మా రామసక్కని పలుకయ్యో!

  • 446 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। నలిమెల భాస్కర్‌

  • కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
  • కరీంనగర్‌
  • 9704374081
డా।। నలిమెల భాస్కర్‌

ఇవాళ తెలంగాణ ఓ ప్రత్యేక రాష్ట్రం. దాదాపు కృష్ణా గోదావరుల మధ్య ఉన్న ఓ ప్రత్యేక ప్రాంతం. ఈ ప్రాంత ప్రజల భాషకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇతర తెలుగు ప్రాంతాల భాషతో పోల్చితే అవి విలక్షణమైనవి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కవులూ, రచయితలూ, విద్యాధికులూ, పాత్రికేయులూ రాస్తున్న, మాట్లాడుతున్న భాషకన్నా విభిన్నమైనవి. ‘తెలంగాణ భాషా దినోత్సవం’ (సెప్టెంబరు 9- కాళోజీ జయంతి) సందర్భంగా తెలంగాణ తెలుగులోని ఆ ప్రత్యేకతల విశేషాలు...
భాష అనగానే
మొదట స్ఫురించేవి వ్యాకరణరీత్యా భాషాభాగాలు. క్రియలూ, నామవాచకాలూ, సర్వనామాలూ, అవ్యయాలూ, విశేషణాలూ... ఇలా అన్నింటిలోనూ కాకున్నా చాలావరకూ తెలంగాణ తెలుగులో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ భూతకాలిక సమాపక క్రియ ‘వచ్చిండు’. ఈ రూపం నిజానికి ‘వచ్చియున్నవాడు’, ‘వచ్చినవాడు’, ‘వచ్చినాడు’.. అదే వరసలో పరిణామం చెంది ఏర్పడింది. వచ్చియున్నవాడులోని ‘న్న’, వచ్చినవాడులోని ‘న’, వచ్చినాడులోని ‘నా’ కొంత మారిపోయి ‘వచ్చిండు’(వచ్చిన్‌డు)లో ‘న్‌’ అనే పొల్లుగా కనిపిస్తోంది. ఇలా నకారం రావడం తెలంగాణ క్రియల (భూతకాలిక సమాపక క్రియల) ప్రత్యేకత. ఇక ‘వచ్చుకుంట, పోవుకుంట, చూసుకుంట’ తదితరాలు శత్రర్థకాలు. వీటికి ‘వస్తూ, పోతూ, చూస్తూ’ అని అర్థాలు. మరి ఈ ‘కుంట’ ఎలా వచ్చింది? తమిళంలో వీటిని ‘వందుకొండు, పోయ్‌కొండు, పార్‌త్తుక్కొండు’ అని అంటారు. ఆ తమిళ భాషలోని ‘కొండు’ ఈ తెలంగాణలో ‘కుంట’గా మారింది. తెలంగాణ తెలుగు ద్రావిడ భాషాజన్యమైందే కాబట్టి ఈ శత్రర్థక అసమాపక క్రియల రూపాల్లో ‘కుంట’ నిలిచింది. ‘వస్తున్నడు’ మొదలైన వర్తమాన క్రియల్లోని ‘న్న’- దీర్ఘాన్ని పోగొట్టుకున్న రూపం. నిజానికి ఇది ‘వస్తున్నాడు’గా ఉండాలి. ఇక ‘వస్తడు’ అనేది తెలంగాణ ప్రాంత భవిష్యత్తు కాల క్రియ. ఇక్కడ సైతం ‘స్త’ దీర్ఘం కోల్పోయింది. వాస్తవానికి ‘వస్తాడు’ అని ఉండాలి కదా! అయితే ప్రాచీన పద్యభాషలో ‘వచ్చెదడు’ అనే క్రియ ఉంది. అదే క్రమంగా ‘వస్తడు’గా మారిందని చెప్పుకోవడం సబబు... దీర్ఘలోపం జరిగింది అనడం కన్నా!
      విశేషణాల్లో భావార్థక విశేషణం ‘వచ్చుడు, పోవుడు’ ప్రాచీనభాషలో ఆ రూపాల్లోనే ప్రయుక్తమై ఉండటం గమనార్హం. ఇవి తమిళంలో ‘వరువుదు, పోవుదు’ అని ఉన్నాయి. తమిళ విశేషణాంతంలోని ‘దు’, తెలంగాణలో ‘డు’గా మారింది. తద్ధర్మార్థక విశేషణం అయితే తెలంగాణలో ‘వచ్చేటి, పొయ్యేటి’గా ఉంది. ప్రాచీన భాషలో ఇది ‘వచ్చెడు/ది, పోయెడు/డి’ అని వేరుగా కనిపిస్తుంది. ‘వచ్చే, పోయే’ అనే విధంగా ఉన్న నేటి ఆధునిక ప్రామాణిక భాషలో ‘వచ్చేటి’, ‘పొయ్యేటి’లోని ‘టి’కి ప్రాచీనరూపమైన ‘డు/డి’ లోపించింది. మొత్తానికి తెలంగాణ భాష చాలావరకు ప్రాచీన తెలుగు భాషా రూపాలను నిలుపుకున్న భాష. ముస్లింల పాలనలో మాతృభాషలో విద్యావకాశాలు లేకపోవడం, భౌగోళికంగా ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లకపోవడం... ఇతరేతర అనేకానేక కారణాలతో తెలంగాణ ప్రాంతానికి విద్య, ఆధునికత, నాగరికతల వంటివి కొంతకాలం చేరలేదు. తద్వారా ఈ ప్రాంతం భాషకు సంబంధించి కొన్ని ప్రత్యేకతలను నిలుపుకుంది. 
      క్రియల్లో ‘తుమున్నర్థకం’ కూడా తెలంగాణలో ప్రత్యేకంగా ఉంది. ‘వచ్చేటందుకు’, ‘పోయేటందుకు’ తదితరాలు ఉదాహరణలు. నామవాచకాల్లోనైతే ‘ఆనెపుకాయలు, ఎండ్రికాయలు, ఆలుగడ్డలు, గోకలు, జంబి, సాబ్దానాలు’ మొదలైన అనేక ప్రత్యేక పదాలు బహుళంగా ఉన్నాయి. సర్వనామాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ‘అతను’ అనడానికి ‘తన’ లేదా ‘తిను’ అని అంటారు. ‘నేను’కు బదులు ‘నీను’ అనడమూ ఉంది. 
వీనులవిందైన మాట
వ్యాకరణాంశాల్లోనే కాకుండా, భాషా విషయకంగా కూడా బాగా ప్రత్యేకతలున్నాయి. తెలంగాణ పలుకుబడిలో నాదమాధుర్యం ఎక్కువ. లయ, తూగు, సంగీతం, నాదం ఎక్కువ. ఆ నాద సౌందర్యానికి ప్రధాన కారణం... పదాల మధ్యలోనో, చివర్లోనో ‘నిండు సున్నా’ ఉండటం. ఉదాహరణకు ‘నాగుంబాము, తాంబేలు, పుంటికూర, మెంటకన్ను, వరంగల్, పొద్దుందాక, తెల్లందాక, పొద్దుంజాముల, పొంటె’ మొదలైనవి. వీటిలో ‘నిండుసున్న’ మధ్యలో ఉంది. ఇక ఇదే ‘నిండుసున్న’ ‘మెంతం’, బొదునం’ తదితరాల్లో చివరన ఉంటుంది. ఈ నిండుసున్నలు అంటే పూర్ణానుస్వారాలు కొన్ని క్రియా పదాల్లో సహజసిద్ధంగానే ఉన్నవి అయితే మరికొన్ని సాధించుకున్న రూపాలు. ‘నాగుంబాము’, ‘తాంబేలు’ మొదలైన పదాల్లో ‘సున్న’ సిద్ధపూర్ణానుసారమే! నిఘంటువుల్లోనూ నిదర్శనంగా ఈ ‘సున్న’ స్థానంలో ఆ పదాలకు ‘అరసున్న’ ఇప్పటికీ ఉంది. మెల్లట్లకన్ను (మెంటకన్ను), పుల్లటికూర(పుంటికూర)ల్లో సాధ్యరూపాలున్నాయి. 
      తెలంగాణ భాషలో సంగీత మాధుర్యానికి ‘నిండుసున్న’ ఒక్కటే కారణం కాదు. ఆ భాష యతిప్రాసల శ్రుతిసుభగ భాష. శ్రవణపేయ అమృతభాష. తెట్టన తెల్లారుడు, పట్టన గండె పల్గుడు, చెటాన చెంపదెబ్బ ఏసుడు, మూట ముగ్గురు, ఎర్రటి ఎండ, పాలు పల్లుడు, కాటకల్సుడు.. వీటిలో యతిమైత్రి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భాషను సంగీతమయం చేసే మరో అంశం... పదాల్లో (కొన్నింటిలో మాత్రమే) కొన్ని అక్షరాలను ద్విత్వం చేయడం. మస్సి, గస్సాలు, తట్టతట్ట కాళ్లు కొట్టుకునుడు, గొర్రగొర్ర గుంజుకపోవుడు, బర్రబర్ర గోకుడు, కస్సపిస్స తినుడు, లట్టలట్ట తాగుడు, మిట్టమిట్ట చూసుడు, వల్లవల్ల ఏడుసుడు... ఇలాంటి మాటల్లో ద్విత్వం ఒక ఊనికను ఇస్తూ శబ్దపరంగా ఆయా అక్షరాలను మరింత బలోపేతం చేస్తుంది. 
      తెలంగాణలోని కొన్ని పదాలకు ఉన్న తూగు కూడా నాదానికి కారణం. తోక తెల్వది/ తొండెం తెల్వది, తోక తెల్వది/ ఈక తెల్వది, చుట్టాలు/ పక్కాలు, ఆస్తులు/ పాస్తులు, చెప్పకుంట/ చెయ్యకుంట... ఇలా దీనికెన్నో ఉదాహరణలు చూపవచ్చు. ఇక్కడ గీతకు ఇటూ అటూ ఉన్న పదాలు సరిసమానంగా ఉన్న పదాలు. అంటే ఒకే తూగును, లయను కలిగి ఉన్న శబ్దాలు. ఇక్కడి శబ్దసంయోజకత్వానికీ నాదమాధుర్యానికీ మరో కారణం... కొన్ని పదాల్లోని అసంయుక్తాక్షరాలను సంయుక్తాలుగా మార్చడం. ‘జంజాట్కం, కైలాట్కం, నీట్కం, పూట్కం, జాత్కం, జోప్కం’ తదితరాలన్నీ అసంయుక్తాలుగా ఉన్నప్పుడు లేని శబ్దసౌందర్యం ఉచ్చారణలో సంయుక్తాలుగా మారినప్పుడు వస్తుంది.
ప్రతి మాటకూ అర్థం
తెలంగాణలో నాదసౌందర్యం కలిగిన లయబద్ధమైన భాషే కాకుండా ఈ ప్రాంత ప్రజల వ్యవహారంలో అర్థవంతమైన భాష ఉంది. అంటే ఆ భాషలో చాలా పదాలకు వ్యుత్పత్తి చెప్పవచ్చు. అంగాన్ని కప్పేది ‘అంగీ’. వేసుకునేటప్పుడూ, తీసేసేటప్పుడూ లాగుతూ ఉంటాం కాబట్టి ‘లాగు’. లోపల బోలుతనం కలిగి ఉండేవి ‘బోలుప్యాలాలు’. మష్కరము అంటే వెదురుకర్రల్ని పట్టుకుని ఉండేవాళ్లు ‘మస్కరోల్లు’. వెలివేయబడినట్లు ఉండేవాళ్లు ‘ఎలోల్లు’. వెట్టిచేసేవారు ‘ఎట్టోల్లు’. గ్రామ తలైవర్లు (ఒకానొక కాలంలో నాయకులు. తలైవర్‌ అనేది తమిళ పదం) కాబట్టి ‘తలార్లు’. సుంకం వసూలు చేసేవాళ్లు ‘సుంకర్లు’. నాగుపాము పడగ ఆకారంలో కాండమూ ఆకులూ కలిగిన నాగజెముళ్లు ‘పాముపడిగె చెట్లు’. గుడ్డని మేరల కత్తిరించి కుట్టే దర్జీ కాబట్టి ‘మేర’. పంట చేతికొచ్చే దాకా కంటికి రెప్పలా కాపలా వహించే రైతులు ‘కాపోల్లు’ లేదా ‘కాపుదనపోల్లు’. చల్లగా ఉండి చల్లదనాన్ని ఇచ్చే మజ్జిగ ‘చల్ల’. ఎర్రగా ఉండి, చేపకు ఎరగానూ ఉపయోగపడే వానపాము ‘ఎర్ర’. తలకింద పెట్టుకునే మెత్తటి తలగడే ‘మెత్త’ అనీ... ఇలా వేల పదాలకు ఆ పదాలు ఎలా వచ్చాయో చెప్పవచ్చు. 
      తెలంగాణ నుడిలో లౌకికగుణం ఉంది. ముస్లింల పరిపాలన వల్ల ఉర్దూ పదాలు పాలల్లో పంచదారలా చేరిపోయాయి. అంగూర్లు, సేపులు, సంత్రాలు, మోసంబీలు, కిస్మిస్‌లు, పరేషాన్, చాపత్త, చాయ్, లాపత్త, బేఫికర్, బేయిమాన్‌తనం వంటి పదాలు తెలంగాణలో ఈనాటికీ విరివిగా వాడతారు. ఆంగ్ల ప్రభావానికి లోనుకాని భాష ప్రపంచంలో ఏదీ లేదు. అయితే ఆంగ్ల పదాలు తెలంగాణ తెలుగులో ఇతర ప్రాంతాల తెలుగుకన్నా భిన్నమైన రీతిలో ఏర్పడతాయి. పెట్రోలు తెలంగాణలో ‘పిట్రోల్‌’ అవుతుంది. కంపెనీ ‘కంపినీ’గా మారుతుంది. బకెట్టు ‘బకీటు’గానూ, కప్పు ‘కోపు’గాను మారతాయి. ఈ రూపాంతరాలు అన్ని ప్రాంతాల తెలుగులో ఒకేలా ఏర్పడట్లేదు. మళ్లీ వ్యాకరణరీత్యా చూసినప్పుడు ఉపమావాచకాలు తెలంగాణలో వేరుగా ఉంటాయి. వలె, పోలె, లా, లాగా, వంటి, మాదిరి మొదలైన ఉపమావాచకాలు ‘ఓవె, ఓలిగె, లెక్క, నమోన, తీరుగ’ (వానోలె, వానోలిగె, వానిలెక్క, వారినమోన, వానితీరుగ) అనే విధంగా ఉంటాయి. 
అందమైన నుడికారం
తెలంగాణ నుడికారాల సంగతి చెప్పనక్కర్లేదు. అసలు ఏ భాషకైనా నుడికారాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఏదీ పట్టించుకోని ‘తామరాకు మీద నీటిబొట్టు’ లాంటి వ్యక్తి తెలంగాణలో ‘గడ్డి గాలికి పోనీ- వడ్లు వాగల పోనీ’ అనుకుంటాడు. ఈ లౌకిక విషయాలు అతనికి పట్టవు. బాధ్యతలు నచ్చవు. మందమతులైన మృత్పిండాలుగా ఉన్న మట్టిబుర్రల్ని పట్టుకుని ‘నీ తల్కాయల పెండ గిట్ల ఉన్నాదిరా?’ అని ప్రశ్నిస్తారు. పనుల పట్ల ఏకాగ్రతతో ఉండాల్సిన అవసరాన్ని ‘దమాక్‌ సంటర్ల ఉండాలెరా’ అని హెచ్చరిస్తారు. అనవసరమైన విషయాలు పట్టించుకునే మనుషుల ప్రవర్తన చూసి ‘పురుగు మెసులుతుందారా?’ అని అడుగుతారు. అర్థంకాని విషయం ఏదైనా ఉంటే ‘అరటిపండు ఒలిచి నొట్లె పెడతరు’. లోకం చుట్టిన వీరులను ‘వాడు దునియ చూసిండు’ అంటుంటారు. నువ్వు ఎన్నయినా విషయాలు చెప్పు అనే మాటను ‘నువ్వు దునియ చెప్పు’ నేను విననే వినను అని మొండికేస్తారు. ఏ ఒక్కదానికీ జవాబు చెప్పని వ్యక్తిని ‘మూగదయ్యం’ అంటారు. ఇంకా ‘ముద్దలింగం, సుబ్బన్న, అబ్బన్న, పెండకడి, గజ్జెలగుర్రం, ఏషకాంత, దయిత, చెంచెత’... లాంటి ఎన్నో మాటలు ఇక్కడ నుడికారాలుగా చలామణిలో ఉన్నాయి. 
ఎన్నెన్నో సొగసులు
తెలంగాణలో తత్సమపదాలకు కొదవే లేదు. ఓ మనిషికి ఎల్లవేళలా ఒకే పనిమీద దృష్టిపడినప్పుడు వానికెప్పుడూ అదే ‘ఆలాపన’ అంటారు. సంగీతంలో ఆలాపన తెలిసిందే కదా! అలాంటిదే ఇది. విపరీతమైన అపేక్ష ఉన్నప్పుడు వానికి ‘ఆపాచ్చన’ ఎక్కువ అంటారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ పరిశోధిస్తున్నప్పుడు ‘అబ్బా! వాడు పొక్కలకెల్లి సోదిచ్చుకవత్తడు’ అంటుంటారు. అతితొందరగా మహావైళమే వచ్చినప్పుడు ‘ఏమో మాయల్లెమే వస్తివి’ అంటారు. దారుణం జరిగిపోయిందనడానికి ‘గోరం’, బాధకు పర్యాయంగా ‘గోస’, మహత్కార్యాన్ని ‘ఏం మాత్కార్యం తియ్యి’, పెద్దపని చేసినవాణ్ని వ్యంగ్యంగా ‘గనకార్యం చేసినవు తియ్యి’ అనీ పేర్కొంటారు. 
      అచ్చతెలుగు పదాలకూ, తెలుగుదనం ఉట్టిపడే మాటలకూ తెలంగాణ పెట్టింది పేరు. అసూయను ‘ఓర్పుమల్లెతనం, కండ్లమంటతనం, కన్నెర్రతనం’ అనీ, అర్ధాకలిని ‘సగం కడ్పుకు తినుడు’ అనీ అంటారు. ప్రేమను ‘నెనరు’, అందాన్ని ‘చక్కదనం’/ ‘రామసక్కదనం’, అజ్ఞానాన్ని ‘తెలివితక్కువతనం’, అవగాహనను ‘తెల్సినతనం’, అవగాహన లేమిని ‘తెల్వనితనం’, మిడిమిడి జ్ఞానాన్ని ‘తెల్సితెల్వనితనం’ అనీ... ఇలా అనేక పదాలు పండితులు మొదలుకుని చదువురానివాళ్ల దాకా వ్యవహారంలో ఉండటం తెలంగాణ ప్రత్యేకత.
      మొత్తమ్మీద చూసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణలో మాట్లాడుతున్న భాష కొంత వ్యత్యస్తంగా ఉందన్నది సత్యం. తెలంగాణ తెలుగులో బాగా చదువుకున్న వాళ్ల మాటల్లోనూ మహాప్రాణాక్షరాలు పలకవు. తెలంగాణలో దేశీ సంప్రదాయానికి విలువ ఎక్కువ. జానుతెలుగు ప్రభావమూ అధికమే! జ్ఞానవిదులైన జానపదుల తత్త్వం తెలంగాణలో బాగా కనిపిస్తుంది. తెలంగాణ తెలుగు అశేష ప్రజానీకానికి దగ్గరైన భాష. గానయోగ్యమైన జానపద భాష.


వెనక్కి ...

మీ అభిప్రాయం