ఎర్రబడ్డ పొద్దుమీద పచ్చటి సంతకం

  • 68 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ముత్తేవి రవీంద్రనాథ్‌

  • తెనాలి, గుంటూరు జిల్లా
  • 9849131029
ముత్తేవి రవీంద్రనాథ్‌

తన రచనల ద్వారా పీడిత తాడిత జనం సమస్యలను ప్రపంచానికి బలంగా వినిపించిన విఖ్యాత బెంగాలీ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి మహాశ్వేతాదేవి. జులై 28, 2016న తుదిశ్వాస విడిచేవరకు గిరిజనుల సమస్యల మీద అలుపెరుగని పోరాటం చేశారు. ఆమె జీవితం నేటి తరానికి ఆదర్శం. రచయితలు ఎలా ఉండాలి, రచనలు ప్రభావవంతంగా నిలిచిపోవాలంటే ఎలాంటి కసరత్తు చేయాలి అన్న అంశాలకు మహాశ్వేత సజీవ ఉదాహరణ. అనువాదాల రూపంలో తెలుగు సాహితీ లోకానికి ఆవిడ సుపరిచితురాలు. విలక్షణమైన ఆమె జీవితం, సాహిత్య- సామాజిక కృషి తెలుగు రచయితలందరికీ స్ఫూర్తిదాయకమే. 
అప్పటి బ్రిటిష్‌
ఇండియాలోని ఢాకా నగరంలో జనవరి 14, 1926న మహాశ్వేతాదేవి జన్మించారు. తండ్రి మనీష్‌ ఘటక్‌ సుప్రసిద్ధ కవి, నవలాకారుడు. ఆయన 1923-35 మధ్యకాలంలో బెంగాల్‌ని ఊపేసిన ‘కల్లోల్‌’ అనే యువ సాహిత్యోద్యమంలో ప్రముఖపాత్ర పోషించినవాడు. మనీష్‌ సోదరుడు సుప్రసిద్ధ బెంగాలీ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రిత్విక్‌ ఘటక్‌. మహాశ్వేత తల్లి ధరిత్రీదేవి కూడా పేరున్న రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి. ధరిత్రి సోదరుల్లో ఒకరు ప్రఖ్యాత శిల్పి శంఖ చౌధురి, మరొకరు ‘ది ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా’ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు సచిన్‌ చౌధురి. సాహితీవేత్తలు, ఉద్యమకారులైన తన కుటుంబ సభ్యుల ప్రభావం బాల్యం నుంచే మహాశ్వేత మీద బలంగా పడింది. మొదట్లో ఆమె ఢాకాలోనే చదువుకున్నారు. తర్వాత దేశ విభజనానంతరం ఆమె కుటుంబం పశ్చిమబంగకు వచ్చేసింది. విశ్వకవి రవీంద్రుడు స్థాపించిన శాంతినికేతన్‌లోని విశ్వభారతిలో ఆంగ్లంలో బీఏ (ఆనర్స్‌) చదివారు మహాశ్వేత. అక్కడ చదువుకుంటున్నప్పుడే కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితురాలయ్యారు. ఆ తర్వాత కోల్‌కతా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల భాషా సాహిత్యాల్లో ఎమ్మే చేశారు.
      మొదట్లో కొంతకాలం పాటు మహాశ్వేత తపాలా శాఖలో ఉద్యోగం చేశారు. అయితే కమ్యూనిస్టు అన్న అభియోగంతో ఆ ఉద్యోగంలోంచి తొలగించారు. తదనంతరం ఆవిడ ఏ ఉద్యోగం చేసినా, నక్సలైటు అనే మిషతో తనమీద నిఘా కొనసాగింది. జీవిక కోసం అమెరికాకు కోతులను సరఫరా చేయడం, ప్రైవేటు ట్యూషన్లు చెప్పడం, ‘జుగాంతర్‌’ బెంగాలీ దినపత్రికకు సంచార విలేకరిగా పనిచేయడం వంటివెన్నో చేశారావిడ. ‘ఆజ్‌కల్‌’, ‘వసుమతి’, ‘వర్తమాన్‌’ తదితర బెంగాలీ దినపత్రికల్లోనూ, ‘సండే’ వంటి ఆంగ్ల పత్రికల్లోనూ వ్యాసాలు రాస్తూ, శీర్షికలు నిర్వహిస్తూ పాఠకులకు బాగా దగ్గరయ్యారు. ‘స్వతంత్ర భారత్‌’ పత్రిక కోసం ఆమె చేసిన రచనలు అందరి మెప్పూ పొందాయి. లోతైన సైద్ధాంతిక పునాదితో పాటు నమ్మిన సిద్ధాంతాల పట్ల అచంచలమైన నిబద్ధత కారణంగా ఆవిడ అనతికాలంలోనే గొప్ప రచయిత్రిగా రూపొందారు.
      మహాశ్వేత వందకుపైగా నవలలు, 20 కథానికా సంపుటాలు రాశారు. ఆవిడ రచనలు పలు భాషల్లోకి అనువాదమయ్యాయి. 1956లో తొలి నవల ‘ఝాన్సీర్‌ రాణి’ (ఝాన్సీరాణి) ప్రచురితమైంది. ఈ నవలకు అవసరమైన జనశ్రుతులు, జానపద గేయాలు సేకరించడానికి ఆవిడ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. సామాన్య ప్రజలతో మమేకం కావడంలో ఇది ఆవిడకు తొలి అనుభవం. 1964లో ఆమె కోల్‌కతాలోని విజయ్‌గఢ్‌ జ్యోతిష్‌రాయ్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా చేరారు. ఆ రోజుల్లో ఆ కళాశాల గిరిజనులకు- ప్రత్యేకించి శ్రామిక మహిళలకు విద్యగరపే సంస్థగా పేరొందింది. అక్కడ మహాశ్వేత  అధ్యాపకురాలిగా పనిచేస్తూనే, మరో పక్క పాత్రికేయురాలిగానూ, సృజనశీల రచయిత్రిగానూ రాణించారు. తన విద్యార్థినులతో చనువుగా ఉంటూ, వారితో కలగలిసిపోయిన కారణంగా ఆమె లోధా, శబర గిరిజన తెగల భాషా సంస్కృతులను, సగటు బెంగాలీ స్త్రీల, దళితుల సమస్యలను కూడా క్షుణ్నంగా అధ్యయనం చేయగలిగారు. అలా తెలుసుకున్న అంశాలను విస్తారమైన తన నవలా సాహిత్యంలో పొందుపరిచారు. నాటి సమాజంలో గిరిజనులు ఎంత దారుణంగా అగ్రవర్ణ భూస్వాముల, వడ్డీవ్యాపారుల, అవినీతి అధికారుల దోపిడీకి గురయిందీ కళ్లకు కట్టినట్లు వర్ణించగలిగారు. 
      గిరిజనుల మీద జరుగుతున్న అమానుషమైన దోపిడీకి వ్యతిరేకంగా మహాశ్వేత ఉద్యమించారు. ఆ క్రమంలో 19వ శతాబ్దంలో బ్రిటిష్‌ వారినెదిరించి పోరాడిన ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుడు, గిరిజనోద్యమ నేత బిర్సా ముండా జీవన పోరాటాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేశారు. బిర్సా ముండా (1875-1900) ప్రస్తుత బిహార్, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఉన్న ముండా జాతి గిరిజనుల ప్రియతమ నేత. ‘బ్రిటిష్‌ రాణి పాలనను తుదముట్టించి మన రాజ్యం స్థాపిద్దాం’ అనే నినాదంతో గెరిల్లా సైన్యాన్ని సృష్టించి, పోరాడిన వీరుడు. బ్రిటిష్‌ సేనలకు బందీగా చిక్కి రాంచీ జైలులో కలరాతో తన 26వ ఏటే మరణించాడు. ఆ పోరాట యోధునికి ముండా ప్రజలు నేటికీ వీరపూజలు చేస్తారు. బిర్సా ముండాపై మహాశ్వేతకు గల ఆరాధనా భావం ఎంతటిదంటే సంకెళ్లతో బంధించినట్లు ఉన్న ముండా విగ్రహాన్ని చూడటానికి సైతం ఆవిడ ఇష్టపడలేదు. ఝార్ఖండ్‌ ప్రభుత్వంతో పోరాడి మరీ ఆ విగ్రహానికున్న సంకెళ్లు తొలగింపజేశారు. బిర్సా ముండా జీవిత కథను 1977లో ‘అరణ్యేర్‌ అధికార్‌’ (అడవిపై హక్కు) పేరిట ఓ చారిత్రక నవలగా మలిచారు. దీనికి 1979లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. దీని తెలుగు అనువాదాన్ని ‘ఎవరిదీ అడవి?’ పేరిట హైదరాబాద్‌ బుక్‌ట్రస్టు ప్రచురించింది. బ్రిటిష్‌వారిని గడగడలాడించిన ఈ గిరిజన యోధుడి జీవితాన్ని యువజనుల కోసం సంక్షిప్తీకరించి మరో చిన్న పుస్తకంగానూ వెలువరించారామె. పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో ముండా చిత్రపటం ఉంచి గౌరవించడం, రాంచి విమానాశ్రయానికి బిర్సా ముండా పేరు పెట్టడం వంటి ప్రభుత్వ నిర్ణయాల వెనక మహాశ్వేతాదేవి రచనల ప్రభావం ఎంతో ఉందంటారు. 
      స్త్రీలకు స్వాభావికంగా ఉండే భావోద్వేగాలను అడ్డం పెట్టుకుని, ప్రేమ పేరిట భర్తలు ఎప్పుడూ భార్యల్ని బెదిరిస్తుంటారని, ఈ ‘భావోద్వేగ బెదిరింపు’లను (ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌)ని సరిగా అర్థం చేసుకున్న స్త్రీలు ఆ ఉచ్చులో చిక్కుకోరనీ మహాశ్వేత అభిప్రాయం. స్త్రీ స్వేచ్ఛ పట్ల ఆవిడకు గట్టి పట్టింపు కారణంగా తన వైవాహిక జీవితం అర్ధంతరంగానే ముగిసింది. ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌ (ఐపీటీఏ)ను స్థాపించిన ప్రముఖ బెంగాలీ నాటక, సినీ రచయిత బిజోన్‌ భట్టాచార్యను 1947లో మహాశ్వేత పెళ్లిచేసుకున్నారు. 1948లో కుమారుడు నబారుణ్‌ భట్టాచార్య జన్మించాడు. అనంతర కాలంలో నబారుణ్‌ కూడా సుప్రసిద్ధ బెంగాలీ రచయితగా ఎదిగారు. సాహిత్య అకాడెమీ పురస్కారం పొందారు. పేగు కాన్సర్‌తో 2014లో మరణించారు. అయితే, 1959లోనే మహాశ్వేత తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1962లో అసిత్‌ గుప్తా అనే మరో రచయితను పెళ్లి చేసుకున్నారు. అసిత్‌తో కలిసి దేశమంతా పర్యటించారు. పశ్చిమ బంగలోని గిరిజన ప్రాంతాలకు వెళ్లి, వారి దయనీయమైన స్థితిగతులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు. వాళ్లతో కలిసి, వాళ్ల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలనే బలమైన సంకల్పం కలిగింది. రోజులు, వారాలు, ఒక్కోసారి నెలల తరబడి కూడా ఆమె గిరిజన ప్రాంతాల్లోనే ఉండిపోయేవారు. నాగరిక సమాజం గుర్తించే విధంగా గిరిజనులకు జరుగుతున్న ఘోరమైన అన్యాయాల మీద నిర్భయంగా ఎలుగెత్తి చాటాలని ఆమె భావించారు. తాను ఏమైనా రాస్తే ఇక వారి గురించే రాయాలనే నిశ్చయానికి వచ్చారు. చిరకాలంగా పరిష్కారానికి నోచుకోని అనేక గిరిజన సమస్యల మీద ఎన్నో వ్యాసాలు రాశారు. తన ప్రతి రచనలోనూ కథాంశంలోకి గిరిజనుల సమకాలీన సమస్యలను తెలివిగా జొప్పించి, తనదైన రీతిలో వాటికి తగు పరిష్కారాలు సూచించేవారు. 1975లో అసిత్‌ నుంచి విడిపోయారు. ఆ తర్వాత కాలంలోనే ఆవిడ ఎక్కువ రచనలు చేశారు. 
      ‘బషాయిటుడు’, ‘ఒక తల్లి’ (హజార్‌ చౌరాషిర్‌ మా), ‘రుడాలి’, ‘చోలీ కే పీఛే’, ‘రాకాసి కోర’ (శ్రీశ్రీ గణేష్‌ మహిమ) తదితర ఆమె రచనలనూ హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ ప్రచురించింది. ‘అగ్నిగర్భ’, ‘మూర్తి’, ‘స్తన్యదాయిని’, ‘అమృతార్‌ సంచయ్‌’, ‘తితుమీర్‌’, ‘నైరుతి మేఘ్‌’, ‘సతి’, ‘స్వాహా’, ‘సుభగ’, ‘వసంత’ తదితరాలు ఆమె ఇతర రచనల్లో ముఖ్యమైనవి. ‘హజార్‌ చౌరాషిర్‌ మా’, ‘రుడాలి’ చలన చిత్రాలుగానూ వచ్చాయి. ఆమె ‘అరణ్యేర్‌ అధికార్‌’ నవలను ఆదివాసీలు తమ భాషలోకి అనువదించుకున్నారు. అదే తనకు నిజమైన పురస్కారమని ఆమె భావించారు. 
      మహాశ్వేత వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా తాను ఎంచుకున్న మార్గాన్నుంచి మాత్రం వైదొలగలేదు. గిరిజన సమస్యల మీద పోరాటం అనే తన జీవిత లక్ష్యాన్ని ఎన్నడూ వీడలేదు. అందుకే వైవిధ్యభరితమైన, లక్ష్యశుద్ధితో కూడిన ఆమె రచనలు ఆవిణ్నో గొప్ప భారతీయ రచయిత్రిగా నిలిపాయి. మనకు రచయిత్రులెందరో ఉన్నారు. అలాగే సామాజిక ఉద్యమకారిణులకూ కొదవలేదు. అయితే ఏకకాలంలో ఈ రెండు పాత్రలూ పోషించి, విజయవంతం అయినవారు మాత్రం చాలా అరుదు. మహాశ్వేతాదేవి అలాంటి అరుదైన వ్యక్తి. సాధారణంగా దుర్గమారణ్యాల్లోకి వెళ్లేందుకు పట్టణ జీవితానికి అలవాటుపడిన వాళ్లెవ్వరూ  సాహసించరు. మహాశ్వేత సాహసమే శ్వాసగా... ఎక్కడో విసిరేసినట్టుగా ఉండే సుదూర గిరిజన ప్రాంతాల్లోని కొండలు, గుట్టలు, అడవుల్లో సంచరిస్తూ గిరిజనులతో సహజీవనం చేస్తూ, వారు తినే తిండి తింటూ, వారి గోడు వింటూ, వారి సమస్యలేంటో, వాటికి తగిన పరిష్కారాలేమిటో యావత్ప్రపంచానికీ చెప్పారు. రచయితల పని కేవలం రాయడం మాత్రమే కాదు, వారు కార్యాచరణకూ ముందుకు ఉరకాలని తన జీవితమే ఒక సందేశంగా చాటిచెప్పారావిడ. నామమాత్రపు నష్టపరిహారంతో రైతుల నుంచి విలువైన భూములను సేకరించి, వాటిని కారుచౌకగా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయడాన్ని ఆమె ప్రశ్నించారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) నేతృత్వంలోని ప్రభుత్వ వివాదాస్పద పారిశ్రామిక విధానాన్ని తప్పుబట్టారు. బడా పారిశ్రామిక వేత్తలకు ఎర్ర తివాచీలు పరుస్తూ, తరాల తరబడి గిరిజనులు సాగు చేసుకుంటున్న పంట భూముల నుంచి వాళ్లని గెంటేయడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. మతం పేరిట 2002లో గుజరాత్‌లో జరిగిన మారణహోమాన్ని వ్యతిరేకిస్తూ, ఆ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. పశ్చిమ బంగ 2011 శాసనసభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ను బలపరచడం ద్వారా మహాశ్వేతాదేవి 34 సంవత్సరాల లెఫ్ట్‌ఫ్రంట్‌ రాజకీయ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టడంలో ప్రముఖపాత్ర పోషించారు. నందిగ్రాంలో ఆవిడ నడిపిన చారిత్రాత్మక ఉద్యమంలో పలువురు మేధావులు, కళాకారులు, రచయితలు తన వెంట నడిచారు. ఆ ఉద్యమానికి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చి... సింగూర్, నందిగ్రాంల విషయంలో నాటి ప్రభుత్వపు వివాదాస్పద నిర్ణయాన్ని తిప్పికొట్టగలిగారు. ఆ తర్వాత లాల్‌గఢ్‌ ఉద్యమ సమయంలోనూ ఆదివాసీల మీద భద్రతా బలగాలు చేస్తున్న దౌష్ట్యాలను తీవ్రంగా గర్హిస్తూ, లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వానికి తన తీవ్ర నిరసన తెలిపారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా లాల్‌గఢ్‌ ఆదివాసీల మీద మరోసారి దాడులు పెచ్చుమీరినప్పుడూ బాధితుల పక్షం వహించారు మహాశ్వేత. ఈ విషయంలో తన ఆప్తమిత్రురాలైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సైతం నిలదీయడానికి ఆవిడ వెనకాడలేదు. ఇదీ మహాశ్వేత నిర్భీక స్వభావం.
      మహాశ్వేత సామాజిక సేవకు గుర్తింపుగా 1986లో ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది. ఇక దేశ విదేశాల్లోని మరెన్నో పురస్కారాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చి, తమ గౌరవాన్ని మరింతగా పెంచుకున్నాయి. 1996లో ఆవిడకు అత్యున్నత సాహిత్య పురస్కారం ‘జ్ఞానపీఠ్‌’ లభించింది. ‘ఆసియా ఖండపు నోబెల్‌’గా గుర్తింపు పొందిన రామన్‌ మెగసెసె పురస్కారాన్ని మహాశ్వేత 1997లో అందుకున్నారు. భారతీయ జన జీవనంలో గిరిజనులు తమ న్యాయమైన, గౌరవ ప్రదమైన స్థానం దక్కించుకునేందుకు మహాశ్వేతాదేవి అహర్నిశలూ శ్రమించారని మెగసెసె పురస్కార కమిటీ కొనియాడింది. ఆవిణ్ని 2003లో ‘షెవాలియర్‌’ పురస్కారంతో సత్కరించింది ఫ్రెంచ్‌ ప్రభుత్వం. భారత ప్రభుత్వం 2006లో ‘పద్మవిభూషణ్‌’ ప్రదానం చేసింది. విశ్వసాహితీ యవనిక మీద అజరామరమైన సుస్థిర స్థానాన్ని పొందిన మహాశ్వేతాదేవి ఈ తరం రచయితలు, ఉద్యమకారులందరికీ ఆదర్శం.


‘‘సామాన్య ప్రజలే సిసలైన చరిత్ర నిర్మాతలని నేనెప్పుడూ నమ్ముతాను. జానపద కథలు, వీరగాథలు తదితర కాల్పనిక సాహిత్యం వేర్వేరు రూపాల్లో తరాల తరబడి మళ్లీ మళ్లీ ఈ సామాన్యుల ద్వారానే మనముందుకు వస్తూ ఉండటం నేను గమనించాను. ఈ సమాజం వల్ల అణచివేతకూ, దోపిడీకి గురై, ఎలాంటి గుర్తింపునకూ నోచుకోకున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించేందుకు మాత్రం ఇష్టపడని ఆ సామాన్యుల కోసమే ఈ నా రచనలు. వారే నాకు స్ఫూర్తి. బాధార్తులైన ఆ మహోన్నత మానవులే నా రచనలకు అంతులేని ఇంధనం సమకూరుస్తున్నారు. ఒకసారి వారి గురించి తెలుసుకోవడం మొదలెట్టాక నా రచనలకు ముడిసరకు కోసం వేరే ఎక్కడో ఎందుకు వెతుక్కోవాలి? ఆ సామాన్యుల రోజువారీ కార్యకలాపాలే నా రచనలకు పునాది’’ 

- గిరిజనుల సమస్యల పట్ల తన సాహిత్య సృజనలోని నిశ్చిత దృక్పథానికి కారణమేంటన్న ప్రశ్నకు మహాశ్వేత సమాధానమిది.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం