జ్ఞాన శిఖ‌రం

  • 292 Views
  • 1Likes
  • Like
  • Article Share

సౌజన్యశీలమైన పాండిత్యానికి మరో పేరు కె.వి.రాఘవాచార్యులు. వేదాంత దేశికుల రచనల విశిష్టతలను తెలుగువారికి పరిచయం చేసిన ఘనత ఆయనది. ‘వేదాంత దేశికుల పాదుకా సహస్ర వ్యాఖ్య’ రచన రాఘవాచార్యుల వ్యాఖ్యాన సామర్థ్యానికో నిదర్శనం. గోదాస్తుతి, గరుడ దండకం, శ్రీనివాస దయాశతకం, అచ్యుతశతకం తదితర రచనలెన్నో చేసిన బహుభాషా పండితుడాయన. సంస్కృత వాఙ్మయానికి తెలుగు వ్యాఖ్యానాలను అందిస్తూనే, తమిళ గ్రంథాలనూ తెలుగులోకి తెచ్చారు. ఆళ్వారుల ప్రబంధాల్లో మూడింటికి వివరణ అందించారు. తన వ్యాఖ్యాన ప్రకర్షతో పోతన భాగవత పద్యాల మధురిమను చవిచూపించిన రాఘవాచార్యులు, ‘యాదవాభ్యుదయం’ లోని నాలుగు సర్గలకు వ్యాఖ్య కూడా అందించారు. 
      రాఘవాచార్యులు స్వస్థలం కరీంనగర్‌ జిల్లా నారాయణపురం. వేంకటమ్మ, తిరుమల మనోహరాచార్యులకు జనవరి 22, 1929న జన్మించారు. జోగా వెంకటయ్యశర్మ, అర్చి వెంకటాచార్యుల దగ్గర వేదం, దివ్యప్రబంధాలను ఆపోశన పట్టారు. ఏకోపాధ్యాయుడిగా వృత్తిజీవితం ప్రారంభించారు. మెదక్‌ జిల్లా సిద్ధిపేట కళాశాల అధ్యాపకుడిగా పదవీవిరమణ చేశారు. భార్య పద్మావతి. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి వారి పెద్దకుమారుడు. 1983లో ‘మాఘకావ్య వైభవం’ మీద రాఘవాచార్యులు చేసిన ప్రసంగం పుస్తకంగా వచ్చి మంచి ఆదరణ పొందింది. ఆ స్ఫూర్తితో ఆయన వ్యాఖ్యానాలు ప్రారంభించారు. ఆ క్రమంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ‘వాచస్పతి’ (రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం), ‘శాస్త్ర విద్వన్మణి’ (తిరుపతి వేదవిశ్వవిద్యాలయం) బిరుదులతో పాటు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా పండితులను సన్మానిస్తూ వస్తున్నారు. విశిష్టాద్వైత ఆలోచనాధారకు గొడుగుపట్టిన రాఘవాచార్యులు ఆగస్టు 5, 2016న స్వర్గస్థులయ్యారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం