యాదాద్రికీ ఓ రామదాసు!!

  • 78 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కొత్తూరి సతీష్‌

  • హైదరాబాదు
  • 9010639899
కొత్తూరి సతీష్‌

శ్రీనికేతన నారసింహ మానఘన- మనవి వినవే ఇకనేనెవ్వరిని వేడుదురా నరహరి... అంటూ ‘నా బాధ నీకుతప్ప ఎవరికి చెప్పుకోమంటావు?’ అంటూ యాదగిరిగుట్ట నరసింహస్వామిని నిలదీస్తాడు ఓ కవి. ఆయన కీర్తనలు అందమైన పదబంధాలతో, అక్కడక్కడా తెలంగాణ మాండలికంతో, స్వచ్ఛమైన ఛందస్సుతో... అన్నమయ్య అడుగుల్లో, రామదాసు మార్గంలో, త్యాగయ్య స్వరకల్పనంత అందంగా ఉంటాయి. యాదాద్రి ధార్మికసభల్లో వినిపించే ఆ కీర్తనల వెనక ఒక చరిత్ర ఉందని, అది యాదాద్రికి సాంస్కృతిక వైభవాన్ని తెచ్చిందన్న సంగతి చాలామందికి తెలియదు.
పేరు పాపట్ల లక్ష్మీకాంతయ్య. 1900 తొలినాళ్లు... హైదరాబాదు సంస్థానం నిజాం పాలనలో మగ్గుతున్న రోజులవి. తెలుగు భాషా సారస్వతాలకు ఆదరణ లేని సమయం అది. పాపట్ల లక్ష్మీకాంతయ్య లాంటివాళ్లు కూడా మరుగున ఉండిపోయారు. జీవితంలో సింహభాగం యాదాద్రి క్షేత్రం కోసమే పరితపించి ఆ దేవుని కీర్తిస్తూ కీర్తనలు రాశారు పాపట్ల లక్ష్మీకాంతయ్య. ఒక్కో కీర్తన ఒక్కో మధురగుళిక. యాదాద్రి బ్రహ్మోత్సవాల సమయంలో ఆయన చిత్రపటాన్ని పూజిస్తారు. పరబ్రహ్మ పరమేశ్వర అంటూ స్తుతించి... ఆయన పేరిట సంగీత ధార్మిక సభలనూ నిర్వహిస్తారు. కానీ, ఆ లక్ష్మీకాంతయ్య ఎవరయ్యా అని అడిగితే మాత్రం ఎవరూ సమాచారమివ్వరు. అసలు ఆయన గురించి ఏ కొద్దిమందికో గానీ తెలియదు. బాధాకరమైన విషయమేంటంటే ఆయన పేరుకీ అక్షరదోషం పట్టింది. లక్ష్మీకాంతయ్య ఇంటిపేరు పాపట్ల అయితే బాపట్లగా వ్యవహరిస్తున్నారు.
      ఒక్కసారి లక్ష్మీకాంతయ్య జీవితంలోకి తొంగిచూస్తే ఎన్నో ఆసక్తికర పార్శ్వాలు కనిపిస్తాయి. మహారాష్ట్ర నుంచి ఎప్పుడో వలసవచ్చి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో స్థిరపడ్డారు ఆయన తాతముత్తాతలు. 1880లో లక్ష్మీకాంతయ్య జన్మించినట్టు చెబుతారు. ఆయన ఆహార్యం చూస్తే అచ్చమైన మరాఠీలా కనిపిస్తారు. పేరుకి మరాఠీ అయినా తెలుగు అంటే ఆయనకు ఎంతో మమకారం. ఆ ప్రేమతో చిన్నవయసులోనే నాటకాలు, గేయాలు రాయడం మొదలుపెట్టారు. ఆయన జీవితం చాలావరకు తెలంగాణతోనే ముడిపడింది. 1910 ప్రాంతంలో ఆంధ్ర, హైదరాబాదుల్లో చాలా నాటక సమాజాలకు లక్ష్మీకాంతయ్య గురుతుల్యులు. అలనాటి ప్రసిద్ధ నాటక సంస్థ మైలవరం కంపెనీలో చాలాకాలం కొనసాగారు. ప్రహ్లాద, శకుంతల, సావిత్రి ఇలా ఎన్నో నాటకాలకు ఆయన రాసిన పాటలు మారుమోగాయి. ఆ పాటలకు ముగ్ధులైన ప్రజలు స్వరనిధి, స్వరమూర్తి బిరుదులతో సత్కరించారు. దాంతో అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్న చలనచిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు కూడా వచ్చాయి. అయినా నాటకమే ఆయన ప్రాణమైంది.
      అదే సమయంలో కోదాడ వాసి, హరికథలతో అలరించిన చందాల కేశవదాసు... మైలవరం సంస్థలో ప్రాంప్టరుగా చేరారు. అక్కడ ఆయనకు, కాంతయ్యకు ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ కలిసి సాహిత్యగోష్ఠి సాగించేవారు. వయసులో కేశవదాసు పెద్దవారైనా, లక్ష్మీకాంతయ్య ప్రతిభా పాటవాలకు ముగ్ధుడై ఆయన్ను గురువుగా భావించేవారు. ఒకసారి కేశవదాసుతో... యాదాద్రి వెళ్లిన లక్ష్మీకాంతయ్య అక్కడి పరిస్థితులు చూసి చలించిపోయారు. నిజాం పాలనలో ఆదరణకు నోచుకోని యాదాద్రిని, సరైన ఉత్సవకాంతి లేని స్వామిని చూసిన లక్ష్మీకాంతయ్య బాధపడ్డారు. అప్పటినుంచే ఆ స్వామిమీద కీర్తనలు రాయడం ఆరంభించారు..హిందూస్థానీ సంగీత విద్వాంసుడైన ఆయన... కర్ణాటక సంగీతంలో అరుదైన రాగమాలికలతో ఆశ్చర్యం కలిగించే రాగాలు పలికించారు.  ఆ కీర్తనలు విన్న కేశవదాసు పులకించి... ఇవి జనబాహుళ్యంలోకి వెళ్లాలని లక్ష్మీకాంతయ్యకు సూచించారు.
కేశవదాసు, లక్ష్మీకాంతయ్యల స్నేహం లాగానే సాహితీగోష్ఠీ విస్తృతరూపాన్ని పొందింది. అలా యాదాద్రి  బ్రహ్మోత్సవాలకు కళ తేవాలని సంకల్పించి ... మిత్రుల సహకారంతో సంగీత ధార్మిక మహాసభలు ప్రారంభించారు. తన కీర్తనలతో యాదగిరి వైభవాన్ని నలుదిశలా చాటారు పాపట్ల. ఆంధ్ర, హైదరాబాదుల నుంచి ఎంతోమంది కళాకారులను పిలిచి సత్కరించి ఉత్సాహం నింపారు. ఆయన ‘లక్ష్మీకాంత వినుత’ మకుటంతో కీర్తనలు రాశారు. ఈ సభలతో యాదాద్రికి కొత్తకళ వచ్చింది. సభలు ప్రారంభించే సమయానికే లక్ష్మీకాంతయ్యకు జబ్బు చేసింది. చివరిదశలో ఆయన స్వామి చెంతనే ఉండి... ఆయన సేవలోనే తరించి... కీర్తనాభిషేకం చేశారు. దేవునిపట్ల ఆయన ఆర్తిని వ్యక్తంచేసే ఓ కీర్తన...
నీకేల యింత ఆవేశమేల బాలల మేమోర్వలేమే
మహా ఆనందమని మది భావించుచు మెలిగెడు
నాపై నీకేల బాలుని మొరవిని బ్రోచిన నాటి పరమ కరుణ 
యిపుడేల కల్గదు నాకేలు మోడ్చి  యడుగుతుంటిరా
నీకేల సుంత కృపగల్గదు తండ్రీయేల యింతనీ
దాస పోషకుడవు దయామయుడవు దాతవు యాదాద్రి వాసుడవు

 నీ దాసుడైన లక్ష్మీకాంతుని కాయాసము దీరిచి రక్షింపవు     ।।నీకేల యింత।।
నీ ఆవేశాన్ని ఓర్చుకునేందుకు మేమెంతవారం? నువ్వే సర్వమని మహదానందపడిపోతున్నా. బాలుడైన ప్రహ్లాదుణ్ని రక్షించిన నాటి కరుణను నా మీదా చూపించు. ఓ యాదాద్రి వాసా నీ దాసుడైన లక్ష్మీకాంతుడికి ఆయాసం తీర్చి నన్ను రక్షించు.. అని ఆర్తితో గానం చేశారు లక్ష్మీకాంతయ్య. ఇక ‘శ్రీనికేతన నారసింహ మానఘన... కీర్తనలో నా మనవి ఆలకించకపోతే నేను ఇంకెవ్వరిని వేడుకోవాలి? అని దేవుణ్ని సఖుడిగా చేసుకుని ప్రార్థిస్తాడు. మరో కీర్తన ‘నా మాట వినుటకు రామా దయరాలేదా’లో రాముడికీ నరసింహస్వామికీ అభేదం చూపిస్తాడు. నేను ఎప్పటినుంచో నిన్ను ప్రార్థిస్తున్నాను. అయినా ఏనాడూ నిన్ను పొట్టకూటి కోసం అడుక్కోలేదు. మూటలీయమని ముచ్చట్లాడలేదు. సాటివారిలో నన్ను నవ్వులపాలు చేయొద్దని వేడుకున్నాను. అలాంటిది నా మాట మన్నించకపోవడం నీకు పాటికాదు ఓ రామా! అని తన ఆవేదనను వ్యక్తంచేశారు.
      ఇక కేశవదాసు రాసిన ‘పరబ్రహ్మ పరమేశ్వర’ గీతానికి బాణీని సమకూర్చింది లక్ష్మీకాంతయ్యనే. ఇంకా అప్పట్లో తెలుగునాట ఉన్న అన్ని నాటక సమాజాలతో మాట్లాడి... నాటకానికి ముందు ఆ ప్రార్థనా గీతాన్ని ఆలపించేలా చేసిన కృషి కూడా ఆయనదే. నాటకాల ద్వారా ఎంతో సంపాదించిన లక్ష్మీకాంతయ్య  వేములవాడ దేవాలయ ఆస్థాన పండితుడిగా ఆమరణాంతం వ్యవహరించినా... యాదాద్రి ఒడిలోనే ఎక్కువ సమయం గడిపి, గుట్టకు ఒకరూపం తెచ్చి 1950 ప్రాంతంలో నృసింహైక్యం చెందారు.
      ఆ తర్వాత 1956 ప్రాంతంలో నల్గొండ జిల్లా బూరుగుగడ్డకు చెందిన వాగ్గేయకారుడు, వయోలిన్‌ విద్వాంసుడు ముడుంబై సీతారామానుజాచార్యులు యాదాద్రి ధార్మిక మహాసభలకు అధ్యక్షులయ్యారు. ఆయన పాపట్ల లక్ష్మీకాంతయ్య వేసిన ధార్మికమార్గంలో నడిచి, దాన్ని మరింత విస్తరించారు. సంగీత మహాసభలకు దేశవ్యాప్త ప్రముఖులను రప్పించి... యాదాద్రికి ఎంతో సేవచేశారు. సుమారు 40 ఏళ్లపాటు ధార్మికసభలు నిర్వహించిన సీతారామానుజాచార్యులు ఎంతో శ్రమకోర్చి, లక్ష్మీకాంతయ్య శిష్యులనుంచి ఆయన కీర్తనలను సేకరించారు. కాంతయ్య చివరిదశలో రాసి, అసంపూర్తిగా స్వరపరిచిన కీర్తనలకు స్వరకల్పన కూడా చేశారు. అలా పూర్తిచేసిన పుస్తకాన్ని యాదాద్రికి అప్పగించినట్టు ఆయన లేఖలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం లక్ష్మీకాంతయ్య సంకీర్తనల్లో పదో ఇరవయ్యో మాత్రమే లభిస్తున్నాయి. అవీ సీతారామానుజాచార్యుల కుటుంబ సభ్యులకు తెలిసినవి మాత్రమే. ఇప్పటికీ ఏటేటా జరుగుతున్న సంగీత ధార్మిక మహాసభల్లో లక్ష్మీకాంతయ్య కృషిని కొన్ని కీర్తనల ద్వారా అయినా... యాదాద్రికి గుర్తు చేస్తోంది సీతారామానుజాచార్యుల కుటుంబం మాత్రమే. కానీ, నాడు  సీతారామానుజాచార్యులు యాదాద్రికి అప్పచెప్పిన లక్ష్మీకాంతయ్య కీర్తనల సమాహారం ఆచూకీ ఇప్పుడు లభించట్లేదు. ఆ సాహిత్యాన్ని వెలికితీసి ముందుతరాలకు అందించాలి. తెలుగు నాటకాలకు కొత్త వన్నెతెచ్చి, అందమైన కీర్తనలు రాసి యాదాద్రికి ఒక సాంస్కృతిక వైభవాన్నిచ్చిన మహానుభావుడు పాపట్ల లక్ష్మీకాంతయ్యను స్మరించుకోవడం మనందరి బాధ్యత.


వెనక్కి ...

మీ అభిప్రాయం