వ్యాసాల్లోనూ అదే అడుగుజాడ

  • 358 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। వేలూరి శ్రీదేవి

  • సహాయ ఆచార్యులు, కాకతీయ విశ్వవిద్యాలయం
  • వరంగల్లు
  • 9866963615
డా।। వేలూరి శ్రీదేవి

గురజాడ అంటే కన్యాశుల్కం, దేశభక్తి గేయం, పూర్ణమ్మ... ఇవే జ్ఞప్తికి వస్తాయి. అయితే ఆయన వివిధ అంశాల మీద వ్యాసాలూ రాశారు. ‘ఇతర రచనలు వేటిలోనూ కనిపించనంత బహుముఖంగా గురజాడ అప్పారావు వైదుష్యం ఈ వ్యాస సంకలనంలో ప్రతిబింబిస్తుంది. వైదుష్యం ఒక్కటేకాదు జీవితం గురించి, దానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి దీక్షాదక్షతలతో ఆయన చేసిన పరిశ్రమకు ప్రతిబింబాలు ఈ వ్యాస సంకలనంలోని వ్యాసాలు’... అంటారు గురజాడ వ్యాసాలు అచ్చొత్తిన పుస్తకానికి ముందుమాట రాసిన సెట్టి ఈశ్వరరావు. 
విద్య, నాటకం, కవిత్వం,
ఇతర భాషలతో తెలుగు తులనాత్మక సింహావలోకనం, కావ్యవిమర్శ వంటి అంశాల మీద గురజాడ లోతుగా చర్చిస్తూ వ్యాసాలు రాశారు. ఇవి విషయ బోధకాల్లా కాకుండా, లేఖల రూపంలో, ఒక డాక్యుమెంటరీలా నడుస్తాయి. ముప్ఫయ్యేడు వ్యాసాల సంకలనం (‘గురజాడ వ్యాసాలు’)  అన్న పేరేగానీ ఇందులో చాలావరకు గురజాడ డైరీనుంచి యథాతథంగా తీసుకున్నవే ఎక్కువ. విద్యారంగం మీద రాసిన వ్యాసాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. వాటిలో ఒకటి ‘చుట్టుచూపులేని విద్య’. చుట్టుచూపు అంటే సరిపోల్చగలిగిన తారతమ్యం తెలుసుకుని చదవడం. ఒక దేశచరిత్ర బాగా తెలియాలంటే ఇతర దేశాల చరిత్రను కూడా అధ్యయనం చేయాలంటారు గురజాడ. ‘విశ్వవిద్యాలయాలు, సంస్కృత మాతృభాషలు’ వ్యాసంలో పాఠశాల విద్య గట్టి పునాదులమీద లేనప్పుడు కళాశాలలు బోధించే విద్యను గురించి పెద్దపెద్ద పథకాలు ప్రణాళికలు వేస్తే లాభం ఉండదంటారు. ఇది ఇప్పటికీ పనికొచ్చే సూచనే. ఇక భాషల స్వరూప స్వభావాలు తెలియనివారు అతి ముఖ్యమైన విద్యా సమస్యల జోలికి వెళ్తే, ఎంతో హాని, ముప్పు కలుగుతాయని ఆవేదన చెందారు గురజాడ. విద్యారంగం విషయంలో ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోవా లనే హెచ్చరిక ఇందులో ప్రస్ఫుటం.
వాడుకభాషే గ్రాంథికం
‘వాడుకభాషలు, గ్రామ్యము’లో ‘రసావేశం మిక్కుటమైతే గద్యం తూగు ఆగక మాటలు పాటలుగా పరిణమిస్తాయి’, అని గ్రాంథికాన్ని పరిహసించారు గురజాడ. తన సమకాలంలో జరిగిన పండితుల పోరును ఇందులో ప్రస్తావించారు. ఆయన చిన్ననాట కొక్కొండ వెంకటరత్నం మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు పండితులుగా ఉన్నారు. ఆయన ‘ఆంధ్రభాషా సంజీవని’ అనే పత్రికను వెలువరించేవారు. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి కందుకూరి వీరేశలింగం ‘వివేకవర్ధని’ నడిపారు. కొంతకాలానికి కందుకూరి కూడా ప్రెసిడెన్సీ కళాశాల పండితులయ్యారు. వీళ్లిద్దరి ప్రతిభకు మెచ్చిన ప్రభుత్వం ‘మహామహోపాధ్యాయ’తో సత్కరించింది. అయితే పాండిత్యం విషయంలో కొక్కొండ, కందుకూరికి ఒకరంటే ఒకరికి పడకపోయేది. దీన్నే దేవాసుర యుద్ధం అని పేర్కొన్నారు గురజాడ. అయితే ఇందులో దేవుడెవరు, అసురుడెవరు అన్నది మాత్రం చెప్పలేదు. 
ఆంధ్ర శబ్దచింతామణి, అహోబలపండితీయం, అప్పకవీయం తదితర లక్షణ గ్రంథాల్లోని నియమాలను ఉల్లంఘించిన కొన్ని ఉదాహరణలను కూడా ఈ వ్యాసంలో చూస్తాం. మరోవ్యాసం ‘గ్రామ్యశబ్ద విచారణము’లో... వావిలికొలను సుబ్బారావు ఆంధ్రపత్రికలో గ్రామ్యం కన్నా లాక్షణిక భాషే ప్రశస్తమని చెబితే, దాన్ని ఖండించారు గురజాడ. వావిలికొలను రామాయణం సంస్కృత పదాలతో నిండి ఉందని, అందులో కూడా తప్పులు ఉన్నాయని ఎత్తిచూపారు.
      భాషకు సంబంధించిన మరో వ్యాసం ‘మాతృభాషా? సజీవభాషా?’. ఇందులో గురజాడ తెలుగు వ్యాకరణవేత్తల మీద ధ్వజమెత్తారు. ‘తెలుగు వ్యావహారిక భాషపైన సాధారణంగా చేసే ఫిర్యాదు- అది వ్యాకరణబద్ధంగా లేదని. దీన్ని నిరూపించడానికి గ్రంథకర్తలు, రచయితలు, ప్రామాణిక గ్రంథకర్తల రచనల నుంచి ఉదాహరణలిస్తారు, వ్యాఖ్యానాలు చేస్తారు. వ్యావహారిక తెలుగు వ్యాకరణబద్ధంగా లేనట్లైతే ఆ దోషం వ్యాకరణవేత్తలది. 20వ శతాబ్దంలో ప్రాచీన తెలుగులో రాయడం అసంబద్ధంగా ఉంటుంది. నిజానికి తెలుగులో మాట్లాడే భాష, రాసే భాష యథార్థస్థితిలో రెండు భిన్న భాషలు. విద్యావంతులు తెలుగులో పుస్తకాలు రాయడానికి పూనుకోవడం లేదు. ఆ కారణం వల్లే మాతృభాషకు, సజీవభాషకు మధ్య పోటీ జరుగుతోంది’ అంటూ గురజాడ ఆవేదన వ్యక్తం చేశారు.
మార్పు కాలానుగుణం
ముత్యాలసరాల ఛందస్సు మీద ఓ శతావధాని ఆంధ్రపత్రికలో విమర్శ రాస్తూ, గ్రాంథికభాష వ్యాకరణం, ఛందశ్శాస్త్రం, పద్యాల్లో కావ్య గుణాలు పాటించలేదని మూడు లోపాలు చూపించారు. అది నచ్చని గురజాడ, ‘పూర్వులు చేసిన ఛందోనియమాలు మార్చదగియున్నప్పుడు, ఆంధ్ర వైయాకరణుల శాసనమునేల మార్చరాదు?’ అన్నారు. ‘ముత్యాలసరాల లక్షణము’ రాశారు. ముత్యాలసరాలకు మొదటి మూడు చరణాల్లో 14 మాత్రలు, 4వ చరణంలో 7 నుంచి 14 మాత్రలు ఉంటాయని స్పష్టంచేశారు. కవులు రాయగా రాయగా వాడుక భాషలే గ్రాంథిక భాషలయ్యాయన్నది గురజాడ అభిప్రాయం. గుమ్మలూరి లక్ష్మీనృసింహశర్మ ఉత్తరానికి ‘కవిత్వం శ్రాద్ధమంత్రం కారాదు’ అని వ్యాసంతో జవాబిచ్చారు గురజాడ. ఇది 1919 నవంబరులో వేగుచుక్క కథావళి సంచికలో వెలువడింది. మంత్రంలాగా కవిత్వం మార్చడానికి వీలులేకుండా ఉండదని, పద్యం రాసేటప్పుడు మాత్రాగణాలు అవసరమైనవి చేర్చుకోవడం, తగ్గించుకోవడం చేయవచ్చని, ఇది కొంతవరకు ఇంగ్లిష్‌ పద్ధతని ఈ వ్యాసంలో అభిప్రాయపడ్డారు.
‘కవిత్వము’ పేరుతో మరో వ్యాసం ఉంది. వర్డ్స్‌వర్త్‌ ఓ గొర్రెలకాపరి మీద ఒక కవిత రాశాడు. ఓ గొర్రెలకాపరి కొడుకు చెడుతిరుగుళ్లు తిరిగి దేశాంతరం వెళ్లిపోతాడు. దాంతో దుఃఖంలో మునిగిపోయి తన మందకు కడుతున్న కొట్టాన్ని మధ్యలోనే ఆపేస్తాడు తండ్రి. ఇదేం కవిత అని ఇక్కడి పండితులు హేళన చేశారట! దాన్ని నిరసిస్తూ, ‘పుట్టుక వల్ల గొప్పకాదు. గుణయోగ్యత వల్ల గొప్ప వచ్చును. పెద్ద అవస్థలోనున్న దుర్జనుని కన్న, తక్కువ స్థితిలో ఉన్న సజ్జనుడే నిజమైన గొప్పవాడు’ అంటారు గురజాడ. ఇంకా టెన్నిసన్‌ కవితా పాదాలను తెలుగు చేస్తూ ‘పెద్ద ప్రభువులై ఉండుటకంటే దయగల హృదయం కలిగి ఉండటం శ్రేష్ఠం. రాజరత్నం కన్న నమ్మిన నీతియే శ్రేష్ఠం’ అంటూ... వ్యాసం చివర్లో ‘లోకంలో ఎక్కువ అవస్థ అనేది తెచ్చిపెట్టుకొన్నది. ఇది నాణెం మీద ముద్రవంటిది. మనిషికి గుణయోగ్యతలను బట్టి విలువ కలుగుతుందే, తప్ప ఉద్యోగం, ధనధాన్యాలవల్ల కాద’ంటారు. 
      సాహిత్యాన్ని వ్యాప్తి చేసే విషయంలో మనదేశానికి, యూరోపియన్‌ దేశాలకు చాలా తేడాలున్నాయంటారు గురజాడ. భారతదేశంలో సాహిత్య విమర్శ లేదని, తెలుగు పత్రికల మనుగడ పండితుల చేతుల మీదుగానూ, అరకొర ఆంగ్ల విద్య అభ్యసించిన వ్యక్తుల చేతుల మీదుగా సాగుతుందంటూ చురకలంటించారు.
నాటకాల మీద చర్చ
తన సమకాలపు నాటక ప్రదర్శన మీద ‘శాకుంతల నాటక ప్రదర్శనం’ రాశారు. ఇది 1895 ఏప్రిల్‌ 13న గురజాడ రాసుకున్న డైరీలోనిది. టౌన్‌హాలులో జరుగుతున్న నాటక ప్రదర్శనకి తన మిత్రులతో కలసి వెళ్లారు గురజాడ. నాటకంలో శకుంతలగా నటించిన కల్యాణ రామయ్యరుకు, ఆ పాత్రకు కావాల్సిన సౌకుమార్యం, లాలిత్యం మచ్చుకైనా లేవట. పోనీ దుష్యంతుడి వేషం వేసిన వ్యక్తయినా లక్షణంగా ఉన్నాడా అంటే, అతని ముఖంలో రాజసం, లావణ్యం, చురుకుదనం అసలేమాత్రమూ లేవంటారు. విసుగెత్తిన గురజాడ బయటికి వెళ్లబోతుంటే... పక్కనే ఉన్న ఓ మిత్రుడు ‘ఇప్పుడీ నాటక ప్రదర్శనకు కాళిదాసు వచ్చి ఉంటే ఏమనుకునేవాడో’ అన్నాడు. బదులుగా ‘మారు మాటాడక ఈ పాటికి ఏ నుయ్యో, గొయ్యో చూసుకుని ఉంటాడు’ అన్నారట గురజాడ!  గురజాడ ఓసారి తన మిత్రుల ప్రోద్బలంతో ‘బాలామణి నాటక ప్రదర్శన’కు వెళ్లారట. ఇందులో బాలామణి శకుంతల, ఆమె చెల్లెలు దుష్యంతుడి పాత్రలు పోషించారు. శకుంతల పాత్ర చీటికిమాటికి దుఃఖిస్తుండటంతో గురజాడ మిత్రబృందం ఆమెకు ‘విషాదనటి’ అని బిరుదునిచ్చిందట! ఈ సంగతులన్నింటినీ ‘బాలామణి నాటక ప్రదర్శన’ వ్యాసంలో చెప్పారు. మరో రెండు వ్యాసాలు నాటకరంగానికి చెందినవి ఉన్నాయి.
      అపరిశోధిత శాసనం-1, 2 అనే శాసన సంబంధ వ్యాసాలతోపాటు, ‘కావ్యాల్లో శృంగారం, ఆకాశరామన్న ఉత్తరాలు, కన్నడ వ్యాకరణం, ఆంధ్రకవితా పితామహ, ఆధునిక ఆంధ్రవచన రచన,  బాలికా పాఠశాల, వంటలక్క చెప్పిన ముచ్చట్లు, పిల్లలు, తనలోతాను’ తదితరాలూ ముఖ్యమైనవే. కన్యాశుల్కం, ఇంకా ఇతర రచనల్లో కనిపించే దార్శనికతే గురజాడ వ్యాసాల్లోనూ ప్రధానంగా వెల్లడవుతుంది. అవి వందేళ్ల కిందటివైనా ఇప్పటికీ నిత్యనూతనమే.


వెనక్కి ...

మీ అభిప్రాయం