మన కళలకు జాతీయ గౌరవం

  • 1009 Views
  • 3Likes
  • Like
  • Article Share

కళలు... జాతి సాంస్కృతిక వికాసానికి పట్టుకొమ్మలు. అందుకే కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం 1965 నుంచి జాతీయ పురస్కారాలు, 2002 నుంచి శిల్పిగురు పురస్కారాలను ఇస్తోంది. 2012, 2013, 2014 సంవత్సరాలకు గాను తెలుగు రాష్ట్రాల నుంచి అయిదుగురికి జాతీయ పురస్కారాలు, ఒకరికి విశిష్ట హస్తకళాకారులకు ఇచ్చే ‘శిల్పిగురు’ పురస్కారం లభించాయి. వాటిని 2015 డిసెంబరు 9న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రదానం చేశారు. తెలుగు పతాకాన్ని జాతీయస్థాయిలో ఎగరేసిన ఆ కళాతపస్వులకు కైమోడ్పులు.
కోవ నానేశ్వర్‌
జిల్లా కేస్లాగూడకు చెందిన ఆదివాసీ. నిరక్షరాస్యుడు. కానీ తాత ముత్తాతల నుంచి వారసత్వంగా సంక్రమించిన డోక్రా హస్తకళలో ఆయన ప్రతిభ శిఖర సమానం. అదే ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విశిష్ట పురస్కారం ‘శిల్పి గురు’ను సంపాదించి పెట్టింది.
      డోక్రా పశ్చిమ బెంగాల్‌లో పుట్టిపెరిగిన కళ. అక్కడి ‘డోక్రా డామర్‌’ అనే ఆదివాసీ తెగకు చెందినవారు కమ్మరి పనిలో భాగంగా ఇనుపచక్రాలు తయారు చేస్తూ ఉపాధి పొందేవారు. అదే నైపుణ్యంతో వారి ఆరాధ్య దైవాలను అలంకరించేందుకు వస్తువులు తయారుచేయడం మొదలుపెట్టారు. అదే క్రమంగా డోక్రా కళగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఈ కళాకారులు మధ్యప్రదేశ్‌, ఒడిశా, బిహార్‌, బెంగాల్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు.
      డోక్రా కళాఖండం తయారుచేయాలంటే... ముందుగా బంకమట్టిని, వరిపొట్టును కలిపి నీళ్లతో నానబెట్టి కావాల్సిన శిల్పం అచ్చును రూపొందిస్తారు. తర్వాత తేనెతుట్టె మైనంతో సన్నటి తీగను తయారుచేసి దానితో ఆ అచ్చుకు సన్నటి రంధ్రం చేస్తారు. బాగా మరిగించిన ఇత్తడి ద్రవాన్ని ఓ రంధ్రం గుండా అచ్చు అంతటా వ్యాపించేలా చేస్తారు. ఆ ఇత్తడి ద్రవం చల్లారేదాకా అలాగే ఉంచుతారు. తర్వాత పైన మట్టిని తొలగిస్తారు. అంతే కావాల్సిన కళాఖండం సిద్ధం. అయితే అచ్చుల్ని ఎప్పటికప్పుడు కొత్తగా తయారు చేసుకోవాల్సిందే! ఒకసారి తయారుచేసిన అచ్చు ఒకసారికే పనికొస్తుంది. అంటే ఏ డోక్రా కళాఖండమూ ఒకేలా ఉండదు.
అలా అడుగుపెట్టింది
వందేళ్ల కిందటే ఈ కళ తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఆదిలాబాదులోకి ప్రవేశించింది. జిల్లాలోని పిట్టబొంగరం వాసి ఆత్రం మారుతి తొలి స్థానిక డోక్రా కళాకారుడు. ఆయననుంచి జంగాం గ్రామానికి చెందిన ఆత్రం జయరామ్‌; ఆయన దగ్గర నానేశ్వర్‌ తండ్రి రామ్‌చందన్‌ దీన్ని అందిపుచ్చుకున్నారు. రామ్‌చందన్‌ నుంచి నానేశ్వర్‌కు వారసత్వంగా వచ్చిందీ కళ. తెలుగునాట డోక్రా ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఉంది. విశాఖపట్నం మన్యం ప్రాంతంలో దీనిని పోలిన హస్తకళ ఉన్నా కానీ రెండింటికీ మధ్య చాలా తేడా ఉంది.
      1985లో ఆదిలాబాదు జిల్లాలో జంగుబాయి గిరిజన హస్తకళ పారిశ్రామిక సహకార సంఘాన్ని ఏర్పాటుచేసింది ప్రభుత్వం. దానికి అధ్యక్షుడిగా నానేశ్వర్‌ను నియమించారు. తర్వాత ఆయన చొరవతో జిల్లాలోని ఉషేగావ్‌లో హస్తకళాభివృద్ధి సంస్థ ఏర్పాటైంది. గోల్కొండ (పాత లేపాక్షి) హస్తకళా కేంద్రంలో డోక్రా కళాఖండాల విక్రయాలూ ప్రారంభమయ్యాయి. .
ప్రావీణ్యంతోనే గుర్తింపు...
ఆదివాసీ ఆరాధ్య దేవతల అలంకరణ వస్తువులతోపాటు అలంకరణ కళాఖండాలు, దీపాలు, నంది, గంటలు వంటి రెండు వందల రకాల ఇత్తడి కళారూపాలను తయారుచేయడంలో నానేశ్వర్‌ది అందెవేసిన చేయి. దిల్లీ, మైసూర్‌, చెన్నైల్లో జరిగిన ప్రదర్శనలకు హాజరయ్యారు. కేస్లాగూడలో గతంలో ఆయన ఒక్కరే కళాకారుడు. ప్రస్తుతం 25 కుటుంబాలు ఈ కళతో ఉపాధి పొందుతున్నాయి. తండ్రి దగ్గర కళను నేర్చుకున్న నానేశ్వర్‌, తన కుమారులు భూమేశ్వర్‌, రాంచందర్‌, కాశీరామ్‌లకూ దీన్ని నేర్పించారు.
      నానేశ్వర్‌ 1993లో రాష్ట్ర హస్తకళా పురస్కారానికి ఎంపికయ్యారు. 2005లో జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు ‘శిల్పి గురు’ అయ్యారు. ప్రపంచీకరణ, యంత్రీకరణలతో దిగాలుపడుతున్న హస్తకళల కళాకారులకు స్ఫూర్తిగా నిలిచారు. 

- మహ్మద్‌ రహీముద్దీన్‌, ఉట్నూరు, ఆదిలాబాదు, 8008573607


ఇత్తడిపై ‘రాజముద్ర’
పెంబర్తి... వరంగల్లు జిల్లాలో ఉన్న ఈ వూళ్లొ ఎక్కడ చూసినా రాగి, జింకుల మిశ్రమలోహం ఇత్తడితో తరాలుగా ఆటలాడుకుంటున్న హస్తకళాకారుల పనితనమే కనిపిస్తుంది. ఈ కళ కాకతీయుల కాలంలోనే పురుడు పోసుకుందట. అప్పట్లో రాచరికం, దేవాలయ అవసరాలకు ఉపయోగపడిన ఈ కళ ప్రభావం తర్వాత కొడిగట్టింది. తిరిగి పునర్వైభవం పొందింది నిజాం నవాబుల కాలంలోనే. ఈ కాలంలో పాన్‌దాన్లు, అత్తరు బుడ్డీలు లాంటి అంతఃపుర వస్తువులకు ఆదరణ లభించింది. ప్రస్తుతం వేలాడే దీపాలు, పంచలోహ విగ్రహాలు, జ్ఞాపికలు, పూజా సామగ్రి, ఉత్సవ వాహనాలు తదితర విభాగాలకు విస్తరించింది. 800 ఏళ్ల నాటి ఈ కళకు పట్టంకడుతూ రంగు వెంకటేశ్వర్లుకు ప్రభుత్వం జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
      పెంబర్తికి చెందిన దేవేంద్రమ్మ, నరసింహాచారి దంపతులకు జన్మించారు రంగు వెంకటేశ్వర్లు. ఇత్తడి హస్తకళా కుటుంబం కావడంతో, బాల్యం నుంచే ఈ వృత్తి అంటే ఆసక్తి పెంచుకున్నారు. విశిష్ట కళాకారుడు అయిలాచారి శిక్షణలో రాటుదేలారు. కాలానికి అనుగుణంగా కళలో కొత్తకొత్త నమూనాల్ని సృష్టించారు. వాటికి ప్రచారం కల్పించారు. అవసరాలకు అనుగుణంగా కొత్త పనిముట్లనూ తయారుచేశారు. ఈ కఠోర పరిశ్రమే ఆయన్ను మాస్టర్‌ క్రాఫ్ట్‌మన్‌గా నిలబెట్టింది. వెంకటేశ్వర్లు పనితనానికి... ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం ప్రధాన ద్వారం దగ్గర కనిపించే రాజముద్ర; భారత ప్రభుత్వం ఇంగ్లండు రాణి ఎలిజబెత్‌కు బహూకరించిన జ్ఞాపిక గీటురాళ్లుగా నిలుస్తాయి. ఇవేకాదు... 1975 ప్రపంచ తెలుగు మహాసభల్లో ఎంబోజింగ్‌ ప్రక్రియలో కళాఖండాన్ని రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. 1979 అంతర్జాతీయ ట్రేడ్‌ఫెయిర్‌లో పాల్గొన్నారు. ఇటలీలోని మిలానో వ్యాపార మేళాలో ప్రదర్శన ఇచ్చారు. పెంబర్తి కంచుకళలో వెంకటేశ్వర్లుది 43 సంవత్సరాల అనుభవం. తన కళా కౌశలానికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ క్రాఫ్ట్స్‌ కౌన్సిల్‌, ఉగాది పురస్కారం, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల గౌరవాలు పొందారు.

- నర్సింగరావు, హైదరాబాదు


కలంకారిలో భారతీయత
కలంకారి చిత్రలేఖనానిది సుదీర్ఘమైన చరిత్ర. నాటి హరప్పాలోనూ దీని ఆనవాళ్లు లభ్యమయ్యాయి. బౌద్ధ చైత్యాలు, విహారాలనూ కలంకారి వస్త్రాలతో అలంకరించేవారట. తెలుగునాట ఈ కళకు మచిలీపట్నం, శ్రీకాళహస్తి ప్రసిద్ధిచెందిన పట్టణాలు. వస్త్రాల మీద సహజమైన రంగులతో వివిధ చిత్రాలను అద్దే ఈ కళకు అంతర్జాతీయ ఖ్యాతి ఉంది. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం టంగుటూరు గ్రామవాసి శివప్రసాద్‌రెడ్డి ఈ కళలో రాణిస్తూ జాతీయస్థాయి గుర్తింపు పొందారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలో ‘ఈనాడు’లో వచ్చిన కలంకారి చిత్రాలు చూసి, ఆ కళ మీద ఇష్టం పెంచుకున్నారు. తర్వాత రెండేళ్లపాటు రాంభోజనాయక్‌ దగ్గర కలంకారి మెలకువలు ఒడిసి పట్టుకున్నారు. రామాయణం, భాగవతం, భారతం, ప్రకృతి సౌందర్యాలు ఆయన కుంచెతో అందమైన కలంకారి బొమ్మలుగా మారిపోతాయి. వీటిని చిత్రించడంలో కరక్కాయ, దానిమ్మ, మంజిష్ట, మోదుగ పువ్వు, బెల్లం, పటిక, ఇండిగో, జాజి తదితర చెట్లతో తయారయ్యే సహజ వర్ణాలను ఉపయోగించడం విశేషం.
కలంకారిలో శివప్రసాద్‌రెడ్డి భారతీయ సంస్కృతికి పెద్దపీట వేశారు. 50 మీటర్ల వస్త్రం మీద రెండువేల చిత్రాలను గీయడం ఆయన ప్రతిభకు తార్కాణం. ముంబయి, బెంగళూరు, హైదరాబాదు, మైసూర్‌ తదితర ప్రాంతాల్లో జరిగిన ప్రదర్శనలో పాల్గొని పురస్కారాలు అందుకున్నారు. బుద్ధుడి జీవితం మీద గీసిన చిత్రాలకు 1995లో అప్పటి కేంద్రమంత్రి చిదంబరం, దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఏ.ఆర్‌.లక్ష్మణన్‌ల చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. 2004లో ట్రీ ఆఫీస్‌ కలంకారి చిత్రాలకు యునెస్కో పురస్కారం పొందారు. 2007లో రామాయణం, మహాభారతాలపై ఒకేసారి చిత్రాలను గీసి లిమ్కా బుక్‌ఆఫ్‌ రికార్డు సాధించారు 2010లో డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా ప్రశంసాపత్రాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వరించిన జాతీయ పురస్కారం... ఆయన కుంచెలోంచి జాలువారిన బుద్ధుడి చిత్రంలోని సౌందర్యానికి కట్టిన పట్టం!  

- నగేష్‌, బనగానపల్లి, కర్నూలు జిల్లా 


తోలుబొమ్మలే జీవనాధారం
తోలుబొమ్మలు తెలుగువారి ప్రాచీన సామూహిక ప్రదర్శన కళ. పాల్కురికి సోమన కాలానికే ఇవి ప్రదర్శనలో ఉన్నట్లు ‘భారతాది కథల జీరమఱుగుల - నారంగ బొమ్మల నాడించు వారు’ అన్న మాటలనుంచి తెలుస్తోంది. గూడూరు (వరంగల్‌ జిల్లా)లో లభ్యమైన కాకతీయుల కాలం నాటి శాసనంలో కూడా తోలుబొమ్మలాటల ప్రస్తావన ఉంది. అయితే కాలంతో పాటు వచ్చిన మార్పుల్లో భాగంగా ఇతర జానపద కళల్లాగే తోలుబొమ్మలాట కూడా కనుమరుగయ్యే దశకు చేరుకుంది. కళాకారులు కూడా అక్కడక్కడ కనిపిస్తారు. అందులో అనంతపురం జిల్లా ధర్మవరం ఒకటి.
తెలుగునాట ఈ కళకు ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లా ప్రసిద్ధిచెందింది. అక్కడే తోలుబొమ్మల తయారీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మాత్రం ధర్మవరంలోనే ఈ కళాకారులు కనిపిస్తారు. సుమారు రెండువందల సంవత్సరాల కింద ఇక్కడ తోలుబొమ్మల తయారీ, ప్రదర్శన మొదలైందట. అయితే ఆధునికత ఈ కళనూ మసకబార్చినా, ఇప్పటికీ దాన్నే నమ్ముకుని... తోలుబొమ్మలు తయారుచేస్తూ, ప్రదర్శిస్తూ అది అంతరించకుండా కృషి చేస్తున్నారు షిందే సోదరులు ఆంజనేయులు, మారుతీరావు. వారి కళా తపస్సుకు గుర్తింపునిస్తూ భారత ప్రభుత్వం జాతీయ పురస్కారాలు ప్రదానం చేసింది.
ధర్మవరం పట్టణం సిద్ధయ్యగుట్ట కాలనీకి చెందిన ఆంజనేయులు, మారుతీ రావు తోలుబొమ్మల ప్రదర్శనలోనూ, తోలుబొమ్మల తయారీలోనూ సిద్ధహస్తులు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామ ఘట్టాలను తోలు మీద చిత్రీకరించి, వాటికి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు ఆంజనేయులు. ఆ ప్రతిభకే 2014 సంవత్సరానికి జాతీయ పురస్కారం లభించింది. తోలుబొమ్మల కళలో ఆయనది నలభైకి పైగా ఏళ్ల కృషి. ఆదరణ లేకున్నా తన తాత ముత్తాతల వారసత్వ సంపదగా భావించి, తోలుబొమ్మలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్న కుటుంబం ఆయనది. ఈ విషయాన్నే ‘తోలుబొమ్మలు మా జీవనాధారం. బెంగళూరులో ఉంటున్న నా మనవడికి కూడా ఈ కళను నేర్పుతున్నాను. ఇంకా మా దగ్గరికి వచ్చే ఔత్సాహికులకు కూడా కళావిజ్ఞానాన్ని అందిస్తున్నామ’ని సంతోషంగా చెబుతారాయన.
అంతర్జాతీయ స్థాయిలో సైతం మెప్పు పొందిన కళా ప్రతిభ ఆంజనేయులు సొంతం. ఆయనకు ప్యారిస్‌లో జాతీయ పురస్కారం లభించింది. స్పెయిన్‌ ప్రశంసాపత్రం ప్రదానం చేసింది. ఇప్పటికీ ప్రభుత్వ హస్తకళల కేంద్రాల తరఫున విద్యార్థులకు తోలుబొమ్మల కళను బోధిస్తున్నారాయన.ఇక ఆంజనేయులు సోదరుడు షిందే మారుతీరావుది ఈ రంగంలో ముప్ఫై ఏళ్ల పరిశ్రమ. కళానైపుణ్యానికి విలక్షణతను జోడించి ఆయనా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన 2012 ఏడాదికి శ్రీకృష్ణలీలలు తోలుబొమ్మకు జాతీయ పురస్కారం అందుకున్నారు.
తొలుబొమ్మలాట తెలుగుజాతి ఆస్తి. ‘మాకు వారసత్వంగా సంక్రమించిన కళకు చిరాయువును ఇవ్వడం మా ధర్మం’ అనే.. షిందే సోదరులలాంటివారే ఆ కళను బతికించగలరు.  

- చంద్రశేఖర్‌, ధర్మవరం, అనంతపురం


ప్రతిభను గుర్తించారు...:
తోలుబొమ్మల తయారీలో చిన్నప్పటినుంచీ ప్రవేశం ఉంది. తోలుబొమ్మల్లో కీలకం రామాయణ, మహాభారత ఘట్టాలు. కురుక్షేత్ర సంగ్రామం ఘట్టాలను ఒకే తోలుబొమ్మపై చిత్రీకరించి వాటికి రంగులు అద్దాను. దీనికోసం 20 రోజులు శ్రమించాను. దానిని జాతీయ పురస్కారం కోసం పోటీలకు పంపాను. అది ఎంపిక కావడం, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందుకోవడం సంతోషకరం. నా ప్రతిభకు గుర్తింపు లభించింది అనుకుంటున్నాను.  

- షిందే ఆంజనేయులు


అదృష్టంగా భావిస్తున్నాను:
జాతీయ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీకృష్ణలీలలు తోలుబొమ్మపై చిత్రీకరించి, దానికి నేపథ్యంగా దీపాన్ని రూపొందించి పోటీలకు పంపించాను. నా శ్రమకు ఫలితంగా జాతీయ పురస్కారం లభించింది. 

- షిందే మారుతీరావు


‘కనక’ కళా కౌశలం
చిత్రాలకు బంగారు రజనును అద్ది... వైవిధ్యభరితమైన అందాలను సృష్టించే కళ ‘బంగారు ఆకుల చిత్రకళ’. దీన్లో నవరత్న గుళికలనూ వినియోగిస్తారు. పన్నూరు గురుస్వామి కేశవులు ఇందులో ప్రసిద్ధిచెందిన కళాకారుడు. ఆయన చిత్తూరు జిల్లాలో కళాకారుల కుటుంబంలో 1955లో జన్మించారు. బంగారు ఆకు చిత్రకళ ఆయనకు వారసత్వంగా వచ్చింది. దాన్నే ఈ రోజుకూ కొనసాగిస్తున్నారు. ఆయన దాన్ని తన తండ్రి పన్నూరు గురుస్వామి దగ్గర నేర్చుకున్నారు. అన్నయ్య శ్రీపతి దగ్గర కూడా కళా రహస్యాలు ఔపోశన పట్టారు. చిన్నతనం నుంచే కళారంగంలో ఆసక్తి ఉన్న కేశవులు మద్రాసు నుంచి చిత్రకళలో డిప్లొమా, ఎమ్మే పూర్తిచేశారు. తర్వాత చిత్తూరు నుంచి 1972- 74 మధ్య లిఖిత పత్రికను నడిపారు. ఆయన కళను వివిధ సంస్కృతులను ఒక దగ్గర చేర్చేదిగా భావిస్తారు.
చిత్రకళా రంగంలో 40 ఏళ్లుగా తనదైన ముద్రవేసిన కేశవులు ఇప్పటివరకు 2000 మందికి బంగారు ఆకు చిత్రకళ, తైలవర్ణ చిత్రకళ, గ్లాస్‌ చిత్రకళల్లో శిక్షణను అందించారు. 2011- 12లో లేపాక్షి హస్తకళా కేంద్రంలో హస్తకళల విద్యార్థులకు బంగారు ఆకు చిత్రకళను బోధించారు. ఆయన సృజనాత్మకత బంగారు ఆకు చిత్రకళతో ఆగకుండా... పసుపు చిత్రకళా సృష్టికి దారిచూపింది. ఇందులో మనకు మంచి ఆలోచనలు ప్రేరేపించే ముద్రలు ఉపయోగించడం విశేషం. దీనిమీద ఒక ఛానల్లో 300 ఎపిసోడ్లు పూర్తిచేశారాయన. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇది తమిళం, కన్నడ భాషల్లోనూ ప్రసారం అవుతూండటం విశేషం. తన చిత్ర కళాభిమానాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు హైదరాబాదు శ్రీనగర్‌కాలనీలో కళాశ్రీ టెంపుల్‌ ఆర్ట్‌ గ్యాలరీనీ నడుపుతున్నారు కేశవులు. బంగారు ఆకు చిత్రకళలో ఆయన ప్రావీణ్యానికి భారతజ్యోతి పురస్కారం, లేపాక్షి పురస్కారం, యువ కళా సమితి కళానిధి బిరుదు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పురస్కారం, సిక్కిం, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలిచ్చే కళాశ్రీ పురస్కారాలు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ కళలో జాతీయ స్థాయి పురస్కారం ప్రదానం చేయడం బంగారానికి తావి అద్దడం లాంటిదే. 

  సహకారం: వేణుగోపాల్‌, హైదరాబాదు


* * * 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  హస్తకళలు