శిష్యా! కొంప పీకరా!!

  • 109 Views
  • 1Likes
  • Like
  • Article Share

    శివుడు

గురువుగా చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి పరిస్థితి చిత్రాతి చిత్రం. ఆయన కన్నా అదృష్టవంతుడు లేడు. దురదృష్టవంతుడూ లేడు. తెలుగువారి సొంతమైన అవధాన కళకు అద్భుతమైన జనాకర్షణ కలిగించిన జంట అవధానులు తిరుపతి వేంకటకవుల్లో ఒకరు ఆయన. విశేషమేమిటంటే చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి శిష్యుడు కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ. ఆయన తమ గురువుగారి గురించి ఇలా చెప్పారు...
అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడయినాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్‌

      తన వంటి శిష్యుడు ఉండే భాగ్యం నాడు నన్నయ్యకు, తిక్కనకు కలగలేదు, చెళ్లపిళ్లవారికి మాత్రమే దక్కింది అన్నారు. తన గౌరవాన్ని పెంచుకుంటూనే గురువుగారి గౌరవాన్ని ఆకాశం ఎత్తుకు పెంచారు. ‘లేడురా ఇటువంటి శిష్యుడింకెందు’ అనిపించారు. భేష్‌ భేష్‌! ఇదో కోణం. రెండో కోణంతోనే సమస్య!
      చెళ్లపిళ్ల వెంకటశాస్త్రికి ఓలేటి వెంకటరామశాస్త్రి అనే శిష్యుడు ఉండేవారు. ఆయనా ప్రసిద్ధుడే. ఎటొచ్చీ ఆయన గురువుగారిని పట్టుకుని నేను నీ శిష్యుణ్ని కాదు పొమ్మన్నారు. చెళ్లపిళ్లవారికి మండింది. దాంతో ఓలేటి తన శిష్యుడని నిరూపించడానికి ప్రయత్నించారు. తిరుపతి వెంకటకవులంటే అద్యతనాంధ్ర కవిత్వ ప్రపంచ నిర్మాతలు. అలాంటివారికి కోపమొచ్చినా, తాపమొచ్చినా, ఇంకేమి వచ్చినా మొదట నోటి వెంట వచ్చేది పద్యాలేగా! చెళ్లపిళ్ల వారి వివాదం సంగతేమైనా పద్యం సాహిత్య ప్రియులందరికీ మంచి వినోదమైంది.
ఇంజరంబొక సాక్షి - యేనాము తాసాక్షి
    పల్లెపాలెంబు తా నెల్లసాక్షి
ఇపుడు నీవున్నట్టి - యీ పిఠాపురి సాక్షి
    ఏలూరు సాక్షి నీ ఇల్లు సాక్షి
వల్లూరు నృపతి శ్రీ - భాష్యకారులు సాక్షి
    నూజివీడ్రామచంద్రుండు సాక్షి
మంజువాణీ ప్రెస్సు - మానేజరొక సాక్షి
    శంకరుండాతని సాని సాక్షి
మధున పంతుల సూరయ బుధుడు సాక్షి
యయ్యనఘు, నన్న సాక్షి సుబ్బయ్యగారు
సాక్షులున్నారు పద్యంబు చాలదింక
వేంకటేశ్వరు శిష్యుడవే, నిజంబు

      చిత్రమేమిటంటే ఈ వివాదం వాళ్లిద్దరికే పరిమతం కాలేదు. అటూ, ఇటూ వకల్తా పుచ్చుకున్న ఉద్దండులూ ఉన్నారు. ‘వెంకట శాస్త్రిగారిని గురువు కాదంటావేమిటయ్యా! ఆయనే నీకు గురువు’ అంటూ చెళ్లపిళ్లవారి సోదర అవధాని తిరుపతి శాస్త్రి... వేంకటరామశాస్త్రిని ఉద్దేశించి రెండు పద్యాస్త్రాలు సంధించారు. ‘‘వ్యాకరణంబు చెప్పె, నదియంటకపోయిన పోవుగాక, నీ/ కీ కవి నామమయ్యనఘు డేకద పెట్టిన, దంతబోక, తా/ నే కడకేగె నిన్నుగొని యేచనె నచ్చటి కట్టివాని, సు/ శ్లోకు సభాస్థలిన్విడచి చోరుగతి న్మెలగంబనేమొకో?’’; ‘‘వేంకటేశ్వరు పాదంబు వీడి, పిదప/ నెవని సేవించితివి చెప్పుమింతయేల?/ యే విషయమీవు సాధించినావొ పిదప/ వ్రాయుమా వేంకటేశ్వరు పదములాన!’’ అని హితవు చెప్పారు. 
      అంత మాత్రాన శిష్యుడి మనసు మారిందా అంటే మారలేదే! ‘పాఠం చెప్పేవాడు గురువు... గుణపాఠం చెప్పేవాడు శిష్యుడు’ అని శిష్య బాధితుడైన ఓ గురువు ఎప్పుడో చెప్పాడు. చెళ్లపిళ్లవారిని తూలనాడుతూ ఓలేటి వెంకట్రామశాస్త్రి సోదర కవి అయిన వేదుల రామకృష్ణ శాస్త్రి ఇంకో పద్యం చెప్పారు. ‘‘ఎట్టొ చదివితి మూన్నాళ్ల పట్టపవలు/ పట్టుమని రెండు ముక్కలు పలుకకున్న/ తిరుగడికనెన్ని సెప్పిన గురుడననుచు/ తగులుకున్నాడు నిన్ను సైతానులాగు’’ అనేశారు. ఈ పద్యంలో చెళ్లపిళ్లవారి గురించి నీచంగా రాసినా ఓలేటి వెంకట్రామశాస్త్రి చెళ్లపిళ్లవారి శిష్యుడని ఆయన మిత్రుడే చెప్పక తప్పలేదు. 
      చిత్రమేమిటంటే చెళ్లపిళ్ల వెంకటశాస్త్రికి తన శిష్యులతోనే కాదు గురువుతోనూ పేచీలు వచ్చాయి. చెళ్లపిళ్లవారు తమ గురువుగారి మీద కోపంతో తక్కువ అన్నారా?, ‘గురుడైనన్‌ హరుడైననేమీ’ అని పద్యం చెప్పారు. మరి ఆయన శిష్యుడు తన గురువుగారి పాండిత్యాన్నే వేలెత్తి చూపాడు. ‘శ్రుత పాండిత్యము దక్కలేని గురుడు’ అని చెళ్లపిళ్లవారి పాండిత్యాన్ని గురించి ఎకసెక్కెమాడాడు. చెళ్లపిళ్ల విని నేర్చుకున్నదే, చదువుకున్నది అంత లేదని శిష్యుడు (ముక్కు) పిండితార్థం, పండితార్థం చెప్పాడు.
      ఎవడు శిష్యుడు? ఎవడు కాడు? ఓ మహాత్మా ఓ మహర్షీ!


వెనక్కి ...

మీ అభిప్రాయం