విదేశాంధ్ర తెలుగు తేజం

  • 257 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ప్రేంచంద్

  • 8712293994

ప్రొఫెసర్‌ జి.కె.గా సుప్రసిద్ధులు గూటాల కృష్ణమూర్తి. కళింగాంధ్ర నుంచి మొదలై, ఖండాంతరాల్లో తెలుగువారి కీర్తిపతాక ఎగరవేసిన సాహిత్య పరిశోధకులు. సోషలిస్టు భావజాలంతో, విశాఖలోనే నివసిస్తున్న గాంధేయవాది కె.ఎస్‌.శాస్త్రితో సాన్నిహిత్యం, అలాగే జయప్రకాశ్‌ నారాయణ్, ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడల్లా వారి సామాజిక కార్యాచరణలో పాల్గొనడం, చేస్తూ వచ్చిన వ్యక్తి. పర్లాఖెముండిలో జులై 10, 1928లో జన్మించిన కృష్ణమూర్తి విజయనగరం, విశాఖపట్నం, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అమలాపురంలో కొన్నాళ్లు, తర్వాత బిలాస్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌)లో పనిచేశారు. ఆయనకు మేనబావ వరస అయిన ప్రముఖ కథారచయిత జయంతి వెంకటరమణ విశాఖవాసి. ‘ఎప్పుడూ ఆంగ్ల సాహిత్యం చదవడం ఆయనకు అలవాటు. అమలాపురం కళాశాలలో తాను బాగా పాఠాలు చెప్పడంవల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడి, ఉద్యోగార్థం రాష్ట్రాంతరం వెళ్లిపోయార’ని చెప్పారు. బరంపురం జీవితం గురించి ఎక్కువగా తెలిసి ఉండటం, ఖుర్దారోడ్‌లో ఉండే తన అన్నగారింట్లో బాల్యంలో ఎక్కువగా కలిసే వాళ్లమని, కలిసినప్పుడల్లా, ఆంగ్ల సాహిత్యం నుంచి కొత్త సంగతులు చెబుతూ ఉండేవారని గుర్తు చేసుకున్నారు.
      కృష్ణమూర్తి లండన్‌ వెళ్లడం కూడా, అలనాటి టైమ్స్‌ పత్రిక కార్యాలయంలో గుమస్తా ఉద్యోగం కోసం. ముఖ్యంగా దానివల్ల తన పరిశోధన కూడా కొనసాగుతుందన్న ఆలోచనతో వెళ్లారు. ఆ వెళ్లిన లక్ష్యం, ఆయనకు 1967లో తన నలభయ్యో ఏట సిద్ధించింది అది. ఫ్రాన్సిస్‌ థాంప్సన్‌ జీవితం, సాహిత్యాల మీద కృష్ణమూర్తి చేసిన పరిశోధనే ‘ఫ్రాన్సిస్‌ థాంప్సన్‌- ఏ క్రిటికల్‌ బయోగ్రఫీ’. దీని తర్వాత దశాబ్దాల జీవితం అక్కడే వివిధ కళాశాలల్లో అధ్యాపకులుగా గడిపారు. కుకునం (వంట), క్లీననం (శుభ్రపరచడం), స్లీపనం (సంసారం), కననం (పిల్లల్ని కనడం) వంటి వింతపేర్లతో కొన్ని రచనలు, అలాగే ‘జుబ్బా లేని అబ్బాయి’ అనే ఓ పూర్తికాని పెద్ద నవల, కృష్ణమూర్తి తెలుగు సాహిత్య వ్యాసంగం గురించి చెప్తాయి. తెలుగువాళ్లకన్నా, ఆంగ్ల సాహిత్య సమాజానికి ఎక్కువగా ఆయన రచనలు వికాస కారణాలయ్యాయి.
1890 దశకంలో పుట్టిన బ్రిటిష్‌వాళ్లు చాలా ప్రసిద్ధులయ్యారని, వాళ్లమీద ప్రత్యేక కృషికి, ఆయన ‘ఎయిటీన్‌ నైంటీస్‌ సొసైటీ’ పేరిట ఓ సంఘాన్ని స్థాపించారు. ఆంగ్లేయులకే తెలియని వారి చరిత్రను వారికి తెలియజెప్పారు. అలాగే 1963లో ‘ఫ్రాన్సిస్‌ థాంప్సన్‌ సొసైటీ’ పేరిట ఓ పరిశోధన వేదిక, ఓ జర్నల్‌ కూడా నడిపారు. ‘ఎయిటీన్‌ నైంటీస్‌ విమెన్‌ రైటింగ్స్‌’ పేరిట కూడా సంకలన బాధ్యతలు, వాటికి సంబంధించిన పరిశోధనలు చేశారు. ఈ పనులే వారి ఎక్కువ కాలాన్ని ఆక్రమించాయి.
      తెలుగులో ‘విదేశాంధ్ర ప్రచురణలు’ పేరిట గూటాల కృష్ణమూర్తి, శ్రీశ్రీ చేతిరాత, సొంతగొంతు మహాప్రస్థానాన్ని బాపు బొమ్మలతో వేయడం 1980ల్లో ఓ పెద్ద విశేషం. అలాంటి కృషే ఆయన పురిపండా ‘పులిపంజా’ ప్రచురణ విషయంలోనూ చేశారు. వీటితో సమానమైన మరో ముఖ్యకృషి టంగుటూరి సూర్యకుమారి గురించి చాలా విలువైన స్మృతి సంచిక ప్రచురించడం. దీన్ని కూడా ‘విదేశాంధ్ర ప్రచురణలు’ పేరిట ప్రచురణ చేశారు. 
      అంతర్జాతీయ విపణిలో పుస్తకాలు ఎలా ఉంటే అందరూ ఆకర్షితులవుతారో గ్రహించి, తెలుగు ప్రచురణలకు కొత్త సొబగులు తెచ్చిన కార్యదక్షులు గూటాల కృష్ణమూర్తి. పరిశోధన రంగంలో ఆయన నెలకొల్పిన ప్రమాణాలు ఉత్తమమైనవి. ఆ దిశగా ప్రస్తుత తరాలు కృషి కొనసాగించడం, జులై 13న పరమపదించిన ఆయనకు మనం ఇవ్వగల నివాళి.
      2002లో తన యు.కె. సందర్శనలో భాగంగా ప్రధాని పి.వి.నరసింహారావు కృష్ణమూర్తిని, ఆయన ఇంటి దగ్గరే కలిసినట్టు అక్కడి హైకమిషన్‌ పెద్దలు చెబుతారు. లండన్‌ తెలుగు సంఘంవాళ్లు ఆయనకు 2006లో జీవితకాల సాఫల్య పురస్కారం అందించారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం