సాహిత్య సుమగంధాలు సంస్థానాలు

  • 181 Views
  • 7Likes
  • Like
  • Article Share

దిగువ కృష్ణాతీరంలో ఆవిర్భవించిన సంస్థానాలు బిగువైన సాహిత్య పోషణను చేశాయి. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా, తెలుగు సాహిత్య గంధాన్ని నాటి సమాజానికి చక్కగా అందించారు అప్పటి పాలకులు. తెలుగు వెలుగుల పూలతోటల్లో కష్టాలు, కడగండ్లను పరిమార్చుకున్న పండిత ప్రకాండులు, సాహితీ దిగ్దంతులు ఎందరెందరో ఆనాడు ఉండేవారు.
కవిపండిత నిలయం 

నూజివీడు సంస్థానం పౌరుష ప్రతాపాలకు పెట్టింది పేరు. పరాయిపాలన నుంచి దేశాన్ని విముక్తిచేయటానికి మొట్టమొదటిసారిగా తిరుగుబాటు మొదలైంది ఈ సంస్థానంలోనే. ఆ విప్లవ వీరుడు నారాయణప్పారావు. కుమార ధూర్జటి, అణివెళ్ల వేంకటశాస్త్రి, నారాయణశాస్త్రి, దిట్టకవి రాజయోగి, రామచంద్రకవి, మాడభూషి నరసింహాచార్యులు, మాడభూషి వేంకటాచార్యులు ఈ సంస్థానపు ప్రముఖ కవులు. వీరితోపాటు తిరుపతి వేంకట కవులు, మల్లాది సూర్యనారాయణశాస్త్రి, చిలకమర్తి, బుక్కపట్నం రాఘవాచార్యులు వంటి వాళ్లు ఈ సంస్థానంలో సన్మానాలు అందుకున్నారు. కుమార ధూర్జటి ‘పిల్ల వసుచరిత్ర’గా ప్రసిద్ధి పొందిన ‘ఇందుమతీ పరిణయం’ కర్త. కాకరపర్తికి చెందిన అణివెళ్ల వేంకటశాస్త్రి ‘అప్పారాయ యశశ్చంద్రోదయం’ అనే అలంకారశాస్త్రం రచించారు. దిట్టకవి రామయోగి కంచిలో పండితుల్ని గెలిచి, సత్కారాలు అందుకున్నాడు. ఇక మాడభూషి వేంకటాచార్యులు తెలుగువారి అవధాన కళకు ఆద్యులు. తొలి శతావధాని. నూజివీడు ప్రభువులూ రసవంతమైన రచనలు చేశారు. రాజా రంగయ్యప్పారావు ‘షానామా’ అనే పార్శీ కావ్యాన్ని తెలుగులోకి అనువదించారు. ఆయన చొరవతోనే విజయవాడలో ఎస్‌.ఆర్‌.ఆర్‌. (శ్రీమంతు రాజా రంగయ్యప్పారావు) కళాశాల ఏర్పడింది. ఆయన దత్తపుత్రుడు వేంకటాద్రి అప్పారావు రామదాసు ‘జ్యోతిర్లీల, గోవర్ధనోద్ధరణం’ నాటకాలతో పాటు ‘ఆంధ్రాష్టపదులు, శోభనాచల మాహాత్మ్యం’ తదితర కావ్యాలు రచించారు. ముసునూరు పాలకుడైన రామచంద్ర అప్పారావు సంస్కృతాంధ్ర పారశీక భాషల్లో పండితుడు. విశ్వనాథ తన ‘అనార్కలి’ నాటకాన్ని ఈయనకే అంకితమిచ్చారు. ఈయన మరణించినప్పుడు తిరుపతి కవులు చెప్పిన ‘‘రాజులు లేరే లోకమున? రాజులుగా గలరేమి లాభ?మీ/ తేజము, రంజకత్వమును దేకువ లోకువగాని శక్తియున్‌/ భోజునివంటి పాండితియు, బోల్చెడి వాడెవడో వచింపు, మిం/ కీజన పాలురందు ధరణీశ శిఖామణి! యప్పరాడ్విభా!’’ పద్యం జమీందారు వైభవాన్ని, సాహితీ పోషకత్వాన్ని ప్రకటిస్తుంది. 
      ఉయ్యూరు కుమారరాజా (రంగయ్యప్పారావు బహద్దూర్‌ విద్యావేత్త, క్రీడాకారుడు, రచయిత. ఉమర్‌ఖయ్యాం రచనల్ని తెలుగులోకి అనువదించారు. ‘ఆంధ్రుల చరిత్ర, గీతగోవిందం’ (ఆంగ్లానువాదం) వంటి రచనలెన్నో చేశారు. కాకినాడ, శ్రీకాకుళం, నూజివీడుల్లో పీజీ కేంద్రాలు ఏర్పాటయ్యేలా కృషిచేశారు. నూజివీడులో ధర్మ అప్పారావు కళాశాల స్థాపించారు.
సాహితీ కల్పవల్లి ‘చల్లపల్లి’ 
దివి తాలూకాలోని పురాతన సంస్థానం ‘చల్లపల్లి’. శ్రీకృష్ణ లీలాతరంగిణి రాసిన నారాయణతీర్థులు, కూచిపూడి నాట్య సిద్ధాంత కర్త సిద్ధేంద్రయోగి, ముక్తేవి పెరుమాళ్లయ్య కవి ఇక్కడివారే. ఇక శ్రీకాకుళం అనగానే గుర్తుకువచ్చే కాసుల పురుషోత్తమకవి చల్లపల్లి రాజైన ఇమ్మడి అంకినీడు బహద్దూర్‌ ఆస్థానకవి. ఈయన ఆంధ్రనాయక శతకకర్త. ‘చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్యభావ హతవిమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ’ మకుటంతో సాగే ఈ శతకం నిందాస్తుతికి నిండైన ఉదాహరణ. చల్లపల్లి పాలకుడు మల్లికార్జున ప్రసాద్‌ బహద్దూర్‌ ఉర్దూ, ఇంగ్లీషు, సంస్కృతం, తెలుగు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్నవారు. చిత్రకళ, వ్యాయామం, ఛాయాగ్రహణం, ఆయుర్వేదాల్లో కూడా అభినివేశం ఉంది. స్వయంగా వీణ వాయించేవారు. కృష్ణాపత్రికలో అనేక వ్యాసాలు రాశారు. ఈయన ఆస్థాన పండితుడైన దేవినేని సూరయ్య ‘హనుమదభ్యుదయం, వీరరసపుత్రీయం, వైద్యరహస్య దీపిక’ మొదలైన రచనలెన్నో చేశాడు. జంగం కోటయ్యగా ప్రసిద్ధి పొందిన వాగ్గేయకారుడు గరికపర్తి కోటయ్య దేవర చల్లపల్లి ఆస్థాన సంగీత విద్వాంసుడు. 
      చల్లపల్లి సంస్థానాధీశుల్లో అమిత కీర్తిసంపన్నుడు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్‌ బహద్దూర్‌. ఈయన పట్టాభిషేకానికి దేశంలోని కవిపండితులంతా వచ్చారు. ఈయనతో సత్కారం అందుకోని కళాకారులు ఆంధ్రదేశంలోనే లేరు. దివిసీమకు చెందిన పారుపల్లి రామకృష్ణయ్య ఆధునిక త్యాగరాజుగా కీర్తిపొందారు.  
సాహితీకేదారం 
ముక్తికి నిలయమైన క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ముక్త్యాల సాహితీ సుమాలు విరబూసిన అమరావనం. సుప్రసిద్ధ కవులు తాతంభట్టు గురుమూర్తిశాస్త్రి (కృష్ణానదీ మాహాత్మ్య కావ్యకర్త), కొప్పరాజు సుబ్బకవి (కాంచీమాహాత్మ్య కర్త), అమరవాది రామకవి (ద్రౌపదీ పరిణయ ప్రబంధ కర్త), ఆతుకూరి పాపకవి (లలితాంబోపాఖ్యాన రచయిత) తదితరులందరూ ముక్త్యాల రాజుల పోషణలోని వారే. శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి తన ‘వేదాద్రి మాహాత్మ్యం, శ్రీకృష్ణభారతం’ కావ్యాలను రాజా చంద్రమౌళీశ్వర ప్రసాద్‌కు అంకితమిచ్చారు. శ్రీపాదకు జీవితాంతం చేదోడువాదోడుగా నిలిచింది ముక్త్యాల సంస్థానమే. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి కూడా ఎన్నోసార్లు ముక్త్యాల రాజు సత్కారాలు అందుకున్నారు. ‘ఈ రాజుల దాతృత్వానికి భయపడి మా ఇంటి కార్యాల శుభలేఖ పంపించటం కూడా మానేశాను. అయినా రాజావారి కానుకలు అందుతూనే ఉన్నాయి’ అని చెళ్లపిళ్ల అన్నారంటే ముక్త్యాల ప్రభువుల సాహితీపోషణ గురించి అర్థం చేసుకోవచ్చు. విశ్వనాథ రామాయణ కల్పవృక్షానికి చంద్రమౌళీశ్వర ప్రసాద్‌ ప్రత్యక్ష శ్రోత. ముక్త్యాల చివరి జమీందారు రామగోపాలకృష్ణ మహేశ్వరప్రసాద్‌. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ ఈయన చలవే. ఆంధ్రదేశంలో నాటి సుప్రసిద్ధ కవులందరూ ఈ జమీందారు సత్కారాలు అందుకున్నారు. 
తెలుగు నాటకానికి మైల‘వరం’ 
తెలుగు నాటకం ఇంకా బతికి ఉందంటే అది మైలవరం జమీందారుల కళాప్రియత్వం వల్లే! రాజా సూరానేని పాపారావు ‘బాలభారతి’ పేరుతో నాటక సమాజం ఏర్పాటుచేసి, నాటక రచయితలు, దర్శకులు, కళాకారులను పోషించారు. విజయవాడలోనూ కళాకారుల కోసం భవనాలు నిర్మించిన ఘనత ఈయనది. నగరంలోని హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి కళాకారులు ఇప్పటికీ పూజలు చేస్తుంటారు. నాటకాలతోపాటు సాహిత్యాన్నీ ఈ జమీందార్లు పోషించారు. ఈ సంస్థానపు కవుల్లో సూరవరపు వేంకట సోమయాజులు (‘సుందరకాండ విశ్లేషణ’ కర్త), సూరవరపు లక్ష్మీపతిశాస్త్రి (గాయత్రీ మంత్రార్థ వివేకం), నందివెలుగు వేంకటేశ్వరశర్మ (శివశతకం), మల్లాది అచ్యుతరామశాస్త్రి (‘అహల్య’ నాటకం) ప్రసిద్ధులు. అయ్యపు వెంకటకృష్ణయ్య విప్లవ సాహిత్యం రాశారు. మైలవరం, విజయవాడల్లోని ఎన్నో విద్యాలయాలకు ఈ ప్రభువులు దానాలు చేశారు. 
కళాసాహిత్యాల ఇల్లు 
సంగీత, నృత్య, సాహిత్య, చిత్రకళలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి పొందిన సంస్థానం వల్లూరు. ఇదే నేటి తోట్లవల్లూరు. ఈ సంస్థానాన్ని పరిపాలించిన ఇమ్మడి నాగన్ననాయుడు కవిపండితులను బాగా పోషించేవారు. ప్రఖ్యాత వావిళ్ల రామస్వామిశాస్త్రులు ముద్రణాలయానికి ఎంతో ఆర్థిక సాయం చేశారు. ఈయన ఆస్థానంలోని మతుకుమల్లి నరసింహశాస్త్రి ‘ఆంధ్ర మేఘసందేశం, ఆంధ్ర సిద్ధాంత కౌముది’ లాంటి గ్రంథాలు  రచించారు. గరికపర్తి కోటయ్యదేవర ఆస్థాన గాయకుడిగా, తోట నరసయ్య ఆస్థాన మల్లయోధుడిగా ఉండేవారు. 
నరసరావుపేట అక్షరాదరణ
నరసరావుపేట సంస్థానంలో ఆనాడు మైదవోలు కలిసి ఉండేది. ఈ ప్రాంతానికి చెందిన ప్రఖ్యాత కవి అహోబల పండితుడికి ఉమ్మడివరం అగ్రహారాన్ని దానం చేశారు నరసరావుపేట సంస్థానాధీశుడు మల్రాజు. దిట్టకవి నారాయణ కవి రచించిన ‘రంగరాయ చరిత్రము’ నాటి పాలకుల జీవనశైలి, పాలన ఔన్నత్యం తదితరాలకు అద్దంపడుతుంది. ఈ నారాయణకవి కుమారుడు రామచంద్రకవి ‘రఘుతిలక ఉద్దండ గోపాలరాయ శతక’ కర్త. రాజా మల్రాజు పెదవేంకట గుండారాయుడి ఆస్థానంలో తాడికొండ మల్లనారాధ్యుడు, పట్టాభిరామ కవి, మతుకుమల్లి కనకాద్రిశాస్త్రి లాంటి కవి పండితులు ఉండేవారు. వారిలో పట్టాభిరామ కవి కృతుల పేర్లే గమ్మత్తుగా కనిపిస్తాయి. ‘కవిసర్పగారుడం, కవి మూషిక మార్జాలం, వజ్రపంజర కవచం’ తదితర గ్రంథాలను ఈ కవి రచించాడు. తాడికొండ మల్లనారాధ్యుడు అయితే ప్రభువును తన కవితాశక్తితో మెప్పించి నందివెలుగు గ్రామంలో ఒక మాన్యం పొందాడు. రాజా మల్రాజు వేంకట నృసింహారావు కాలంలో వేంకట పార్థసారథి కవులు అనే జంటకవులు ఉండేవారు. వీరు ‘విచిత్ర రాఘవం’ అనే నాటకాన్ని రచించారు. అలాగే వేంకటరామ నృసింహాచార్యులు ఆస్థాన పండితుడు, విద్యా పరీక్షకుడు. 
హారతిపట్టిన అమరావతి
అమరావతి సంస్థానాధీశులుగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి తండ్రి, తాతలందరూ సాహిత్య పోషణ చేసినవారే. వెంకటాద్రినాయుడు సంస్కృతాంధ్ర, తురుష్క భాషలలో పండితుడు. ఈయన ఆస్థాన పండితుడు ములుగు పాపయారాధ్యుడు. వెంకటాద్రినాయుడి కుమారుడు జగన్నాథనాయుడి ప్రేరణతో పాపయారాధ్యుడు దేవీ భాగవతాన్ని ఆంధ్రీకరించాడు. ఈ కవి పండితుడు తెలుగు సంస్కృత భాషలలో వందలాది గ్రంథాలను రచించాడు. వాసిరెడ్డి ప్రభువులు చివరిదాకా సాహిత్య పోషణ చేస్తూనే ఉన్నారు. మరోవైపు... రాజా హరిహర ప్రసాదు బహదూర్‌ స్వయంగా సంస్కృతాంధ్ర భాషా పండితుడు. ఉన్నతవిద్యలో పట్టభద్రుడు. 1925లో పొన్నూరు భావనారాయణస్వామి సన్నిధిలో ఓ వేదశాస్త్ర పాఠశాలను స్థాపించారు. అదే వృద్ధి చెంది ప్రాచ్య కళాశాలగా రూపొందింది. ఈయనకు అవధానం, ఆశుకవిత అంటే అభిమానం ఎక్కువ. అష్టావధానాలు, శతావధానాల్లో పృచ్ఛకుడుగా పాల్గొంటూ ఉండేవారు. 
సాహిత్య సిరిమల్లె రేపల్లె
గుంటూరు మండలంలో వెలసిన ప్రాచీన సంస్థానాలలో రాచూరు, రేపల్లె కూడా ఉన్నాయి. మొదట్లో ఒకే సంస్థానంగా ఉండేవి. తర్వాత విడిపోయాయి. రేపల్లె జమీందారు జంగన్న ‘సప్తసంతానా’లను ప్రోత్సహించినట్లు కనిపిస్తుంది. అయితము వేదావధానులు, రాయప్రోలు సూరంభొట్లు, పట్టెము రామలింగదీక్షితులు, పోతుకుచ్చి పాపంభొట్లు, నేతి తెలగావధానులు, బూరుగుల నిమ్మంభొట్లు తదితర పండితులకు భూమిని దానం చేశారు. జంగన్న తమ్ముడు తిరుపతిరాయడు. ‘ధనుర్విద్యావిలాసం’ అనే కావ్యరచనకు ప్రోత్సాహాన్ని అందించాడు. ఈ కావ్యకర్త కృష్ణమాచార్యుడు. అలాగే, రేపల్లె సంస్థానాధీశుల ఆదరణను పొందిన మరో కవి ఉరుటూరి వేంకటకృష్ణ కవి. ఈయన ‘ఆకాశ రావణ సంహారం’ అనే గ్రంథాన్ని రాశాడు. ఈ జమీందారి వారసులలో చివరివాడైన రాజా మాణిక్యారాయవేెంకట హయగ్రీవరావు బహద్దర్‌ కూడా సాహిత్యాభిమాని, విద్యా పోషకుడు. వేద విద్యావ్యాప్తికి సహకరించాడు. ఇలా అమ్మభాషకు గొడుగుపట్టిన ఈ సంస్థానాధీశులందరూ స్మరణీయులే.
 


వెనక్కి ...

మీ అభిప్రాయం