జయమంగళం శుభమంగళం

  • 83 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। రంగురాజ పాపయ్య

  • చిగురుమామిడి, కరీంనగర్‌ జిల్లా.

మంగళం పాడటం అంటే కథ చెప్పడం పూర్తయిందనే సంకేతంతో పాటు విన్నవారికి శుభం కలగాలని పలికే పలుకులు. అంతేకాదు, దేవతానుగ్రహంతోనే ఈ సృష్టి మనుగడ సాగిస్తోంది కాబట్టి సృష్టి స్థితి, లయకారులకు కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పించుకోవాలన్న విశ్వాసమూ ఇందులో ఇమిడి ఉంది. ఈ నేపథ్యంలో ఆశ్రితకుల సాహిత్యంలోని ఓ రెండు మంగళహారతి పాటలివి..  
పోషక
కులాల దగ్గరికి వెళ్లి కథాగానం చేసే కళాకారుల సాహిత్యమే ఆశ్రితకుల సాహిత్యం. ఈ కథాగానాలు పూర్తయ్యాక మంగళహారతి పాటలను పాడుతుంటారు. వినసొంపుగా ఉండే ఈ గీతాల సాహిత్యమూ ఇంపుగా ఉంటుంది. ఈ పాటలు వింటే, చదివితే అందరికీ శుభం కలుగుతుందన్నది జానపద కళాకారుల నమ్మకం. సాధారణ పరిభాషలో మంగళం పాడటం అంటే విడిచిపెట్టడం/ ఆపేయడం అనే అర్థాలు స్థిరపడ్డాయి కానీ, నిజానికిది శుభం పలకడం, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం.
మాసయ్యలవారి కళాకారులు, రజకుల దగ్గర రజకపురాణం కథను ప్రదర్శిస్తారు. ముగింపు సమయంలో ప్రధాన కథకుడు మంగళహారతి పాడతాడు. ఇతర కళాకారులు హారతిపళ్లెం పట్టుకుని వీక్షకులకు బొట్లు పెడుతుంటారు. 
హారతి గొనుమా శ్రీ శివకుమార వీరభద్ర
బండయందు జన్మించి దేవతలను దునుమాడి
శివుని చెమటయందుపుట్టి
దక్షుని తలనరికి         
తండ్రిశబధమునేమో నెరవేర్చే ప్రభువర
అతిఘోరయుద్ధమందు అమరులను జయించి 
అతిఘోరయుద్ధమందు దక్షబ్రహ్మను వధించి
వయము శిరస్సుపెట్టి నీవు ఆలయమున వెలసిన
ఓ శివకుమార మహేశ్వర హారతిగొనుమా
ధరణిలో జమాళ్ల పెళ్లిదాముడు నర్సింహుని
హారతి గొనుమాపరమ భక్తితో రాసిన
హారతి గొనుమా మంగళహారతి ఇదిగో
రజక రాజపుత్రి మంగళహారతి ఇదిగో 
సావిత్రి వరమునందు పుట్టినదమ్మా 
మంగళహారతి ఇదిగో రజక రాజ
పుత్రి మంగళహారతి ఇదిగో
ఓ శివకుమార మహేశ్వర
మంగళం మంగళం మంగళం
శుభమంగళం

      అంటూ మాసయ్యలు రజక పురాణం పటం కథను చెప్పడం పూర్తిచేస్తారు. నాయకపోడు గిరిజనుల ఆశ్రితకులం వారైన ‘కొర్రాజులు’ మంగళహారతి పాటలను చాలా శ్రావ్యంగా పాడతారు. ప్రధాన కథకుడు పాట పాడుతుంటే.. వంతలు వంతపాడుతూ వాద్య సహకారం అందిస్తారు. వీక్షకుల్లో భక్తితత్త్వాన్ని పెంచేలా ఉంటాయి వారి గీతాలు. ఈ మంగళహారతుల్లో మకుటం లాంటి  పాట ఇది..  
పట్టుచీర ఘనమైన
పట్టురైక ఘనమైన 
పార్వతీ పరమేశానీకు నివ్వాళీ.. 
జయమంగళం శుభమంగళం
జయమంగళం లక్ష్మీకళ్యాణం
తెల్లని మనసడిగే... దేవరథమే అడిగే     
దేవుడా ధర్మరాజ నీకు నివ్వాళీ.. 
జయమంగళం శుభమంగళం
జయమంగళం, శుభశోభనం
పిడికెడు నడుమైన... భీమ భీరధులైన     
వినవయ్య భీమయ్య నీకు నివ్వాళీ.. 
జయమంగళం శుభమంగళం
జయమంగళం శుభశోభనం
తెల్లని విల్లడిగే... దేవరథంబడిగే ।।2।।
వినవయ్యా అర్జున నీకు నివ్వాళి.. 
జయమంగళం - శుభమంగళం
జయమంగళం - శుభశోభనం
బూసింత బూసింది బూసింతగాసింది ।।2।।
భూశక్తి నకులుడా నీకు నివ్వాళి..  
జయమంగళం - శుభమంగళం
జయమంగళం - శుభశోభనం
కల్జామపూసింది కల్జామకాసింది    ।।2।।
కడగొట్టు సహదేవ నీకు నివ్వాళీ.. 
జయమంగళం - శుభమంగళం
జయమంగళం - శుభశోభనం
అగ్నిలో పుట్టింది, అగ్నిలో పెరిగింది    
పాంచాలీ ద్రౌపదీ నీకు నివ్వాళీ.. 
జయమంగళం - శుభమంగళం
జయమంగళం - శుభశోభనం
పాండవపుత్రులైన మల్లెపూల దండ వినరయ్యా 
పాండురాజ మీకు నివ్వాళి.. 
జయమంగళం, శుభమంగళం
జయమంగళం, శుభశోభనం 

      కొర్రాజులు పాండవుల కథలను చెబుతూ.. వారికి వందనాలు సమర్పించుకుంటూ మంగళహారతి పాడతారు. 
      శాంతికి ప్రతీక అయిన ధర్మరాజుది పాల వంటి స్వచ్ఛమైన మనసు అంటారు. నడుము సన్నగా ఉండే భీముడు అతిబలవంతుడని చెబుతారు. విలువిద్యల్లో ఆరితేరిన అర్జునుడు, చింతపువ్వు లాంటి నకులుడు, వీళ్ల కడగొట్టు సోదరుడు సహదేవుడు, వీరితోపాటు అగ్నితేజాన్ని నింపుకున్న ద్రౌపదీదేవి..  ఇలా అందరినీ స్మరించుకుంటూ నివాళి పలుకుతారు. ఈ గీతాలతో పాటు ఆశ్రిత కులాల కళాకారులందరూ పాడే మంగళహారతులన్నీ ప్రత్యేక అధ్యయనాంశాలే. 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం