గొబ్బున నిచ్చినవాడే యబ్బురమగు దాత!

  • 183 Views
  • 12Likes
  • Like
  • Article Share

గత్యంతరం లేని స్థితిలో ఉన్నవారికి ఊరట కలిగించేది దానం. మనం ఇచ్చేది స్వల్పమే అయినా ఒక్కోసారి ఎదుటి వ్యక్తి జీవితాన్ని నిలబెట్టవచ్చు. అందుకే, దాతను దేవుడితో పోల్చుతారు. కరోనా కల్లోలంలో ఇలాంటి దయార్ద్ర హృదయులు ఎందరో ఆపన్నులకు తమవంతు సాయం చేశారు. అయితే, మన ప్రాచీన సాహిత్యం దానం గురించి, దాని విధానాల గురించి ఏమంటోంది?
ఆర్థిక,
ఇతరత్రా అంతరాలతో సంబంధం లేకుండా సమాజంలో ప్రతి మనిషీ తనదైన ఆత్మాభిమానంతో జీవిస్తుంటాడు. అందుకే ఎంత కష్టమొచ్చినా ఒకరి దగ్గర చెయ్యిచాచడమంటే ఎవరికైనా గుండెల్లో అంకుశం గుచ్చుకున్నట్టే. దీన్ని దృష్టిలో పెట్టుకుని అవసరంలో ఉన్నవారిని గుర్తించి, అడగకముందే సాయం చేసేవాడే గొప్ప దాత అంటుంది ఆంధ్రమహాభారతం. ‘‘అడిగిన నిచ్చుకంటెను నయాచకుగాగ నెఱింగి యిచ్చుటె/ క్కుడు ఫలమిచ్చు దానవిధ కోవిద! వేడుట చావు, వేడ్కగా/ బడుటది పెద్ద చావు దగు ప్రార్థన పూర్ణము సేయునాతడా/ యడిగిన వాని దన్నును దయారతి గావగ జాలువాడగున్‌’’- అడగడంతో పాటు, అడగబడటాన్ని కూడా చావుగా పేర్కొంటుందీ పద్యం. సాటి మనిషికి కష్టమొచ్చి మన ముందు చెయ్యిజాపితే అది మానవత్వానికే మచ్చ కదా! అది మనిషిగా మన మరణమే! అందుకే అడగని వారికి ఇవ్వడం వల్ల అతణ్నీ, తననూ రక్షించినవాడవుతాడనే గొప్ప సత్యం చెబుతుందిది.
అది పాపమే!
కొందరు దాతలు అర్థి మనోధైర్యాన్ని   
  పోగొట్టి, ఒకటికి పదిసార్లు బతిమాలించుకుని, అతని పేదరికాన్ని ఏకరువు పెట్టించి సిగ్గుతో చితికిపోయేలా చేసి తర్వాత ఎప్పుడో దానానికి సిద్ధమవుతారు. ఇది ఎంతమాత్రం సరికాదని చెబుతుంది ‘శృంగార నైషధం’. ‘‘కటికతనంబు మాన్చి చటుకాకు విడంబము గూర్తి లజ్జసం/ కటపడజేసి యర్థి గడు గాఱియపెట్టిన పాతకంబున/ క్కట తలగంగ జాలునొకొ కాలవిలం బము నాచరించి పి/ మ్మట దదభీప్సి తార్థము సమర్పణసేయు ప్రదాత యెమ్మెయిన్‌’’.. అర్థిని ఇబ్బందులపాల్జేసి చేసే దానం వృథానే అని చెబుతుందీ పద్యం. ‘యాజ్ఞవల్క్య చరిత్రం’లో కూడా ఇలాంటి పద్యమే ఒకటి కనిపిస్తుంది. ‘‘మబ్బువిడి నేడు రేపని/ సబ్బిడు లిడిబొంకి బొంకి సడినొందక బల్‌/ గొబ్బున నిచ్చినవాడే/ యబ్బురమగు దాత...’’- దానం విషయంలో అజ్ఞానం (మబ్బు) వదిలిపెట్టి నేడు రేపని సాకులు చెప్పకుండా వెంటనే దానం చేసినవాడే గొప్ప దాత అని దీని భావం. 
      కొందరైతే దానం చేసేసి, ‘నేను ఇచ్చాను చూశావా?’ అని అందరికీ చెప్పుకుంటుంటారు. లాక్‌డౌన్‌ సమయంలో కొంతమంది చిన్న సాయాలు చేసి పెద్ద ప్రచారాలు చేసుకున్నారు. సాయం చేసేశాక ‘అయ్యో, అలా ఎందుకు చేశానూ!’ అని ఏడ్చేవాళ్లూ ఉంటారు. ఈ రెండింటి వల్ల చేసిన దానం నిష్ఫలమే అంటుంది ‘ఆంధ్రమహాభారతం’. ‘‘చేయుటెంతయు మేలైన జేసి పిదప/ వగచినట్టి దానము దను బొగడికొన్న/ దానవిధి నిష్ఫలంబులు...’’ దానం విషయంలో సొంత గొప్పలను వదులుకోవాలని హితవు చెప్పే పద్యమిది. ఇక దానం వల్ల కలిగే పుణ్యం, కీర్తిలతో పాటు ‘‘దానమునకు నధికమైన ధర్మము గలదే?’’ అని తేల్చి చెబుతుంది ‘మత్స్యపురాణం’. అలాగే ‘‘మానిత యాచమాన జన మానస వృత్త్యభిపూర్తి బుద్ధియె/ వ్వానికి లేదొకింతయును, వాడొకరుండు భరంబు ధాత్రికిం..’’ అంటూ తెలిసీ దానం చెయ్యని వాళ్లు భూమికి భారమే అంటుంది ‘శృంగార నైషధం’. ‘‘అన్యాయార్జితమైన విత్తమున జేయంబూను దానంబు మూ/ ర్ఖన్యాయం బది...’’ అని చెబుతుంది మహాభారతం. ‘‘యుక్తన్యాయార్జిత మించుకంతయయినం గాలంబు దేశంబు స/ మ్మాన్యంబై తగ బాత్రయోగమున సౌమ్యంబై ఫలించుందుదిన్‌’’ అంటూ కష్టపడి సంపాదించింది కొంచెమైనా సకాలంలో, సరైన ప్రదేశంలో, యోగ్యుడైన వారికి దానం ఇవ్వాలని వివరిస్తుంది. దానం మనిషిలోని మానవత్వానికి ప్రతీక. ఆ ఈవిని మరింత అర్థవంతం చేసుకోవ డానికి మార్గదర్శకాలు ఈ పద్యాలు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం