సంస్థానాల తెలుంగాన

  • 214 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి

  • స‌హాయ ఆచార్యులు, తెలంగాణ విశ్వవిద్యాల‌యం
  • డిచ్‌ప‌ల్లి, నిజామాబాదు
  • 9866917227
డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి

‘‘తెలంగాణలో తెలుగు సాహిత్య జ్యోతి ఆరిపోకుండా ఆనాటి సంస్థానాలు కాపాడాయి’’- నిన్నటితరం వాఙ్మయ పరిశోధకులు ఏకగ్రీవంగా అంగీకరించిన అభిప్రాయమిది. నిజమే, అసఫ్‌జాహీల పాలనలో ప్రభుత్వ యంత్రాంగం, బోధకాభ్యాస రంగాల్లో తెలుగు భాష నిరాదరణకు లోనవుతున్న దశలో చేతనైనంత మేర మాతృభాషా పరిరక్షణ చేసిన ఘనత సంస్థానాలదే. కృష్ణాతీరంలోని వనపర్తి, జటప్రోలు, ఆత్మకూరు, దోమకొండ, గద్వాల, మునగాల తదితర సంస్థానాలు స్థానిక ప్రతిభను గుర్తించాయి. సుదూర ప్రాంతాల కవి గాయక నటకుల్నీ సంస్థానాలకు ఆహ్వానించాయి. ఘనంగా సత్కరించాయి. 
తెలంగాణ సంస్థానాల
సాహితీచరిత్రలో ముందువరసలో నిలిచే సంస్థానం గద్వాల. ఈ సంస్థాన తొలిపాలకుడు పెద సోమభూపాలుడు. ఆయన నుంచి ఆరంభమైన సాహిత్య పోషణ ఆధునికయుగం వరకు నిరాటంకంగా కొనసాగింది. ఇక్కడ సన్మానాన్ని పొందని విద్వాంసులు లేరు. అవధానాల్లో దిగ్గజాలైన తిరుపతి వేంకటకవులు వివిధ సందర్భాల్లో గద్వాల గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు. గద్వాలలో సన్మానాన్ని అందుకున్న తర్వాత ‘అటు గద్వాలిటు చెన్నపట్టణము మధ్యంగల్గు దేశంబునన్‌’ అంటూ ఆ కవులు చెప్పిన పద్యం తెలుగు సీమలో సుపరిచితం. 
     కృష్ణాతీరంలో ఉన్న గద్వాల కోటను పెద సోమభూపాలుడు నిర్మించాడని చరిత్రకారుల అభిప్రాయం. ఆయన 17వ శతాబ్ది మలిభాగంలో అధికారంలోకి వచ్చాడు. ఆయనకే సోమనాద్రి అనిపేరు. ఆయన తర్వాత తిరుమలరాయలు, రామరాయలు, చిన సోమభూపాలుడు అధికారంలోకి వచ్చారు. వీరిలో చిన సోమభూపాలుడి పాలన సుదీర్ఘకాలం సాగింది. ఆయనకు ‘అభినవ భోజుడు’ అని బిరుదు ఉండేదట. గద్వాలలో కార్తీక, మాఘ మాసాల్లో విద్వత్సభలు నిర్వహించే సంప్రదాయం ఈయన కాలంనుంచే ప్రారంభమైంది. ఆ తర్వాత రెండో రామరాయలు, సీతారామ భూపాలుడు, మూడో సోమభూపాలుడు, లక్ష్మీ వేంకటలక్ష్మమ్మ, శ్రీరామ భూపాలుడు, సీతారామ భూపాలుడు, లక్ష్మీదేవమ్మ సంస్థాన పాలకులయ్యారు. అందరూ సాహిత్య పోషణలో ముందుకాలం సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ వచ్చినవారే. లక్ష్మీదేవమ్మ ఆంధ్ర ఇతిహాస పరిశోధక మండలికి సాయం చేశారు. 
     గద్వాల సంస్థాన కవి పరంపరలో ముందుగా వచ్చేవారు కొటికలపూడి వీరరాఘవకవి. ఈయన పెద సోమభూపాలుణ్ని దర్శించుకున్నాడు. రాజు వీరరాఘవకవిని మహాభారతంలో తిక్కన విడిచిపెట్టిన భీష్మపర్వ భాగాన్ని అనువదించమన్నాడు. కవి ఆ పని పూర్తిచేశారు. ఉద్యోగపర్వాన్ని యథాశ్లోకంగా అనువదించాడు. ఇది చాలాకాలం తర్వాత గద్వాల ప్రెస్సులో అచ్చయింది. మహాభారత భాగాన్ని అనువదించినందువల్ల వీరరాఘవకవి ‘నూతన తిక్కన కవి సోమయాజి’గా గుర్తింపును అందుకున్నాడు. పెద సోమభూపాలుడు సంస్కృత పండితులను కూడా పోషించాడు. మరోకవి బుచ్చి వెంకటాచార్యులు అభినవ శృంగారరస మంజరీ భోజము, కల్యాణీ పురంజనం, శృంగార సర్వస్వం, వేదాంత కారికావళి అనే గ్రంథాలు రచించాడు. సోమనాద్రి మనుమలు సోమభూపాల్‌ అష్టపదులు, రతిరహస్యాలు; రాంభూపాల్‌ కేశవాష్టకం, ఛందో ముకురం తదితర రచనలు చేశారు. వాల్మీకి రామాయణాన్ని ‘యథాశ్లోక తాత్పర్యం’లో తీసుకొని రావాలనే సంకల్పం చిన సోమభూపాలుడి కాలంలో ఏర్పడింది. కాణాదం పెద్దన, కొత్తపల్లి రామాచార్యులు, గార్గేయపురం సుబ్బారావు, కామసముద్రం అప్పలాచార్యులు, తిరుమల కృష్ణమాచార్యులు, బోరవెల్లి శేషకవి యథాశ్లోక తాత్పర్య రామాయణ రచనలో భాగస్వాములు. అయితే ఈ అనువాదం పూర్తిస్థాయిలో కాలేదు.
    నాటి గద్వాల సంస్థాన గ్రామాలకు చెందిన కవులు, పండితుల వివరాలు ‘గోలకొండ కవుల సంచిక’లో లభ్యమవుతాయి. వీరిలో కొంతమంది ఏదో ఒక సందర్భంలో గద్వాల సంస్థానంలో సత్కారాలు పొందినవారే! వీరిలో ముఖ్యుడు కర్నమడకల అనంతాచార్యులు. 19వ శతాబ్ది ఉత్తరార్ధానికి చెందిన ఆయన న్యాయ వేదాంత వ్యాకరణ మీమాంస సాహిత్యాల్లో గొప్ప పండితుడు. ఆంధ్ర శబ్ద చింతామణి, మదన విజయ భోజము వంటి రచనలు సంప్రదాయ రచనా వైఖరికి అద్దంపడుతున్నాయి. కర్నమడకల అనంతాచార్యులు గద్వాల ఆస్థాన పండితులుగా ఇతర ప్రాంతాలనుంచి పండితులు వచ్చినప్పుడు వారిని ఎదుర్కొన్నారు. అహోబలాచార్యులు గద్వాల ధర్మాధికారి. జ్యోతిషంలో ప్రామాణిక గ్రంథంగా భావించే సూర్య సిద్ధాంతసారం ఆయన రచన. దక్షిణ భారతదేశపు గొప్ప పండితులలో ఒకరైన ఖండవల్లి నరసింహారావు గద్వాలలో సత్కారాన్ని పొందారు. ఆదిపూడి ప్రభాకరరావు రాజా సీతారామభూపాల్‌ ఆస్థానంలో ఉండేవారు. ‘గద్వాల ప్రభాకరము’ ఆయన ప్రసిద్ధ రచన. బైరంపల్లి తిరుమలరాయకవి ఆశుకవిత్వంలో దిట్ట. పురాణ దీక్షాచార్యులు, నరసింహాచార్యులు, యామునాచార్యులు- వీరంతా గొప్ప విద్వాంసులు. ఒక్క తెలుగునాడే కాదు దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి కూడా కవులు, పండితులు గద్వాలను సందర్శించేవారు.
    ధర్మవరం రామకృష్ణమాచార్యులను గద్వాలలోనే ‘ఆంధ్రనాటక పితామహుడు’ బిరుదుతో సన్మానించారు. ‘రత్నాలు పొదిగిన బంగారు పతకం’తో గొప్ప సత్కారం జరిగింది. ‘రైలుకంటే వేగంగా పద్యాలను పరుగుపెట్టిస్తాడని’ ప్రసిద్ధిచెందిన గాడేపల్లి వీరరాఘవశాస్త్రి కూడా గద్వాలను సందర్శించారు. సంస్థానంలో గొప్ప పండితులు అధికారిక హోదాల్లోనూ ఉన్నారు. వారిలో ప్రముఖులు గుండేరావు హర్కారే. ఆయన సంస్థాన పాలనా విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. షేక్స్పియర్‌ నాటకాలను కొన్నింటిని సంస్కృతంలోకి అనువదించారు. సంస్థాన పాలకుల నుంచి సత్కారాలు అందుకున్నారు. 
      అరుదైన కవితా ప్రతిభకు నిలువెత్తు రూపం పోకూరి కాశీపతి. చిత్రకవితా రచనలో ఆయనది అందెవేసిన చేయి. అందుకు నిరోష్ఠ్య నిర్వచన శుద్ధాంధ్ర హరిశ్చంద్రోపాఖ్యానం ఉదాహరణ. ఒక్క పద్యంలోనే నలభై అర్థాల్ని చెప్పగలిగిన ప్రతిభావంతుడు. బహుగ్రంథకర్త. ఆయనకు గండపెండేరం ప్రదానం, కనకాభిషేకం వంటి సత్కారాలు జరిగాయి.
నిరంతరం పండిత సందర్శనతో గద్వాల సంస్థానంలో కవి పండితుల మధ్య వాద- వివాదాలు జరగడం సహజమే. యావదాంధ్ర దేశంలో జైత్రయాత్రలు సాగించిన తిరుపతి వేంకటకవులకు ఇక్కడి        పండితుల నుంచి గట్టిపోటీ ఎదురైనట్టు చెబుతారు. ఆదిపూడి ప్రభాకరరావుకు కొంతమంది అవధానులతో జరిగిన వాద, వివాదాలు చరిత్రలో నమోదయ్యాయి. కవి పండితుల నిరంతర శ్రమకు ప్రతీకలుగా నిలిచిన రచనల్ని తొలిసారి వెలుగులోకి తెచ్చిన ఘనత కూడా గద్వాల ముద్రాక్షరశాలదే. 
పండితులు సభలోకి అడుగుపెట్టేటప్పుడు కింద తెల్లనిగుడ్డను పరిచేవారట. అందరూ వెళ్లాక ఆ బట్ట మీద చేరిన పాదధూళిని భరణిలలో భద్రపరచుకుని, ప్రతిరోజు స్నానం కాగానే  ్ఞసిందూరంలో కలుపుకుని ధరించేవారట. ఇంతటి అద్భుతమైన పండితాదరణను కనబరిచిన గద్వాల సంస్థాన చరిత్ర ఒక మరచిపో(లే)ని జ్ఞాపకం.
గద్వాలకు సాటివచ్చే వనపర్తి
వనపర్తి తొలుత సూగూరు సంస్థానంగా గుర్తింపు పొందింది. సంస్థానం మొదటి పాలకుడు వీరకృష్ణ భూకవి. 1510- 1550 వనపర్తిని పాలించిన రాజా బహిరి గోపాలరాయలు కవి పండితుడు. ఈయన అష్టభాషా ప్రవీణుడట. వనపర్తి సంస్థానపు ఆదరణ అందుకున్న ప్రముఖులలో వీరరాఘవాచార్యులు, అక్షింతల సుబ్బాశాస్త్రి, సింగంపల్లి నరసింహ సిద్ధాంతి, హొసదుర్గం కృష్ణమాచార్యులు వంటి ఉద్దండులున్నారు. తిరుపతి వేంకటకవులు, ప్రసిద్ధ అవధాని కార్యమపూడి రాజమన్నారు వంటి వారినీ ఈ సంస్థానం ఆదరించింది. ఆధునిక యుగంలో సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి, చలమచర్ల రంగాచార్యులు వంటి విద్వాంసులు ఈ సంస్థాన ప్రోత్సాహాన్ని పొందారు. తెలుగు వాఙ్మయ పరిశోధనలో చిరస్మరణీయులైన మానవల్లి రామకృష్ణ కవి కొంతకాలం పాటు వనపర్తి సంస్థానంలో పనిచేశారు. ఆయన వనపర్తిలో పనిచేసిన రోజుల్లోనే తన పరిశోధనా దృక్పథానికి మెరుగులు దిద్దుకున్నారంటారు తిరుమల రామచంద్ర. 
      ఇంకా కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, మాదిరాజు విశ్వనాథరాయలను ఈ సంస్థానం ఆదరించింది. ఇక్కడ వివిధ రంగాల్లో పరీక్షలు జరిగేవట. వీటికి ఆయా రంగాల్లో మేరుశిఖర సమానులైన విద్వాంసులు న్యాయనిర్ణేతలు. ఈ పరీక్షల్లో నెగ్గినవారు ‘విద్వన్మణి’ బిరుదు పొందేవారు. వనపర్తి సంస్థానాధీశులు దార్శనికత కలిగినవారు. 1950లకు ముందే విజ్ఞానశాస్త్ర గ్రంథ రచనపట్ల ఆసక్తి చూపించారు. దీనికోసం గ్రంథరచన పోటీలు నిర్వహించారు. ఆ పోటీలో ఎంపికైన రచనల్లో బేతనభట్ల విశ్వనాథం ‘ఆధునిక విజ్ఞాన వికాసం’ ఒకటి. వనపర్తి సంస్థానం దీన్ని ప్రచురించింది. వివిధ సంగీత సదస్సులలో విద్వాంసుల ప్రసంగాలను పత్రాలుగా రూపొందించి గ్రంథ రూపంలో ప్రకటించాలనుకున్న ఆలోచన కూడా ఆ కాలానికి కొత్తదే.
జటప్రోలు- ఆత్మకూరు- మునగాల
జటప్రోలు సంస్థానం కొల్లాపూర్‌ పేరుతోనూ ప్రసిద్ధిచెందింది. ఈ సంస్థాన చరిత్రలో ఇద్దరు సుప్రసిద్ధ తెలుగు కవులు కనిపిస్తారు. ఒకరు ఎలకూచి బాలసరస్వతి. ఈయన సుభాషిత త్రిశతికర్త, మహామహోపాధ్యాయుడు. మరొకరు సురభి మాధవరాయలు. ఈయన రాసిన ‘చంద్రికా పరిణయం’ వసుచరిత్రతో సమానమైన రచన అని కొంతమంది అభిప్రాయం. తమ సంస్థాన కవులు, పండితులను జటప్రోలు సంస్థానాధీశులు గొప్పగా ఆదరించారు. అక్షింతల సింగరశాస్త్రి, అక్షింతల సుబ్బాశాస్త్రి, వెల్లాల సదాశివశాస్త్రులు మహా విద్వాంసులు. ఇంకా చింతలపల్లి గోపాలకవి, కవి కంఠీరవ కృష్ణమాచార్యులు, మంచాలకట్ట గోవిందాచార్యులు, హొసదుర్గం కృష్ణమాచార్యులు తదితరులు జటప్రోలు ఆదరణ పొందారు.  
      ఆత్మకూరు సంస్థాన చరిత్ర కాకతీయుల కాలంలో ఆరంభమవుతుంది. దీనికే అమరచింత అనే పేరుకూడా ఉంది. సురవరం ప్రతాపరెడ్డి ‘గోలకొండ కవుల సంచిక’కు ఈ సంస్థాన సహాయం లభించింది. చక్రతీర్థ, బాలసరస్వతి బిరుదులున్న బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు ఆత్మకూరు సంస్థాన ఆస్థానకవి. దీక్షితుల నరసింహశాస్త్రి, హారతి దీక్షాచార్యులు వంటివారు ఈ సంస్థానంలో రచనలు చేశారు. సాహిత్యసభలు, గోష్ఠులు, కవి సమ్మేళనాలతో ఈ సంస్థానం ఎంతోమంది ప్రతిభావంతుల్ని ప్రోత్సహించింది. మిగతా సంస్థానాలతో పోలిస్తే చిన్నదే అయినా బోరవెల్లి సంస్థానంలోనూ సాహితీసేవ జరిగింది. చింతలపల్లి ఛాయాపతి రాసిన ‘రాఘవాభ్యుదయం’ అనే ప్రబంధం ఈ సంస్థాన చరిత్ర చెబుతుంది. గద్వాల పెద సోమభూపాలుడి కాలానికి చెందిన కవిగా భావిస్తున్న లయగ్రాహి గరుడాచలకవి ‘కౌసలేయ చరిత్రము’ రచించాడు.
      మునగాల స్వతంత్రం వచ్చాక కృష్ణాజిల్లా నందిగామలో చేరిన నిజాం రాజ్య సంస్థానం. మునగాలలో కొమర్రాజు వంశీయులు కవులుగానూ, పాలనా బాధ్యతల్లోనూ ఉన్నారు. అందరిలోకి ప్రసిద్ధులు కొమర్రాజు లక్ష్మణరావు. ఆయన గొప్ప పండితులు, పరిశోధకులు, విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి నిర్వాహకులు. తెలుగువారికి ఒక సమగ్రమైన విజ్ఞాన సర్వస్వం అవసరమని భావించి, ఈ దిశలో ముందుకు సాగిన దార్శనికులు. ఆయన సమకాలికులైన రాజా నాయని వెంకటరంగారావు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయ పోషకులలో ప్రముఖులు. 
      18వ శతాబ్దం తొలినాళ్లకే హైదరాబాదు కేంద్రంగా నిజాం రాజుల పాలన మొదలైంది. పాలన కుదురుకునే సమయానికి రాజభాషగా ఉర్దూకు అగ్ర తాంబూలం దక్కింది. అక్కడినుంచి ప్రభుత్వపరంగా తెలుగుకు మన్నన దొరకని పరిస్థితి నెలకొంది. అలాంటి సమయంలో గద్వాల, వనపర్తి తదితర సంస్థానాలే తెలంగాణలో తెలుగు సాహితీ దీపం కొడిగట్టకుండా చేసి, స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించాయి. తెలుగును నిలబెట్టాయి. ఆ స్ఫూర్తిని ఇప్పటివాళ్లూ అందిపుచ్చుకోవాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం