యువ సాహిత్య ‘చైతన్యం’

  • 265 Views
  • 5Likes
  • Like
  • Article Share

కల్పనాదత్, ప్రీతిలతా వడ్దేదార్, ఇందుమతీ సింగ్, సుహాసినీ గంగూలీ...  వీరంతా భారత స్వాతంత్య్రం కోసం విప్లవబావుటా ఎగరేసిన వీరవనితలు. వీరి కార్యకలాపాలకు వేదిక బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌. భారత స్వాతంత్య్రోద్యమంలో స్ఫూర్తిదాయకమైన ఈ సంఘటన గురించి చాలామందికి తెలియదు. దీని స్ఫూర్తిగా చిట్టగాంగ్‌ ఆయుధాగారం మీద దాడిలో వనితల పాత్ర నేపథ్యంగా పుస్తకం రాశారు చైతన్య పింగళి. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ 2016 యువ పురస్కారం లభించింది. 
మనసుని
కదిలించడానికి పెద్ద సంఘటనలే ఎదురుకానక్కర్లేదు... చిన్న ఆధారమైనా చాలు. ఓ కొత్తలోకాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి అని నిరూపించారు చైతన్య. గర్భిణిగా తనకు దొరికిన విరామ సమయాన్ని ఎంతో ఇష్టమైన వ్యాపకం పుస్తక పఠనానికి కేటాయించుకున్నారు. అలా చదువుతున్నప్పుడే మాలినీ ఛటర్జీ రాసిన ‘చిట్టగాంగ్‌ అప్‌రైజింగ్‌’ ఆమె కంటపడింది. ఈ పుస్తకంలోని ఓ సందర్భం ఆమెలో ఆలోచన రేకెత్తించింది.  
      భారతీయుల్ని కుక్కలతో పోల్చిన యూరోపియన్‌ క్లబ్‌ ఉన్నది చిట్టగాంగ్‌ ప్రాంతంలోనే. దానిమీద దాడి చేసే ప్రయత్నంలో కల్పనాదత్‌ మరో ఇద్దరితోపాటు ఖైదుకు గురైంది. పోలీసులు వాళ్లను చిత్రహింసలకు గురిచేశారు. చొక్కాలు విప్పి, చేతుల్ని వెనక్కిపెట్టి మోకాళ్ల మీద నిలబడమన్నారు. ఆమెతోపాటు అరెస్టయిన ఇద్దరూ మగవాళ్లు. పరిస్థితి గమనించిన కల్పనాదత్‌ ‘‘నన్ను కూడా తీయమంటారా?’’ అని అడిగింది. ఆ ప్రశ్న బ్రిటిష్‌ పోలీసుల్ని నిర్ఘాంతపరిచింది. అది చదువుతున్నప్పుడే ఈ పోరాటం గురించి మరిన్ని వివరాలు సంపాదించాలనుకున్నారు చైతన్య. దీనికోసం బంగ్లాదేశ్‌లోని స్నేహితుల సాయంతో అక్కడి గ్రంథాలయాల నుంచి సమాచారం తెప్పించుకున్నారు. కలకత్తా వెళ్లి అక్కడి లైబ్రరీ ఆర్కైవ్స్‌ నుంచి ఫొటోలు, వివరాలను సేకరించారు. చరిత్ర పుస్తకాలను తిరగేశారు. బ్రిటిష్‌ రికార్డుల్నీ పరిశీలించారు.
      కల్పన గురించి తెలుసుకునే క్రమంలో ఎన్నోవిషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పోరాటంలో పాల్గొన్న ప్రీతిలతా వడ్డేదార్‌ 20వ శతాబ్దంలో అమరురాలైన మొదటి భారతీయ మహిళ. కల్పనాదత్‌ బాంబులు తయారుచేసిన మొదటి మహిళ. ఆపై సుహాసినీ గంగూలీ, ప్రేమలత, ప్రీతిలత, బీనాదాస్‌.. ఒక్కొక్కరి గురించీ తెలిసింది. వారి సాహసగాథలన్నింటినీ కలిపి పుస్తకంగా వేస్తే ఇంకొంతమంది స్ఫూర్తి పొందుతారనుకుని, మరిన్ని వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. మొదట్లో చరిత్ర గురించి కొంత చెప్పినా, ఆ వీరనారుల్ని కథా వస్తువులుగా మలిచి, కాస్త నాటకీయత జోడించి రాసేటప్పటికి ఏడాదిన్నర పట్టింది. మొత్తం రచన పూర్తయ్యేప్పటికి రెండేళ్లు దాటింది. ఈలోగా బాబు పుట్టాడు. ఆ బాబుకు ఖుదీరామ్‌బోస్‌ అని పేరుపెట్టుకున్నారు. వందేమాతర ఉద్యమం సమయంలో అమరుడైన యువకుడే ఖుదీరామ్‌. ఆ తర్వాత చైతన్య రచన ‘చిట్టగాంగ్‌ వనితలు’గా పుస్తకరూపం దాల్చింది. గతంలో రాసిన వ్యాసాలను ‘మనసులో వెన్నెల’గా పుస్తకంగా తీసుకొచ్చారు చైతన్య. మణిపుర్‌లో ఇరోమ్‌షర్మిల చేస్తున్న పోరాటాన్ని అక్షరీకరించడానికి ప్రస్తుతం సిద్ధమవుతున్నారు. 
అమ్మే స్ఫూర్తి  
చైతన్య పుట్టింది విజయవాడలో. హైదరాబాదులో డిగ్రీ చేశారు. తండ్రి దశరథ్‌ పాత్రికేయులు. అమ్మ సుశీల పాలిటెక్నిక్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ వార్డెన్‌గా పనిచేశారు. చైతన్యకు రెండేళ్ల వయసున్నప్పుడే నాన్న చనిపోయారు. చిన్నప్పటినుంచే కథలు రాయడం మొదలుపెట్టిన చైతన్య, రెండేళ్లు ఓ సంస్థలో పాత్రికేయురాలిగా, ఆపై ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా పనిచేశారు. ‘‘పదోతరగతి పాసైనప్పుడు అమ్మ నాకు మహా ప్రస్థానం. తమ్ముడికి ఓ చేతిగడియారం బహుమతిగా ఇచ్చింది. గడియారం తిరగడం ఆగిపోయిందే కానీ ఆ పుస్తకం ఇచ్చిన స్ఫూర్తి మాత్రం నాలో ఈ రోజుకీ అలాగే ఉంది. అదే పుస్తక పఠనం, రచనల పట్ల ఆసక్తి పెంచింది’’ అంటారు చైతన్య. ఆ ఆసక్తే ఇప్పుడు ఆమెకు సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందించింది. 
 


వెనక్కి ...

మీ అభిప్రాయం