క్రాంతిదర్శి... సాహితీ రుషి

  • 163 Views
  • 0Likes
  • Like
  • Article Share

కవిత్వం రాసేవాళ్లందరూ కవిత్వాన్ని ప్రేమించరు. ఇక్కడ ప్రేమించడం అంటే తన పర భేదాలకు అతీతంగా కవితామధురిమలను ఆస్వాదించడం... ఆ రుచి తెలియని వారికి దాన్ని చవిచూపించడం. కానీ, చాలామంది కవులు తమ కవితలను మాత్రమే ప్రేమిస్తారు. ఇతరుల రచనలను తీసిపారేస్తారు. ఈసడించేవాళ్లూ లేకపోలేదు. ఇలాంటి కాలంలో ఓ కవి సొంతంగా కవితలు అల్లుతూనే, ఇతరుల కవిత్వంలోని విశిష్టతలను లోకానికి చాటడం గొప్ప విషయమే కదా. స్వచ్ఛమైన ఆ కవితా ప్రేమికుడే ఆవంత్స సోమసుందర్‌. నిజాం నిరంకుశ పాలన మీద ప్రయోగించిన అభ్యుదయ ‘వజ్రాయుధం’తో సహా ఆయన వందకు పైగా రచనలు చేశారు. తన విశ్లేషణా సామర్థ్యంతో తెలుగు సాహితీచరిత్రలో శ్రీరంగం నారాయణబాబుకు శాశ్వత స్థానం కల్పించారు. విశ్వనాథ, పాలగుమ్మి, శ్రీశ్రీ, పఠాభి, సినారె, శేషేంద్రశర్మల నుంచి అనిశెట్టి సుబ్బారావు వరకూ ఎందరో సమకాలీన సాహితీవేత్తల రచనలను తనదైన కోణంలో విశ్లేషిస్తూ, వ్యాఖ్యానిస్తూ ఎన్నో రచనలు చేశారు. ‘నా కవిత్వం మీద విమర్శా వ్యాసం రాయవూ’ అని దేవులపల్లి కృష్ణశాస్త్రి, తిలక్, పురిపండాలు ఆవంత్సను అడిగారంటే... విమర్శకుడిగా ఆవంత్స స్థాయిని అర్థం చేసుకోవచ్చు.  
      తూర్పుగోదావరి జిల్లా శంఖవరంలో నవంబర్‌ 18, 1924న జన్మించారు సోమసుందర్‌. పిఠాపురం, కాకినాడల్లో చదువుకున్నారు. ‘క్విట్‌ఇండియా’ ఉద్యమంలో పాల్గొని లాఠీదెబ్బలు తిన్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తితో ‘వజ్రాయుధం’ రాశారు. నాటి బ్రిటీష్‌ ప్రభుత్వం దాన్ని నిషేధించింది. స్వాతంత్య్రం వచ్చాకగానీ ఆ నిషేధం తొలిగిపోలేదు. ఆ తర్వాత కూడా అభ్యుదయ దృక్పథంతో ఎన్నో రచనలు చేశారు ఆవంత్స. అంతేనా! ‘కళాకేళి’ పత్రిక నిర్వహించారు. అనువాదాలు చేశారు. జీవిత చరిత్రలు రచించారు. ఆగస్టు 12, 2016న ఆఖరిశ్వాస విడిచేవరకూ సాహిత్యాన్నే శ్వాసించిన మహామనీషి ఆయన. ‘నవతరంలో కూడా ఆలోచనాపరులైన రచయితలు ఉన్నారు’ అంటూ యువతరాన్ని భుజం తడుతూ ముందుకు నడిపించిన ఆయన మరణంతో తెలుగు సాహితీరంగం ఓ పెద్దదిక్కును కోల్పోయింది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం