విరచిత వర్ణాలు జన జీవన సౌరభాలు

  • 396 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సింధూర

  • హైదరాబాదు

ఆవు గుర్తుకు వస్తే అందమైన బాల్యమే స్ఫురిస్తుంది. ఆవుదూడల గంగడోలు నిమురుతూ ఆడుకున్న బాల్యం, కోడెడ్లని సాగదోలుతూ యవ్వనంలోకి అడుగుపెట్టి, చేను చెలకతోపాటు గొడ్డూగోదని పంచుకుని కొత్త సంసారంలోకి అడుగుపెడుతుంది. అదే రైతు జీవితం. ఎద్దు, ఎవుసమే ప్రపంచమైన నిన్నటి జీవితం అది. మనుషుల మధ్యే కాదు, మనిషికి జంతువులకు మధ్య అనుబంధాలు పెంచిన సంస్కృతి మనది. ఈ సంస్కృతి చేతివృత్తులకు, హస్తకళలకు ఆశ్రయమిచ్చింది. ఆశ్రిత కళలను పోషించింది. ఆ జనజీవన సంస్కృతిని కళ్లకు కడుతూ ‘తెలంగాణ సంబురాలు’ సంబురంగా ముగిశాయి. ఈ వేడుకల సందర్భంగా తెలంగాణ చిత్రకారులు తెలంగాణ జీవన వైభవాన్ని, వైవిధ్యాన్ని కళ్లకు కట్టారు. కనుమరుగైపోతున్న జీవనం కాన్వాస్‌మీద ఆవిష్కరించిన చిత్రాలను చూస్తుంటే సంతోషం, వ్యథ వెనువెంటనే కలుగుతాయి. ఈ జీవితం మళ్లీ వస్తే బాగుండనిపిస్తుంది. అంత ప్రతిభావంతంగా చిత్రించారు వాళ్లు. 
తెలంగాణ ఆవిర్భావ
దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయంతో కలిసి హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ ఈ ఆర్ట్‌ క్యాంపును నిర్వహించింది. ఇందులో నలభై మంది చిత్రకారులు చిత్రించిన ప్రతి చిత్రం ఓ జీవనపార్శ్వాన్ని ఆవిష్కరించింది. ‘నలుగురు కలిసి పొరుపులు మరచి చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం.. మనకిస్తుందెంతో ఫలసాయం. అది రైతులకెంతో సదుపాయం’ అన్నట్లుగా భిన్నమైన చిత్ర రీతుల్లో ఆరితేరిన కళాకారులందరూ కలిసి మెలిసి కళాఖండాలెన్నింటినో ఆవిష్కరించారు. ‘ఒక సంసారం వందెకరాలను సాగుచేయడం కష్టముగా’ అని శ్రీశ్రీ అన్నట్లే నూరు పూలు వికసిస్తే వేయి భావాలు సంఘర్షిస్తాయని చాటిందీ కార్యశాల. సృజనలో ఇలాంటి సేద్యం కళాకారులకెంతో సదుపాయం అని నిరూపించారు నిర్వాహక సమన్వయకర్త, హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ అధ్యక్షులు ఎంవీ రమణారెడ్డి.
      స్త్రీలకు హక్కులు, సమానత్వం, భద్రత గురించి మాట్లాడుకుంటే కొంతమందికి నవ్వొస్తుంది. ఆ నవ్వేవాళ్లను ‘వెనకబడిన మనుషులు’ అనుకుంటారు మాట్లాడుకునేవాళ్లు. మన సంస్కృతిలోని భిన్నత్వాన్ని పరిశీలిస్తే స్త్రీ సమానత్వమూ తారసపడుతుంది. ఈ శ్రమైక జీవన సౌందర్యమే శ్రవణ్‌ కుమార్‌ జీవనచిత్రం. అర్ధనారీశ్వరుల్లా దేహాలు కలిసిలేకున్నా, కష్టసుఖాల్లో కలిసిమెలిసి పోవడమే వ్యావసాయిక జీవితం. ఆడుతు పాడుతు పనిచేస్తూ మొలకల్నీ బిడ్డలా సాకుతారీ తల్లిదండ్రులు. సిరులు పండించడంలో కష్టాన్ని పంచుకున్నట్లే నష్టాలనూ పంచుకుంటారు. ఆలిని ఇంటికి పరిమితం చేయక ఉత్పత్తిలోకీ ఆమెను ఆహ్వానిస్తుంది వ్యవసాయం. స్త్రీల శ్రమలేనిదే ఈ పంట దిగుబడులే లేవు. ఆధ్యాత్మిక శివుణ్ని ఈ సృష్టికి లయకారుడిగా భావిస్తే, ఈ చిత్రకారుడి హృదయం సంపదసృష్టికి శ్రామికులనే లయకారులుగా భావించిందేమో. శివపార్వతులను తలపించేలా ఆత్మీయమైన స్పర్శతో తన్మయత్వంలో ఉందా జంట. బండబారిన నేలను దున్ని దుక్కిని కుంకుమలా మారుస్తాడు. బూడిద పూసుకున్న శివుడిలా బురదను మీగడలా పులుముకుని మట్టిపై మమకారం పెంచుకునేది రైతే! దాంపత్యంలో అన్యోన్యతకు చిహ్నంగా భావించే శివపార్వతుల్లాగే శ్రమలో అన్యోన్యంగా ఉండే ఈ రైతులే మనకు పూజ్యులు! 
      జీవిత చరమాంకంలో ఏదోలా జీవితాన్ని నెట్టుకొచ్చే బడుగులెందరో. ఆ పేదలే మన కంది నర్సింలు చిత్రకథలకు కథానాయకులు. ఎండకు ఎండి, వానకు తడిసిపోయే శ్రమజీవుల ముఖాలకు అందమైన ఆకారాలు, ప్రకాశవంతమైన రంగులు పులమకుండా వారి జీవితాన్ని అందంగా చూపడం ఆయన సృజన శైలి. ఆ కుంచె నుంచి జాలువారిన కల్లాకపటం కానని మనుషులే ఆయన చిత్రాంశాలు. డబ్బులు దాచుకునే గుడ్డసంచి, నామోషీ పడకుండా నగిషీలు లేని ఆభరణాలు ధరించే మనుషులు సినిమాల్లో వెర్రిబాగుల వేషాలు కడుతుంటే కంది నర్సింహులు వాళ్లను మానవీయతకు ప్రతినిధులుగా, ప్రతిబింబాలుగా కాన్వాస్‌పై ఆవిష్కరిస్తారు. అక్రిలిక్‌ శైలిలోని మరో చిత్రాన్ని సృజించిన నగేష్‌ గౌడ్‌ కూడా ఇదే పల్లెను పరవశంతో చిత్రించి అదే అనుభూతిని మనకూ కలిగించేలా అందించారో కళాఖండాన్ని. 
      అతి ప్రాచీనమైన కళ చిత్రకళ. భాష పుట్టకముందే పుట్టిన కళ అది. రాతి గుహలనుంచి నాగరిక సమాజంలోకి నడిచివచ్చిన మానవుడు ఆ కుడ్య చిత్రకళను అనేకచోట్ల అనేకరీతుల్లో ఆవిష్కరించాడు. సృజనతో విస్తరించిన ఈ కళలన్నీ కనుమరుగవుతున్నాయి. ‘కదిలే చిత్రాలు’ పుట్టకముందు, ఊరూరా ఊరేగిన తోలుబొమ్మలు నేడు రంగు వెలసిపోయాయి. కూడుపెట్టని కళకు ఆదరణ లేక కునారిల్లితే, అవసరం లేని ఎవుసం ఎద్దుని నిర్లక్ష్యం చేసింది. బతుకుదెరువుకు ఆదరువైన చెట్టును, పుట్టను ప్రేమించడం, ఆరాధించడం మన జీవన విధానం. ఆధ్యాత్మిక ఆలోచన పుట్టకముందే అనాదిగా అనేక ఆదిమ తెగల్లో ఉన్న ఆచారం ఇది. చెరువుకట్టను, చెట్టుపుట్టను ఆరాధించే మనిషి ఎవుసానికి సాయపడే గోవుని కూడా అలంకరించేవాడు. ఎద్దుకు మువ్వలు కట్టి, నుదుటన కుంకుమ దిద్ది అలంకరించిన రైతు మురిపాన్ని నగేష్‌ గౌడ్‌ చిత్రం చెబుతుంది. గోధూళివేళ స్ఫురించేలా కాన్వాస్‌ను అరుణమయం చేసిన ఆయన చీకటిలో ప్రకాశించే పల్లెకళపై అమితమైన ఆరాధననూ వ్యక్తం చేశారీ చిత్రంలో. చేర్యాల చిత్రకళా రీతిని చెబుతున్న ఈ చిత్రంలో తోలుబొమ్మే కాదు దానికి అనేక అలంకరణలూ చేర్చారు. 
      తల్లివేరు లాంటి భాషను ఆసరా చేసుకుని విస్తరించిన వ్యవసాయ సంస్కృతి మనది. వేల సంవత్సరాల ఆ సంస్కృతి ప్రపంచీకరణ ప్రభావంతో కనుమరుగైపోతున్న సందర్భమిది. ఫలితంగా జీవితాల్లో వెలుగుల్ని కోల్పోతున్న రైతన్నల గురించి పట్టించుకోని సమాజంలో, ఆ రైతు నేస్తం ‘ఆవు’ మీద మాత్రం రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే... గోవుకు, గోవుతో సరిజోడుగా గొడ్డు చాకిరీ చేసే రైతుకు కావాల్సిందేంటో తేల్చే చర్చే లేదు. ఈ చీకటిని వెలిగిస్తూ పల్లె ఆశల్ని ప్రకాశింపజేసింది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చిత్రకళా క్యాంపు. ఈ సాంస్కృతిక వృక్షానికి ఫలించిన కళ ఇప్పుడు తల్లివేరును స్మరించుకోవడం మరో సంబురం! రైతుకు నీడనిచ్చేందుకు అదును చూసుకుని నలుదిక్కులా ఆలోచనల బీజాలు వెదజల్లేందుకు ప్రయత్నించారు ఈ క్యాంపులో పాల్గొన్న ‘సృజనులు’.

 


      మట్టి మనుషులను, గ్రామీణ జీవితాన్ని ఆధునిక రీతిలో చిత్రించడంలో చేయి తిరిగిన చిత్రకారుడు టైలర్‌ శ్రీనివాస్‌. రెండు దశాబ్దాల కిందట పల్లెలు ఎలా ఉండేవో? పల్లె మనుషులు ఎలా ఉండేవాళ్లో చూడాలంటే ఆయన చిత్రాలనే చూడాలి. ఫొటోగ్రఫీ పల్లెల్ని పలకరించని లోటును ఇలాంటి చిత్రాలు భర్తీచేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. కిర్రుచెప్పులు, తలపాగా వంటి ఆహార్యం నేడు అరుదుగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాలు ఒక డాక్యుమెంటరీగానే కాదు ఈ సమాజ వారసత్వంగానూ నిలుస్తాయి. నీలి ఆకాశం రంగులో ఉన్న కాన్వాస్‌పై అదే రంగులో అక్రిలిక్‌ వర్ణాలతో చిత్రాలను సృజించడం శ్రీనివాస్‌ ప్రతిభకు నిదర్శనం. ఒకే రంగును అనేక పొరలుగా (లేయర్స్‌) తీసుకురావడంలో ఆయన అనుసరించే సాంకేతిక పద్ధతి ఆయన చిత్రాలన్నింటిలోనూ ఐచ్ఛికంగా కనిపిస్తుంది. అతి తక్కువ రంగులతోనే కాన్వాస్‌ను తీర్చిదిద్దడం ఆయన ప్రత్యేకత. నీలిరంగు అక్రిలిక్‌ వర్ణాలతోనే ఆయన అనేక చిత్రాలు గీశారు. ఇలాంటి ప్రేమను అభివ్యక్తి చేసే మరో చిత్రకారుడు బైరు అభిరామ్‌. సామాన్య మానవులకు సాధుజీవులకు ఉండే అన్యోన్యత ఆయన చిత్రం ఆవిష్కరించింది. పశుపోషణ, కళాపోషణ వ్యవసాయానికి రెండు కళ్లుగా ఉన్న సంస్కృతిని ప్రతిబింబించే ఈ చిత్రాలు చూడాలంటే రెండు కళ్లూ సరిపోవేమో!
నవ నాగరికత అడవిలో మనిషినే కాదు అడవినేలే పులులనూ తరిమివేస్తోంది. కాకులు దూరని కారడవులను ఆక్రమించిన మానవుడు కోతుల బెడద, అడవి పందుల బెడదంటూ వేటకు సిద్ధమవుతున్నాడు. ఇక వేటగాళ్ల తూటాలకు ఒరిగిన పులిని కాపాడుకోవడానికి సంరక్షణ చేపట్టాడు. అంటే, ధ్వంసం చేసేదీ మనిషే, రక్షించేదీ మనిషే! అంటోంది సంతోష్‌ చిత్రం. ఎంత విచిత్రం. క్రూరమృగాలను, సాధుజీవులను లక్షల ఏళ్లు తన ఒడిలో పెంచుకున్న అడవి అంతరించిపోతుంటే అడవి బతుకూ పల్లె  బతుకులాగే నాగరిక ఆవాసాల్లోకి వలస వస్తోంది. నగరాలు కొండలపైకి ఎగబాకుతుంటే, అడవుల్లో మానులు కూలి ఉద్యానవనాలు మొలుస్తున్నాయి. ఆవాసాలు ధ్వంసం చేసిన మానవుణ్నే రక్షకుడిగా అవతరింపజేసిందీ రాజ్యం. క్రూరమృగాల కోరలు పీకిన మనిషి ఇంకా ఏదో సాధించాలని పరుగెడుతూనే ఉన్నాడు. అభివృద్ధి పరుగులో వెనకబడిన వాళ్ల బతుకును విస్మరిస్తూనే ఉన్నాం. విస్మరణ కూడా ఒక కుట్రే. ఈ కుట్రలో ధ్వంసమవుతున్నదే మన సంస్కృతి. నేడు కాకపోతే రేపు, కాకపోతే ఇంకొంత కాలం. అభివృద్ధి రాసిన మరణ శాసనం ఏదో ఒకరోజు అమలవుతుంది. అప్పుడు మన జన జీవన సంస్కృతిని చదువుకోవడానికి తెలంగాణ గోపీ చిత్రాలే మనకు పాఠాలవుతాయి. ప్రకృతి వనరులపై హక్కులే పోయాక ఇక ఆ ప్రకృతిని ఆరాధించే వారసులెక్కడుంటారు. వసుధైక కుటుంబం అన్న భావనకు ఆలోచన చేసిన దేశం చిన్న కుటుంబాలుగా ఛిద్రమవుతుంటే ఇక ఊరుమ్మడి బతుకులెక్కడివి అంటూ ఈ పట్నం మోజు పల్లెల్ని ఎక్కిరిస్తోంది. వస్తు వినియోగ యుగంలో ‘అంతరించిన మానవుడి’ని తెలుసుకోవడానికి ఈ చిత్రాలు దోహదపడతాయి. కళతో పాటు, కళాత్మక జీవనాన్ని పరిరక్షిస్తున్నందుకైనా మనం సంతోషించాలి.
      సాధారణ చిత్రకళా ప్రదర్శనల్లో కనిపించని వైవిధ్యం ఈ చిత్రకళా కార్యశాలలో తారసపడింది. సాధారణ ప్రదర్శనల్లో ఒక చిత్రకారుడి చిత్రాలు ఏకరీతిలో కనిపిస్తాయి. ఒకే శైలిని ఎంచుకోవడం ఒక కారణమైతే, ఒకరి అవగాహన పరిమితమై ఉండటం మరో కారణం. అరుదుగా నిర్వహించే గ్రూప్‌ షోలు ఇందుకు విరుద్ధంగా ఉన్నా మార్కెట్‌ ఆదరణ వైపు చిత్రకారులు మొగ్గు చూపడంవల్ల అక్కడ కూడా వైవిధ్యం పరిపూర్ణంగా ఉండదు. కళాకారుడి అభిరుచికి తగిన రీతి, ఆలోచనకు తగ్గ భావ వ్యక్తీకరణకు పరిమితులు లేకుండా సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించిన ఈ కార్యశాలలో చిత్రకారులకు ఉన్న భావ స్వేచ్ఛవల్ల వైవిధ్యం పరిఢవిల్లింది. పోటీతత్వం మినహా పోటీలో పరుగెత్తించని నిర్వహణ- చిత్రకారులను స్వతంత్ర ఆలోచనల వైపు నడిపించింది. నిర్వాహక సంస్థలు, నిర్వహణ బాధ్యులు రమణారెడ్డి ఈ విషయంలో అభినందనీయులు. జీవిక కోసం అభిరుచులు మరచి, కొనుగోలుదారుని ఆకర్షించేందుకు కళ పరాయీకరణ చెందుతున్న రోజుల్లో సృజనాత్మకతకు జీవంపోసేలా ఆర్ట్‌క్యాంప్‌ను నిర్వహించడం ఆదర్శవంతమైన ఆచరణ. 
      ఈ సుహృద్భావ వాతావరణంలోనూ సానుకూలమైన ప్రేమానురాగాలే కానీ ధిక్కారం మాత్రం ప్రతిధ్వనించలేదు. నకాషీ కళాకారుల కుటుంబం వారసత్వం ఉన్న రమాదేవి మాత్రం స్త్రీ ఒక ఆయుధం అని, ఆయుధాన్ని ఈ సమాజం గోడకు అలంకరించుకుంటోందని పురుషాధిక్య సమాజం మీద ఆలోచనల కత్తి దూశారు. ఆధిపత్య భావనపై ఒకవైపు కళారంగం ధిక్కారం ప్రకటిస్తోంది. మరోవైపు పల్లెలు జీవన విధ్వంసంతో నలిగిపోతున్నాయి. అభివృద్ధి చేస్తున్న జీవన విధ్వంసాన్ని ఏ ఒక్క కుంచె కూడా ప్రశ్నించకపోవడం విచిత్రం. చిత్రకారుడు చిరంజీవి పాలపిట్ట దర్శనంతో శుభాల్ని ఆకాక్షించారు. తంగేడుతో మన సాంస్కృతిక వైభవాన్ని గుర్తుచేశారు. కానీ ఆ వైభవానికి ముప్పు తెస్తున్న అంశాలను ఆయన కానీ, మరో చిత్రకారుడు కానీ ఎక్కడా రంగుల్లో ప్రదర్శించలేదు. అయితే వెంకటస్వామి ఒకడుగు ముందుకేసి ఇక్కడ మేకవన్నె పులిని గుర్తుచేశారు. జీవితానుభవాన్ని రంగరించిన జాతీయాలెన్నో ఉన్న ఈ భాష తెలియని పిల్లలకు అది ఒక సమాకాలీన రీతిగానే తోస్తుంది. కానీ హెచ్చరికగా వినిపించదు. భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి విస్మృతికి గురవుతున్న వేళ కళాకారుడి కర్తవ్యం పచ్చని పొలాలను ప్రేమించడమేనా? అంతరిస్తున్న కళలను ఆరాధించడమేనా? సృజనలో హాస్యమూ, వ్యంగ్యమూ, భావోద్వేగాలు, ప్రేమానురాగాలే కాదు ధిక్కారమూ ఉండాలి. ప్రతీకారమూ రగలాలి. కళ కళ కోసం కాదని తెలిసే రోజు రావాలి.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం