‘ఉమ్రాలిషా కవి’ యనగ నేను!

  • 207 Views
  • 11Likes
  • Like
  • Article Share

వ్యాసములున్‌ విమర్శనలు భావకవిత్వరసైక చారు వి/ న్యాసములున్‌ మతాంతర మహాపరివర్తన తత్త్వరూపకో/ పాసనముల్‌ పురాణములు వ్రాసితి భారతభూమి నేనుప/ న్యాసము లిచ్చుచున్‌ దిరిగినాడను ‘ఉమ్రలిషా’ కవీంద్రుడన్‌... అని ప్రకటించుకున్న డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా తెలుగు సాహితీరంగంలో ఓ మణిపూస. విభిన్న సాహితీ ప్రక్రియల్లో సాగిన ఆయన కలం సేద్యం చిరస్మరణీయం.
‘‘తెలుగు సాహిత్యానికి
ముస్లింల ప్రత్యేక సేవలు వెలుగులోనికి రాలేదు’’... ఈ మాట ఆరుద్రది. అది నిజమే! సాహితీ విశేషాలను పత్రికాముఖంగా చర్చించడం అనే సంప్రదాయాన్ని పాదుకొల్పిన ‘వర్తమాన తరంగిణి’ పత్రిక నిర్వాహకులు సయ్యద్‌ రహమతుల్లా గురించి ఎంతమందికి తెలుసు? ఎప్పుడో 1842లో ప్రారంభమైన ఈ పత్రిక తొలితరం తెలుగు పత్రికల్లో ఒకటి. ఆ తర్వాత మున్షీ మీర్‌ సుజాయత్‌ ఆలీఖాన్, బజులుల్లా సాహెబ్‌ తదితరులు ‘విద్వన్మనోహారిణి’, ‘సత్వానేషిణి’ లాంటి పత్రికలు నడిపారు. చెదలుపట్టిపోతున్న తెలుగు సాహిత్యాన్ని ఉద్ధరించిన బ్రౌను ప్రయత్నాలకు ఊతమిచ్చినవారిలోనూ ముస్లింలు ఉన్నారు. ‘శృంగార నైషధం’, ‘రసికజన మనోభిరామం’ తదితర కావ్యాల రాత ప్రతులను షేక్‌ మహమ్మద్‌ సాహెబ్‌ అనే ఆయన గ్రంథాలయం నుంచి బ్రౌను సేకరించారు. ‘‘తెలుగు సాహిత్యాన్ని అభిమానించి ప్రసిద్ధ గ్రంథాల వ్రాత ప్రతులు భద్రం చేసిన ఇటువంటి ముస్లింవారు ఎందరున్నారో ఇంకా లెక్క తేలలేదు’’ అన్నారు ఆరుద్ర తన ‘సమగ్రాంధ్ర సాహిత్యం’లో. ఇలా తెలుగు సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పరోక్షసేవలు అందించిన వారే కాదు, తెలుగులో విస్తృతంగా సాహితీ సృజన చేసిన ముస్లిం కవులూ రచయితలూ చాలామందే ఉన్నారు. పద్యకావ్యాల నుంచి శతకాల వరకూ, పౌరాణిక నాటకాల నుంచి కథలవరకూ రాసిన ఆ సాహితీవేత్తల్లో అగ్రగణ్యులు డాక్టర్‌ ఉమర్‌ ఆలీషా. ‘‘తెలుగుబాస కడుపున బుట్టి పెరిగినవారికే దిక్కులేదు. ఈయన యెంత సొగసుగా గవితకట్టెను!’’ అని మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి సైతం అబ్బురపడిన ప్రజ్ఞ ఈయనది. 
రచియించినాడ విభ్రాజితదివ్య ప్ర
   బంధముల్‌ పది కావ్య బంధములుగ
వ్రాసినాడను కల్పనాసక్తమతి పది
   నాటకంబులను గర్ణాట ఫక్కి
కూర్చినాడను గళా కోవిదుల్‌ కొనియాడ
   నవలలు పది నవ నవల లనగ
తెలిగించినాడ నుద్దీపితాఖండ పా
   రసి కావ్యములు పది రసికు లలర
రసము పెంపార నవధాన క్రమములందు
నాశువులయందు పాటలయందు కవిత
చెప్పినాడ నుపన్యాససీమ లెక్కి
యవని ‘‘ఉమ్రాలిషా కవి’’ యనగ నేను  

      ‘మహాభారత కౌరవరంగం, అనసూయాదేవి, కళ, చంద్రగుప్త, దానవవధ, విచిత్ర బిల్హణీయం’ తదితర నాటకాలు; ‘తత్వసందేశం, సూఫీవేదాంత దర్శనం, స్వర్గమాత, మహమ్మద్‌ రసూలువారి చరిత్ర, బర్హిణీదేవి’ లాంటి పద్యగ్రంథాలు; ‘పద్మావతి, శాంత’ తదితర నవలలు; ‘ప్రభాత కథావళి’ కథల సంగ్రహాలను సృజించిన ఆలీషా తన గురించి తాను చెప్పుకున్న పద్యమిది. ఉమర్‌ ఖయ్యాం రుబాయీలనూ తెలుగులోకి తెచ్చారాయన. ఇక పత్రికల్లో రాసిన వ్యాసాలైతే సరేసరి. అన్నింటికీ మించి ఆయన వాగ్ధాటి! ‘‘యీయన తెలుగులో నుపన్యసించుట విన్న వారున్నచో నడుగవచ్చును. అచ్చమైన మధువాహిని యోడిగిలునటులుండెడిది. భాషలో నిర్దుష్టత పలుకుబడిలో గ్రొత్త బెడగు, ధారాళత వీరి యుపన్యాసమునకు మెఱుగులు తెచ్చినవి. మాటనేరుపు, వ్రాత తీరును, సరితూకముగా నలవడిన యీ కవి ధన్యుడు’’ అన్న మధునాపంతుల మాటలు ఆలీషా ప్రతిభకు అద్దంపడతాయి.
గోదావరి తీరం నుంచి... 
ఉమర్‌ ఆలీషా స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. ఫిబ్రవరి 28, 1885న జన్మించారు. తల్లిదండ్రులు మొహియుద్దీన్‌ బాషా, చాంద్‌బీ. అయిదు శతాబ్దాల చరిత్ర కలిగిన ‘విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం’కు ఆలీషా కుటుంబికులు వంశపారంపర్య పీఠాధిపతులు. పిఠాపురం ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఆయన నాటి పండితుల శిష్యరికంలో తెలుగు, సంస్కృత భాషలమీద పట్టు సంపాదించారు. మాతృభాష ఉర్దూతోపాటు, అరబ్బీ, పర్షియన్, ఆంగ్ల భాషల్లోనూ ఆయనకు ప్రావీణ్యం ఉంది. పద్నాలుగో ఏట నుంచే పద్య రచన ప్రారంభించిన ఆలీషా, ఆ వయసులోనే ‘బ్రహ్మవిద్యా విలాసం’ శతకాన్ని రచించారు. పద్దెనిమిదేళ్ల వయసులో తొలిసారి ‘మణిమాల’ నాటక రచన చేశారు. దానికి మంచి ప్రశంసలు వచ్చాయి. హిందూ పురాణాలు, ఇతిహాసాల మీద సాధికారికమైన విజ్ఞానాన్ని సముపార్జించిన ఆలీషా పౌరాణిక రచనలెన్నో చేశారు. ‘దానవవధ’ నాటకంలో భాగంగా ‘నరసింహ దండకం’ (నమో దేవదేవా! నమో భక్తసంత్రాణశేలా! నమో సర్వలోకాంతవాసా!) సైతం రాశారు. భార్య అక్బర్‌ బీబీ కోరిక మేరకు వెలువరించిన ‘అనసూయాదేవి’ నాటకంలో ‘‘నిగురు గల నిప్పుపై నీగలెగుర గలవె/ భానుబింబంబు జెద పట్టగలదె/ అట్టులా సాధ్వియనసూయ నంటనెవరి/ తరము మృత్పాత్రమేరువు దాకినట్లు’’ అంటూ ఆ సాధ్వీమణి వ్యక్తిత్వానికి పట్టంకట్టారు. సూఫీ సిద్ధాంతాల పునాదుల మీద ఏర్పాటైన ‘విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం’ బాధ్యతలను తండ్రి తదనంతరం స్వీకరించిన ఆలీషా, మతసామరస్యాన్ని ప్రబోధించారు. 
      బిపిన్‌చంద్ర పాల్, అరవింద ఘోష్, చిత్తరంజన్‌ దాస్‌ తదితరులతో కలిసి స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకున్న ఆయన్ను ‘‘ఉదాత్తమైన రాజకీయ భావాలు గల వ్యక్తి’’గా గాంధీజీ అభివర్ణించారు. ‘చంద్రగుప్త’ నాటకంలో అలెగ్జాండర్‌ పాత్ర చెప్పే ‘ఏ మహారాజ్ఞికి హిమవన్నగంబులు/ కులగిరుల్‌ పెట్టని కోటలొక్కొ/ ఏ లతాతన్వికి సింధు గంగానదుల్‌/ దరిలేని మంచి ముత్యాల సరులొ/ ఏ సరోజాస్యకు నా సింహళ ద్వీప/ మత్యంత రత్న సింహాసనంబొ/ ఏ రమారమణికి భారత యోధుల/ గాళిదాసాదుల గన్న కడుపొ/ అట్టి సుగుణరత్నాకరమైన జగాన/ నసదృశ విలాసినిగ నలరారుచుండ/ భారత వర్ష వధూటి...’ పద్యం ఆలీషా దేశాభిమానానికి ప్రతీక. అఖిల భారత ఖిలాఫత్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన ఆలీషా, ఉత్తర మద్రాసు నియోజకవర్గం నుంచి 1934లో అఖిల భారత శాసనసభ(నేటి పార్లమెంట్‌ మాదిరి)కు ఎన్నికయ్యారు. జనవరి 23, 1945న స్వర్గస్థులయ్యే వరకూ ఆ పదవిలోనే కొనసాగారు. 
సంస్కరణాభిలాషి
‘‘పర్యాయపద భూయిష్ఠముగావించి పాఠకుని మెదడును పాడుచేయుట కంటె చెప్పవలసినవేవో హృదయము నాటుకొనిపోవునట్లు చెప్పుటలోనే సొగసున్నది’’ అనే ఆలీషా, తన రచనల్లో ఇదే సూత్రాన్ని పాటించారు. అందుకే సమకాలీన పండితుల నుంచి ‘ఆయన కవితాధోరణి సులభ రమణీయమైంది’ అనే ప్రశంసలను అందుకున్నారు. ఆరుద్ర సైతం ఆలీషా కవిత్వంలో ‘ధార ధారాళంగా ఉంటుంది’ అన్నారు. ‘‘అణువులయందు సుందర యజాండమునందు హిమాంబు సూక్ష్మపుం/ గణములయందు సూర్యశశికాంతులయందు పరాత్పరా! భవ/ ద్వినుత విలాసవైఖరి ప్రవీణత దోచుచు నున్నదింక నిన్‌/ గనుగొన లేనిచో కనులు గల్గిన నంధులుగారె మానవుల్‌’’ అన్న ‘మహాభారత కౌరవరంగం’లోని పద్యం ఆలీషా రచనా నైపుణ్యానికో మచ్చుతునక. ‘లోపములు గలవారే లోపము లెంచెదరు’ లాంటి సంభాషణలు ఆయన నాటకాలకు వన్నెతెచ్చాయి. 
      ‘ఏను హిమాలయంబుపయి నెక్కితపస్వుల జూచి వారి వి/ న్నాణములన్‌ గ్రహించి విజనంబగుచోట రచించినాడ’ అని చెప్పుకున్న ఆలీషా... సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం, జాతీయభావాలను రంగరిస్తూ రచనలు చేశారు. నాటి సమాజంలోని మూఢనమ్మకాలను దునుమాడారు. బాల్యవివాహాలు, కన్యాశుల్కం, గృహహింసలను నిరసించారు. స్త్రీవిద్యకోసం గళమెత్తారు. ఆయన నాటకాల్లో ఎక్కువశాతం ఈ కోణంలోనే కనిపిస్తాయి. ‘పడతి, గృహంబునందొక బంధురదీపిక’ అని వర్ణిస్తూ భార్యను మిత్రురాలిగా చూడాలని ఉద్బోధించారు. ‘తరుణి వివేకమున్‌ జదువు ధర్మము జ్ఞానముతత్త్వ దీక్షలన్‌/ గురువుల చెంగటన్‌ బడయ గోరిన వారల మాన్పువారు సూ/ కరులై పుట్టుచుండ్రు..’’ అంటూ స్త్రీవిద్యను వ్యతిరేకించేవారిని తీవ్రంగా నిరసించారు. మరోవైపు స్వాతంత్య్ర యోధుడిగా దేశమంతా పర్యటించారు. ఆయన ఉపన్యాసం ఉందంటే చాలు, ఆ సభలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చేవారు. దేశవిదేశాల్లోని ఎన్నో సంస్థలనుంచి సత్కారాలను అందుకున్న ఆలీషా ‘‘సర్వజనుల సర్వేశ్వరుడు ఒక్కడేనన్న భావన ద్వారా వసుధైక కుటుంబం ఏర్పడుతుంది’’ అని చెప్పేవారు. మానవుణ్ని మానవుడిగా మార్చడమే తన ధర్మమని ప్రకటించిన మానవతామూర్తి ఆయన. అలీగఢ్‌ విశ్వవిద్యాలయం నుంచి ‘మౌల్వీ’ బిరుదాంకితులైన ఆలీషా, ఆల్‌ ఇండియా ఓరియెంటల్‌ కాన్ఫరెన్స్‌ నుంచి ‘పండిట్‌’ బిరుదునూ అందుకున్నారు. ఇలా భారతీయ సమాజంలోని రెండు ప్రధాన వర్గాల మధ్య వారధిగా, మతసామరస్యానికి ప్రతినిధిగా ఆయన నడిచిన బాట అనుసరణీయం. 

సహకారం: విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం


వెనక్కి ...

మీ అభిప్రాయం