ఇలా రా... ఇదేరా ఇలారం!!

  • 597 Views
  • 6Likes
  • Like
  • Article Share

    జి.సత్యవాణి

  • గుంటూరు

ట్రాక్టర్లు వచ్చాక నాగళ్లు తగ్గిపోయాయి. వ్యవసాయం యాంత్రీకరణ చెందాక మరెన్నో సంప్రదాయ పనిముట్లు మూలనపడ్డాయి. వాటితోపాటే వాటికి సంబంధించిన పదజాలమూ పక్కకెళ్లిపోయింది. ఇదంతా నాణానికి ఒకవైపు. అసలు ఈతరానికి మట్టితో అనుబంధం పలుచబడిపోతోంది. పల్లెకు దూరమైన పెద్దల జీవితాల్లోంచీ ఆ పల్లెపలుకులు అదృశ్యమవుతున్నాయి. ఇలా మొత్తమ్మీద పాడిపంటలకు సంబంధించిన అమ్మభాషా పదాలన్నీ వాడుకలోంచి కనుమరుగవుతున్నాయి. వాటిలో అపురూపమైన కొన్నింటి గురించి...
తొడుగు:
కవచం, ఆభరణం తదితర అర్థాల్లో ఈ మాటను వాడుతుంటాం. కానీ, రైతుల వాడుకలో మాత్రం ‘తొడుగు’ అంటే ‘ముళ్లకంచె మోపు’. ‘‘కంపతొడు గీడ్చినట్లే దుకానఁజన్న, తెరువెఱుంగుచు’’ అంటూ ‘మనుచరిత్ర’లో పెద్దన సైతం ఈ పదాన్ని ఇదే అర్థంలో వాడాడు. పశువులు చొరబడకుండా చేను చుట్టూ, వాముదొడ్డి చుట్టూ కంచె వేస్తారు. దీనికోసం ముళ్లకంపను ముందే కొట్టి ‘తొడుగు’ తయారుచేస్తారు. ముళ్లమండలను ఒక దానిమీద ఒకటి నాలుగైదు అడుగుల ఎత్తువరకూ వేసుకుంటూ వస్తారు. తర్వాత వాటిపైన ఓ బండరాయి పెడతారు. ఇదీ తొడుగంటే. నాలుగైదు రోజులు ఎండిన తర్వాత మండలను అన్నింటినీ మోకుతో బిగిస్తారు. ఆ మోకును కాడికి కట్టి ఎద్దుల సాయంతో లాక్కొస్తారు. ఈ మండలతో వేసిన కంచె కోటగోడలా పనిచేస్తుంది. ఈ కంచె నిర్మాణంలో ఢిల్లీకంప, మంగకంప, కలేకంపలను వాడుతుంటారు.
రాగోల (కట్టె): పంగలకర్ర ఇది. కంపను ఒత్తడం, మోయడం, మండల్ని పక్కకు నెట్టడం... ఇలా ఏ పనికైనా ఉపయోగపడుతుంది. సాధారణంగా కంచె వేసేటప్పుడు ముళ్లకంపల్ని ఎత్తడానికి బాగా సాయపడుతుంది. ఒక విధంగా ఇది రైతులకు మూడో చెయ్యే! దీన్నే ఉత్తరాంధ్రలో ‘రాగోలు, రోగాలు, రోగాళ’ అనీ పిలుస్తారు. ఇరకాల కట్టె, కవకట్టె, కవరకట్టె తమరుకట్టె, పంగకట్టె, రేపకర్ర అనేవి దీనికి పర్యాయపదాలు. పదిహేనో శతాబ్దికి చెందిన అనంతామాత్యుడి ‘భోజరాజీయం’తోపాటు కాటమరాజు కథల్లో ‘ఇనుప రాగోల’ కనిపిస్తుంది.
ఉక్కడాలు: ఇదో గోతం పేరు. ‘‘తూరుపాఱ బట్టి తోడ్తోడ నుక్కడా/ ల్పట్టు వేళవచ్చిపడె జనంబు... యిసుక రాలకుండ’’ అన్నారు ఏటుకూరి వెంకటనరసయ్య తన ‘రైతు’ హరికథలో. పూర్వం రైతులు తాము పండించిన జొన్న, సజ్జ, వరిగ, పెసలు, మినుములు, సెనగలు, వేరుసెనక్కాయలు, వడ్లు లాంటివాటిని పాతర వేసేవారు. అవసరమైనప్పుడు పాతర తీసి ఇంట్లో పోసుకునేవారు. రాన్రానూ ఈ పాతర్లతోపాటు గాదెలు కూడా ధాన్యం దాచుకోవడానికి రైతులకు ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత గోతాలు వచ్చాయి. మామూలుగా వాటిలో ధాన్యం పోసి దబ్బణంతో కొసను కుట్టేస్తారు. కానీ, ఉక్కడాల గోతం అలా కాదు. దీన్ని ప్రత్యేకంగా జనపనారతో నేస్తారు. మందంగా ఉంటుంది. చివరన చుట్టూ తాడుతో కట్టలు కడతారు. నిండా జొన్నలు/ సజ్జలు పోసి గోతం కప్పుతారు. తర్వాత తాడుతో కట్టలనన్నింటినీ కలిపి కాళ్లకట్టలా కట్టి బిగిస్తారు. అంతే! ఇక ఆ గోతం గుండ్రాయిలా తయారవుతుంది. చినగదు, అంత తొందరగా వొట్టిపోదు. ప్రస్తుతం ఇది వాడుకలో లేదు. అన్నట్టు... ‘ఉక్కడం’ అనే పదానికి నిఘంటు అర్థం ‘గొప్ప, శ్రేష్ఠమైన’. ఈ మాట ఉక్కడాల గోతానికి సరిగ్గా సరిపోతుంది.
ఇలారం: దీనికి వ్యవసాయ వృత్తి పదకోశంలో ‘గుండ్రంగా వేసిన పశువుల కొట్టం’ అని అర్థం చెప్పారు. ‘గుత్తాపుసాల’ అనే పర్యాయాన్నీ సూచించారు. నేలను అనుకుని ఉండే కొట్టం మాదిరి ఓ చిత్రాన్ని ఉదాహరణగా చూపించారు. అయితే దీనికి ఇంకో అర్థమూ ఉంది. దాని ప్రకారం ‘ఇలారం’ అనేది గాదెకు వాడేది. గాదె నిండా ధాన్యం పోసి, దాన్ని ఈ ఇలారంతో కప్పుతారు. ఇది గుడిసెలా ఉండి, ఒక్క చినుకునూ లోపలికి పోనివ్వదు. దీనిమీద పడ్డ నీరంతా కిందికి జారిపోతుంది. దీన్ని కట్టెలతో కడతారు. బరువుగా ఉంటుంది. మామూలు గాలికి కదలదు. చిన్నచిన్న గాదెలైతే... ఇలారాన్ని తాడుతోకట్టి గాదెకు ముడేస్తారు.
మేడెం: జొన్న, సజ్జ, నువ్వులు లాంటి మెట్టపంటల్ని కోసి కట్టలు కడతారు. ఆ కట్టలను కోసుగా నిలబెట్టి, చివరి కంకుల్ని జొన్నకర్రతో కట్టేస్తారు. అదే ‘మేడెం’. దీనిమీద కంకులు కోసిన చొప్పను కడతారు. దాంతో వర్షం వచ్చినా గింజలు తడవవు. పాడవవు. చెదలూ పట్టవు. కంకులు ఏమాత్రం పాడుకాకుండా ఎండాలంటే ‘మేడెం’ అవసరం. ఇదో గూడు లాంటిది. అవసరాన్ని బట్టి దీన్ని చిన్నగా, పెద్దగా కడుతూ ఉంటారు. 
జడ్డిగం: వర్షాలు మొదలవగానే రైతుల ఇళ్లలో జడ్డిగం బుర్రలు అటక మీదినుంచి దిగుతాయి. చాళ్లలో విత్తనాలు పోయాలంటే ఈ జడ్డిగాన్ని గొర్రుకు అమర్చాల్సిందే. జడిగెం, జడిగం, జడ్డిగెం, జణిగెం... దీనికి పర్యాయాలు. ‘దడ్డిగం’ దీని రూపాంతరం. ఎదగొర్రుకు నాలుగు వెదురు బొంగులను పెట్టి, వాటిని జడ్డిగం కింది కంతలకు అమర్చి కట్టేస్తారు. జడ్డిగం పైభాగాన ‘బొడు’్డ ఉంటుంది. దాని మీద పడ్డ విత్తనాలు నాలుగు బెజ్జాల్లోంచి సమానంగా జారుతూ చాళ్లలోకి చేరతాయి. కానీ, దీన్ని నేర్పుగా ఉపయోగించడం అందరివల్లా కాదు. రైతూ, ఎద్దులూ కష్టపడాలి. ఈ విత్తనాల జారవేతతో పాటే ‘గుంటక’ సాగుతుంది. దాంతో విత్తనాల మీద మట్టికప్పు పడుతుంది. తర్వాత వాటిలోంచి మొలకలు వస్తాయి.
మంచె: రైతుకు చాలా ముఖ్యమైంది. దీన్ని ‘మంచి, మణిసి, మనిసె’... ఇలా రకరకాలుగా వాడతారు. దీని రూపాంతరాలే మచ్చు, మచ్చె, మంచం, మంతలు. అరప, గడమంచె, జోబడి, బడ్డీ తదితరాలు పర్యాయాలు. దీన్ని పందిరిలాగా వేసి, మీద తడికె వేస్తారు. ఆ తడికె మీద వరిగడ్డి పరుస్తారు. ఒక్కోసారి కోతగడ్డిని నిల్వ ఉంచుకోవడానికీ దీన్ని ఉపయోగిస్తారు. మంచెకు గుంజలు కాకుండా కోళ్లు అమర్చి, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోవచ్చు. అప్పుడది ‘మంచం’ అవుతుంది. పడుకోవడానికి కూడా వీలైన పెద్ద మంచెనూ ‘మంచం’ అంటారు. దీనికి ‘మంచిక’ అని మరోపేరూ ఉంది.
చెర్నాకోల: చేత్తో కర్రబట్టుకున్న రైతు భుజాన వేలాడుతుంటుంది చెర్నాకోల. దీంతో చెళ్లుమనిపిస్తే ఎద్దులు పరుగు తీస్తాయి. మూరెడు పొడవు కర్రకు ఓ చివర చిన్న చెండు కడతారు. అది గట్టిగా ఉంటుంది. దానికి పెద్దతాడు కలిపి, కొసలో రెండు తోలుతోకలను అమర్చుతారు. అందంకోసం చెండు దగ్గర్లో రంగుల ఊలు కడతారు. ‘శరణాకోల, చెర్రాకోల’.. దీని పర్యాయాలు. ‘చెండ్రకోల’ దీనికి రూపాంతరం. ‘కాడికి కట్టిన ఎద్దుల్ని తోలే కర్రకు వారుతో అల్లినతాడు కడతారు’ అంటూ దీనికి అర్థం చెబుతుంది వ్యవసాయ వృత్తిపదకోశం. ‘సెర్లకోల, నెల్రకోల’ అనీ పిలుస్తారు. అరక దున్నేటప్పుడు కొంతమంది దీన్ని ఉపయోగిస్తారు. పందేలప్పుడైతే తప్పకుండా వాడతారు.
పలుపు: పశువుల మెడకు వేసి గుంజకు కట్టే తాడు ఇది. ఉత్తరాంధ్రలో దీన్నే ‘పొలుపు’ అనీ అంటారు. కన్నె తగులు, తనుగు, తలుగు అనేవి దీనికి పర్యాయపదాలు. ఈ పలుపు ముడి తగిలించే భాగాన్ని ‘తమ్మె’/ ‘పాసికి’ అంటారు. ఈ పలుపు తాడును పశువు మెడకు చుట్టి తమ్మె బిగిస్తారు. అది ఊడి రాదు. కానీ, విడదీయడం చాలా సులువు. అయితే, తలతిప్పి కాలితో దీన్ని డుల్చివేసే పశువులూ ఉంటాయి. తమ్మె తీసుకుని పాలు తాగే దూడలు, తప్పించుకుని వెళ్లి మేత మేసి వచ్చే గేదెలు, ఎద్దులు రైతులకు పరీక్ష పెడతాయి. వాటికోసం తమ్మె లోపలి ముడితాడును ముందుకు లాగి, గొంతుకు బిగించి ముడి వేస్తారు. ఇక అది ఊడదు. అయితే ఈ ముడి జాగ్రత్తగా వేస్తారు. లేకపోతే అది ఉరితాడులా బిగిసిపోయి పశువు చనిపోతుంది. ఇలా పలుపు ఉచ్చుగా మారకుండా ఉండటానికి, వేళ్లు పెట్టి ఖాళీ చూసుకుంటూ ముడి వేస్తారు.
లంకె/ లెంకె: దొంగపశువు తప్పించుకు పోకుండా మెడలో కట్టే వస్తువు ఇది. లంకెపీట, టెక్కడి, టొంపకర్ర, బుడ్డాం, లంపటం, లొటారం తదితర పేర్లూ ఉన్నాయి దీనికి. మేతకు వదిలిన పశువుల్లో కొన్నింటికే దీన్ని కడతారు. అవి దొంగగొడ్లన్న మాట. అవి పంట చేలమీద పడి పాడుచేస్తాయి. వాటిని అదుపులో పెట్టడానికి దీన్ని వాడతారు. పారిపోకుండా,  పరుగెత్తకుండా ముందుకాళ్ల మోకాళ్లకు చెక్క తగులుతుంది. దాంతో అవి మెల్లగా నడుస్తాయి. అలా కాపరికి సాయపడుతుందీ ‘లంకె’. ఇంటికి రాగానే దీన్ని విప్పి, విడిగా కొట్టంలో దాస్తారు. పంటలు కోసిన తర్వాత ఎండాకాలంలో పశువుల్ని మేతకు వదులుతారు. అప్పుడీ లంకెపీటకు పని ఉండదు. ఆ సమయంలో అసలు పశువుల కాపరే అక్కర్లేదు. చేలన్నీ తిరిగి దొరికినంత తిని ఇంటికి చేరతాయి పశువులు. ఎటొచ్చీ పంటల కాలంలోనే వాటి మెడల్లో లంకెలు పడతాయి. 
చిక్కం: పశువులు మేయడానికి వీల్లేకుండా మూతికి కట్టే జల్లెడ లాంటి బుట్ట. దీన్ని వెదురుబద్దలతో తయారు చేయడం ఓ పద్ధతి.  తాడు/ పేములతో కూడి చిక్కాన్ని అల్లుతారు. దూసర తీగెలనూ వాడతారు. రెండు ముదురు తీగల్ని గుండ్రంగా మెలేసి, వాటిని మధ్యలో చిన్న తీగలు నాలుగైదింటిని ఒక మడతగా అమర్చి ‘చిక్కం’ చేస్తారు. దానికి రెండువైపులా తాళ్లు కట్టి.. పశువు నోటికీ, మెడకూ బిగిస్తారు. ఇదే చిక్కాన్ని తాటిమట్ట పేళ్లతో అల్లితే ‘గరిచిక్కం’ అంటారు. దీబుట్ట, మూతిపుటికె, మూతిబుంగ, మూతిబుట్ట... ఇలా దీనికి బోలెడు పర్యాయపదాలు వినపడతాయి.
బొనుగు/ లొడుగు: దొంగగొడ్డుకు మెళ్లో కట్టే గంట ‘బొనుగు’. ఇనుము/ కంచులతో చేస్తారు. వీలైనంత వరకూ ఇనపదే వాడతారు. ‘బొణుగు, బునగ, బొంగు, బొనగు, బొనిగె, బొనుక, బొన్గ, బొడగ, బొనుగరు’ దీనికి రూపాంతరాలు. తొడక, తొడుగు పర్యాయాలు. ఇక ‘లొడుగు’ను కట్టెతో తయారుచేస్తారు. దీనిలోపల చిన్న కర్రలు కడతారు. దీన్నీ దొంగగొడ్ల కోసమే చేస్తారు. గొడ్డు నడిచేటప్పుడు, మేత మేసేటప్పుడు తల ఊపుతుంది. ఈ ఊపువల్ల లొడుగు కదులుతుంది. దాంతో లోపలి కర్ర కొట్టుకుని శబ్దం వస్తుంది. బొనుగు శబ్దానికి దీనికి తేడా ఉంటుంది. ఒకటి లోహం, మరొకటి కట్టె. దీన్ని లొటారం అనీ పిలుస్తారు. 
సిగమోర: సిగమార, సిగమారు, సిగమోరు, సిగముట్టె, చిక్కుతాడు, చిటిమూరుతాడు, చింబోర, చిలమరక, చిలముకుతాడు, చిలమోర, ముకుచిక్కారు, ముకుచిలమ ముకుబంతి, ముక్కుమురికె, ముగుచిక్కం, మూతిచిక్కం, మోర్కె, సిరిముట్టె ... ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. దీన్ని రెండు మూడు రకాలుగా తయారుచేస్తారు. తాడు/ తోలుతో అల్లి, మూతికి తగిలించేది ఓ రకం. పశువుకు ఇది అలంకారంగా పనికి వస్తుంది. అదే సమయంలో అది పంటను కొరకకుండా కాపుగాస్తుంది. జనపనార/ గోగునారతోగాని ఈ తాడును తయారుచేసి, చిక్కంగా మారుస్తారు. తాడు తీసుకుని పశువు మూతికి రెండువైపులా ముళ్లు వేయడం మరో పద్ధతి. గుండ్రంగా గోరుచుట్టు ముడి వేస్తారు కొంతమంది. దాన్నే పలకగా మార్చి ‘చిక్కుముడి’గా కూడా వేస్తారు. ‘చిప్పచిగమార’ అని ఇంకో రకం ఉంది. మూతికి తగిలించాక రెండుపక్కల తాడును కొమ్ముల అవతలికి చేర్చి కట్టేయడం ఇందులోని ప్రత్యేకత.


వెనక్కి ...

మీ అభిప్రాయం