ఇదే...ఇదే...విజయ‘విలాసం’!

  • 68 Views
  • 2Likes
  • Like
  • Article Share

    శంభు

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా! జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా అన్నదే విజయానికి ‘తారక’మంత్రం! అది జయనామ సంవత్సరమైనా, విజయనామ సంవత్సరమైనా, మన్మథనామ సంవత్సరమైనా చివరకు ఖరనామ సంవత్సరమైనా దీనికి తిరుగులేదు. ఖర అంటే గుర్తొచ్చింది.. సాటివాణ్ని పట్టుకుని వేళాపాళా లేకుండా గాడిద చాకిరీ చేస్తాడని సోమరులు వేళాకోళం చేసినా అదీ విజయ సోపానమే. పని రాక్షసుడు రాక్షస నామ సంవత్సరంలోనే కాదు.. ఏ సంవత్సరంలోనైనా విజయానికి చేరువలో ఉంటాడు. విజయసాధకుడు ఒళ్లు దాచుకోడు. ఒళ్లు దాచుకున్నవాడు విజయకేతనం ఎగురవేయలేడు. కష్టే ఫలి.. కష్టపడకపోతే గిలి.. అంతే కదా! అసలు సంస్కృత భారతానికి ‘జయ’ అని పేరు. అందువల్ల మనచుట్టూ మనం తిరగకుండా జయం చుట్టూ తిరగాల్సిందే.
      ‘నీ పని నీవు చెయ్యి.. ఫలితం సంగతి నీ కెందుకు బిడ్డా’ అని భగవద్గీత చెబుతోంది. శ్రీకృష్ణపరమాత్ముడు కురుక్షేత్రంలో అర్జునుడికి గీత బోధించాడు. ‘కృష్ణం వందే జగద్గురుం’ అనిపించుకున్నాడు. అర్జునుడికి విజయుడు అనే పేరూ ఉంది. అన్నట్టు ఏకాగ్రత లేనివాడు ఏ రకంగానూ ఎగబాకలేడు. ‘అర్జునా! నీకేం కనపడుతున్నదయ్యా’ అంటే ‘పక్షి కన్ను తప్ప ఇంకేమీ కనపడట్లేదు’ అన్నాడు. అర్జునుడు చూసింది పక్షి కన్ను కాదు.. అచ్చంగా గెలుపు. యథా దృష్టి.. తథా సృష్టి!
      ప్రతి పురుషుడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందంటారు. ఒక్కోసారి వెనక ఉన్న స్త్రీ ముందుకొచ్చి భర్తకు చేదోడు వాదోడుగా నిలిచి విజయకారకురాలవుతుంది. సత్యభామే లేకపోతే నరకాసురుడు చచ్చేవాడా? దీపావళినిచ్చేవాడా? పార్వతి అపర్ణ అనిపించుకుని కూడా తపస్సు చేసి శివుణ్ని భర్తగా పొందింది. కార్యసాధకులకు గమ్యం తప్ప ఇంకోటి కనిపించదు. కనిపించకూడదు. కార్యసాధకులు అంటే కారణజన్ములు. వారు వీరులు కావచ్చు, శూరులు కావచ్చు, కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, నాయకులు కావచ్చు. ఇంకేమైనా కావచ్చు.
      ‘‘కవనార్థంబుదయించితిన్‌.. సుకవితా కార్యంబె నావృత్తి/ భవమద్దాన జయింతు!’’ అన్నారు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి! ఆయన దిగ్గజ అవధానులైన తిరుపతి వేంకటకవుల్లో ఒకరు. అన్నట్టు ప్రతి కార్యసాధకుడూ తనదైన రంగంలో అవధాని అవక తప్పదు. చిత్తఏకాగ్రతే అవధానమన్నారు పెద్దలు.
      విజయం వైపు నడిపించడానికి ఓ గురువు ఉండాలి. ‘‘పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి’’ అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఇలాంటి మార్గదర్శకత్వంలో ‘నదీనదాలు, అడవులు, కొండలు, ఎడారులా? మనకడ్డంకి’ అంటూ ముందుకు సాగేవాణ్ని విజయం వరిస్తుంది. అయితే పగలు ఎండ, రాత్రి చీకటి అంటూ భయపడి కూర్చునేవాణ్ని విజయం వరించదు. నిరాశ అనేది కూడదు. నిరాశ కన్నా దురాశ మంచిది అన్నారు పఠాభికవి. ఎందుకంటే దురాశలో మనిషి ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తాడు. విజయం సాధించే అవకాశం ఉంది. కానీ నిరాశపడేవాడు ఏమీ చేయడు. ఏమీ సాధించలేడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు చేసిందల్లా అర్జునుడి నిరాశను తొలగించడమే. అంతమాత్రాన ఉత్తర ప్రగల్భాలు పనికిరావు. స్వస్వరూప జ్ఞానం లేకపోతే అడ్డంగా పడిపోతాడు. ‘స్వీయ లోపంబు లెరుగుట పెద్ద విద్య’ అన్నారు పెద్దలు.
      ‘ఎత్తున గొందు కౌరవుల నెల్లను మార్కొని రేని’ అని ప్రగల్భాలు పలికిన ఉత్తరకుమారుడు తీరా రణరంగంలోని దృశ్యం చూసి బిత్తరపోయి పారిపోయాడు. పారిపోవడం వీరుడి లక్షణం కాదు. విజయసాధకుడి లక్షణం అంతకన్నా కాదు. పోరి గెలవడం ముఖ్యం! అయితే, విజయసాధనకు గురువన్నా ఉండాలి. గురి అన్నా ఉండాలి. ఎటొచ్చీ గురువు ఉన్నా గురిలేకపోతే ప్రయోజనం లేదు. గురువు లేకపోయినా గురి ఉంటే చాలు. ఏకలవ్యుణ్నే చూడండి.. గురువు దగ్గరలేకపోయినా గురివల్ల విజయం సాధించాడు. ఏకంగా తన పేరు మీద ఏకలవ్య శిష్యులు అన్న వర్గాన్నే సృష్టించుకున్నాడు.
      మనిషన్న తర్వాత మతాలు ఉంటాయి. అభిమతాలు ఉంటాయి. మనోభావాలూ ఉంటాయి. ‘నడిపించు నా నావ నడిసంద్రమున దేవ... రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభూ జయము’ అనే నిరాశలు మధ్య మధ్యలో వస్తుంటాయి. ఓటమి వచ్చినంత మాత్రాన వీరుడు లక్ష్యం నుంచి పక్కకు తప్పుకోడు. పరాజయాలు విజయసోపానాలని తెల్లవాడు చెప్పినా నల్లవాడూ కాదనలేడు. అయితే విజయం వరించినంత మాత్రాన అందుకు సంబంధించిన ప్రతిష్ఠ అంతా అప్పనంగా వచ్చి ఒళ్లో పడుతుందని కలలు కనడానికి వీల్లేదు. ఖ్యాతిని ఎగరేసుకు పోవడానికి ఎంతోమంది పొంచి ఉంటారు. ‘విజయానికి ఎందరో తండ్రులు కానీ, ఓటమి అనాథ’ అని మానవ తత్వాన్ని కాచి వడబోసిన వాళ్లెవరో చెప్పారు. దీనిని ‘స్కాచి వడబోసినవారు’ కూడా కాదనలేరు.
      ఎవరి నమ్మకాలు వారివి. వాటికి బోలెడన్ని ‘అమ్మకాలు’ కూడా ఉన్నాయి. నడిచొచ్చే కాలానికి కలిసొచ్చే బిడ్డలు అని నమ్మేవాళ్లూ ఉంటారు. అయితే ఈ భాగ్యం ఇప్పటి వరకు యావత్‌ సృష్టిలో ఎవరికైనా కలిగిందో లేదో తెలియదు.
      విజయం వరించనంత మాత్రాన డీలాపడాల్సిన అవసరమూ లేదు. గెలిచినంత మాత్రాన కళ్లు తలకెక్కనవసరం లేదు. విజయమో, వీరస్వర్గమో అన్నమాటను మన పెద్దవాళ్లు ఏనాడో చెప్పారు. కార్యసాధనకు కృషి చేస్తూ మరణించడం కూడా అత్యంత గౌరవప్రదమే. యుద్ధంలో వెనుదిరిగి వచ్చిన భర్తకు ‘గుణపాఠం’ చెప్పే పనిచేసి, అతణ్ని తిరిగి కదనరంగానికి పంపిన చానమ్మ అనే మగువ తెగువ అందరికీ తెలిసిందే. గురువు భార్య రూపంలోనూ ఉండవచ్చని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ‘భార్య దేవోభవ’ అన్నా తప్పులేదు.
      కల్యాణమంటే ఏంటనుకున్నారు? జీవితంలో తొలి విజయసోపానం. శ్రీరామచంద్రుడంతటివాడు స్వయంవరంలో శివధనుర్భంగం చేసి సీతమ్మను పెళ్లాడాడు. ఇది కల్యాణంలా కనిపించినా ఇందులో లోకకల్యాణమూ ఉందని రామాయణం తెలిసినవాళ్లందరికీ తెలుసు. ఇక కృష్ణలీలలన్నీ లోకకల్యాణం కోసమే. వెన్న దొంగతనాలు, కన్నె దొంగతనాల సంగతి ఏమైనా శ్రీకృష్ణుడు గోవర్థన పర్వతాన్ని ఎత్తి గోకులంలో వారందరికీ ఆశ్రయమిచ్చేశాడు. ఇంతకుమించిన లోకకల్యాణం ఏముంటుంది?
      విజయానికి కూడా నిర్వచనాలు ఒకరకంగా ఉండవు. ఒకరి విజయం ఇంకొకరికి అపవిజయం. ఒకరు విజయం అనుకున్నది ఇంకొకరు అపజయం అనుకోవచ్చు. ఒక్కొక్కడి మనస్తత్వం ఒక్కోరకంగా ఉంటుంది. ఆడబిడ్డ పుడితే అపజయం పాలయినట్టు కుంగిపోయే మగవాళ్లూ ఉన్నారు. అందుకు భార్య ఒక్కతే కారణమన్నట్టు తిట్టి, కొట్టి సతాయించేవాళ్లూ ఉన్నారు. పుత్రుడు పుట్టే వరకు ఫుల్‌స్టాప్‌ పెట్టకూడదన్న తదేక దీక్షలో దశాధికమైన అమ్మాయిల్ని కన్నవాళ్లూ ఉంటారు. అప్పటికీ అబ్బాయి కంటపడక దేవుణ్ని తిట్టేసుకుంటారు. వీళ్ల ముందు జాగ్రత్త అలాంటిలాంటిది కాదు. పుత్రుడు లేకపోతే పున్నామ నరకం అనుభవించక తప్పదని భయం! ఇది చచ్చిన తర్వాత సంగతి! పాపం! మేం బతికి ఉండగానే మీ పుత్రులు ఎన్నెన్ని నరకాలు చూపిస్తారో మీకేం తెలుసు? అని పుత్ర సంతానం ఉన్న కొంతమంది వాపోతుంటారు. ఇలాంటివి చెవినపడ్డా, కంటే కూతుర్నే కను అని ఎవరు చెప్పినా వారు వినరు.
      విజయసాధకులకు వినాయకుడికి మించిన గురువులేడు. గణాధిపత్యం కోసం కుమారస్వామితో జరిగిన పోటీలో వినాయకుడు ఎలా నెగ్గుకొచ్చాడు? ‘విజయ సూక్ష్మాన్ని’ విఘ్ననాయకుడు ఈ ప్రపంచానికి నేర్పించాడు. గణాధిపత్యం కోసం కుమారస్వామి నానాశ్రమ పడ్డాడు. మరి వినాయకుడో.. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసి విజయాన్ని కైవసం చేసుకున్నాడు. సూక్ష్మంలో మోక్షం ఏమిటో వినాయకుడి దగ్గరి నుంచి నేర్చుకోవాలి. ఇందుకోసం ఎవరి ‘బుర్ర’ కథ వారికి ఉండాలి. వినాయకుడికి జైజై.


వెనక్కి ...

మీ అభిప్రాయం