికిరెప్పలా చూసుకుంటున్నారు. ఆదివారం మినహాయించి మిగిలిన రోజుల్లో ఉదయం పదింటి నుంచి పన్నెండు గంటల వరకూ, సాయంత్రం నాలుగింటి నుంచి ఆరింటి వరకూ ఈ పుస్తకాలయాన్ని తెరచి ఉంచుతారు. 
      ఆ రోజుల్లో ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, సి.నారాయణరెడ్డి లాంటి మేరునగ సాహితీవేత్తలు ఈ గ్రంథాలయానికి వచ్చేవారు. అలాగే జమున, జగ్గయ్య తదితర ప్రముఖ సినీ నటులు ఇక్కడి జానపద సాహిత్యాన్ని చదువుకుని తమకు అవసరమైన సమాచారాన్ని తీసుకెళ్లేవారు. ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది జానపద సాహిత్య పరిశోధకులు ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తున్నారు. ఇంకా ఎందరో కవులు, రచయితలు, సాహిత్యాభిమానులూ విరివిగా వస్తుంటారు. ఇప్పటి వరకు ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకుని యాభై మంది వరకు పీహెచ్‌డీ పరిశోధనలు చేశారు.
      తెలుగువారి సాంస్కృతిక జీవన చిత్రాన్ని తెలుసుకోవడంలో కీలకమైన జానపద వాఙ్మయ రాశిని ఒకచోటకు చేర్చిన నేదునూరి నిత్యస్మరణీయులు! ఆనాడు ఆయన వెలిగించిన గ్రంథాలయ జ్యోతి.. ఇప్పటికీ, ఎప్పటికీ జానపద పరిశోధకులకు ఓ దిక్సూచే!


వెనక్కి ...

మీ అభిప్రాయం

  గ్రంథాలయాలు