మాది కలికి తెలుగు కులము

  • 212 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

  • కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
  • అనంతపురం
  • 9440222117
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

గత మూడు దశాబ్దాల్లో దేశంలో, తెలుగునాట సంభవించిన సాంఘిక, రాజకీయ పరిణామాల మధ్య గుర్రం జాషువను దళిత కవిగా చూడటం తెలుగువారికి అలవాటైపోయింది. ఆయన కవిత్వంలో దళిత సంవేదన ఒక శక్తిమంతమైన పార్శ్వం. అది చాలా తీవ్రమైంది కూడా. దాన్ని గుర్తించి గౌరవించాల్సిందే. దానితోపాటు ఆయన కవిత్వంలోని ఇతర కోణాలను కూడా చూడకపోతే, మనం ఆయన్ని పాక్షికంగానే చదువుకున్నవాళ్లమవుతాం.
కవిగా
జాషువలో ముగ్గురు కవులున్నారు... తెలుగు కవి, భారతీయ కవి, విశ్వ కవి. ‘మాది కలికి తెలుగు కులము’, ‘అచ్చముగ భారతీయుడనయితి నేడు’, ‘విశ్వనరుడ నేను’ లాంటి జాషువ పదప్రయోగాలు ఆయన్ను మనం చదువుకోవాల్సిన పద్ధతిని సూచిస్తున్నాయి. అస్పృశ్యత, ఆకలి, వివక్ష, మౌఢ్యం, సాంఘిక రుగ్మతలు, అవినీతి, దోపిడీ తదితర అంశాల దగ్గర జాషువ ప్రపంచ యుద్ధ సైనికుడిగా కలం ఆయుధాన్ని ప్రయోగిస్తారు. తక్కిన స్థలాలలో ప్రసన్న స్నేహితుడిగా కరచాలనం చేస్తుంటారు. కొట్టేటప్పుడు కొట్టాలి, పెట్టేటప్పుడు పెట్టాలి అన్నట్లుంటుంది ఆయన కవిత్వం. జాషువ 121వ జయంతి (సెప్టెంబరు 24) సందర్భంగా ఓ తెలుగు కవిగా ఆయన్ను అర్థం చేసుకుందాం. ఇక్కడ తెలుగు కవి అంటే తెలుగు జాతి గురించి కవిత్వం రాసిన కవి అని అర్థం.
      తెలుగు జాతి, దాని చరిత్ర, భాషా సాహిత్యాలు, తెలుగు వీరులు, నాయకులు, దాతలు, తత్వవేత్తలు, తెలుగు నేల భౌగోళికత లాంటివి జాషువ కవిత్వంలో కళాత్మకంగా ప్రతిబింబిస్తాయి. 1917లో కవిత్వం రాయడం ప్రారంభించిన ఆయన 1925లోనే ‘కృష్ణా నది’ అనే కవిత రాశారు. అప్పటి నుంచి 1966నాటి ‘నాగార్జున సాగర్‌’ దాకా ఆయన నాలుగు దశాబ్దాల పాటు తెలుగు జాతి కీర్తిపతాకలను ఎగురవేశారు.
ఈ నేల, ఈ పలుకు... 
‘ముంతాజ మహలు’ కావ్యంలో ప్రేమను ఉదాత్తంగా, మానవీయంగా చిత్రించారు జాషువ. ఆ మహల్‌ నిర్మాణంలో పనిచేసిన 33 మంది శిల్పులలో ముగ్గురు మచిలీపట్నానికి చెందిన వాళ్లని ఆయన గుర్తించారు. ఈ కావ్యంలో ముంతాజ మహల్‌ సౌందర్యాన్ని వర్ణిస్తూ, మధ్యలో ఆపి, తెలుగు భాష గొప్పదనాన్ని చాటారు జాషువ. ఏబదారక్షరంబుల నెసకమెసగు/ కలికి భాషకు తెలుగున కలినిగాక/ అలవింత తాజిలావణ్యమభ్య తింప/ తదితరంబైన భాషాది తానమునకు... ముంతాజ్‌ మహల్‌ సౌందర్యాన్ని వర్ణించడానికి 56 అక్షరాల తెలుగు భాషకు సాధ్యం కాకపోతే, ఇంకో భాషకు అసాధ్యం అన్నారు. అమ్మభాష మీద ఆయన మక్కువ అంతటిది.
రెండో ప్రపంచ యుద్ధం నేపథ]్యంలో ‘కాందిశీకుడు’ అనే కావ్యం రాశారు జాషువ. యుద్ధ సమయంలో బర్మా నుంచి ఓ కాందిశీకుడు పరిగెత్తుకుని పర్వతాలు, అరణ్యాలు దాటి మాతృభూమిని చేరుకుంటాడు. అక్కడ అతనికి ఓ బౌద్ధ భిక్షువు పుర్రె కాలికి తగులుతుంది. ఆ ఇద్దరి మధ్యా సంభాషణగా, ప్రపంచ శాంతి లక్ష్యంగా జాషువ ఈ కావ్యం రాశారు. ఆ కాందిశీకుడు తెలుగు వ్యక్తి. అతను బర్మా నుంచి అనేక అవస్థలు పడి వస్తాడు. అప్పటిదాకా నడచి నడచి అలసిపోయిన కాందిశీకుడికి తెలుగు నేల మీద అడుగు పెట్టగానే ఎంత ఉపశమనం కలిగిందో వర్ణించారు జాషువ. ‘‘పర్వతములు నదులు ప్రతిపదార్థంబును/ స్వాగతం బొనర్చె పల్కరించి/ ఆదరించినట్టులై యింపుగావించె/ కన్నతల్లి గాదె కన్న భూమి’’... ఇలా మాతృభూమిని సాంత్వన చేకూర్చే అమ్మ ఒడితో పోల్చారు. 
‘గబ్బిలం’ సాక్షిగా...
‘గబ్బిలము- 1’లో జాషువ, గబ్బిలాన్ని తంజావూరు నుంచి హిమాలయాల దాకా ఏ మార్గంలో వెళ్లాలో చెబుతూ తెలుగునేలను విస్తృతంగా వర్ణించారు. తంజావూరులో నాయక రాజులనూ, సరస్వతీ మహలును, అప్పటి సాహిత్యాన్ని ప్రశంసించారు. ఆ తర్వాత నెల్లూరు, హంపి, గుంటూరు, రాజమండ్రి, ద్రాక్షారామం, బొబ్బిలి మీదుగా విజయనగరం దాకా అన్నింటినీ కళ్లకు కట్టారు. అయితే, ఇందులో రాయలసీమ, తెలంగాణ ప్రస్తావన లేదు. నెల్లూరును పెన్నానదితోను, తిక్కనతోనూ గుర్తించారు. హంపిని ‘తెల్గు రాజ్యంపు నైలింపశ్రీల కొకానొకప్పుడది కేళీరంగము’ అని ప్రస్తుతించారు. అక్కడి రత్నరాశులను, ఉగ్ర నరసింహుణ్ని, విఘ్నేశ్వరుణ్ని, రాయల అశ్వశాలను ప్రస్తావించారు.
      ఈ చిన్న ఖండ కావ్యంలో బహుశా ఆయన హంపిని రాయలసీమకు ప్రతినిధిగా భావించి ఉంటారు. గుంటూరు ప్రాంతంలోని కోడిపందేలను, కారంపూడి యుద్ధాన్ని ప్రస్తావించారు. వేమనను వినుకొండ వాసిగా స్మరించుకున్నారు. రాజమహేంద్రవరంలో నన్నయ్యనూ స్తుతించారు. ద్రాక్షారామ భీమేశ్వరుణ్ని ‘ఉజ్జీలేని దయా స్వభావుడు’, ‘ముప్పొద్దులున్‌ గజ్జెంగట్టెడి నాట్యకాడు’ అని నిర్వచించారు. బొబ్బిలిలోకి అడుగుపెట్టగానే ‘చటులావేశంబు దేహంబునన్‌ మొలుచున్‌’ అన్నారు. బొబ్బిలి మీదుగా మన్యం దాటితేే ‘పలుచబడిబోవుమన్‌ జిల్గుతెల్గు శోభ’ అని గుర్తు చేశారు. 
      ‘గబ్బిలం’ దేశారాధన కావ్యం. అందులో ఆంధ్ర దేశారాధన ఓ భాగం. ‘గబ్బిలము- 2’లో హిమాలయాలకు వెళ్లి తిరిగి వచ్చిన గబ్బిలంతో అరుంధతీ తనయుడు మాట్లాడే సమయంలో... తెలుగు జాతికి సంబంధించిన అనేకాంశాలను చర్చించారు జాషువ. ‘‘తెలుగు తేజం బెల్లదిక్కుల ఎగబ్రాకి/ పగవాని బెదిరించి వచ్చునపుడు/ తెలుగు శిల్పుల సుత్తెదెబ్బ ఖంగునమోసి/ చీనాకు పయనంబు సేయునపుడు/ తెలుగు కవిత్వంబు దిగ్దంతుల ముఖాన/ బృంహిత ధ్వనులు గావించునపుడు/ తెలుగు జెండా శక్తి నలుదెసల్‌ ప్రసరించి/ విద్యానగర వీధి వెలుగునపుడు/ రామలింగని హాస్యకార్యములు దలచి/ నాల్గు దిక్కులు కడుపుబ్బ నవ్వినపుడు/ నాట్యమాడిన మానంద నవ్యలక్ష్మి/ కానుపించెనె శిథిల దుర్గములయందు’’ అని హంపీ నగర విశేషాలు ప్రశ్నించారు.
స్వరాజ్యం... స్వరాష్ట్రం
భారత స్వాతంత్య్రోద్యమంలో తెలుగువారి పాత్రను వర్ణించిన జాషువ, ‘‘మిన్ను విరిగి నెత్తిమీద గూలిన కత్తి/ దించనట్టివారు తెలుగు వారు’’ అని తెలుగు ప్రజల నిబద్ధతను కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ‘రాష్ట్ర పూజ’, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైన సందర్భంలో ‘కొత్త లోకము’ రాశారు. ‘‘తెలుగు శబ్దమహిమ తెలుగు ధీగదిమంబు/ తెలుగు ధర్మనిరతి తేటపడగ/ ప్రభావ మందియున్న ప్రత్యేక వీరాంధ్ర/ రాష్ట్రమునకు కోటి ప్రణుతిపూట’’ అంటూ ఆనందపడ్డారు. పొట్టి శ్రీరాములు బలిదానంలో ప్రభవించిన రాష్ట్రాన్ని ‘వీరాంధ్ర రాష్ట్రం’ అని నిర్వచించడం వెనక ఆంధ్ర రాష్ట్రోద్యమ స్ఫూర్తి ఉంది. 
      అనేక ఉద్యమాలు, అలజడులు, ఉప్పెనలతో దేశం నలిగిపోతున్న సమయంలో ఏర్పడిన పేద రాష్ట్రం ఆంధ్ర. దాని పరిస్థితిని ‘‘దేశమెల్ల దెబ్బతిని మున్న సమయాన్‌/ చిల్లి గవ్వయేని చేతలేక/ కదలివచ్చి దొడ్డ కర్నూలు గడ్డపై/ ధ్వజము నిల్పి తెట్ట ధైర్యవతివొ’’ అని చిత్రించారు జాషువ. ఈ సమయంలో గుంటూరు వాసి అయిన జాషువ రాయలసీమ గురించి ‘‘దత్త మంతలాల దైన్యంబు మాయించి/ తరలిరమ్ము సమ్మతంబు నాకు’’ అని న్యాయంగా, ధర్మంగా మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, దానికోసం కొత్త కొత్త పరిశ్రమలు స్థాపించాలని, నదీ జలాలు సముద్రంలో కలిసిపోకుండా కాపాడుకొని వ్యవసాయభూమిని విస్తరించాలని కోరుకున్నారు. రాయలసీమ, కోస్తా ప్రజల మధ్య అప్పట్లో నెలకొన్న వైషమ్యాలు సమసిపోవాలని అభిలషించారు. అధికారం కోసం జరిగే కుమ్ములాటను అసహ్యించుకున్నారు.
      ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడగానే జాషువ ‘‘సమసన్నేటికి తెల్గు జాతికి సమస్త క్లేశముల్‌’’ అంటూ ఆనందపడ్డారు. ‘‘హైదరాబాదు రాజ్యంబు నాది’’ అంటూ కొత్త రాష్ట్రాన్ని గుండెలకు హత్తుకున్నారు. ‘‘మాది కలికి తెలుగు కులము’’ అన్నారు. నాగార్జున సాగరం ద్వారా కరవు తీరా పంటలు పండాలని ఆకాంక్షించారు. నాగార్జునకొండ కేంద్రంగా ఉన్న బౌద్ధం ప్రభావంతో సమాజంలో శాంతి నెలకొనాలని ఆశించారు.
నదీమతల్లులకు ప్రణుతులు
గుర్రం జాషువ ఖండ కావ్యాలు ఒక ఎత్తయితే, ఆయన రచించిన కావ్య ఖండికలు/ కవిత్వ ఖండికలు ఇంకో ఎత్తు. ఇవి ఏడు సంపుటాలు. వాటిలో 250 కవితలు దాకా ఉన్నాయి. దాదాపు 1500 పద్యాలు అనంతమైన వస్తు వైవిధ్యంతో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ విషయాలను కవిత్వీకరించారు. ‘కృష్ణానది’ మొదలు 1963 నాటి ‘శ్రద్ధాంజలి’ దాకా కనీసం యాభై కవితల్లో ఆయన తెలుగు రాగం ఆలపించారు.
జాషువ కవిత్వంలో నదీ కవిత్వం ఓ భాగం. గంగ నుంచి పెన్నా దాకా అనేక నదుల మీద ఆయన కవితలు రాశారు. కృష్ణ మీద ‘కృష్ణా నది’, ‘భిక్ష’, గోదావరి మీద ‘అఖండ గౌతమి’ రాశారు. నదుల పౌరాణిక చారిత్రక విశేషాలను చెప్పడంతో పాటు వాటి ప్రజోపయోగ లక్షణాలనూ వివరించడం జాషువ ప్రత్యేకత. ‘భిక్ష’లోని ఈ పద్యమే దానికి ఉదాహరణ...

‘అన్నమో రామచంద్రా’ యంచు నల్లాడి
పరదేశముల కేగి బ్రదుకువారు 
పన్ను గట్టుట కిండ్లువాకిళ్లు తెగనమ్మి
పైమీద బట్టతో వగచువారు
సుంకుబట్టిన కంకి సురిగి వర్షము లేక 
మెండిపోవగ జూచియేడ్చువాడు 
నీకు దాపుననున్నారు నిశ్చయముగ 
కొర్తి ఏమయున్‌ బ్రద్దలుగొట్టి వచ్చి 
లక్షలాది ప్రజా క్షుధాత్తు లెల్ల
దనిపి చను మమ్మా! కృష్ణా సుధా స్రవంతి!
వేమనకు వందనం

తెలుగు పాలకులను, నాయకులను, తత్వవేత్తలను, కళాకారులను, వీరులను, పండగలను తన కవిత్వ ఖండికలలో చిత్రించారు జాషువ. ఇదొక పెద్ద పరిశోధనాంశం. శ్రీకృష్ణ దేవరాయలకు, ఆ తర్వాత వేమనకు ఆయన పెద్దపీటలు వేశారు. అనేక సందర్భాలలో రాయలు శౌర్యపరాక్రమాలను, ఆయన సాహితీ వ్యక్తిత్వాన్ని కీర్తించారు. జాషువ కలం పట్టిన పదేళ్లకే 1926లో ‘కృష్ణదేవరాయలు’ కవిత రాశారు. మరో పదేళ్లకు ‘ఆంధ్ర భోజుడు’ రచించారు. ‘‘భాషా సముద్ర కుంభసంభ ప్రభవుడయ్యు/ విద్వత్కవుల గౌరవించినావు/ ప్రతిపక్ష రాజ భార్గవరాముడవయయ్యు/ వెన్నిచ్చుచో విడిపించినావు’’ అని రాయల కీర్తిగానం చేశారు.
      ‘శబ్దశాసనుడు’లో నన్నయ్య గురించి చెబుతూ ‘‘తేజముడిగిన స్వీయజాతి రక్త నాళములు పుల్కరింపగానంబు జేసే’’నని కొనియాడారు. ‘‘కళాసౌరభ్య సంపత్తి చేపూర పద్ధతి తెల్గు శారద/ షరాబు లేదు నీ నేర్పు బంగారంబున వెలగట్టి చెప్ప’’ అని తిక్కన ప్రతిభను ఎలుగెత్తి చాటాడు. ఎంతమంది ప్రాచీన తెలుగు కవులను స్మరించుకున్నా జాషువకు, తనలాంటి భావాలుగల వేమన అంటే మక్కువ ఎక్కువ. ‘వేమన యోగీంద్రుడు’, ‘తబిసి వస్తాదు’ లాంటి కవితలు రాయడమే కాదు, ఖండ కావ్యాలలో అనేకసార్లు ఆయన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ‘తబిసి వస్తాదు’లో వేమనను బుద్ధుడి లాంటి త్యాగిగా పేర్కొన్నారు. ‘‘సకల సామ్రాజ్య భోగపిశాచములను/ గోచిపాతకు బలియిచ్చిన ఘనుడు’’ అని కైమోడ్పులర్పించారు.
      ‘వేమన యోగీంద్రుడు’ పేరుతో, ఒకే మకుటంతో 26 మత్తేభ వృత్తాలు రాశారు జాషువ. అది వేమన వ్యక్తిత్వం పట్ల జాషువకు గల గౌరవం. వేమన కన్నతల్లి గర్భం ధన్యమైంది అన్నారు. ‘పురాణ కారణ జన్మమెత్తిన దయాబుద్ధండవో’ అనడానికీ సంకోచించలేదు. ‘వేమన’ అనే మూడక్షరాలు ప్రజల నాల్కలమీద నిరంతరం నాట్యం చేస్తున్నాయన్నారు. ‘గబ్బిలము- 2’లో తెలుగువారి దయా దాక్షిణ్యాలలోని వైచిత్రిని చెప్పడానికి జాషువ వేమన జీవితాన్నే తీసుకున్నారు. వేమన బతికి ఉన్నప్పుడు పట్టించుకోని జాతి ఆ తర్వాత ఆయన్నెలా నెత్తినపెట్టుకుంటోందో ఇలా చెప్పారు... 
పిడికెండన్నము బెట్టలేదెపుడు మా వేమన్న జీవించిన
ప్పుడు ముద్దుల్‌ మురిపించు మేలి కవనంపుంబుగ్గలుప్పొంగి కా
ఱడవుల్‌ మొద్దులు మోసులెత్తునపు డౌరా! నేడు గోరీపయిన్‌
నడుచుంబూజలు పుణ్యకార్యములు వింతల్‌ మా దయాధర్మముల్‌ 

నిండార తెలుగుదనం
యుద్ధ వ్యతిరేక కవిత్వం పుష్కలంగా రాసి, ప్రపంచ శాంతిని కోరుకున్నారు జాషువ. అయితే, తెలుగు వీరుల పౌరుషాన్ని చెప్పాల్సి వచ్చినపుడు మాత్రం ఆయన వీరోచిత పద్యాలు రాయడం ఆసక్తిదాయకం. యుద్ధంలో ఓడిపోయి వచ్చిన ఖడ్గ తిక్కనకు పసుపు ముద్ద చేసి పెట్టిన ఆయన భార్యను ‘వీర చానమ’, ‘నవ్యాంధ్ర భార్గవి’ అన్నారు. ఆ ‘వీర కాంతకు సమస్థాంధ్రంబు భూషించెడిన్‌’ అని ప్రస్తుతించారు.
తెలుగునేల మట్టివాసనను నలుదిశలా వెదజల్లిన కవి గుర్రం జాషువ. అందులో ఆయన తాదాత్మ్యం చెందారు. తెలుగుదనం, తెలుగు ధనం ఆయనలో ఉట్టిపడతాయి. ‘తెలుగు తల్లి, తెలుగు వెలుగు, తెలుగు తేజం, ఆంధ్రుడను’ లాంటి కవితల్లో జాషువ తెలుగు రూపం కనిపిస్తుంది. ‘తెలుగు వెలుగు’లో తెలుగు జాతి గతాన్ని చిత్రిస్తూనే, దాన్ని పునరుజ్జీవింప చేసుకోమని పిలుపునిచ్చారు. పాశ్చాత్య వ్యామోహంలోంచి బయటపడమన్నారు. ‘ఆంధ్రుడను’లో జాతి బహుముఖీన ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. స్వాతంత్య్రానంతరం తెలుగు జాతి ఎలా ఉండాలో ‘తెలుగు గడ్డ’లో బోధించారు.
      తెలుగు చరిత్రను, సంస్కృతిని ఎంత కీర్తించినా, జాషువలోని ప్రశ్నించే తత్వం మరుగునపడిపోలేదు. ‘తెలుగు తల్లి’లో జాతి చరిత్ర, సంస్కృతిని గౌరవిస్తూనే అందులో దళితులకు చోటు లేకపోవడాన్ని ప్రశ్నించారు. ‘‘... మనుమసిద్ధియును తిక్కన గన్నకావ్యంబు/ కోరచూపులు జూచుకొన్నవాడు.../ అలసాని కులజు డూయెలమంచముల నుండి/ పసిడి లేఖనిబూని వ్రాయునాడు.../ ప్రతినదప్పక వైరి వక్షముల్‌ బెకలించు/ వెలమబెబ్బులులు జీవించునాడు.../ శరణాగత త్రాణ బిరుదంబు రాజుల/ నెరదఱొమ్ములమీద వెలుగునాడు.../ గారవంబుల నన్నేలగాంచవైతి?/ తెలుపుగదవమ్మ! నను గన్న తెలుగు తల్లి!’’ అని నిగ్గదీశారు. 
      తెలుగు చరిత్రను గౌరవిస్తూనే, తెలుగు సంస్కృతిని సన్నుతిస్తూనే వాటిలోని వెలితిని చూపించటం విమర్శనాత్మక దేశభక్తి. జాషువ అలాంటి కవి. ఆయన కవిత్వం తెలుగు వెలుగుల ప్రతిఫలనం. ఆయన తెలుగు వెలుగుల కాంతిరేఖ. ‘తెలుగు వెలుగు’ కవితలో జాషువా చెప్పిన ఈ మాటలు మనకు శిరోధార్యం... 
బోళావాడవుగాన నీదు విభావంబున్‌  సత్కళామర్మముల్‌
జాలాభాగము కొల్లబెట్టితివి, నీ శాస్త్ర  ప్రపంచంబులో
మేలెల్లన్‌ గబళించినారు పరభూమిశాగ్రణుల్, నేటికిన్‌
బోలేదేమియు దిద్దుకొమ్ము బలగంబున్‌ స్వీయ  విజ్ఞానమున్‌


వెనక్కి ...

మీ అభిప్రాయం