భార్యా విధేయత!

  • 77 Views
  • 1Likes
  • Like
  • Article Share

    గుడ్లదొన సరోజనీదేవి

  • విశ్రాంత తెలుగు ఉపాధ్యాయురాలు
  • హైదరాబాదు.
  • 8142282158
గుడ్లదొన సరోజనీదేవి

విధి విధేయత కన్నా గడుసు పురుషుడు భార్యావిధేయతను నమ్ముకుంటాడు. భగవంతుడు కనిపించడు. భార్య కనిపిస్తుంది. భయం భార్య మీదా, భక్తి భగవంతుడి మీదా ఉంచుకుంటే బతికున్నంత కాలం భుక్తికి వెతుకులాట తప్పుతుంది. పెళ్లినాడే పెళ్లాం కొంగుకి పంచె అంచు ముడివేయించి మరీ పెద్దలు భార్యామణి ఆధిక్యతను అధికారికంగా ప్రకటిస్తారు. బరువు బాధ్యతలు భర్తవంటారు గానీ... వట్టిదే! భర్త బరువూ బాధ్యతా భార్యదే! భార్య బరువూ బాధ్యతా భర్తకు పడకటింటి వరకే పరిమితం.
      పెళ్లాం చెబితే వినాల్సిందే! రాముడు అదే చేశాడు. అష్టకష్టాల పాలయ్యాడు. అయినా కృష్ణుడూ అదే బాటపట్టి భార్య కాళ్లుపట్టాడు. పడకటిల్లే కదా! ఏ పాట్లు పడితే మాత్రం తప్పేంటి! అనేది వట్టి బుకాయింపులకే! గడపకవతలా తన తరుణి గీచిన గీత మగవాడు జవదాటరాదు. దాటితే ఏమవుతుందో ఏ మొగుడూ బయటికి చెప్పడు!
      ఎన్నికల్లో ఓటేసే జనాలంత అమాయకంగా ఉంటారా భార్యలెవరైనా! మగాడేదో మానసిక సంతృప్తి కోసం ఆడదాని జడత్వం మీదనో... పతివ్రతా మాహాత్మ్యం మీదనో కథలు, కవిత్వాలల్లుకుంటే అల్లుకోవచ్చుగాక. ఆడవాళ్లు వాటిని చదివి లోలోన నవ్వుకుంటారని పాపం మగభడవాయిలకి తెలీదు!
      లాలూ ప్రసాదు అర్ధాంగి రబ్రీదేవమ్మ కథల్లోనే స్త్రీశక్తి ఏంటో తేటతెల్లమవడం లేదా! పోనీలే పాపమని మొగుడు తనమీద పెత్తనం చెలాయించేందుకు ఆడది అంగీకరిస్తుంది కానీ... వాస్తవానికి ఇంటి పెత్తనం, మొగుడి కంటి పెత్తనం... వంటి పెత్తనం... చివరాఖరికి... జైలుకెళ్లిన భర్త కుర్చీ మీద కూడా దాన వినిమయ విక్రయాది సర్వహక్కుభుక్తాలు తాళి కట్టించుకున్న భార్యామణికి మాత్రమే దఖలుపడి ఉంటాయి.
      కైకేయిని కాదని దశరథుడు ఏమన్నా చేయగలిగాడా? సత్యభామను రావద్దని కృష్ణస్వామి యుద్ధభూమికి వెళ్లగలిగాడా? భార్యను కాళ్ల దగ్గరుంచుకున్నట్లు బయటికి వీరబిల్డప్పే శేషప్ప శయనుడిది! భృగుమహర్షి పాదాలు పట్టాడని అలిగి భూలోకం జారుకున్న శ్రీలక్ష్మమ్మను ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఏడుకొండల వాడు పడ్డ ఇడుములు అన్నీ ఇన్నీనా! సహధర్మచారిణి సాహచర్యంలో ఏ మజా లేకపోతే మహావిష్ణువంతటి వాడూ అన్నేసి కోట్ల ఖర్చుకు వెనకాడకుండా పెళ్లిపీటల మీదకు తయారవుతాడు... చెప్పండి! విరాగి... బికారి... అంటూ వీరబిరుదులు ఎన్ని తగిలించుకుంటేనేమి! ఇద్దరు భార్యలనూ సుబ్బరంగా ముద్దు చేశాడా లేదా ఉబ్బులింగడు! విధాతగారి కథయితే మరీ విచిత్రం. అర్ధాంగి అవసరం ముదిమితనంలో మరీ ఎక్కువ. వావివరసలైనా చూసుకోకుండా అందుకే సరసమహాదేవి సరసన చేరిపోయాడు ముసలిబ్రహ్మ!
      పూర్వాశ్రమంలో ఎంత చింకిపాతలరాయుడైనాగానీ... తన మెళ్లో తాళి కట్టిన అదృష్టానికి ‘శ్రీవారు’ హోదా ప్రసాదిస్తుంది స్త్రీమూర్తి! అలాంటి ఒక ఉదారమూర్తిని మగాడు ఓ దినం ఎన్నుకుని అభినందించేందుకు పూనుకోడమేంటి! ఫన్నీ! ఇంగ్లీషు వాడికదో చాదస్తం. మన దేశీయ మగవాడు మాత్రం అడుగడుగునా ఏడడుగులు తనతో కలిసి నడిచిన ఇల్లాలి అడుగులకు మడుగులు ఒత్తుతూనే ఉంటాడు... ఇంట్లో! బయటకు చెబుతారా అన్నీ!
      భార్య కొన్నవి మినహా ఏ మగవాడైనా సొంత అభిరుచి మేరకు దుస్తులు ధరించే సాహసం చేయగలడా! విసుగుపుట్టో, జాలి కలిగో... రిమోటు వదిలితే తప్ప మగవాడన్నవాడు సొంత ఇంట్లో- పడకటింట్లో అయినా ఇష్టమైన ఏ ‘ఎఫ్‌’ ఛానల్‌నయినా మనసారా చూడగలడా! ‘భోజనంలోకి ఏం చేయమంటారండీ!’ అంటూ భార్యలు తలుపు చాటునుంచి బిడియపడుతూ అడిగి... చేసి... వడ్డించే స్వర్ణయుగం కేవలం ప్రబంధాల్లోనే! వంటకు వంక పెట్టడం అటుంచండి మహాశయా! భార్య బజారు నుంచి కొనుక్కొచ్చిన పచ్చడికైనా వంకపెట్టే గుండె ధైర్యం ప్రపంచంలో ఏ మగాడికైనా ఉంటుందా... చెప్పండి! పచ్చడి పచ్చడి అయిపోదూ ఆ రోజంతా బతుకంతా!
      స్త్రీ పాత్ర లేని నాటకాలంటే మగాళ్లు ముచ్చటపడి రాసుకునే ఉటోపియాలు! స్త్రీ ప్రమేయం లేని... ముఖ్యంగా భార్యామణి హస్తాల్లేని సంసారాలను ఆ విధాత కూడా సృష్టించలేడు. సృష్టించాలని ఉన్నా, కట్టుకున్న శారదమ్మ చూస్తూ ఊరుకోదు!
      ‘కవులేల తమ కావ్యములలో భార్యల గూర్చి వర్ణించరు?’ అని వెనకటికి తర్కం లేవదీసింది ఓ ఎల్లేపెద్ది వెంకమ్మగారు ‘విద్యానంద’మనే పాత పత్రికలో! కాళిదాసు శకుంతలను వర్ణించాడుగానీ... కట్టుకున్న భార్య కట్టుబొట్టులనైనా గట్టిగా ఓ శ్లోకంలో వర్ణించలేదని ఫిర్యాదు. శూలపాణీ అంతే! ముప్ఫయ్యేడు నాటకాల్లో లెక్కలేనంత మంది ఆడవాళ్లను అణువు వదలకుండా వర్ణించిన శృంగార పురుషుడు! అణిగిమణిగి ఉందన్న చులకనభావం కాబోలు... వేళకు అన్న వస్త్రాలు అందించే భార్య సుగుణాలలో ఒక్కటీ సదరు శూలపాణిగారి దృష్టికి ఆనలేదు! తల్లులను తలుచుకున్నవారు కొందరున్నారు. అవ్వల మీద అవ్యాజమైన ప్రేమానురాగాలు కురిపించిన కవులూ కద్దు. అన్ని దేశాల కవులు తమతమ రాజులనే కాకుండా వాళ్లవాళ్ల దేవేరులను, భార్యలను, వేశ్యలను సైతం వర్ణించి తరించడం కనిపిస్తున్నదేగాని... సొంత భార్యల ప్రస్తావనల దగ్గరమాత్రం ఎందువల్లనో సర్వే సర్వత్రా పస్తాయింపులే! ఏ కావ్యపీఠికైనా పరకాయించి చూడండి! కావ్యపోషకుడి వంశవర్ణనలే మెండు. ఒక్క రెండు మూడు మంచి పద్యాలైనా సమయం సందర్భం చూసుకుని కంచిగరుడ సేవ చేసే ఇల్లాలి గురించి రాద్దామన్న బుద్ధే ఏ కవిమాన్యుడిలో కలక్కపాయె!
      భార్య లఘువుగా ఉండి మరీ భర్తను గురువు చేస్తుందని మళ్లీ షేక్‌స్పియరే స్త్రీమూర్తిని మోస్తాడు! భార్యలేని మగాడు పైకప్పులేని తాటాకుగూడని జర్మన్‌లు కూడా వంతపాడారు. ‘అదృష్టం ఎన్ని భాగ్యాలైనా ప్రసాదిస్తుందటగానీ... అనుకూలమైన భార్యమాత్రం ఈశ్వరేచ్ఛే’నని పోప్‌ జాన్‌పాల్‌ సైతం అన్నారే! మరెందుకీ మగాళ్లందరికీ తాళికట్టిన మహిళ మీదంత మత్సరం!
      ‘నిప్పు... నీరు... భార్య’ అందుబాటులో ఉండే అత్యంత అపాయకరాలని ఆ ఎద్దేవాలెందుకు! ఏ మాటకామాటే! నిప్పూ నీరుకు మల్లే ఆడదీ ఒళ్లు మండితే వేడి పుట్టించేస్తుంది. కన్నీళ్లతో వణుకూ పుట్టిస్తుంది. మగాడిదే మాయదారి బుద్ధి. చచ్చిన పెళ్లాం మీదా అతగాడి దుఃఖం వాకిలి దాకానే!
      అందరు మగాళ్లూ అలాగే ఉంటారని కాదు. మంచన మహాకవి ‘కేయూరబాహు చరితం’లో మగాడి ప్రేమకు అద్దంపట్టే ఓ చిత్రమైన కథా ఉంది. భార్య వయసులో చిన్నది. భర్తకు ఆమె అంటే అంతులేని అనురాగం. ఆమె గర్భం దాల్చింది. ఆ సమయంలోనే ఊరువాళ్లంతా తీర్థయాత్రలకని బయలుదేరారు. ‘వయసులో ఉన్నదానివి. నాలుగూళ్లు తిరగాలన్న సరదా సహజం. నీ గర్భం నేను మోస్తాను. తీర్థయాత్రలు ముగించుకొని వచ్చి తిరిగి తీసుకో!’ అంటూ భార్యగర్భం తనకు బదిలీ చేయించుకుని ఆపసోపాలు పడేందుకు సిద్ధపడతాడు ఓ అద్భుతమైన మగవాడు! చూలు మోయడమంటే పేలాలమూట మోయడమా! అన్నం సయించదు. నిద్రబాధలు. బిడ్డకుట్లకు ఓర్చి నీళ్లాడినా... తర్వాత వాతాలు తగులుకోకుండా పథ్యపానీయాలతో పంచకరపాట్లు పడాలి! గర్భం మోసి బిడ్డను కని... పెంచి పోషించేందుకు ఆడది సుకుమారయీ ఎన్ని కష్టాలను ఇష్టంగా ఓర్చుకుంటుందో మగవాడు తెలుసుకోవాలి. నాగరికులమని బోరవిరుచుకు తిరిగే నేటి తరాలకన్నా... అనాగరికులుగా ముద్ర వేయించుకొని బతుకులు వెళ్లమార్చే జాతులు కొన్నింటిలో మగవాడు భార్య ప్రసవ వేదనలను పలురీతుల్లో తానూ పంచుకొంటూ నిజమైన సహచరుడు అనిపించుకుంటాడు.
      ఎరుకల కులంలో భార్య ప్రసవించే సమయానికి మగవాడు ఆమె కట్టుబొట్టులను తాను అనుకరిస్తూ చీకటిగది కుక్కి మంచం మీద దుప్పటి ముసుగులో దాక్కుంటాడు. భార్యకు సుఖంగా ప్రసవమైతేనే మంచం దిగేది! బాలింత తినాల్సిన గొడ్డుకారం... ఇంగువ ముద్దలు భర్తే మింగుతాడు. అండమాను దీవుల్లోని మరో తెగలో అయితే గర్భిణీ భార్య తినకూడని గొడ్డుమాంసం, తేనె వంటి పదార్థాలు తనూ ముట్టడు. బిడ్డ పుట్టగానే పెనిమిటి ఉయ్యాల్లో పడుకొనే వింత ఆచారం న్యూగినియా ఆదిమ జాతుల్లో నేటికీ ఉంది. పార్శీసుజాతి మగాడికి ఉయ్యాలశిక్షతోపాటు ఒంటికి నల్లరంగు పులుముడు అదనం. మైల తీరేదాకా గది బయటికి రాడు కూడా. బిడ్డ బొడ్డుతాడు ఊడేవరకు ఉపవాసాలుంటాడు. ఫిలిప్పీన్స్‌ దీవుల్లో ప్రసవ సమయంలో భార్య గది గస్తీ బాధ్యత కట్టుకొన్న భర్తదే. బిడ్డ పుట్టుకకు తనే కారణమన్న వాస్తవం లోకానికి చాటిచెప్పే ఇలాంటి తంతుల్ని ఇంకెన్నో పలుదేశాల ఆదిమజాతులు ఈనాటికీ ఆచరిస్తున్నాయి.! పురిటి బాధల్లో భాగం పంచుకోవాలని ప్రసవ సమయంలో భార్య మంచానికి తనను తానే కట్టేసుకొనే మియాస్‌ తెగ మగాడికి మించి భార్యలను ఎవరు ఎక్కువ ప్రేమించగలరు? ప్రశంసించగలరు?
      బుద్ధభగవానుడు భార్యాభర్తలిద్దరూ పాటించాల్సిన సూత్రాలు చెరి అయిదేసి బోధించాడు. ‘భార్యను చీదరించుకోకుండా, సంపూర్ణ గౌరవం అందిస్తూ, ఆమె తనివితీరా అన్నవస్త్రాలు, ఆభరణాలు క్రమం తప్పకుండా అందించడం భర్త బాధ్యత. పరస్త్రీలను కాముక దృష్టితో చూడకపోవడాన్ని మించి మగవాడు మగువకు ఇవ్వగల గొప్ప ప్రశంస మరేదీ లేద’ని కూడా బుద్ధుడు చురకలంటించాడు. 
      భార్యలను ప్రశంసించేందుకు ప్రతి ఏటా సెప్టెంబరు నెల మూడో ఆదివారం నాడు ‘భార్యామణిని ప్రశంసించే దినం’ జరుపుకుంటారు పశ్చిమదేశాల్లో మగవాళ్లు! ప్రశంసలు ఆనక! సర్వస్వాన్ని నిస్వార్థంగా అర్పించడానికి సిద్ధపడి మగాడి గడప తొక్కిన ఆడదాన్ని ముందు సాటి మనిషిగా
 గుర్తించడం నేర్చుకోవాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం