అమలిన శృంగార విఫల ప్రణయగాథ!!

  • 1184 Views
  • 20Likes
  • Like
  • Article Share

    దేవులపల్లి ప్రభాకరరావు

  • అధ్యక్షులు, తెలంగాణ అధికార భాషా సంఘం
  • హైదరాబాదు.
  • 4065697143
దేవులపల్లి ప్రభాకరరావు

నిరుపమాన ప్రతిభా వ్యుత్పత్తులు, అఖండ విజ్ఞాన సంపద, అకుంఠిత దేశభక్తి, భారతీయత పట్ల అచంచల గౌరవం, అంతులేని ఆత్మాభిమానం, అహంకార భూషణం, స్వేచ్ఛా స్వాతంత్య్రాల పట్ల అభేద్య గౌరవం సొంతమైన మహామనీషి గనుకే లేఖిని విశ్వనాథ సత్యనారాయణ చేతిలో అక్షరలాస్యం చేసింది. ఆధునిక తెలుగు సారస్వత రంగంలో ‘డిక్టేటర్‌’ ఆయన ఒక్కడే. శాసించడం ఆయన స్వభావం. ‘వేయిపడగలు’ సహా మొత్తం యాభై ఆరు అద్భుత నవలలను ఆయన చెబుతుంటే (నెలకు ఒకటి చొప్పున) ఇతరులు రాసేవారు. అయితే, ఆయన మస్తిష్క మథనం నుంచి వెలువడిన మరో నవల ‘ఏకవీర’ కొన్ని ప్రత్యేకతలను, విశిష్టతలను సంతరించుకుంది. ఆయన స్వహస్తంతో రాసిన ఒకే ఒక నవల ‘ఏకవీర’.
‘ఏకవీర’ను విశ్వనాథ
రాయడం మొదలుపెట్టిన మూడేళ్లకు పూర్తయింది. ‘ఏకవీర’ కథాకథనం, పాత్రల మనస్తత్వం చిత్రణ తదితర విషయాల్లో విశ్వనాథ అన్నేళ్లు మథనపడ్డారనుకోవాలి. 120 పేజీలు మించని 23 అధ్యాయాల చిన్న నవల ఇది. అయినా తెలుగు పాఠకలోకాన్ని అమితంగా అలరించింది. విశ్వనాథ నవలల్ని చదవడం సులభం కాదు- ఆ నవలలపై విశ్లేషణలు, విమర్శలు చేయడం చాలాకష్టం. విశ్వనాథ నవలల మీద బహుభాషావేత్త, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కరీంనగర్‌లో ఓ సమావేశంలో ప్రసంగించాల్సి వచ్చింది. కరీంనగర్‌ సమీపంలోని సింగాపురం గ్రామంలో మూడు రోజులు ఎవరికీ కన్పించకుండా తలుపులు మూసుకుని కూర్చుని ఆయన ప్రసంగానికి సంసిద్ధులయ్యారు. ఆ సమావేశంలో స్వయంగా పాల్గొన్న విశ్వనాథ సద్విమర్శలతో కూడిన పీవీ ప్రసంగాన్ని సహృదయంతో మెచ్చుకున్నారు.
      తెలుగువాళ్లకు అభిమానం, ఆభిజాత్యం, ఆవేశం, అనైక్యతతో పాటు బిడియం కూడా ఎక్కువే. బిడియం అన్నది లేకపోతే మనం కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణను ప్రపంచస్థాయి మహా పండితులలో, మహాకవులలో, అత్యున్నత స్థాయి నవలాకారులలో ఒకడిగా గుర్తించి, పరిగణించి గౌరవించేవాళ్లం. నిస్సందేహంగా విశ్వనాథ ప్రపంచ సాహిత్యవేత్తల్లో, సారస్వత తపస్సంపన్నుల్లో ఒకరు. అక్షరాల ఆయన ప్రపంచ వాఙ్మయ రంగంలో ట్రిలియనేర్‌ కన్నా మించినవాడే. ఆయన అరవై సంవత్సరాలు నిరంతరంగా, నిర్విరామంగా కొనసాగించిన అపూర్వ వాఙ్మయ కృషికి, తెలుగు సాహిత్యరంగంలో ఏకచ్ఛత్రాధిపతిగా ఆయన సృష్టించిన నిరుపమాన సారస్వత సంపదకు నోబెల్‌ బహుమతి ఇచ్చినా తక్కువే. ఆధునిక తెలుగు సారస్వత రంగంలో విశ్వనాథది ఒక యుగం. ‘వైతాళికుడు’ వంటి విశేషణాలకు, బిరుదులకు అతీతుడైన యుగకర్త విశ్వనాథ. ప్రాచీన తెలుగు సారస్వత రంగంలోని మహామహులతో పోల్చినా సమానస్థాయిలో, శిరసు వంచకుండా నిటారుగా నిలువగలిగిన ఆధునిక కవి పుంగవుడు, మహా పండితుడు విశ్వనాథ ఒక్కడే అంటే అత్యుక్తి కాదు. 
      ఆధునిక తెలుగు వాఙ్మయ రంగంలో అన్ని ప్రక్రియలను చేపట్టి శోభించిన వాడు, ఏ ప్రక్రియలోనైనా ఎదురు లేకుండా నిలిచినవాడు విశ్వనాథ ఒక్కడే. ఆయన లేఖిని నుంచి వెలువడినన్ని విభిన్న, వైవిధ్య విలసిత సృజనాత్మక పద్య గద్య రచనలు ఆధునికులలో ఇంకెవరి లేఖిని నుంచీ వెలువడలేదు. పరిమాణంలో, ప్రమాణంలో అవి మిన్న. రాశిలో గుణవాసిలో అవి అద్భుతమైనవి. అవన్నీ అనేక ముద్రణలు పొందాయి. పండితులను, పామరులను సమాన రీతిలో అలరించాయి. విమర్శలు, ప్రతి విమర్శలకు, భిన్నాభిప్రాయాలకు తావిచ్చినప్పటికీ విశ్వనాథ వివిధ రచనలను ఇప్పటికీ వేదంలా చదువుతున్న వాళ్లున్నారు- వాళ్లు అసంఖ్యాకులు. 
నారికేళ, ద్రాక్షాపాకాలను మిళితం చేసి రసజ్ఞులను ఒప్పించిన, మెప్పించిన మహాకవి విశ్వనాథ. శ్రీమద్రామాయణ కల్పవృక్షంతో పాటు కిన్నెరసాని పాటలు కూడా ఆ మహాకవి లేఖిని నుంచి అమృతధారల్లా ప్రవహించాయి. కవిగా, కథకుడుగా, నవలాకారుడుగా, నాటకకర్తగా, విమర్శకుడుగా ఇంకెవరికీ అందని అత్యున్నత స్థానం ఆక్రమించిన విశ్వనాథ మహావక్త. ఆయన ప్రసంగరీతి, పద్యపఠనశైలి ఇంకెవరూ అనుకరించలేనివి, విశిష్టమైనవి. ఆయన ప్రసంగించడానికి నిలిచినప్పటి నుంచి, ఆయన మహోపన్యాసం పూర్తయ్యేవరకు తరచూ కరతాళ ధ్వనులు తప్ప ఇంకేమాట వినిపించక పోయేది- ఆయన హావభావాలు సైతం సభికులను ముగ్ధపరచేవి. విశ్వనాథ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగుజాతికి గర్వకారణం. విశ్వనాథ ఆంధ్రాభిమానం దురభిమానం కాదు. ఆంధ్రావేశం మూర్తీభవించిన విశ్వనాథ అకళంక దేశభక్తుడు, అచ్చమైన జాతీయవాది. ఆయనను ఆవహించిన ఆంధ్రాభిమానం అమలినమైంది; భారత జాతీయతకు, అంతర్జాతీయతకు, వసుధైక కుటుంబ భావనకు పట్టుగొమ్మ ఆయన ఆంధ్రాభిమానం!
ఇమ్ముగ గాకుళమ్ము మొదలీ వరకుం గల/ యాంధ్ర పూర్వ రాజ్యమ్ముల పేరు చెప్పిన/ హృదంతరమేలొ చలించిపోవు,/ నార్ద్రమ్మగు చిత్తవృత్తుల పురాభవ నిర్ణయమేని/ ఎన్ని జన్మములుగాగ నీ తనువునన్‌/ బ్రవహించునొ యాంధ్ర రక్తముల్‌!...  అని గొంతెత్తి ఆయన పరవశుడవుతాడు. ఆంధ్ర పౌరుషము, ఆంధ్ర ప్రశస్తి, తెలుగు ఋతువులు, కోకిలమ్మ పెళ్లి తదితర కావ్యాలు ఆయన ఆంధ్రాభిమానానికి, తెలుగు పౌరుషానికి ప్రతీకలు. విశ్వనాథ ‘ఆంధ్రప్రశస్తి’ కావ్యం నూతన ఉత్తేజాన్ని కలిగించి తెలుగుజాతి పునరుజ్జీవానికి చాలా దోహదపడింది. ఆంధ్రోద్యమంతో పాటు భారత స్వాతంత్య్ర, జాతీయోద్యమాలు, గాంధేయ సిద్ధాంతాలు, గాంధీతత్త్వం విశ్వనాథ వ్యక్తిత్వం, దృక్పథాల మీద ప్రగాఢ ప్రభావాన్ని ప్రసరింపజేశాయి. సమకాలికులు అనేకుల్లా విశ్వనాథ పాశ్చాత్య ప్రభావానికి గురికాలేదు. భారతీయ సంస్కృతి, సనాతన భారతీయ జీవన విధానం విశిష్టమైనవని, ఆరాధనీయమైనవని విశ్వనాథ గాఢంగా విశ్వసించారు. ఈ విశ్వాసం ఆయన రచనలన్నింట్లో అంతర్లీనంగా ప్రవహిస్తుంది, ప్రాబల్యం వహిస్తుంది, పాఠకులకు స్పష్టంగా ద్యోతకమవుతుంది. ముప్ఫై సంవత్సరాలకు మించిన అధ్యాపకత్వంలో విశ్వనాథ ఒకవంక కొన్నివేల విద్యార్థులకు, శిష్యకోటికి మాతృభాష తెలుగు మాధుర్యాన్ని పంచుతూ, ఔన్నత్యాన్ని వివరిస్తూ మరోవంక మహోత్కృష్ట సారస్వత తపస్సు కొనసాగించారు. ఇరవైవేలకు మించిన పద్యాలను రచించారు. ‘వేయిపడగలు, చెలియలికట్ట, ఏకవీర, స్వర్గానికి నిచ్చెనలు, మా బాబు, జేబుదొంగ, బద్దన్న సేనాని’ తదితర ఆయన నవలలు సమకాలీన సామాజిక జీవనానికి, సంప్రదాయాలకు దర్పణాలు. ఆంధ్రజాతి జీవన పరిమాణం ‘పురాణ వైర గ్రంథమాల’లో చిత్రితమైంది. తెలుగు సీమ, తెలుగు పల్లెల సహజ సౌందర్యం, తెలుగు సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు విశ్వనాథ రచనల్లో అమిత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అణువణువున తెలుగుదనం తొణికిసలాడిన మహోన్నత వ్యక్తిత్వం విశ్వనాథది. 
      విశ్వనాథ మొదటి నవల ‘అంతరాత్మ’, రెండోది ‘ఏకవీర’. 1929- 31లో విశ్వనాథ స్వయంగా కలంపట్టి స్వదస్తూరితో రాయడం ‘ఏకవీర’ ప్రత్యేకతల్లో ఒకటి. పదహారో శతాబ్ది చారిత్రక ఇతివృత్తంతో రాసిన ఈ నవల 1935లో ‘భారతి’ మాసపత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. తర్వాత పుస్తక రూపంలో 17 ముద్రణలు పొందింది. పలు భారతీయ భాషల్లోకి అనువాదమైంది. కూచిపూడి నాట్య సంప్రదాయ ప్రదాత సిద్ధేంద్రయోగి గురించి విశ్వనాథ ‘ఏకవీర’లో వివరించడం విశేషం.
      జార్జి ఇలియట్‌ అన్న కలం పేరున్న రచయిత్రి 1861లో రచించిన ‘సైలాన్‌ మార్నర్‌’ నవల ప్రభావం, కాళిదాసు, భవభూతి, అల్లసాని పెద్దన ముద్రలు ‘ఏకవీర’ నవల మీద కన్పిస్తాయని డాక్టర్‌ వై.కామేశ్వరి ప్రచురించిన ‘ఏకవీర! విశ్వనాథ కథన కౌశలం’ విమర్శనాత్మక గ్రంథం వెల్లడించింది. ప్రభావాల సంగతి ఏమైనప్పటికీ, విశ్వనాథ ‘ఏకవీర’ నిశ్చయంగా ఒక స్వతంత్ర, అమలిన శృంగార విఫల ప్రణయగాథ. ‘‘...నవలా శిల్పానికి భంగం కలుగకుండా ధర్మోపదేశం చేయటం విశ్వనాథ వారికే చెల్లింది. చిన్నదయినా అన్ని విషయాల్లోనూ మిన్నదైన గొప్ప నవల ఏకవీర’’ అని కొర్లపాటి శ్రీరామ్మూర్తి అభిప్రాయపడ్డారు. ‘‘ఏకవీర నవలలో విశ్వనాథ చూపిన శిల్ప ప్రతిభ చాలా గొప్పది. అది మధుర ప్రాంతాలను పరిపాలించిన రాజకుటుంబపు ప్రణయగాథ. రసవత్తరమైన కావ్యంలా సాగుతుంది... ఈ నవల’’ అని పోరంకి దక్షిణామూర్తి వివరించారు. మూడేళ్ల అమూల్య సమయం తీసుకుని విశ్వనాథ ‘ఏకవీర’ నవల రాసింది బ్రిటిష్‌ పాలనలో. నవలలో ఏ అంశాలను చేర్చాలో, ఏ అంశాలను చేర్చవద్దో అన్న మీమాంసకు, తర్క వితర్కాలకు బహుశ విశ్వనాథ గురై ఉంటారు.  
      ‘ఏకవీర’ సినిమా గురించి ఓ సందర్భంలో తుమ్మపూడి కోటేశ్వరరావు విశ్వనాథను అడిగారు. ఎంతమాత్రం ఆసక్తిలేని సమాధానంతో సరిపెట్టారు విశ్వనాథ. గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకం చదివితే కలిగేది అనిర్వచనీయ ఆనందం- ‘కన్యాశుల్కం’ సినిమా చూస్తే కలిగేది తీవ్ర ఆశాభంగం. ప్రముఖ దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి ‘చెలియలి కట్ట’ సినిమా తీయాలనుకుని ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆయన పెద్ద మనిషి గనుక. తెలుగు సినిమా రంగంలో సత్యజిత్‌రాయ్‌ లాంటి ప్రతిభావంతులు పుట్టినప్పుడు విశ్వనాథ నవలలు మనోజ్ఞ కళాఖండాలుగా రూపొందే అవకాశం ఉంటుంది. సాహిత్యాభిమానులు అంతదాకా ఓపిక పట్టాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం