దండక కావ్యాల శ్రేణి భోగినీ దండకం బోణి

  • 708 Views
  • 2Likes
  • Like
  • Article Share

శతకం తర్వాత తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సాహితీ ప్రక్రియ ‘దండకం’. దాని పేరు చెప్పగానే ‘శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం... నమస్తే నమస్తే నమః’ అనే ప్రఖ్యాత ఆంజనేయ దండకం గుర్తుకొస్తుంది. తెలుగులో ఈ దండక ప్రస్థానంతో పాటు అదో ప్రత్యేక కావ్యంగా ఆవిర్భవించడం గురించి తెలుసుకుందాం!
దండకం ఆవిర్భవించింది
సంస్కృతంలో. ఆ భాషా దండకాల్లో మొదట రెండు నగణాలు వస్తాయి. ఆ తర్వాత రగణాలతో (పరిమితి ఉండదు) దండకాన్ని పూర్తిచేస్తారు. తెలుగులో మాత్రం ‘త’ గణంలో రాసినవే ఎక్కువ (చివరన గురువు ఉండాలి). తెలుగు సాహిత్యంలో తొలిసారిగా దండకం నన్నయ భారతంలో దర్శనమిస్తుంది. ఇది అర్జునుడు శివుడి గురించి తపస్సు చేసే సందర్భంలోది. ఆ తర్వాత మళ్లీ మూడు వందల ఏళ్ల తర్వాత ఎర్రన ‘నృసింహపురాణం’లో దండకం కనిపిస్తుంది. ఇక శ్రీనాథుడి కావ్యాల్లో... శృంగార నైషధంలో దమయంతి తండ్రి సరస్వతిని ప్రార్థించే సందర్భంలో, హరవిలాసంలో క్షీరసాగర మథనం సందర్భంలో దేవతలు విఘ్నేశ్వరుని ప్రార్థించే సందర్భంలో కనిపిస్తాయి. ఇవీ తగణ దండకాలే. కవిసార్వభౌముడికి సమకాలీనుడైన పోతన... కావ్యం మధ్యలో ఏదో ఒక దండకం రాసే సంప్రదాయాన్ని విడిచిపెట్టి, ఏకంగా దండకాన్నే ఓ కావ్యంగా మలచాడు. అదే ‘భోగినీ దండకం’. 
      ఈ భోగినీ దండకం తగణ దండకమే అయినా, చివరన రెండు గురువులు ఉంటాయి. దీన్ని కామబాణ ఛందో భేదంగా పేర్కొన్నారు వైద్యం వేంకటేశ్వరాచార్యులు. ‘కాకలోలంబులై, మోహజాలంబులై, కామబాణంబులై... అన్న పదాలతో ఈ ఛందస్సు ఔచిత్యాన్ని పేర్కొన్నాడు పోతన’ అంటారాయన. శృంగార దండకానికి ‘కామబాణ’ ఛందస్సును ప్రయోగించడం విశేషం.
భోగినీ మనోహారి
శ్రీమన్మహామంగళాకారు నాకార లక్ష్మీకుమారున్‌... అంటూ రాచకొండ పాలకుడు సర్వజ్ఞ సింగభూపాలుణ్ని మన్మథ స్వరూపంగా పొగుడుతూ ప్రారంభమవుతుంది ఈ దండకం. ఓ వసంతరుతువులో రాచకొండలో గోపాలదేవోత్సవ క్రీడల్లో పాల్గొంటాడు సింగభూపాలుడు. ఆ సమయంలో తమ భవనం మీద ఉండి, కిటికీలోంచి అతణ్ని చూస్తుంది భోగిని. చూసీ చూడటంతోనే అతని మీద మోహాన్ని పెంచుకుంటుంది. రాజు తోడిదే జీవితంగా భావిస్తుంది. ఆయనకు తన ప్రేమను వెల్లడించడం ఎలా అని మదనపడుతూ ఉంటుంది. కూతురు పరధ్యానంగా ఉంటున్న విషయం గమనించిన భోగిని తల్లి ఏం జరిగి ఉంటుందన్న దాన్ని ఆరా తీస్తుంది. తర్వాత భోగినితో ‘నువ్వు రాజుతోనే ఉండిపోతానంటే ఎలా? మన వృత్తి ఏం కావాలి? అని ప్రశ్నిస్తుంది. కూతురి మనసు మళ్లించేందుకు ఎన్నో మాటలు చెబుతుంది. చివరికి రాజుల మనస్తత్వం చంచలమైంది. వాళ్లు ఎప్పుడూ కొత్తవాటిని కోరుకుంటారు. నీ ప్రయత్నం మానుకో’ అంటుంది. అయినా వినదు భోగిని. దాంతో తల్లి ‘నువ్వు రాజు అంతఃపురాన్ని చేరుకుంటే మేం నీ దగ్గరికి రాలేం. రాకపోకలు సాగించేందుకు ప్రతీసారి ద్వారపాలకుల అనుమతి తీసుకోవాలి. నీ కోరిక మానుకో’ అంటుంది. అయినా తల్లి మాట వినదు భోగిని. పైగా ఆమెకు తల్లి మీద విపరీతమైన కోపం వస్తుంది. చివరికి ఎలాగైనా సరే తననీ రాజునీ ఒకటి చేయమని ప్రాధేయపడుతుంది. బిడ్డ మనసు మళ్లించలేకపోయిన తల్లి, రాజు దగ్గరికి వెళ్లి విషయం చెబుతుంది. సింగభూపాలుడు కూడా భోగిని రూప లావణ్యాలకు వివశుడై పోతాడు. ఆమెకు సద్భోగినీ పట్టాన్ని ప్రసాదిస్తాడు. 
      అయితే ఇది శృంగార దండకం కావడం మూలంగా దీని కర్తృత్వం మీద వాదవివాదాలు తలెత్తాయి. పోతన భక్తకవి. అలాంటి ఆయన ఒక భోగకాంత ప్రేమకథను కావ్యంగా మలుస్తాడా? అన్నది సందేహం. ఇది పోతన వ్యక్తిత్వానికి సరిపడదన్నది చాగంటి శేషయ్య అభిప్రాయం. అయితే ఇందులో ఉన్న అనుప్రాసలు, ప్రౌఢ స్వతంత్ర రమణీయ శైలి ఇది పోతన రచనగా చూపుతాయి. అందుకే కొంతమంది సాహితీవేత్తలు,  కవులు తొలిరోజుల్లో రాజాస్థానాల్ని ఆశ్రయించి, తమ జీవిత చరమాంకంలో దైవచింతనలో గడిపిన వాళ్లు చాలామంది ఉన్నారు. అలా పోతన సింగభూపాలుడి ఆస్థానంలో ఉన్నప్పుడు దీనిని రాసి ఉండొచ్చు... అన్న దానికి ఎక్కువ మంది సాహితీవేత్తల ఆమోదం లభించింది. 
      ఇంకా ఆ రోజుల్లో భోగకాంతలు విద్యలు, కళల్లో పాండిత్యం సాధించి పట్టమహిషులతో సమాన గుర్తింపు పొందేవారు. ఇక ఆశ్వాసాంతంలో ఉన్న ‘పండిత కీర్తనీయుడగు బమ్మెరపోతన యాసుధాంశు...’ పద్యం ఈ కావ్యాన్ని పోతన కృతిగానే చూపుతుంది. దండకంలోనూ భోగినికి ఆమె తల్లి రాజును కోరవద్దు అని చెప్పే సందర్భంలో రాజుల విపరీత ప్రవర్తనను వర్ణించే సందర్భం రాజులు, రాజాశ్రయాల మీద పోతన అభిప్రాయాన్ని, అయిష్టతను వ్యక్తంచేస్తుంది. కనుక భోగినీ దండకం పోతన కృతి అనేందుకు అభ్యంతరం ఏమీ ఉండదు.
      పోతన అనంతరం కూడా తెలుగులో దండక సాహిత్యం విస్తారంగా వచ్చింది. నందిమల్లయ, ఘంటసింగయలు వరాహపురాణంలో దండకాన్ని రచించారు. ముక్కుతిమ్మన ‘పారిజాతాపహరణం’, పింగళి సూరన ‘కళాపూర్ణోదయం’ కావ్యాల్లోనూ దండకాలు ఉన్నాయి. తాళ్లపాక పెదతిరుమలయ్య ‘శృంగారదండకం’ (పద్మావతీ శ్రీనివాసుల పరిణయం ఇందులో ప్రధానం), చిన తిరుమలయ్య ‘అష్టభాషా దండకం’ రచించారు. గణపవరపు వేంకటకవి ‘విద్యావతీ దండకం’, నుదురుపాటి సాంబకవి ‘చంద్రాననా దండకం’, తంజావూరు పాలకుడు విజయరాఘవనాయకుడి ‘రాజగోపాల దండకా’లు శృంగార రస ప్రధానాలు.
      ఆధునిక యుగంలోనూ ఎంతోమంది కవులు దండకాలు రాశారు. వీటిలో అధిక్షేప, వ్యంగ్య, భక్తి, నీతి తదితరాలు ప్రసిద్ధంగా నిలుస్తాయి. జాతీయోద్యమంలో భాగంగా గాంధీ దండకం, భారతమాత దండకంలాంటివీ వచ్చాయి. వెంపరాల సూర్యనారాయణశాస్త్రి, తిరుపతి వేంకటకవులు, ఆదిభట్ల మొదలైనవారు దండకాలు రాశారు. కలుగోడు అశ్వత్థరావు దండక రామాయణాన్ని రాయడం ప్రత్యేకం. వెయ్యేళ్ల చరిత్ర కలిగి పండిత పామర జనాదరణ పొందిన సాహితీ ప్రక్రియ అయిన దండకం ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.


తెలుగు కావ్యాల్లో తొలి దండకం  
నన్నయ భారతం అరణ్యపర్వం అర్జునుడు శివుణ్ని స్తుతించిన సందర్భంలోది...
శ్రీకంఠ! లోకేశ! లోకోద్భవస్థాన సంహారకారీ! పురారీ! మురారిప్రియా! చంద్రధారీ! మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్య స్వరూపా! విరూపాక్ష! దక్షాధ్వర ధ్వంసకా! దేవ! నీదైన తత్త్వంబు భేదించి, బుద్ధింబ్రధానంబు, గర్మంబు, విజ్ఞాన, మధ్యాత్మయోగంబ, సర్వక్రియా కారణంబంచు నానా ప్రకారంబులన్‌ బుద్ధిమంతుల్‌ విచారించుచున్‌ నిన్ను భావింతు; రీశాన! సర్వేశ్వరా! శర్వ! సర్వజ్ఞ! సర్వాత్మకా! నిర్వికల్పప్రభావా! భవానీపతీ! నీవు లోకత్రయావర్తనంబున్‌ మహీవాయు ఖాత్మాగ్ని సోమార్క తోయంబులంజేసి కావించి; సంసార చక్రక్రియాయంత్ర వాహుండవై; తాదిదేవా! మహాదేవ! నిత్యంబు నత్యంత యోగస్థితిన్‌ నిర్మలజ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్, జితక్రోధరాగాది దోషుల్, యతాత్ముల్, యతీంద్రుల్, భవత్పాదపంకేరుహ ధ్యాన పీయూష ధారానుభూతిన్‌ సదా తృప్తులై, నిత్యులై, రవ్యయా! భవ్యసేవ్యా! భవా! భర్గ! భట్టారకా! భార్గవాగస్త్యకుత్సాది నానా మునిస్తోత్ర దత్తావధానా! లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ! గంగాధరా! నీ ప్రసాదంబునన్‌ సర్వ గీర్వాణ గంధర్వులన్‌ సిద్ధ సాధ్యోరగేంద్రాసురేంద్రాదులున్‌ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై; రీశ్వరా! విశ్వకర్తా! సురాభ్యర్చితా! నాకు నభ్యర్థిత్వంబుల్‌ ప్రసాదింపు; కారుణ్యమూర్తీ! త్రిలోకైకనాథా! నమస్తే! నమస్తే! నమః.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం