మన బంధానికి పేరేంటి?

  • 694 Views
  • 0Likes
  • Like
  • Article Share

    భరత్‌ మూరిశెట్టి

  • సి.డి.కండ్రిగ, కార్వేటినగరం చిత్తూరు జిల్లా.
  • 8754550372

మౌనికకి,
ఈ లేఖ రాసేటప్పుడు అందరిలానే ప్రియమైన అని సంబోధిద్దామనుకున్నా. కానీ నీ పేరే నాకు ప్రియమైనప్పుడు మరో ప్రియమైన ఎందుకు? కోహినూర్‌ పక్కన నకిలీ వజ్రంలా. నువ్వు జ్ఞప్తికి వచ్చినప్పుడు నా మదిలో తారాడే భావాలను వ్యక్తీకరించడానికి నా భాషా పరిజ్ఞానం సరిపోదు. అసలు భాషే సరిపోదేమో! 
      దువుకునే రోజుల్లో ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతాన్ని ఎలాగైనా అర్థం చేసుకోవాలని ప్రయత్నించా, అప్పుడు అర్థం కాలేదు. కానీ నీతో గడిపే గంట నిమిషంలా గడిచిపోతుంది, నువ్వు లేని నిమిషమైనా గంటలా గడుస్తుంది. ఐన్‌స్టీన్‌ సిద్ధాంతం బహుశా ఇదేనేమో..
      నువ్వు నా ఎదురుగా లేనప్పుడు భరించలేని ఎడబాటు. అదే నువ్వు ఎదురుపడ్డప్పుడు నాకెందుకో తడబాటు! నువ్వు నా పక్కన ఉన్నప్పుడు సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఏమంత అందంగా కనపడవు. కాలం దాని ఉనికిని కోల్పోతుంది. ఈమధ్య నాలో నేను మాట్లాడుకుంటున్నానని డాక్టరుకు చూపించుకోమన్నారు కొందరు మంచోళ్లు. నాలోని నీతో మాట్లాడుతున్నానని తెలుసుకోలేకపోయిన పిచ్చోళ్లు.
      అయినా- నా గుండె లోయల్లో లయబద్ధంగా సాగే నీ పేరు ప్రవాహాన్ని స్టెతస్కోపు గుర్తిస్తుందా? నీ వల్ల నేను చాలా మారిపోయాను. ఎంతలా అంటే... నిద్రలో మేల్కొంటున్నాను నీ కలలతో! పగలు పడుకుంటున్నాను నీ ఊహలతో! నా జీవితం నాది కానిది అయింది. మొత్తం నీ జ్ఞాపకాలతో, ఊసులతో నిండిపోయింది. ఇన్నేళ్లూ నేను చూసిన ఆనందాలు, అందాలు, ఉత్సాహాలు, ఉద్రేకాలు ఏవీ నీ కాలిగోటికి సరిరావు.
      నిన్ను చూడకముందు ప్రపంచం మొత్తం అందంగా అనిపించేది. ఏ ముహూర్తాన నిన్ను చూశానో, ఆ క్షణం నుంచి నువ్వు తప్ప ఇంకేమీ అందంగా కనిపించట్లేదు. 
      దేవుడు స్వర్గంలో తేలియాడుతూ బాధనేది ఒకటుందని మర్చిపోయాడు. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి భూమిని సృష్టించి, అందులో మనిషిని సృష్టించి బాధల వలయంలోకి తోసేశాడు. నా దృష్టిలో ఈ జీవితం బాధామయం, ఈ జీవితంలో సంతోషించదగ్గ విషయం నువ్వు మాత్రమే.
      కాలాన్ని కరెన్సీతో, కీర్తిని కార్లతో, ప్రేమని మనీపర్సుతో, స్నేహాన్ని అవకాశంతో కొలతలు వేసే మనుషులు ఉన్న ఈ లోకంలో మన మధ్య ఈ బంధానికి ఏం పేరు పెడతారో??
చలం అన్నట్టు ‘మృణ్మయమైన ఆత్మలు, తమో నిర్మితాలైన మేధస్సులూ’ నిన్నూ నన్నూ అర్థం చేసుకోగలవా??

నీ...


వెనక్కి ...

మీ అభిప్రాయం